Share News

భారతి... వారి కలల సారథి

ABN , Publish Date - Jul 30 , 2026 | 03:53 AM

From Dreaming Football to Coaching Champions Bharati Mudi Koda Empowers Tribal Girls Through Football

భారతి... వారి కలల సారథి

ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి కావాలనేది ఆమె కల. సామాజిక ఆంక్షల కారణంగా ఆ కలను వదులుకోవాల్సి వచ్చినా... కొత్తతరాన్ని క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే ఆశయంగా దాన్ని మార్చుకున్నారు భారతి ముదీ కోడా. పశ్చిమబెంగాల్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన ఈ గిరిజన మహిళ ఫుట్‌బాల్‌ కోచ్‌గా ఎందరో బాలికల భవిష్యత్తుకు బాట వేస్తున్నారు.

ప్రపంచ ఫుట్‌బాల్‌ కప్‌ పోటీల ఉద్వేగంతో ప్రపంచమంతా ఊగిపోతూ ఉంటే... పశ్చిమబెంగాల్‌లోని బంకురా జిల్లా దుందుమీ గ్రామ శివార్లలోని మైదానంలో... కాటన్‌ చీరలో సామాన్యంగా కనిపిస్తున్న ఒక మహిళ... బాలికలకు ఫుట్‌బాల్‌ శిక్షణ ఇవ్వడంలో నిమగ్నమై ఉన్నారు. ఆమె పేరు భారతీ ముదీ కోడా. క్రీడాకారిణి కావాలన్న తన ఆశను నెరవేర్చుకోలేకపోయిన ఆమె... కోచ్‌గా తనదైన ముద్ర వేస్తున్నారు.

మా అమ్మాయి మాటలతో...

భారతిది పశ్చిమబెంగాల్‌లోని జామ్‌గ్రామ్‌కు చెందిన గిరిజన కుటుంబం. బాల్యం నుంచి ఆమెకు ఆటలంటే మక్కువ. అథ్లెటిక్స్‌లో, ఫుట్‌బాల్‌లో బాగా చురుగ్గా ఉండేవారు. ‘‘ఈ అమ్మాయి పాదాల్లో విపరీతమైన వేగం ఉంది’’ అని గ్రామంలో చాలామంది మెచ్చుకొనేవారు. కానీ క్రీడాకారిణిగా ఆమె కొనసాగలేకపోయారు. ‘‘ఫుట్‌బాల్‌... బెంగాలీలకు ఎంతో ఇష్టమైన ఆట. మా గ్రామంలో దాదాపుగా అబ్బాయిలందరూ ఫుట్‌బాల్‌ ఆడేవారు. మరి ఆడపిల్లల సంగతో? ఆడ పిల్లలు క్రీడల గురించి మాట్లాడితేనే నేరంగా చూసేవారు. ఇంటా బయటా ఆంక్షల వల్ల నా కలను పక్కన పెట్టాల్సి వచ్చింది’’ అని చెబుతారామె. వివాహమై, కుటుంబ బాధ్యతల్లో తీరిక లేకుండా ఉన్నా... ఆ అసంతృప్తి భారతిలో కొనసాగుతూనే ఉంది. నెరవేరని తన కలను తన కుమార్తె తనియా ద్వారా తీర్చుకోవాలనుకున్నారు. ‘‘తనియాకు కూడా క్రీడలంటే ఆసక్తే. స్థానికంగా కొన్నాళ్ళు ఫుట్‌బాల్‌ శిక్షణ తీసుకుంది. కానీ దానివల్ల ప్రయోజనం కనిపించలేదు. పైగా... ఏళ్ళు గడిచినా ఆడపిల్లలను లోకువగా చూసే సమాజం తీరులో మార్పు లేదు. దాంతో ‘‘అమ్మా! నువ్వు ఫుట్‌బాల్‌ బాగా ఆడుతావు. నువ్వే ఎందుకు కోచ్‌ కాకూడదు?’’ అని అడిగింది. దాంతో నా బిడ్డకు నేనే శిక్షణ ఇద్దామని నిశ్చయించుకున్నాను’’ అని గుర్తు చేసుకున్నారు భారతి.


వారి వైఖరి మారింది...

తన కుమార్తెతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని గిరిజన బాలికలకు కోసం 2009లో ఫుట్‌బాల్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు భారతి. ‘‘మొదట్లో ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. అమ్మాయిలు షార్ట్స్‌ వేసుకొని పొలాల్లో ఫుట్‌బాల్‌ ఆడడమేమిటి?’’ అని గ్రామంలో చాలామంది ఈసడించారు. అప్పట్లో మా అమ్మాయితో పాటు ముగ్గురు నలుగురు మాత్రమే ఉండేవారు. క్రమంగా వారి సంఖ్య పెరిగింది’’ అని చెప్పారు భారతి. ఆమె దగ్గర శిక్షణ పొందినవారు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించడం ఆమెకు మంచి కోచ్‌గా గుర్తింపు తెచ్చింది. ‘‘ఇప్పుడు గ్రామస్తుల వైఖరి కూడా మారింది. నా కోచింగ్‌లో దాదాపు ఇరవై మంది రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో ఆడారు. అలాగే గోవా, చండీగఢ్‌, భోపాల్‌ తదితర నగరాల్లో జరిగిన జాతీయ పోటీల్లో కూడా పలువురు సత్తా చాటారు. కొందరికి సోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు కూడా వచ్చాయి. మా అమ్మాయి తానియా ఇప్పుడు ఫుట్‌బాల్‌ రిఫరీగా తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది’’ అంటున్న భారతి 25 మందికి పైగా గిరిజన బాలికలకు శిక్షణ ఇస్తున్నారు.

5-Navya.jpg

ఆ లక్ష్యం కోసం...

‘‘గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద బాలికలను తక్కువగా చూడవద్దని సమాజాన్ని కోరుకుంటున్నాను. తమను తాము నిరూపించుకోవాలనే పట్టుదల, దేశానికి గర్వకారణంగా నిలవాలనే సంకల్పం వారిలో ఉన్నాయి. ఫుట్‌బాల్‌ వారికి కేవలం ఒక క్రీడ కాదు... సాధికారతను సాధించే ఒక మార్గం. వారికి నాకు చేతనయినంత శిక్షణ ఇస్తున్నాను. ఎవరి దగ్గరా ఒక రూపాయి తీసుకోకుండా... ఉచితంగా శిక్షణ ఇవ్వాలనే నియమానికి కట్టుబడ్డాను. దాంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్నేళ్ళ క్రితం ప్రభుత్వం మా శిక్షణ కేంద్రానికి చిన్న గ్రాంట్‌ కేటాయించింది. దానితో ప్రాక్టీ్‌సకు వచ్చే అమ్మాయిల వసతి కోసం ఒక ఇల్లు కట్టించాను. ఆ తరువాత ఎలాంటి సాయం అందలేదు. కోచింగ్‌ సెంటర్‌ నడపడానికి నా భర్త శక్తిపాద అండగా నిలబడుతున్నారు. కానీ ప్రాక్టీస్‌ కోసం ఫుట్‌బాల్స్‌, బూట్లు, జెర్సీలు లాంటి సరంజామాను సమకూర్చుకోవడం కష్టమవుతోంది. ఏదో ఒక రోజు వారు అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారనే నమ్మకం నాకుంది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి నా శిక్షణను కొనసాగిస్తూనే ఉంటాను’’ అని చెబుతున్నారు భారతి.

ఇవి కూడా చదవండి

కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు బాక్సర్లు సాక్షి, అరుంధతి.. భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం!

విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ.. లోక్‌సభ ఆమోదంతో పేపర్ లీక్‌లకు చెక్: కేంద్ర మంత్రి అమిత్ షా

Updated Date - Jul 30 , 2026 | 03:54 AM