బంగారు పూతరేకులు ‘చాదస్తం’గా!
ABN , Publish Date - May 09 , 2026 | 04:45 AM
ఆత్రేయపురం అనగానే గుర్తొచ్చేవి పూతరేకులు. వీటిలో ఎన్నో రకాలు. ప్రతి రకానిదీ ప్రత్యేకమైన రుచి. ఎప్పటికప్పుడు కొత్త రకాల తయారీలో ప్రయోగాలు సాగుతూనే ఉంటాయి....
అభి‘రుచి’
ఆత్రేయపురం అనగానే గుర్తొచ్చేవి పూతరేకులు. వీటిలో ఎన్నో రకాలు. ప్రతి రకానిదీ ప్రత్యేకమైన రుచి. ఎప్పటికప్పుడు కొత్త రకాల తయారీలో ప్రయోగాలు సాగుతూనే ఉంటాయి. వాటిలో సరికొత్త రకం... బంగారు పూతరేకులు. వాటికి రూపకల్పన చేసిన చవ్వాకుల లక్ష్మీ ప్రసన్న ఇటీవల అక్షయ తృతీయ సందర్భంగా వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామికి తొలి విడతగా సమర్పించారు. ‘చాదస్తం’ పేరుతో ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తూ... దాదాపు పాతికమంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న లక్ష్మీ ప్రసన్న స్వీట్ జర్నీ ఇది...
‘‘చాదస్తం... ఈ పేరు వినగానే ‘ఏమిటిది?’ అని అందరూ ఉలిక్కిపడతారు. కానీ మా పిండి వంటలన్నిటినీ చాదస్తంగానే తయారు చేస్తాం. అందుకే ఆ పేరు పెట్టాను. నాలుగేళ్ళ క్రితం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో... ఒక పాత ఇంట్లో ‘చాదస్తం’ ఫుడ్ ప్రొడక్ట్స్‌కు బీజం పడింది. దీనికి స్ఫూర్తి మా అమ్మమ్మ. ఆమె చేసిన సున్నండలు ఎంతో రుచిగా ఉండేవి. అలాంటి రుచుల్ని అందరికీ అందించాలనే ఆలోచనతో... పదివేల రూపాయలతో దీన్ని ప్రారంభించాను. కొద్ది రోజుల్లోనే మా ఉత్పత్తులకు మంచి పేరు వచ్చింది.
సంప్రదాయంగా, సేంద్రియంగా...
మాకంటూ కొన్ని ప్రమాణాలను నిర్దేశించుకున్నాం. ఇప్పుడు సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ తిరగలిలో మినుములు ఆడడం మొదలుకొని ప్రతిదీ సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తున్నాం. సేంద్రియ పదార్థాలు వాడుతున్నాం. వినూత్న రీతిలో ప్యాకింగ్ ఉండేలా చూసుకున్నాం. తయారీ, విక్రయాలు చేసేవారికి ప్రత్యేకమైన డ్రెస్‌కోడ్ ఉంటుంది. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంటాయి. ఇవన్నీ కస్టమర్లను బాగా ఆకర్షించాయి. ఆనోటా ఈనోటా మా ఉత్పత్తుల గురించి తెలుసుకున్నవారి నుంచి ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాలకు కూడా ఆర్డర్లు సరఫరా చేస్తున్నాం. మా వ్యాపారంలో దాదాపు 60 శాతం అమెరికా ఆర్డర్ల ద్వారానే సాగుతోంది. కాగా... ప్రతి విజయదశమికి అమర్‌రాజా బ్యాటరీ సంస్థ మా దగ్గర దాదాపు 1.5 లక్షల విలువైన పూతరేకులు కొనుగోలు చేసి, తమ సిబ్బందికి పంచుతోంది. ఇలాంటి ఆర్డర్లు ఎన్నెన్నో. చిన్న వ్యాపారంగా మొదలైన ‘చాదస్తం’ ఇప్పుడు నెలకు దాదాపు రూ.12 లక్షల లావాదేవీలు నిర్వహిస్తోంది. 25 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన వివిధ ఫుడ్ ఫెస్టివల్స్‌లో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసుకొనే అవకాశం మాకు లభించింది. ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మా స్టాల్స్‌కు అవార్డులు కూడా వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లాంటి ప్రముఖులెందరో మా వంటకాలు రుచి చూశారు.

24 క్యారెట్ల గోల్డ్‌పేపర్‌తో...
ఆత్రేయపురం పూతరేకులకు పుట్టినిల్లు. జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో ఆ ఖ్యాతిని మరింత పెంచాలనే లక్ష్యంతో... వినూత్న రీతిలో బంగారు పూత రేకుల తయారీకి నాంది పలికాను. ఇంటింటా బంగారం గురించి చర్చించుకొనే అక్షయ తృతీయ సందర్భంగా... 24 క్యారెట్ల ఇడిబుల్ గోల్డ్‌పేపర్‌తో పూతరేకులు చేసి, గోల్డ్ డస్ట్‌ను అద్ది వాటిని తయారు చేశాం. మొదటి విడతగా చేసిన వాటిని అక్షయ తృతీయ రోజున... సుప్రసిద్ధమైన వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామికి సమర్పించాం. బంగారాన్ని ఆయుర్వేదంలో దివ్యౌషధంగా ఉపయోగిస్తారు. బంగారు పూతరేకును కొనుగోలుదారులు స్టేటస్ సింబల్‌గానే కాదు... ఆరోగ్యప్రదమైనదిగానూ చూస్తున్నారు. ప్రస్తుతం ఆర్డర్‌పై బంగారు పూతరేకుల్ని తయారు చేస్తున్నాం. ఆరు పూతరేకుల ధర రూ.8 వేలు. సందర్భానికి అనుగుణంగా... కార్పొరేట్ ప్యాకింగ్‌తో వాటిని పంపిణీ చేస్తున్నాం.’’
పెనుమళ్ల వెంకటనాగబాబు
ఆత్రేయపురం
ఇలా మొదలైంది...
పుణ్యక్షేత్రాలకు నిలయమైన కోనసీమలో... అత్రి మహర్షి తపస్సు చేసిన ప్రాంతం పేరు ‘ఆత్రేయపురం’గా స్థిరపడింది. ఆత్రేయపురం పూతరేకులకు ప్రసిద్ధి చెందింది. వీటి ఆవిర్భావం వెనుక ఒక కథ ఉంది. పూర్వం ఒక మహిళ మట్టి కుండలో అన్నం వండి, వార్చే సమయంలో... గంజి ఒలికి కుండ మీద పడి పలుచని రేకుగా మారింది. అది గమనించిన ఆ మహిళ... వినూత్నమైన ఆలోచన చేసింది. బియ్యాన్ని రుబ్బి, అందులో పల్చని వస్త్రాన్ని ముంచి, దాన్ని వేడి చేసిన కుండమీద రుద్దితే... పలుచని రేకు వచ్చింది. ఆ రేకుకు పంచదార, నెయ్యి జోడించగా... తియ్యటి వస్తువు తయారయింది. ఆమె మరిన్ని తయారు చేసి బంఽఽధుమిత్రులకు తినిపించేది. కుండపై పూత పూసి, రేకులా రావడంతో ఆ కొత్త వంటకానికి పూతరేకు అనే పేరు స్థిరపడింది. శుభకార్యాలకు సారెలుగా పూతరేకులు అందించడం ఆనవాయితీగా మారింది. క్రమంగా పూతరేకుల తయారీ ఎందరికో ఉపాధి మార్గంగా మారింది. ఆత్రేయపురంలో ఏ ఇంట చూసినా మహిళలు పూతరేకుల తయారీలో నిత్యం బిజీగా ఉంటారు. అది ఒక కుటీర పరిశ్రమగా మారింది. ఆత్రేయపురం పూతరేకుల ఖ్యాతి దేశ దేశాలకూ విస్తరించింది. కాలంతోపాటే వీటి తయారీ కూడా కొత్తపుంతలు తొక్కుతోంది. కోవా, ఐస్‌క్రీం, డ్రైఫ్రూట్స్, హార్లిక్స్, చాక్లెట్, బెల్లం, పంచదార, జీడిపప్పు, ఏలకుల మిశ్రమంతో దాదాపు 16 రకాల వరకూ పూతరేకులు తయారవుతున్నాయి. ఇంకో విశేషం ఏమిటంటే... షుగర్ వ్యాధిగ్రస్తులకోసం కారప్పొడితో పూతరేకుల్ని రూపొందిస్తూండడం.
ఇవి కూడా చదవండి:
సోషల్ మీడియా వ్లాగింగ్ ఆపేయాలి.. అర్ష్‌దీప్ సింగ్‌ను కోరిన బీసీసీఐ!
ఆ నిబంధనను సవరించి పేసర్లకు వెసులుబాటు కల్పించాలి: సునీల్ గావస్కర్