దిండ్లు శుభ్రంగా ఇలా...
ABN , Publish Date - Apr 01 , 2026 | 01:26 AM
కొంతమందికి తలకింద దిండేసుకోనిదే నిద్ర పట్టదు. పిల్లలు కూడా పక్కన దిండును పెట్టుకుని దాన్ని గట్టిగా పట్టుకుని పడుకుంటూ...
కొంతమందికి తలకింద దిండేసుకోనిదే నిద్ర పట్టదు. పిల్లలు కూడా పక్కన దిండును పెట్టుకుని దాన్ని గట్టిగా పట్టుకుని పడుకుంటూ ఉంటారు. అలాంటి దిండ్లు ఎప్పుడూ మెత్తగా పరిశుభ్రంగా ఉండాలంటే ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం...
రోజూ ఉదయం లేవగానే దిండ్లను నాలుగు వైపుల నుంచి గట్టిగా తడుతూ ఉంటే వాటిలోని దూది లేదా ఫోమ్ అంతా సమంగా సర్దుకుంటుంది. దిండ్లు మెత్తగా ఉంటాయి. లేనిపక్షంలో దూది లేదా ఫోమ్ అంతా ఒకే చోటుకు చేరి దిండ్లు గట్టిపడతాయి. ఇలాంటి గట్టి దిండ్ల వల్ల మెడనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
దూది దిండు గట్టిగా మారినట్లయితే కవర్‌లో నుంచి దూదిని బయటికి తీసి చేత్తో విడదీయాలి. తరువాత ఆ దూదిని కవర్‌లో వేసి కుట్టేస్తే దిండు కొత్తదానిలా మెత్తగా తయారవుతుంది.
వారానికోసారి దిండ్లను నాలుగు గంటలపాటు ఎండలో ఉంచాలి. దీనివల్ల దూది లేదా ఫోమ్‌లో చేరిన తేమ పూర్తిగా ఆరిపోతుంది. దిండ్లు పొడిగా తాజాగా మారతాయి.
కొంతమంది ఫోమ్ లాంటి సింథటిక్ దిండ్లను వాషింగ్ మెషిన్‌లో వేసి ఉతుకుతుంటారు. అలాంటప్పుడు వాటితోపాటు రెండు టెన్నిస్ బాల్స్‌ను శుభ్రమైన సాక్స్‌లో ఉంచి ముడివేసి మెషిన్‌లో వేస్తే దిండ్లు పాడవకుండా ఉంటాయి. ఉతికిన తరువాత దిండ్లను డ్రైయర్‌లో వేసేటప్పుడు ఓ పొడి తువాలును కూడా వేస్తే వాటిలోని తేమ పూర్తిగా తొలగిపోతుంది.
దిండ్లను ఉతికేటప్పుడు నీళ్లలో కొద్దిగా వెనిగర్, బేకింగ్ సోడా వేస్తే వాటి లోపల ఏమైనా క్రిమి కీటకాలు చేరివుంటే అవి పూర్తిగా నశిస్తాయి.
ఎలాంటి దిండ్లకైనా డబుల్ కవర్లను వేస్తే చెమట, నూనె, జిడ్డు, దుమ్ము, ధూళి లాంటివి లోపలికి త్వరగా ప్రవేశించకుండా ఉంటాయి. వారానికోసారి పై కవర్లను వేడినీళ్లతో ఉతికేస్తే సరిపోతుంది. దిండ్లు కూడా ఎక్కువకాలం మెత్తగా తాజాగా ఉంటాయి.
ఇవి కూడా చదవండి..
ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్
బీజేపీ అనాగరిక పార్టీ.. నిప్పులు చెరిగిన మమత