Share News

జెన్‌ జీ.. జాలీ ట్రిప్‌

ABN , Publish Date - Jun 18 , 2026 | 04:34 AM

అన్నిట్లో తమ ప్రత్యేకతను చాటుకునే జెన్‌ జీ ఓ సరికొత్త ట్రావెలింగ్‌ పంథాను అనుసరిస్తోంది. ముందుగా ప్లాన్‌ చేసుకొని లగేజ్‌ బ్యాగ్‌లు మోసుకుంటూ యాత్రలు చేసిన ఒకప్పటి తరంలా కాకుండా...

జెన్‌ జీ.. జాలీ ట్రిప్‌

అన్నిట్లో తమ ప్రత్యేకతను చాటుకునే జెన్‌ జీ ఓ సరికొత్త ట్రావెలింగ్‌ పంథాను అనుసరిస్తోంది. ముందుగా ప్లాన్‌ చేసుకొని లగేజ్‌ బ్యాగ్‌లు మోసుకుంటూ యాత్రలు చేసిన ఒకప్పటి తరంలా కాకుండా... ఆకస్మికంగా వ్యక్తిగతంగా జాలీ ట్రిప్‌లకు సిద్ధమైపోతోంది. యాత్ర అంటే కొత్త ప్రదేశాలు చూడడమే కాదు... స్వేచ్ఛగా విభిన్నమైన అనుభవాలను ఆస్వాదించడం, మానసికానందాన్ని సొంతం చేసుకోవడం అంటోంది. అలాంటి జెన్‌ జీ ప్రయాణాలపై ‘యూగోవ్‌’ సహకారంతో ‘ఎయిర్‌ బీఎన్‌బీ’ నిర్వహించిన ఓ సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. బర్నౌట్‌ నుంచి బయటపడేందుకు అప్పటికప్పుడు చిన్నచిన్న ట్రిప్‌లు బుక్‌ చేసుకుంటూ ట్రావెలింగ్‌ తీరుతెన్నులను మార్చేస్తున్న నేటి తరం ప్రయాణ సరళి గురించి అందులో ఏం చెప్పారంటే...

మూడు రోజుల ట్రిప్‌ చాలు...

దీన్ని మైక్రో- కేషన్‌గా పరిగణిస్తారు. రోజువారీ రొటీన్‌తో బోర్‌గా అనిపించినప్పుడు మూడ్‌ను త్వరగా రీసెట్‌ చేసుకోవడం కోసం యువత ఎక్కువగా ఈ ట్రిప్‌ను ఎంచుకుంటోంది. దీనికి పెద్దగా ప్లాన్‌ చేయాల్సిన పని లేదు. ఉద్యోగులు సెలవుల కోసం కష్టపడక్కర్లేదు. జెన్‌ జీ యువతలో అధికశాతం.. వారంలోపు ట్రిప్‌లను ఎంచుకోగా వారిలో సగానికి పైగా ఈ మూడు రోజుల ట్రిప్‌కు ఓటేస్తున్నారు.

ఏమీ చేయకుండా...

ఇలాంటి ట్రిప్‌ను రూమ్‌ రాటింగ్‌ అంటారు. ఈ ప్రయాణానికి ఏ ఉద్దేశం ఉండదు. సైట్‌ సీయింగ్‌, ట్రెక్కింగ్‌ లేదా దైవ దర్శనం లాంటివీ ఉండవు. వెళ్లిన ప్రాంతం చూడడం, అక్కడి ఆహారం తినడం, వసతి గృహంలో విశ్రాంతి తీసుకోవడం మాత్రమే ఉంటాయి. ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఈ ట్రిప్‌ను ఇష్టపడుతున్నారు.

కొత్త వాటిని వెతుక్కుంటూ...

అందరూ వెళ్లాలనుకునే ప్రదేశాలు లేదా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన చోట్లకు కాకుండా కొత్త వాటిని ముందుగా గుర్తించి చూడాలనే కోరికతో ప్రయాణాలు చేస్తుంటారు. వీటిని డీ-ఇన్‌ఫ్లూయెన్స్‌డ్‌ ట్రిప్‌లుగా పరిగణిస్తారు. జెన్‌ జీ యువతలో అధిక శాతం వీటికే ప్రాధాన్యమిస్తున్నారు. తమ ట్రిప్‌ వ్యక్తిగతంగా యూనిక్‌గా ఉండాలని వీరు భావిస్తుంటారు.


అభిరుచికి సరిపోలేలా...

తమ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా అభిరుచికి తగ్గ ప్రదేశాలను ఎంచుకుని ప్రయాణాలు చేస్తుంటారు. దీన్ని మిర్రర్‌ ట్రిప్‌ అంటారు. మనసుకు నచ్చిన బస, ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపడం, తమకు మాత్రమే సొంతమైన అనుభవాలు ఈ ట్రిప్‌ ప్రత్యేకతలు.

అనుభూతి కోసం...

ఒక ప్రత్యేకమైన అనుభూతి కోసం సుదూరప్రాంతాలకు ప్రయణాలు చేస్తుంటారు. దీన్ని వై-కేషన్‌ ట్రిప్‌గా పిలుస్తారు. ప్రకృతిని ఆస్వాదించడం, కొత్త రకం వంటకాలను రుచి చూడడం, విభిన్న సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవడం లాంటివి ఈ ప్రయాణాల్లో భాగంగా ఉంటాయి. రోజువారీ దినచర్య నుంచి కాస్త విరామం తీసుకోవడం కోసం యువత ఈ ట్రిప్‌ను ఎంచుకుంటోంది.

స్థానిక కథల సేకరణ...

ప్రయాణంలో భాగంగా ఎదురైన నగరం లేదా చిన్న పల్లెటూరును సందర్శించడం, ఆక్కడి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవడం, ఆ ప్రాంతాల ప్రత్యేకతలను ఆరా తీయడం లాంటివి చేస్తుంటారు. స్థానిక మార్కెట్లు, కిరాణా దుకాణాలు, సాధారణమైన ఇంటి డిజైన్లు, అంతగా జనసంచారం లేని ప్రదేశాలనుచూసి ఆనందిస్తుంటారు. ఈ ప్రయాణాన్ని లోకల్‌ లోర్‌ హంటింగ్‌ ట్రిప్‌గా పరిగణిస్తారు.

4-Navya.jpg

విశ్రాంతి కోసం...

ఒత్తిడి, ఆందోళనలకు గురై విశ్రాంతి తీసుకోవాలనిపించినప్పుడు ఏ మాత్రం ప్లాన్‌ చేసుకోకుండా వెంటనే ట్రిప్‌కు బయలుదేరుతున్నారు జెన్‌ జీ యువత. దీన్ని బ్రేక్‌ బుక్‌ ట్రిప్‌ అంటారు. ఏకాంతంగా మానసిక ప్రశాంతతను సాధించడమే దీని ప్రధాన ఉద్దేశం.

కానన్‌ ఈవెంట్‌

ప్రస్తుతం ప్రయాణమంటే కేవలం ఒక ప్రదేశాన్ని చుట్టి రావడమే కాదు. విశ్రాంతి, వ్యక్తిత్వం, అనుభవం, భావోద్వేగం లాంటి అంశాలు ప్రధానంగా పరిగణనలోకి వస్తున్నాయి. ఎక్కడికి? ఎందుకు? అనేవాటి కంటే ఎంత సంతోషంగా గడుపుతామనేదానిపైనే జెన్‌ జీ యువత ఎక్కువగా దృష్టి పెడుతోంది. ఇప్పటి వరకు తాము వెళ్లిన ట్రిప్‌లలో ఏ రెండూ ఒకేలా లేవని వారు చెప్పడం విశేషం. ఎలాంటిదైనప్పటికీ ట్రిప్‌ అంతా ఒక ఎత్తయితే అందులో ఎదురయ్యే ఆకస్మిక సంఘటనలు, అనుభవాలు మరో ఎత్తంటున్నారు. అపరిచిత వ్యక్తితో గంటల తరబడి సంభాషణ, అందమైన సూర్యోదయాలు-సూర్యాస్తమయాలు చూడడం, వెన్నెల్లో ప్రయాణం, ప్రయాణానికి అడ్డొచ్చిన వర్షం, దీపపు వెలుగులో తిన్న భోజనం లాంటివి జీవితాంతం గుర్తుంటాయంటున్నారు. ప్లాన్‌ చేసుకుని పేరు పొందిన ప్రదేశాలకు వెళ్లడం కంటే అనుకోకుండా వెళ్లిన చిన్న ట్రిప్‌లోని మధుర జ్ఞాపకాలు అపరిమితమైన ఆనందాన్నిస్తాయంటున్నారు జెన్‌ జీ.


అనుకోకుండా...

ముందుగా ఎలాంటి ఆలోచన లేకుండా అప్పటికప్పుడు బ్యాగ్‌ తీసుకుని యాత్రకు బయలుదేరడమే యాంటీ-ఇటినరరీ ట్రిప్‌. స్పాంటేనిటీ అనేది ఈ ట్రిప్‌ ప్రత్యేకత. ఇలాంటి ప్రయాణాల్లోనే అందమైన అనుభూతులు, అరుదైన జ్ఞాపకాలు, అపురూపమైన అనుభవాలు దక్కుతాయని జెన్‌ జీ చెబుతోంది.

చిన్న చిన్న సాహసాలు...

ఏడాదికి ఒకసారి విహార యాత్ర చేయాలని సెలవులు, డబ్బులు దాచుకోకుండా వీలైనప్పుడల్లా చిన్న చిన్న ట్రిప్‌లకు వెళ్లడానికే యువత మొగ్గు చూపుతోంది. వీటినే సైడ్‌ క్వెస్టింగ్‌ ట్రిప్‌లు అంటారు. నాలుగు నెలలకోసారి చిన్న ట్రిప్‌కు వెళ్లి సాహసం చేసిన అనుభూతి పొందుతున్నారు.

ఏకాంతంగా...

ఖాళీ సమయం దొరికినప్పుడు బార్లు, క్లబ్బులు, నైట్‌ పార్టీలకు వెళ్లకుండా ప్రశాంతతను వెతుక్కుం టూ ఏకాంతంగా ప్రయాణం కొనసాగిస్తుంటారు. దీన్ని డ్రై ట్రిప్పింగ్‌ అంటారు. ప్రకృతిని, దారిలో ఎదురయ్యే చిన్న చిన్న సంఘటనలను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ప్రయాణించడం ఈ ట్రిప్‌ ప్రత్యేకత.

ఇవీ చదవండి:

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

Updated Date - Jun 18 , 2026 | 04:34 AM