Share News

అమ్మాయి పుట్టుక... ఘనమైన వేడుక

ABN , Publish Date - Aug 29 , 2026 | 05:07 AM

ఒకప్పుడు ఆడబిడ్డను గర్భంలోనే చిదిమేసే ప్రాంతాల్లో ఇప్పుడు అమ్మాయి పుట్టుక ఘనమైన వేడుక. రెండు రాష్ట్రాల్లో దాదాపు 900 గ్రామాల ఆలోచనా ధోరణిని సమూలంగా మార్చిన...

అమ్మాయి పుట్టుక... ఘనమైన వేడుక

ఒకప్పుడు ఆడబిడ్డను గర్భంలోనే చిదిమేసే ప్రాంతాల్లో ఇప్పుడు అమ్మాయి పుట్టుక ఘనమైన వేడుక. రెండు రాష్ట్రాల్లో దాదాపు 900 గ్రామాల ఆలోచనా ధోరణిని సమూలంగా మార్చిన ఆ ఘనత డాక్టర్‌ ఇభా పటేల్‌ది. ‘‘ఆడపిల్లను కన్నానని ఏ తల్లీ న్యూనతకు గురికాకూడదు. నా ప్రయత్నమంతా దానికోసమే’’ అంటున్న ఇభా కథ ఆమె మాటల్లోనే...

‘‘లోకం ఎంత మారుతున్నా... ఆడ పిల్లలు అంటే వివక్షలో, చిన్నచూపు చూడడంలో మార్పు కాలేదన్నది చేదు నిజం. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అసమానతలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చదవాలి, ఏ కలలు కనాలి... ప్రతిదీ సమాజం నిర్ణయిస్తూ ఉంటుంది. ఒక దిగువ మధ్యతరగతి ఇంట్లో రెండో ఆడపిల్లగా ఇవన్నీ నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ఉత్తరప్రదేశ్‌లోని ఖడేపూర్‌లో పుట్టి పెరిగాను. మా ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ పెద్దగా చదువుకోలేదు. మా బామ్మ మాత్రం నేను ఉన్నత విద్యావంతురాల్ని కావాలని కోరుకుంది. ఆమె ప్రోత్సాహంతో బీటెక్‌ చదివాను. మా ఊర్లో మొదటి మహిళా ఇంజనీర్‌ని నేనే. ఆ తరువాత పీహెచ్‌డీ చేశాను. గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి, వ్యవసాయ రంగానికి ఉపయోగపడే పరిష్కారాలపై దృష్టి పెట్టాను. ఆ క్రమంలో కొన్ని మీడియా సంస్థలతో పాటు ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌’, ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌’ తదితర సంస్థలతోనూ, ‘ఆరోగ్యసేతు’, ‘డిజీలాకర్‌’, ‘ఉమాంగ్‌’, ‘మదర్‌ అండ్‌ ఛైల్డ్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌’ లాంటి ప్రతిష్టాత్మకమైన పథకాల్లోనూ పని చేశాను.

వారి మాటలకు కన్నీరు ఆగలేదు...

మా ఊరికి ఎప్పుడు వెళ్ళినా... చిన్నప్పుడు నాతో కలిసి చదివిన అమ్మాయిలు కలిసేవారు. వారిలో చాలామందికి ఎన్నో ఏళ్ళ కిందటే పెళ్ళయింది. తమ ఆడపిల్లల గురించి చెబుతున్నప్పుడు వారిలో న్యూనత స్పష్టంగా కనిపించేది. వాళ్ళు కూడా గ్రామానికే పరిమితం కావాల్సిందేనా? వారు జీవితంలో ఎదిగే అవకాశాలు చిన్న వయసులోనే ఎందుకు ముగిసిపోతున్నాయి? దీన్ని ఒక సమస్యగా కాకుండా... చాలా సాధారణంగా సమాజం ఎందుకు పరిగణిస్తోంది? ఈ ప్రశ్నలు నన్ను వేధించాయి. ఆడబిడ్డల్ని గర్భంలోనే చంపెయ్యడం, మగ బిడ్డ పుట్టలేదని అత్తింటివారు వేధించడం, ఆడపిల్లను కన్న పాపానికి మహిళలను వేధించడం, ఆడ శిశువులను చెత్తకుప్పల్లో పారేయడం... ఇలాంటి సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ‘‘అమ్మాయిని కన్నందుకు అవమానాల పాలవుతున్నాం, తల దించుకొని బతకాల్సి వస్తోంది’’ అని కొందరు మహిళలు చెబుతూ ఉంటే నాకు కన్నీరు ఆగలేదు. ఆడపిల్లలను, వారి తల్లులను చిన్న చూపు చూసే ధోరణి సమాజంలో మారాలి. ఆడపిల్ల పుట్టుక కుటుంబానికి విషాదం కాకూడదు... వేడుక కావాలి. ఈ ఆలోచనలు 2019లో ‘ఘర్‌ ఆయే నన్హీ పారీ’ అనే సంస్థ ఏర్పాటుకు దారి తీశాయి.


వారి సహకారంతో...

గ్రామాల్లో తిరగడం, గర్భిణులు ఉన్న ఇళ్ళకు వెళ్ళి... వారితో, వారి భర్తలతో, కుటుంబాల్లోని పెద్దలతో మాట్లాడడం, పుట్టే బిడ్డ మగ అయినా, ఆడ అయినా సాదరంగా ఆహ్వానించాలని చెప్పడం... ఇదీ మా ప్రణాళిక. మొదటి నెల రోజుల్లో నేను, మరికొందరు కార్యకర్తలు 20 ఇళ్ళకు వెళ్ళాం. వారిలో చాలామంది మాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. కొందరు ముఖం మీదే తలుపులు వేశారు. ‘‘ఇవన్నీ మాకెందుకు చెబుతున్నారు? ఏం చెయ్యాలో మాకు తెలుసు’’ అని ఇంకొందరు అన్నారు. ‘ఆడపిల్ల పుట్టవచ్చేమో?’ అనే మాటనే వినడానికి వాళ్ళు సహించకపోవడం ఇంకా బాధగా అనిపించింది. ఇళ్ళకు నేరుగా వెళ్ళడం కన్నా... వాళ్ళనే ఒక చోటికి రప్పిస్తే బాగుంటుందనిపించింది. దానికోసం అధికారులతో, ప్రజా ప్రతినిధులతో మాట్లాడాం. వారి సహకారంతో పంచాయతీ కార్యాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి... గర్భిణులను, బాలింతలను, వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించాం. ఆడపిల్లల తల్లులను... వారి పిల్లల పేర్లున్న సర్టిఫికెట్లను అందజేసి, సత్కరించడంతో మా కార్యక్రమాలు మొదలయ్యాయి.

ప్రభుత్వ పథకాలు అందేలా...

ఒక పంచాయతీ పరిధిలో ఆరంభమైన ‘ఘర్‌ ఆయే నన్హీ పారీ’ కార్యకలాపాలు గత ఏడేళ్ళలో... ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో 900కు పైగా గ్రామాలకు విస్తరించాయి. తొమ్మిదివేల మందికి పైగా ఆడపిల్లల జననాలను వేడుకగా జరిపించాం. అంగన్వాడీ కేంద్రాలను, ఆశా కార్యకర్తలను, ఆసుపత్రులలోని ఆయాలను, గ్రామ సర్పంచ్‌లను ఈ కార్యక్రమాల్లో భాగస్వాములుగా చేశాం. గర్భిణులకు, బాలింతలకు, శిశువులకు పోషకాహారం, ఆరోగ్య సహాయం అందించడం, సమయానికి వ్యాక్సిన్లు వేయించడంతో పాటు బాలికలకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశించిన పథకాలు అందేలా చర్యలు తీసుకున్నాం. మరోవైపు... మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం ఆటోమెటెడ్‌ డెయిరీ మిషన్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేశాం. ఎంబ్రాయిడరీ లాంటి అంశాల్లో శిక్షణ అందించాం.’’

నేను కోరుకున్నది ఈ మార్పే!

మా సంస్థ గురించి తెలుసుకున్న ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌... ఆరున్నర లక్షల రూపాయల విలువైన అంగన్వాడీ కిట్లను మా సంస్థకు అందజేశారు. వాటిలో పిల్లల చదువుకోసం, పోషకాహారం కోసం ఉద్దేశించినవి ఉన్నాయి. మహిళలు, శిశువులు, బాలికల కోసం ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను అమలు కోసం మేము చేస్తున్న కృషికి గుర్తింపుగా ఎన్నో అవార్డులను అందుకున్నాం. ‘టాప్‌ 10 ఇన్‌స్పైరింగ్‌ లీడర్స్‌ ఆఫ్‌ ఇండియా’లో ఒకరుగా ఒక వార్తా నుంచి పురస్కారాన్ని అందుకున్నాను. ఇప్పుడు చాలా గ్రామాల్లో... ఆడపిల్లల తల్లులను సానుభూతితో చూడడం లేదు. ‘‘మీ అమ్మాయిని ఏం చదివిద్దామనుకుంటున్నావు?’’ అని అడుగుతున్నారు. నేను కోరుకున్నది ఈ మార్పే. కానీ ఇంకా చేయాల్సినది చాలా ఉంది.’’

ఈ వార్తలనూ చదవండి:

టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Updated Date - Aug 29 , 2026 | 05:07 AM