నేల నుంచి వికసించిన అక్షరం
ABN , Publish Date - Jul 30 , 2026 | 04:01 AM
నెలాఖరుకు ఖాతాలో పడే లక్షల రూపాయల జీతం, సమాజంలో గుర్తింపు .. సగటు మనిషి కోరుకునే ఆనందమయ జీవితం ఇది. ఢిల్లీకి చెందిన ప్రగతి చస్వాల్ జీవితం కూడా సరిగ్గా ఇలాగే...
భోజనం ప్లేటులో నుంచి కొడుకు పక్కకు నెట్టేసిన ఒక చిన్న కూరగాయ ముక్క.. ప్రగతి చస్వాల్‌ను కార్పొరేట్ ఉద్యోగం వదిలి మట్టిబాట పట్టేలా చేసింది.
తన కొడుకు ఆహారం పట్ల చూపిన నిరాసక్తత నుంచి నేర్చుకున్న పాఠంతో...
వినూత్నమైన ‘మట్టిబడి’కి శ్రీకారం చుట్టారు. ఆ చిన్న ఆలోచనే
నేడు 78 వేలమంది చిన్నారులకు సొంతంగా ఆహారం పండించడం
నేర్పే పచ్చని విప్లవంగా మారింది.
మంచి కార్పొరేట్ ఉద్యోగం.. నెలాఖరుకు ఖాతాలో పడే లక్షల రూపాయల జీతం, సమాజంలో గుర్తింపు .. సగటు మనిషి కోరుకునే ఆనందమయ జీవితం ఇది. ఢిల్లీకి చెందిన ప్రగతి చస్వాల్ జీవితం కూడా సరిగ్గా ఇలాగే సాగింది. ప్రకటనల రంగంలోని అగ్రగామి సంస్థల్లో దశాబ్దానికిపైగా పనిచేశారు. ఆ తర్వాత ఒక స్టార్ట్‌పలో కీలక బాధ్యలు నిర్వర్తించారు. అయితే, పైకి ఇదంతా ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ లోలోపల మాత్రం ఆమెను ఏదో వెలితి పీడించడం మొదలుపెట్టింది. వృత్తిపరమైన సృజనాత్మకత ఆనందాన్ని ఇస్తున్నప్పటికీ.. వ్యక్తిగతంగా ఆమెకు సంతృప్తిని ఇవ్వలేకపోయింది. దీంతో 2013లో ప్రగతి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కొన్ని రోజుల విరామం తర్వాత మళ్లీ కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని అనుకున్నారు. కానీ ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది.

ఇంట్లోనే మొదలైన పాఠం
ఉద్యోగ బాధ్యతల నుంచి బయటపడ్డాక ప్రగతి తన చుట్టూ ఉన్న చిన్నచిన్న విషయాలను నిశితంగా పరిశీలించడం ప్రారంభించారు. అందులో మొదటిది తన కుమారుడు నీల్ ప్రవర్తన. ప్రతిరోజు రాత్రి భోజన సమయంలో నీల్ చేసే ఒక పని ప్రగతిని ఆలోచనలో పడేసింది. ప్లేటులో వడ్డించిన కూరగాయలను అతడు నిశ్శబ్దంగా పక్కకు తోసేసేవాడు. మొదట్లో తన కొడుకు కూరగాయలు తినడం లేదని ఆందోళన చెందిన ప్రగతి.. ఆ తర్వాత అతడికి ఆహారం ఎక్కడి నుంచి వస్తోంది? అది ఎందుకు ముఖ్యం? దానిని పండించడానికి ఎంత శ్రమపడాలి? అనే విషయాలపై అవగాహన గానీ, పట్టింపు గానీ లేవని గ్రహించారు. ఆహారం వృథా అయిపోతున్నా అతడికి ఎలాంటి బాధ లేకపోవడం ఆమెను తీవ్రంగా కలచివేసింది.
తన ఇల్లు దాటి బయటి ప్రపంచంలోకి చూసినప్పుడు.. ఇది ఒక్క నీల్ సమస్య మాత్రమే కాదని, నగరాల్లో పెరుగుతున్న నేటి తరం చిన్నారులందరి పరిస్థితి ఇంతేనని ప్రగతికి అర్థమైంది. నేటి తరం పిల్లలకు ఆన్‌లైన్ యాప్‌లలో ఫుడ్ ఆర్డర్ చేయడం తెలుసు, సూపర్ మార్కెట్లో ప్యాక్ చేసిన కూరగాయలు కొనడం తెలుసు. కానీ ఒక టమాటా మొక్క ఎలా ఉంటుందో వారికి తెలియదు. కూరగాయలు నేల తల్లి ఒడి నుంచి కాక, సూపర్ మార్కెట్ షెల్ఫ్‌ల నుంచి వస్తాయని భావించే అమాయకత్వంలో వారు ఉన్నారు. ‘‘మనం పోషకాహారం గురించి గొప్పగా మాట్లాడుకుంటాం. కానీ పిల్లలను వారికి ఆహారాన్ని ఇచ్చే ‘భూమి’ నుంచి పూర్తిగా దూరం చేసేశాం’’ అని ప్రగతి ఆవేదన చెందుతారు.
చేతికి విత్తులు ఇచ్చే విద్య
తన కొడుకు కూరగాయలు తినాలని ప్రగతి అతడిపై కేకలు వేయలేదు. ఒక భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. తన ఇంటి మిద్దెపైనే సొంతంగా ఆహారాన్ని పండించడం ప్రారంభించారు. టమాటాలు, పాలకూర, రకరకాల ఆకుకూరల పెంపకం మొదలుపెట్టారు. కాలక్రమేణా ఆ చిన్న మిద్దెతోట ఏకంగా 35 రకాలకుపైగా పండ్లు, కూరగాయలతో నందనవనంగా మారింది. ఆ తర్వాత ఒక అద్భుతం జరిగింది. నీల్‌కు కూరగాయలపై అవగాహన మాత్రమే కాకుండా కుతూహలం కూడా పెరిగింది. పొద్దున్న లేచి మొక్కలకు నీళ్లు పోయడం, మారుతున్న వాతావరణాన్ని గమనించడం, ఒక చిన్న విత్తనం మొలకెత్తి రోజురోజుకు పెరుగుతూ చివరికి మన ప్లేటులోకి ఆహారంగా ఎలా మారుతుందో ప్రత్యక్షంగా చూడటం అతడికి ఒత్త అనుభూతిని ఇచ్చింది.
తానూ విద్యార్థిగా...
ఈ మార్పును చూసిన తర్వాత ప్రగతికి ఒక విషయం అర్థమైంది. దీనిని ఇంటికే పరిమితం చేయకూడదని, సమాజంలో మరింత మంది పిల్లలకు చేరువ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం 2015లో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) ద్వారా సేంద్రియ వ్యవసాయంలో డిప్లొమా పూర్తిచేశారు. ఆ తర్వాత పర్మాకల్చర్, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై లోతైన అధ్యయనం చేశారు. ‘‘పిల్లలకు నేర్పించే విధానం అర్థవంతంగా ఉండాలంటే ముందుగా నేను ఈ విషయాలను క్షుణ్ణంగా నేర్చుకోవడం చాలా ముఖ్యమని భావించాను’’ అని చెప్పుకొచ్చారు ప్రగతి.
78 వేల మంది చిన్నారుల భవిష్యత్తు
ప్రస్తుతం ఈ సౌగుడ్ ఫౌండేషన్ ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్, హరియాణా, గుజరాత్ రాష్ట్రాల్లోని 28కిపైగా పాఠశాలల్లో (20 ప్రభుత్వ, 8 ప్రైవేట్ పాఠశాలలు) 78,000పైగా చిన్నారులకు సుస్థిర వ్యవసాయంపై అవగాహన
కల్పించింది. పాఠశాలల దైనందిన విధానంలో వ్యవసాయాన్ని ఒక భాగంగా మారుస్తూ మూడేళ్ల ప్రత్యేక కరికులమ్ కూడా ఈ సంస్థ రూపొందించింది. ప్రగతి చస్వాల్ జీవిత ప్రయాణాన్ని పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతుంది. సమాజంలో ఒక పెద్ద మార్పు రావడానికి
భారీ ప్రణాళికలు అవసరం లేదు. జీవితంలో మనం నేర్చుకునే శక్తిమంతమైన పాఠాలు ఎప్పుడూ పెద్దపెద్ద గ్రంథాల నుంచి రావు..
కొన్నిసార్లు మన పాదాల కింద ఉన్న ఆ మట్టి నుంచే మొలకెత్తుతాయని ప్రగతి చస్వాల్ నిరూపిస్తున్నారు.
‘మట్టి’బడి
తను నేర్చుకున్న విద్యకు ఒక రూపాన్ని ఇస్తూ 2017లో ప్రగతి ‘సౌగుడ్ ఫౌండేషన్’ను స్థాపించారు. పుస్తకాల్లో చదివే పర్యావరణ పాఠాలను పిల్లలు బట్టీపట్టకుండా, సొంతంగా అనుభవించి నేర్చుకోవాలనేది ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఆరంభంలో చాలా చిన్న స్థాయిలో ప్రారంభమైనా మెల్లగా ‘సౌగుడ్’ పేరు మార్మోగిపోయింది. ప్రైవేటు పాఠశాలలతోపాటు అనేక ప్రభుత్వ పాఠశాలలు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం అయ్యాయి. ఈ రోజు ‘సౌగుడ్’ ఫౌండేషన్ నిర్వహిస్తున్న పాఠశాల తోటల్లోకి అడుగుపెడితే పిల్లలు పుస్తకాల్లో బట్టీపడుతూ కనిపించరు. వారు పచ్చని మొక్కల మధ్య నేలపై కూర్చుని ఉంటారు. విత్తనాలు మొలకెత్తాయో, లేదో పరిశీలిస్తుంటారు.
ఇవి కూడా చదవండి
కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు బాక్సర్లు సాక్షి, అరుంధతి.. భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం!
విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ.. లోక్‌సభ ఆమోదంతో పేపర్ లీక్‌లకు చెక్: కేంద్ర మంత్రి అమిత్ షా