Share News

సేవకు ప్రతిరూపం

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:54 AM

నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ... ఇవి హిందుంబీ కౌరోమ్‌ జీవన సూత్రాలు. నర్సుగా 53 ఏళ్ళ వృత్తి జీవితంలో ఎన్నో ఘనతలను సాధించిన ఈ లక్షద్వీప్‌ మహిళ... ‘ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డు’ లాంటి...

సేవకు ప్రతిరూపం

నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ... ఇవి హిందుంబీ కౌరోమ్‌ జీవన సూత్రాలు. నర్సుగా 53 ఏళ్ళ వృత్తి జీవితంలో ఎన్నో ఘనతలను సాధించిన ఈ లక్షద్వీప్‌ మహిళ... ‘ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డు’ లాంటి అనేక గౌరవాలు అందుకున్నారు. ఇప్పుడు ప్రతిష్ఠాత్మకమైన ‘ఆస్టెర్‌ గార్డియన్స్‌ గ్లోబల్‌ నర్సింగ్‌ అవార్డు’ ఫైనలిస్టుల్లో ఒకరుగా, భారత్‌ తరఫున ఏకైక వ్యక్తిగా నిలిచారు. 80 ఏళ్ళ వయసులోనూ అలుపెరుగని హిందుంబీ ప్రయాణం ఇది.

‘‘రోడ్డుపై నడిచి వెళుతూ ఉంటాను. ఒక వ్యక్తి హఠాత్తుగా స్కూటర్‌ ఆపుతారు. తన వెనుక కూర్చున్న పిల్లవాణ్ణి చూపిస్తూ... వీడు మా అబ్బా యి. డెలివరీ మీరే చేశారు సిస్టర్‌’’ అంటారు. పోస్టాఫీసుకు పని మీద వెళ్ళినప్పుడు... అక్కడ ఎవరో మహిళ నన్ను పలకరించి ‘‘మీ చేతులమీదుగా ఈ లోకంలోకి వచ్చిన మా అమ్మాయి ఇప్పుడు సెక్రటేరియేట్‌లో పని చేస్తోంది’’ అని సంతోషంగా చెబుతుంది. తరచుగా ఎవరో ఒకరు మా ఇంటి దగ్గర దింపుతామని రైడ్‌ ఆఫర్‌ చేస్తారు. తమ పిల్లలు నా చేతులమీదుగానే పుట్టారని గుర్తు చేసుకుంటారు. ఇవన్నీ నాకు అమితమైన సంతోషాన్ని కలిగించే సందర్భాలు. అందుకే నా వృత్తిని కేవలం ఒక ఉద్యోగం అనో, బాధ్యత అనో అనుకోను. సాటి మనుషులకు సేవ చెయ్యడానికి దేవుడు నాకు ఇచ్చిన ఒక అవకాశంగా, వరంగా భావిస్తాను. ఇది నేను ఎంతో ఇష్టడి ఎంచుకున్న మార్గం.

నాన్న స్ఫూర్తితో...

లక్షద్వీప్‌ కవరత్తి మా స్వస్థలం. మా నాన్న స్వాతంత్య్ర సమరయోధుడు. దండి సత్యాగ్రహంలో గాంధీతో కలిసి పాల్గొన్నారు. హిందుస్థాన్‌లో ‘హింద్‌’ను తీసుకొని ‘హిందుంబీ’గా నా పేరు పెట్టారు. స్వరాజ్య పోరాటం గురించి, నాటి నాయకుల గురించీ ఆయన చెబుతూంటే ఎంతో ఆసక్తిగా వినేదాన్ని. సేవా కార్యక్రమాల్లో కూడా నాన్న ముందుండేవారు. నర్స్‌ కావాలనీ, అందరికీ సేవ చేయాలనీ అప్పుడే నిశ్చయించుకున్నాను. రెండేళ్ళపాటు కేరళ కోజికోడ్‌లో చదివాను. చదువు పూర్తయ్యాక కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీలో నర్సింగ్‌ కోర్సులో చేరాను. కోర్సు పూర్తయ్యాక కవరత్తి ఇందిరాగాంధీ ఆసుపత్రిలో స్టాఫ్‌నర్సుగా వృత్తి జీవితం ఆరంభించాను. అప్పట్లో అక్కడ విద్యుత్‌ సౌకర్యం కూడా సరిగ్గా ఉండేది కాదు. ఒకసారి ఒక రోగికి డాక్టర్‌ అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వస్తే... పక్కన కిరోసిన్‌ దీపాన్ని పట్టుకొని నిలబడ్డాను. మరోసారి వేరే దీవిలో ఉన్న మహిళకు కాన్పు చేయాల్సి వచ్చింది. అక్కడ సమస్యలు తలెత్తడంతో... ఆమెను తీసుకొని చేపల పడవలో కవరత్తికి బయలుదేరాం. ఈలోగా ఆమె పరిస్థితి విషమించడంతో... సముద్రం మధ్యలో, పడవలోనే రక్తం ఎక్కించాం. ఆమెను కవరత్తికి తెచ్చాక... డాక్టర్‌ సిజేరియన్‌ చేశారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నాం. నా జ్ఞాపకాల్లో నిలిచిపోయిన ఇలాంటి సంఘటనలెన్నో.


8-Navya.jpg

ఇది దేవుడి సంకల్పం...

ఏ వృత్తికయినా నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ ముఖ్యమని నేను నమ్ముతాను. వీటితోపాటు వైద్యరంగంలో పని చేసేవారికి సహానుభూతి కూడా కావాలి. రోగుల పట్ల దయగా వ్యవహరించడం, ధైర్యాన్ని, ఊరటను అందించడం మా బాధ్యత. ఇప్పటివరకూ 20 వేలకు పైగా సర్జరీల్లో, అత్యవసర కేసుల్లో నర్సుగా విధులు నిర్వహించాను. అమినీ ఐలాండ్‌లో కలరా వ్యాపించినప్పుడు అక్కడే పదిరోజులు ఉండాల్సి వచ్చింది. 2004 సునామీలో గాయపడినవారికి, అయిదేళ్ళ కిందట కరోనా సందర్భంగా ఎంతో మంది రోగులకు సేవ చేసే అవకాశం లభించింది. ఇక... 53 ఏళ్ళ వృత్తి జీవితంలో నాకు సవాలుగా నిలిచిన సంఘటనలు ఏవీ లేవనే చెప్పాలి. ఎందుకంటే నా పనిని కష్టంగా నేనెప్పుడూ భావించలేదు. రోజూ పొద్దున్న అయిదు గంటలకు లేస్తాను. పనులు ముగించుకొని ఏడున్నరకు బయలుదేరి... ఎనిమిదికల్లా ఆసుపత్రిలో ఉంటాను. ఇప్పుడు నాకు 80 ఏళ్ళు. నిబంధనల ప్రకారం అరవయ్యేళ్ళకు నేను రిటైరైపోయాను. మూడు నెలల తరువాత... మళ్ళీ కాంట్రాక్ట్‌ నర్సుగా విధుల్లో చేరాను. ‘‘ఇంకెంతకాలం పని చేస్తారు? రిటైర్‌ అవ్వరా?’’ అని కొందరు అడుగుతూ ఉంటారు. ‘‘ఇది దేవుడి సంకల్పం. నాకు ఓపిక ఉన్నంతవరకూ చేస్తూనే ఉంటాను’’ అని బదులిస్తాను.

వారి త్యాగాలు ఎన్నెన్నో...

ఇన్నేళ్ళ సర్వీసులో అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్నాను. 2023లో ‘ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌’ అవార్డు లభించింది. ఈ ఏడాది ‘ఆస్టర్‌ గార్డియన్స్‌ గ్లోబల్‌ నర్సింగ్‌ అవార్డు’ ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచాను. తుది విజేతను ఈ ఏడాది జూలైలో ప్రకటిస్తారు. అది అంతర్జాతీయంగా నర్సింగ్‌ రంగంలో ప్రతిష్ఠాత్మకమైన అవార్డు. రెండున్నర లక్షల డాలర్ల ప్రైజ్‌మనీతోపాటు ప్రపంచస్థాయి గుర్తింపును అందించే ఆ అవార్డు కోసం ఈ ఏడాది 214 దేశాల నుంచి రికార్డు స్థాయిలో 1.34 లక్షలకు పైగా నామినేషన్లు రిజిస్టర్‌ అయ్యాయి. పదిమంది ఫైనలిస్టుల్లో ఒకరుగా, మన దేశం నుంచి ఏకైక వ్యక్తిగా నా పేరు చోటుచేసుకోవడం గర్వంగా అనిపిస్తోంది. దీనంతటి వెనుకా నా కుటుంబ సభ్యులు ఇచ్చిన మద్దతు, చేసిన త్యాగాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆసుపత్రి నుంచి అత్యవసర కేసుల గురించి అర్ధరాత్రి ఫోన్‌ వచ్చినా... నన్ను తక్షణం అక్కడికి తీసుకువెళ్ళి దిగబెడుతూ ఉంటారు. అందుకే నాకు లభిస్తున్న అభిమానంలో, గౌరవంలో వారికీ భాగం ఉంది. మా అబ్బాయి నర్సింగ్‌ అసిస్టెంట్‌. మనుమడు బీఎస్సీ నర్సింగ్‌ చదువుతున్నాడు. అంటే మా కుటుంబంలో మూడో తరం కూడా ఈ వృత్తి కోసం సిద్ధమవుతోంది.’’

ఈ వార్తలనూ చదవండి:

సైబర్ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయ్.. ఓఎస్‌ఎం కాంట్రవర్సీపై సీబీఎస్‌ఈ స్పందన

యూపీలో ఎన్‌కౌంటర్.. టీనేజర్ హత్య కేసులో నిందితుడి మృతి

Updated Date - Jun 01 , 2026 | 12:54 AM