Share News

కర్రసాములో కీర్తిక

ABN , Publish Date - Jun 08 , 2026 | 02:46 AM

కర్రసామును చూడటానికి ఇష్టపడతాం కానీ నేర్చుకోడానికి వెనకాడతాం! కానీ ఆత్మ రక్షణకు తోడ్పడే ఈ భారతీయ ప్రాచీన యుద్ధ కళను ప్రతి ఒక్కరూ నేర్చుకోవడం అవసరమంటోంది...

కర్రసాములో కీర్తిక

వినూత్నం

కర్రసామును చూడటానికి ఇష్టపడతాం కానీ నేర్చుకోడానికి వెనకాడతాం! కానీ ఆత్మ రక్షణకు తోడ్పడే ఈ భారతీయ ప్రాచీన యుద్ధ కళను ప్రతి ఒక్కరూ నేర్చుకోవడం అవసరమంటోంది హైదరాబాద్‌కు చెందిన కీర్తిక బలగ. తండ్రి నుంచి నేర్చుకున్న ఈ కళను ఔత్సాహికులకు బోధిస్తూ, తన క్రీడా జీవితానికి మెరుగులు దిద్దుకుంటున్న కీర్తిక నవ్యతో పంచుకున్న విశేషాలు..

కర్రసాము మా కుటుంబ క్రీడ అనే చెప్పాలి. తాతయ్య నుంచి నాన్నకూ, నాన్న నుంచి నాకూ ఈ క్రీడ సంక్రమించింది. ఎనిమిదేళ్ల వయసు నుంచే నాన్న నాకీ క్రీడ నేర్పించడం మొదలుపెట్టారు. అయితే ఒక క్రీడకే పరిమితమైపోకుండా ఉండడం కోసం ప్రతి రెండేళ్లకూ ఒక కొత్త క్రీడను నాకు పరిచయం చేస్తూ ఉండేవారు. అలా ఓ పక్క కర్రసామును సాధన చేస్తూనే, సాయంత్రం వేళ్లల్లో భిన్నమైన క్రీడలను కూడా సాధన చేస్తూ ఉండేదాన్ని. అలా ఈత, బ్యాట్మింటన్‌, బాస్కెట్‌బాల్‌ క్రీడలు కూడా నేర్చుకున్నాను. గతంలో నాన్న ఆంధ్రప్రదేశ్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ కమిటీ సభ్యులు, సెక్రటరీగా వ్యవహరించారు కాబట్టి పదో తరగతి తర్వాత నాకు బాక్సింగ్‌ పరిచయం చేశారు. అలా బాక్సింగ్‌లో పట్టు పెంచుకుని, రెండేళ్ల పాటు రాష్ట్రస్థాయి పోటీల్లో మెడల్స్‌ సాధించాను. జాతీయ స్థాయిలో అండర్‌ 19 విభాగంలో రజత పతకాన్ని గెలుచుకున్నాను.

నాన్న మార్గదర్శకత్వంలో...

ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ చదవాలనే మక్కువతో బాక్సింగ్‌కు బ్రేక్‌ ఇవ్వవలసి వచ్చింది. బిటెక్‌ మూడో ఏడాదిలో ఉన్నప్పుడు నా ఆసక్తి షూటింగ్‌ వైపు మళ్లింది. ఇండియన్‌ జెర్సీ పట్ల నాకున్న వ్యామోహంతో పదేళ్ల వయసు నుంచే, ఇండియా పేరున్న జెర్సీ కొనిపెట్టమని నాన్నను అడగడం మొదలుపెట్టాను. కానీ అది కొనుక్కుని ధరించేది కాదనీ, కష్టపడి సాధించవలసినదనీ నాన్న అన్నారు. అప్పటి నుంచి నాలో పట్టుదల పెరిగింది. ఆ పట్టుదలతో రైఫిల్‌ షూటింగ్‌ నేర్చుకోవడం మొదలుపెట్టాను. 2021లో స్టేట్‌ లెవల్‌లో ఓపెన్‌ ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌లో బంగారు పతకం సాధించాను. కానీ ఓపెన్‌ ఎయిర్‌ రైఫిల్‌ స్టేట్‌ లెవల్‌కే పరిమితం కాబట్టి తర్వాతి లెవల్‌ ఆడలేకపోయాను. దాంతో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి వీలున్న పిస్టల్‌ షూటింగ్‌కు మారిపోయాను. ఒలింపిక్స్‌లో పిస్టల్‌ షూటింగ్‌లో రాణించాలన్నది నా లక్ష్యం.


ఆత్మరక్షణ కోసం...

కర్రసాము కేవలం పురుషులకే పరిమితం కాదు. ఈ క్రీడకు లింగ, వయోభేదాలు లేవు. ఎవరైనా, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఆత్మరక్షణ కోసం ఈ క్రీడను ఎంచుకోవడం అవసరం. ఈ క్రీడ మార్షల్‌ ఆర్ట్స్‌తో సమానంగా స్వీయరక్షణకు ఉపయోగపడుతుంది. కర్ర చేతిలో ఉంటేనే కర్రసాము కాదు. కర్ర లేకపోయినా చేతులను కదిలిస్తూ, మనల్ని మనం కాపాడుకోవచ్చు. గంటల తరబడి కుర్చీలకు అతుక్కుపోయి ఉద్యోగాలు చేస్తూ, వ్యాయామం కొరవడిన వాళ్లు ఈ క్రీడతో శరీర దారుఢ్యాన్ని పెంచుకోవచ్చు. కర్రసాముతో పాటు కత్తిసాము కూడా నేర్చుకోవడం మంచిది. ఈ రెండు విద్యలూ ఆత్మరక్షణకు ఉపయోగపడతాయి. వీటి మీద పూర్తి పట్టు సాధించడానికి ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరాల సమయం పడుతుంది. నేర్చుకున్న తర్వాత కూడా ప్రతి రోజూ సాధన చేయడం మానకూడదు.

గోగుమళ్ల కవిత

షూటింగ్‌లో రాణించాలంటే ఏకాగ్రత, మానసిక దారుఢ్యాలు మెరుగ్గా ఉండాలి. అందుకోసం ట్రెయిల్‌ రన్‌ను ఎంచుకున్నాను. అలా్ట్ర రన్‌లో కూడా పాల్గొన్నాను. 30 కిలోమీటర్ల నిరవధిక పరుగు ఇది. 2024లో బుద్ధ ట్రెయిల్స్‌ రేసులో పాల్గొని, పూర్తి చేసిన, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మొట్టమొదటి యువతిని నేనే! 7 గంటల్లో పూర్తి చేయవలసిన ఈ పరుగును 6 గంటల 25 నిమిషాలకే పూర్తి చేయగలిగాను. ప్రస్తుతం స్టేట్‌ టోర్నమెంట్‌ పిస్టల్‌ షూటింగ్‌ కోసం సాధన చేస్తూనే, ఔత్సాహికులకు కర్రసాము, కత్తిసాము నేర్పిస్తున్నాను. నాన్న అనంత లక్ష్మణ్‌ దేవ్‌, విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌లో పని చేస్తారు. అమ్మ, జయ కాత్యాయని న్యాయవాది.

ఈ వార్తలు కూడా చదవండి...

ఫాంహౌస్‌ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌‌రెడ్డి

ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్

Read Latest Telangana News, AP News And National News

Updated Date - Jun 08 , 2026 | 02:46 AM