పిల్లలను ఇలా చదివించాలి...
ABN , Publish Date - May 09 , 2026 | 04:36 AM
పిల్లలను చదివించడం, వారిచేత హోంవర్క్ చేయించడమనేవి తల్లిదండ్రులకు సవాల్‌తో కూడుకున్న పనులు. అలాకాకుండా పిల్లలు తమంతట తామే శ్రద్ధగా చదువుకోవాలంటే...
పిల్లలను చదివించడం, వారిచేత హోంవర్క్ చేయించడమనేవి తల్లిదండ్రులకు సవాల్‌తో కూడుకున్న పనులు. అలాకాకుండా పిల్లలు తమంతట తామే శ్రద్ధగా చదువుకోవాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఆ వివరాలు...
పిల్లలకు ఒకేసారి పాఠమంతా చదవమని చెప్పకూడదు. ఆ పాఠాన్ని కొన్ని భాగాలుగా విభజించి రోజుకొకటి చదవమని చెప్పాలి. దీంతో పిల్లలు ఆసక్తిగా చదవడం మొదలుపెడతారు. ఆ రోజు చదవాల్సిన పాఠ్యభాగాన్ని త్వరగా పూర్తిచేయాలనుకుంటారు.
పిల్లలను చదివించేటప్పుడు ఆ పాఠ్యాంశానికి సంబంధించి చిన్న చిన్న ఉదాహరణలు, కథలు చెబుతుండాలి. అలాగే విజ్ఞానంతోపాటు ఉత్సుకతను పెంచే ఆటలు ఆడించాలి. ఫన్ లెర్నింగ్ విధానాన్ని అనుసరించాలి. అప్పుడే పిల్లలకు చదువు మీద ఆసక్తి పెరుగుతుంది.
పిల్లలు రోజూ ఒకే సమయంలో చదివేలా స్టడీ టైమ్‌ను నిర్ధేశించాలి. దీనివల్ల రోజూ చదువుకు సమయం కేటాయించాలని పిల్లలు గ్రహిస్తారు. వారికి క్రమశిక్షణ అలవడుతుంది.
సెలవు రోజుల్లో కూడా పిల్లలు పుస్తకాలు తీసి చదివినప్పుడు వారికి చిన్న చిన్న బహుమతులు ఇచ్చి ప్రోత్సహించాలి.
అదేపనిగా చదువుతూ ఉంటే ఏకాగ్రత దెబ్బతింటుంది. కాబట్టి మధ్యమధ్యలో పిల్లలు చిన్న బ్రేక్స్ తీసుకునేలా చూడాలి.
పిల్లలకు ఏకాగ్రత కోసం చదువుకునే ప్రదేశాన్ని నిశ్శబ్దంగా ఉంచాలి. గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చూడాలి.
తల్లిదండ్రులతో కలిసి చదవడానికి పిల్లలు ఇష్టపడతారు. కాబట్టి వారి పక్కనే కూర్చుని గమనిస్తుండాలి. పిల్లలు ఏవైనా సందేహాలు అడిగితే ఓపికగా వివరించాలి.
బలవంతంగా చదివించే ప్రయత్నం చేయకూడదు. ఎప్పటికప్పుడు పాఠాలు శ్రద్ధగా చదవడం వల్ల కలిగే ప్రయోజనాలను వారికి తెలియజెప్పాలి. దీంతో పిల్లలు ఇష్టంగా చదవడం నేర్చుకుంటారు.
ఇవి కూడా చదవండి:
సోషల్ మీడియా వ్లాగింగ్ ఆపేయాలి.. అర్ష్‌దీప్ సింగ్‌ను కోరిన బీసీసీఐ!
ఆ నిబంధనను సవరించి పేసర్లకు వెసులుబాటు కల్పించాలి: సునీల్ గావస్కర్