Share News

చెరువు కలుపు... ర్యాంప్‌ మెరుపు

ABN , Publish Date - Nov 19 , 2026 | 03:49 AM

చెరువులను కబళించే ఓ సాధారణ కలుపు మొక్క... ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ వేదికపై మెరిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఒక కుగ్రామానికి చెందిన...

చెరువు కలుపు... ర్యాంప్‌ మెరుపు

చెరువులను కబళించే ఓ సాధారణ కలుపు మొక్క... ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ వేదికపై మెరిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఒక కుగ్రామానికి చెందిన కొందరు మహిళల అద్భుతమైన హస్తకళా నైపుణ్యం, ఆత్మగౌరవ పోరాటానికి ఇది నిదర్శనంగా నిలిచింది. సమాజం చిన్నచూపు చూసే ఆ మహిళల చేతుల్లో ప్రాణం పోసుకున్న ‘గుర్రపు డెక్క’ ఉత్పత్తులు, నేడు లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ ర్యాంప్‌పై అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

చెరువులు, కుంటలు, కాలువల్లో విపరీతంగా పెరిగి నీటి ప్రవాహానికి అడ్డుపడే మొక్కను గుర్రపుడెక్క అంటారు. యూపీలో దీనిని ‘జలకుంభి’ అని పిలుస్తారు. నీటిలో ఆక్సిజన్‌ శాతాన్ని తగ్గించి జలచరాల మనుగడకు ముప్పు తెచ్చే ఈ కలుపు మొక్కను అందరూ పర్యావరణ సమస్యగానే చూస్తారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్‌ జిల్లా బిస్కోహర్‌ అనే చిన్న పట్టణంలోని మహిళలు ఈ సమస్యనే తమ జీవనోపాధికి ఆయుధంగా మలుచుకున్నారు. చెరువుల్లో నిరుపయోగంగా ఉండే ఈ మొక్క కాండాలను సేకరించి, ఎండబెట్టి, సన్నని పోగులుగా కత్తిరించి, వాటితో అద్భుతమైన బ్యాగులు, బుట్టలు, గృహాలంకరణ వస్తువులను తయారు చేస్తున్నారు.

అనురాగ్‌ గుప్తా ఆలోచన

ఈ వినూత్న మార్పు వెనుక ఉన్నది ఫ్యాషన్‌ డిజైనర్‌ అనురాగ్‌ గుప్తా. సిద్ధార్థ్‌నగర్‌లోనే పెరిగిన అనురాగ్‌.. తమ ప్రాంతంలో అనాదిగా సామాజిక వెలికి, అవమానాలకు గురవుతున్న సెక్స్‌ వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపాలని సంకల్పించారు. ఢిల్లీలో జరిగిన ఒక హస్తకళా ప్రదర్శనలో బిహార్‌ కళాకారులు గుర్రపుడెక్కతో తయారుచేసిన బుట్టలు, చాపలు వంటివాటిని చూసినప్పుడు ఆయనకు ఈ ఆలోచన వచ్చింది. పర్యావరణానికి హాని చేసే ఒక మొక్కను ఫ్యాషన్‌ వస్తువుగా మార్చడం ద్వారా తన సొంత ప్రాంతంలోని మహిళలకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించవచ్చని ఆయన భావించారు. ఈ క్రమంలో సెక్స్‌ వర్కర్లకు హస్తకళల్లో శిక్షణ ఇచ్చే ‘ఎర్తోమాడిక్‌ ఫౌండేషన్‌’ సేవల గురించి తెలుసుకుని, బిస్కోహర్‌లోనూ అలాంటి ఒక ప్రాజెక్టును ప్రారంభించేందుకు అడుగులు వేశారు.


నమ్మకాన్ని గెలవడానికి...

ఈ ప్రాజెక్టును ప్రారంభించడం అనురాగ్‌ గుప్తాకు అంత సులభం కాలేదు. తాను ఎవరి కోసమైతే ఈ పని చేయాలనుకున్నారో, ఆ మహిళల నుంచే మొదట తీవ్ర వ్యతిరేకత, సందేహాలు ఎదురయ్యాయి. వారిని ఒప్పించడానికి అనురాగ్‌ గుప్తాకు దాదాపు పది నెలలు పట్టింది. గతంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు తమ వద్దకు వచ్చి, తమ జీవితాలను మార్చేస్తామని హామీలు ఇచ్చి, కేవలం పబ్లిసిటీ కోసం తమను వాడుకుని మధ్యలోనే వదిలేశారనే చేదు అనుభవాలు వారిలో బలంగా నాటుకుపోయాయి. ‘ప్రతి ఒక్కరూ పత్రికల్లో హెడింగ్స్‌ కోసం మమ్మల్ని వాడుకుని ఆ తర్వాత మర్చిపోతారు. వారి ప్రయోజనాల కోసం, గ్రాంట్ల కోసం మమ్మల్ని ఉపయోగించుకుని మధ్యలోనే వదిలేస్తారు’ అని మహిళలు తన ఆవేదనను వ్యక్తంచేశారు.

చేతలే ముఖ్యం

అణగారిన వర్గాల సంక్షేమం కోసం పనిచేసేటప్పుడు శిక్షణ ఇవ్వడం కంటే ముందు వారి నమ్మకాన్ని గెలుచుకోవడం ఎంతో ముఖ్యమని అనురాగ్‌ గ్రహించారు. కేవలం మాటలతో వారిని ఒప్పించలేమని తెలుసుకున్న ఆయన, ముందుగా మార్కె ట్‌ నుంచి ఉత్పత్తుల కోసం ఆర్డర్లను తీసుకురావడంపై దృష్టి పెట్టారు. తయారుచేసిన వస్తువులకు కచ్చితంగా డబ్బులు వస్తాయనే భరోసా కల్పించారు. మొదటి విడత సరుకు కోసం ఆర్డర్‌ బుక్‌ అయిన తర్వాతే ఆ మహిళలు ఈ పనిలో భాగస్వాములు కావడానికి అంగీకరించారు. ఒకసారి పని ప్రారంభించాక, వారి చేతుల్లోని నైపుణ్యం అద్భుతాలు సృష్టించింది.

ఎంతో శ్రమ.. మరెంతో ఓపిక

గుర్రపు డెక్కను ఒక ఫ్యాషన్‌ వస్తువుగా మార్చడం వెనుక ఎంతో శ్రమ, ఓపిక దాగి ఉన్నాయి. ముందుగా చెరువుల నుంచి సేకరించిన మొక్కల కాండాలను శుభ్రం చేసి, ఎండలో ఆరబెడతారు. ఆ తర్వాత వాటిని సమానమైన సన్నని పట్టీలుగా కత్తిరిస్తారు. ఈ పట్టీలను మృదువుగా మార్చి, చేతితోనే వడుకుతూ దారాలుగా లేదా అల్లికలుగా మలుస్తారు. వీటితో అందమైన హ్యాండ్‌బ్యాగులు, టోట్‌ బ్యాగులు, నిల్వ చేసుకునే బుట్టలు, టేబుల్‌ మ్యాట్లు, పర్యావరణ హితమైన ప్యాకేజింగ్‌ మెటీరియల్స్‌ను తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో మిగిలిపోయిన మొక్క వ్యర్థాలతో హ్యాండ్‌మేడ్‌ పేపర్‌ తయారు చేస్తున్నారు.


లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ ర్యాంప్‌పై...

బిస్కోహర్‌ మహిళలు తమ చేతులతో అల్లిన ఈ గుర్రపు డెక్క దారాలు, వస్త్రాలను అనురాగ్‌ గుప్తా తన డిజైన్లలో ఉపయోగించారు. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘లాక్మే ఫ్యాషన్‌ వీక్‌’ వేదికపై ఈ దుస్తులు, యాక్సెసరీలను ప్రదర్శించారు. సాధారణంగా పెద్ద పెద్ద డిజైనర్లు, ఖరీదైన బ్రాండ్లు, వాణిజ్య కలెక్షన్లకు మాత్రమే పరిమితమయ్యే ఆ ర్యాంప్‌పై, ఒక మారుమూల గ్రామానికి చెందిన మహిళల హస్తకళ మెరవడం ఒక అపురూప ఘట్టం. తమ ఊరు దాటి బయటి ప్రపంచం తెలియని ఆ మహిళల శ్రమకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అయితే, ఇది కేవలం ఫ్యాషన్‌ దుస్తులకే పరిమితం కాకుండా, హోమ్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులు, కార్పొరేట్‌ గిఫ్టింగ్‌, రిటైల్‌ స్టోర్లు, ఈకామర్స్‌ వేదికలపై వీటిని విక్రయించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

గ్రామంలోనే ఉపాధి

ఈ ప్రాజెక్టులో భాగంగా మహిళల కోసం ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తున్నారు. దీని ప్రకారం, శిక్షణ పొందే మొదటి నెలలో మహిళలకు ఉపకార వేతనం అందిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత, ఆసక్తి ఉన్నవారు తమ ఇళ్ల వద్ద నుంచే ఆర్డర్ల ప్రకారం వస్తువులను తయారు చేసి ఇవ్వొచ్చు. దీనివల్ల వారు తమ కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే, ఉపాధి కోసం ఇతర నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ సొంత గ్రామంలోనే గౌరవప్రదంగా సంపాదించుకునే వీలు కలుగుతుంది.

ఇవి కూడా చదవండి:

20 బంతుల్లోనే శ్రేయాంక పాటిల్ హాఫ్ సెంచరీ.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తుందా?

రూ. 3,700 కోట్ల డీల్.. కేకేఆర్‌లో తన సగం వాటా విక్రయించిన జూహీ చావ్లా భర్త!

Updated Date - Nov 19 , 2026 | 03:49 AM