Share News

ఆ మందులతో కాలేయం గుల్ల

ABN , Publish Date - May 12 , 2026 | 04:25 AM

నీరసం, నిస్సత్తువ వదలడానికీ, బలానికీ, సుఖ విరోచనానికీ, అజీర్తికీ, అసిడిటీకీ, ఇమ్యూనిటీ పెరగడానికీ... ఇలా లెక్కలేనన్ని హెర్బల్‌ మెడిసిన్స్‌ మార్కెట్లో దొరుకుతున్నాయి....

ఆ మందులతో కాలేయం గుల్ల

లివర్‌ కేర్‌

నీరసం, నిస్సత్తువ వదలడానికీ, బలానికీ, సుఖ విరోచనానికీ, అజీర్తికీ, అసిడిటీకీ, ఇమ్యూనిటీ పెరగడానికీ... ఇలా లెక్కలేనన్ని హెర్బల్‌ మెడిసిన్స్‌ మార్కెట్లో దొరుకుతున్నాయి. డాక్టర్లతో పని లేకుండా ఆరోగ్య సమస్యను పరిష్కరించుకోవచ్చనే ఆలోచనతో, చాలామంది ఈ మందులను ఇష్టారాజ్యంగా వాడుకుంటూ ఉంటారు. అయుతే ఈ సప్లిమెంట్లు నిజంగానే సమస్యను పరిష్కరించగలుగుతాయా?

కాలేయం మీదే ప్రభావం

కాలేయ ఆరోగ్యం కోసం లివ్‌ 52, అదనపు ప్రొటీన్‌ కోసం ప్రొటీన్‌ పౌడర్లు, నిద్రలేమి కోసం అశ్వగంధ, వ్యాధినిరోధకశక్తి కోసం గిలాయ్‌ (ఆయుర్వేద మూలిక).. ఇలా చాలా మంది వైద్యులను సంప్రతించకుండా, స్వయంగా ఈ మందులను కొని, వాడేస్తూ ఉంటారు. అయితే మనం తీసుకునే ప్రతి మందు కాలేయం మీద ప్రభావాన్ని కనబరుస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కాలేయం, రసాయనాలను శుద్ధి చేసే కర్మాగారం లాంటిది. మనం తీసుకునే ప్రతి మాత్ర, గుళిక పొట్టలో కరిగి, రక్తప్రవాహంలోకి చేరుతుంది. ఈ రక్తం మిగతా శరీరమంతటికీ ప్రసరించడానికంటే ముందు, కాలేయంలోకి ప్రవహిస్తుంది. కాలేయం ఈ మందును శుద్ధి చేసి, తిరిగి రక్తప్రవాహంలోకి విడుదల చేస్తుంది. ఇలా మనం తీసుకునే మందులన్నీ కాలేయానికి చేరుకుంటూ శుద్ధి అవుతూ ఉంటాయి కాబట్టి కాలేయమే ఎక్కువగా ఈ మందుల ప్రభావానికి గురవుతూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో కాలేయం దెబ్బతింటున్నప్పటికీ, ప్రారంభంలో లక్షణాలు బయల్పడవు. కాలేయం పూర్తిగా దెబ్బతిని, తిరిగి సరిదిద్దలేని స్థితికి చేరుకున్నప్పుడు తీసుకుంటున్న మందులు ఆపేసినప్పటికీ ప్రయోజనం ఉండకపోవచ్చు.


వాటిలో భార లోహాలు, స్టిరాయిడ్లు

సప్లిమెంట్లు తీసుకునే వాళ్లలో కాలేయం దెబ్బతినే క్రమం నెమ్మదిగా సాగుతుంది. ప్రారంభంలో కాలేయ స్రావాలు పెరుగుతాయి. కామెర్లు మొదలవుతాయి. తర్వాత కాలేయం సిర్రోసి్‌సకు చేరుకుని, అంతిమంగా విఫలమవుతుంది. సాధారణంగా చాలా మంది ఆయుర్వేద ఔషధాలు సురక్షితమని అనుకుంటూ ఉంటారు. కానీ వాటి తయారీలో ఉపయోగించే భార లోహాలు, అనబాలిక్‌ స్టిరాయిడ్ల పేర్లు ఔషధ డబ్బాలు, సీసాల మీద పేర్కొని ఉండవు. ఇవి వృక్షాధారిత ఔషధాలు కాబట్టి వీటితో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవనే భ్రమతో ఇలాంటి మందులను వాడుకోవడం ప్రమాదకరం. ఉదాహరణకు పౌడర్‌, క్యాప్స్యూల్‌, టానిక్‌ రూపంలో దొరికే గిలాయ్‌తో కాలేయం దెబ్బతినే ముప్పు ఎక్కువ. ఇలాంటి ఔషధాలతో మన శరీరంలోకి కణాలు ఉత్తేజితమై మన శరీరం మీద దాడి చేసే దుస్థితి తలెత్తుతుంది. ఫలితంగా ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌తో కాలేయం, మూత్రపిండాలు, మెదడు, పిత్తాశయం లాంటి అంతర్గత అవయవాలన్నీ దెబ్బతినడం మొదలుపెడతాయి. అస్తవ్యస్థ ఆహార, జీవనశైలులతో ఇప్పటికే ఎంతో మంది కాలేయ కొవ్వును కలిగి ఉంటున్నారు. ఇలాంటప్పుడు హెల్త్‌ సప్లిమెంట్లతో కాలేయం మీద అదనపు భారాన్ని పెంచడం వల్ల, కాలేయం వేగంగా దెబ్బతినడం మొదలుపెడుతుంది.

ఆలస్యం వద్దు

హెల్త్‌ సప్లిమెంట్లు తీసుకుంటున్న వాళ్లలో, బలహీనత, అలసట, నిస్సత్తువ, కామెర్లు మొదలైన లక్షణాలు తరచూ వేధిస్తుంటే, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి. కాలేయం దెబ్బతినే ప్రారంభ లక్షణాలను సత్వరం గుర్తించి చికిత్స తీసుకోగలిగితే దెబ్బతిన్న కాలేయాన్ని తిరిగి బాగుచేసుకోగలిగే వీలుంటుంది. ఆలస్యం చేసేకొద్దీ చికిత్సతో సరిదిద్దలేని పరిస్థితి నెలకొని, కాలేయం పూర్తిగా విఫలమై, కాలేయ మార్పిడి అవసరమవుతుంది. కాబట్టి ఆరోగ్యం నిక్షేపంగా ఉండడం కోసం సప్లిమెంట్లకు బదులుగా ఆరోగ్యకరమైన ఆహారం మీద ఆధారపడాలి. బలవర్థకమైన ఆహారం కోసం డబ్బు ఖర్చు పెట్టగలిగితే, ఆరోగ్యం దెబ్బతిని చికిత్సల కోసం డబ్బు ఖర్చుపెట్టే దుస్థితి తప్పుతుంది.


5-Navya.jpg

పసరు మందుతో ప్రాణహాని

సాధారణంగా కామెర్లకు పసరు మందు తీసుకుంటూ ఉంటారు. అప్పటికే హెపటైటి్‌సతో దెబ్బతిన్న కాలేయం, ఈ పసరు మందుతో మరింత దెబ్బతిని ప్రాణాపాయ పరిస్థితి తలెత్తవచ్చు. ఇలాంటి పసరు మందులు ఇచ్చే నాటు వైద్యులు, సాధారణంగా మద్యంతో కాలేయం దెబ్బతిన్న వాళ్లను ప్రోత్సహిస్తూ ఉంటారు. మద్యంతో దెబ్బతిన్న కాలేయాన్ని పసరు మందుతో బాగు చేసుకుంటే, తిరిగి మద్యం సేవించవచ్చంటూ వాళ్లను ప్రేరేపిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఈ నాటు మందులు వాడుకోవడం హానికరం.

డాక్టర్‌ గొలమారి శ్రీనివాస రెడ్డి,

కన్సల్టెంట్‌ హెపటాలజీ అండ్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌,

స్టార్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌

ఈ వార్తలనూ చదవండి:

ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం

అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత

Updated Date - May 12 , 2026 | 04:25 AM