Share News

దెబ్బతిన్న సిరలకు గ్లూ థెరపీ

ABN , Publish Date - Jun 23 , 2026 | 06:00 AM

వెరికోస్‌ వెయిన్స్‌కు సరళమైన, సులభ తరమైన తాజా చికిత్సా విధానం అందుబాటులోకొచ్చింది. అదే... ‘గ్లూ థెరపీ’. ఈ చికిత్సతో సత్వరమే సమస్య పరిష్కారమవడంతో పాటు...

దెబ్బతిన్న సిరలకు గ్లూ థెరపీ

వెరికోస్‌ వెయిన్స్‌

వెరికోస్‌ వెయిన్స్‌కు సరళమైన, సులభ తరమైన తాజా చికిత్సా విధానం అందుబాటులోకొచ్చింది. అదే... ‘గ్లూ థెరపీ’. ఈ చికిత్సతో సత్వరమే సమస్య పరిష్కారమవడంతో పాటు, ప్రభావం దీర్ఘకాలికంగా కొనసాగుతుందంటున్నారు వైద్యులు. మరిన్ని వివరాలు...

వెరికోస్‌ వెయిన్స్‌ ఎన్నో శతాబ్దాలుగా

మానవాళిని వేధిస్తున్నాయి. మెలికలు తిరిగి, ఉబ్బిపోయి, పనిచేయడం మానేసే వెరికోస్‌ వెయిన్స్‌ నొప్పి, బరువు, వాపు, చర్మం రంగు మార్పు వీనస్‌ అల్సర్ల రూపంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలమందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్య సాధారణంగా మహిళలు, పురుషులు, గర్భిణులు, కుటుంబచరిత్రలో ఈ సమస్య ఉన్నవాళ్లను వేధిస్తూ ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే...

  • ఎక్కువ గంటల పాటు నిలబడి లేదా కూర్చుని ఉండే టీచర్లు, హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఉద్యోగులు

  • అధిక బరువు కారణంగా చురుకైన జీవనశైలిని కొనసాగించలేని ఊబకాయులు సత్వర పరిష్కారం

వెరికోస్‌ వెయిన్స్‌ సమస్య నుంచి తప్పించుకోవడం సులభమే! వెంటనే అప్రమత్తం కావడం, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకోవడం ద్వారా పరిస్థితి ముదిరిపోకుండా కాపాడుకోవచ్చు. వెరికోస్‌ వెయిన్స్‌కు వైద్యులు వెయిన్‌ స్ట్రిప్పింగ్‌ అనే చికిత్సా విధానాన్ని కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్నారు. ఈ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరవలసి ఉంటుంది. అనస్తీషియా తీసుకోవలసి వస్తుంది. కోలుకోడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. అయితే గత రెండు దశాబ్దాలలో వాస్క్యులర్‌ మెడిసిన్‌ అద్భుతమైన మార్పులకు లోనై, తాజాగా మినిమల్లీ ఇన్వేసివ్‌ థెరపీలు వాడుకలోకొచ్చాయి. సయనోక్రైలేట్‌ క్లోజర్‌ అనే గ్లూ థెరపీ ఈ థెరపీల్లో ఒకటి. మెడికల్‌ సూపర్‌ గ్లూ ట్రీట్మెంట్‌గా పేరుపొందిన ఈ చికిత్స దెబ్బతిన్న సిరలను వేడికి గురిచేయడం, సర్జరీతో తొలగించే వీలుంటుంది. పదే పదే అనస్థీషియా ఇవ్వవలసిన అవసరం లేకుండానే సీల్‌ చేయొచ్చు. సర్జరీ ముగిసిన కొన్ని గంటల్లోనే రోగులు నడవగలుగుతారు. అన్ని పనులూ చేసుకోగలుగుతారు. సరళత, ప్రభావం, రోగుల సౌకర్యం మెరుగ్గా ఉండడం వల్ల, నేడు వైద్యులు కొందరు ఎంపిక చేసిన రోగులకు గ్లూ థెరపీనే ఎంచుకుంటున్నారు.


గ్లూ థెరపీ చరిత్ర

వైద్యరంగంలో జిగురు వాడకం కొత్త విషయమేమీ కాదు. గాయాలను మసివేయడానికీ, సర్జరీ సమయంలో రక్తస్రావాన్ని నిలువరించడానికీ జిగురును వాడతారు. దెబ్బతిన్న సిరలను లోపలి నుంచి సీల్‌ చేయడానికి కూడా అదే పదార్థాన్ని ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ విధానం దశాబ్దానికి పైగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొంది, వెరికోస్‌ వెయిన్స్‌ చికిత్సలో ఉపయోగించదగిన అత్యాధునిక చికిత్సా విధానంగా మారిపోయింది. నేడు ఈ థెరపీని అనేక వాస్క్యులర్‌ సెంటర్లలో సమర్థమైన చికిత్సా విధానంగా ఎంచుకుంటున్నారు.

1-Navya.jpg

గ్లూ థెరపీ అంటే?

పాడైపోయిన ఉపరితల సిరలను మరీ ముఖ్యంగా గ్రేట్‌ సఫీనస్‌ వెయిన్‌, స్మాల్‌ సఫీనస్‌ వెయిన్స్‌ను మూసివేయడానికి ఉపయోగించే నాన్‌ థర్మల్‌ (వేడి అవసరం లేని), నాన్‌ ట్యుమెసెంట్‌ (అనస్థీషియా అవసరం లేని) ఎండోవీనస్‌ చికిత్స. ఈ ప్రక్రియలో ఎన్‌ బ్యుటైల్‌ 2, సైనోఆక్రిలైడ్‌ అనే ప్రత్యేకమైన వైద్యపరమైన జిగురును ఉపయోగిస్తారు. పారిశ్రామిక సూపర్‌ గ్లూకు భిన్నంగా, మానవ శరీరం లోపల ఉపయోగించడానికి వీలుగా ఈ జిగురును రూపొందించారు. సిరలోకి ఎక్కించిన తర్వాత, ఈ జిగురు వేగంగా పాలిమరైజ్‌ అయిపోయి, సిరను మూసివేస్తుంది. దాంతో వెంటనే రక్తప్రవాహం ఆరోగ్యకరమైన సిరలవైపు మళ్లుతుంది. జిగురుతో మూసేసిన సిర క్రమేపీ ఫైబ్రస్‌ టిష్యూగా మారిపోతుంది. కొంతకాలానికి శరీరం ఫైబ్రస్‌ టిష్యూను శోషించుకుంటుంది.

చికిత్సా విధానం

చికిత్స అలా్ట్రసౌండ్‌ గైడెన్స్‌ ఆధారంగా సాగుతుంది. దీన్లో భాగంగా ఒక చిన్న కెథెటర్‌ను దెబ్బతిన్న శిరలోకి పంపిస్తారు. అలా్ట్రసౌండ్‌లో చూస్తూ, ఆ కెథెటర్‌ను, సఫెనోఫెమొరల్‌ లేదా సఫెనోపొప్లిటియల్‌ జంక్షన్‌ దగ్గరకు పంపిస్తారు. ఆ తర్వాత శిరలోకి సైనోఅక్రిలేట్‌ జిగురును పంపిస్తారు. దాంతో శిరల గోడలు ఒకదానికొకటి అతుక్కుపోతాయి. లేజర్‌ లేదా రేడియోఫ్రీక్వెన్సీ చికిత్సా విధానాల మాదిరిగా ఈ చికిత్సా విధానంలో వేడిని ఉపయోగించరు. కాబట్టి వేడితో సిరలు దెబ్బతినే పరిస్థితి ఉండదు. అలాగే సిర పొడవునా అనస్థీషియా ఇవ్వవలసిన అవసరం కూడా ఉండదు. సిర పూర్తిగా సీల్‌ అయిన తర్వాత కెథెటర్‌ను బయటకు తీసి, డ్రెస్సింగ్‌ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం 20 నుంచి 30 నిమిషాల్లోనే పూర్తవుతుంది. సర్జరీ తదనంతరం రోగులు లేచి నడవవచ్చు, వారి పనులన్నీ చేసుకోవచ్చు.


చికిత్స తదనంతరం

సర్జరీ చేసిన వెంటనే లేచి నడవవలసి ఉంటుంది. ఒకట్రెండు రోజుల్లో దైనందిన కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. క్రమం తప్పక నడక, బరువును అదుపులో ఉంచుకోవడం, వైద్యుల సలహాలు పాటించగలిగితే చికిత్స ప్రభావం దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది.

గ్లూ థెరపీ సురక్షితమేనా?

గ్లూ థెరపీ సురక్షితమైనది, ప్రభావవంతమైనది. ఈ థెరపీ సక్సెస్‌ రేటు 90 నుంచి 95ు మేరకు ఉంటుంది. అయితే గ్లూ థెరపీ వెరికోస్‌ వెయిన్స్‌తో బాధపడే ప్రతి ఒక్కరికీ సాధ్యపడకపోవచ్చు. చర్మం అడుగున ఎక్కువ సిరలున్నవారికీ, అధిక వ్యాసం కలిగిన సిరలున్నవారికీ, జిగురు అలర్జీ ఉన్నవారికీ, చర్మ అలర్జీలు కలిగి ఉన్నవారికీ ప్రత్యామ్నాయ చికిత్సలను ఎంచుకోక తప్పదు. కాబట్టే చికిత్సకు ముందు డాప్లర్‌ అలా్ట్రసౌండ్‌ పరీక్ష, వాస్క్యులర్‌ స్పెషలిస్టుతో కన్సల్టేషన్‌ అవసరమవుతాయి. అన్ని వైద్య చికిత్సల మాదిరిగానే గ్లూ థెరపీకి కూడా కొన్ని దుష్ప్రభావాలుంటాయి. కొందరు రోగులకు చికిత్స చేసిన శిర పొడవునా నొప్పి ఉండొచ్చు. తాత్కాలికంగా చర్మం కందిపోవచ్చు. వాపు కూడా కనిపించవచ్చు. స్వల్ప దురద కూడా ఉండొచ్చు. అయితే ఈ లక్షణాలన్నీ నెమ్మదిగా సర్దుకుంటాయి.

డాక్టర్‌ నరేంద్రనాధ్‌ మేడ

క్లినికల్‌ డైరెక్టర్‌ అండ్‌ హెచ్‌ఒడి,

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వాస్క్యులర్‌, అండ్‌ ఎండోవాస్క్యులర్‌ సర్జరీ,

కిమ్స్‌ హాస్పిటల్స్‌.

ఇవి కూడా చదవండి..

‘నా భర్త అన్ని లిమిట్స్ క్రాస్ చేశాడు’.. టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో

ఆధ్యాత్మిక, సనాతన పరిరక్షణ కేంద్రాలుగా ఆలయాలు: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 23 , 2026 | 06:00 AM