Share News

బలమే నా అందం

ABN , Publish Date - May 21 , 2026 | 04:35 AM

బాడీ షేమింగ్‌ చీకట్లను, తిరస్కరణల గాయాలను చీల్చుకుంటూ... చెన్నై వీధుల నుంచి అమెరికా ట్రాక్‌ రికార్డుల వరకు సాగిన ఒక అథ్లెట్‌ కథ ఇది. కృత్రిమ సౌందర్య...

బలమే నా అందం

సంకల్పం

బాడీ షేమింగ్‌ చీకట్లను, తిరస్కరణల గాయాలను చీల్చుకుంటూ... చెన్నై వీధుల నుంచి అమెరికా ట్రాక్‌ రికార్డుల వరకు సాగిన ఒక అథ్లెట్‌ కథ ఇది. కృత్రిమ సౌందర్య చట్రాలను బద్దలుకొట్టి.. శారీరక శక్తిని మానసిక దృఢత్వంగా మార్చుకుని చరిత్ర సృష్టించిన కృష్ణ జయశంకర్‌ మీనన్‌ అంతరంగం ఇది.

ఆ రోజు.. ఆ ఇనుపగుండును సర్కిల్‌లో నిలబడి గాల్లోకి విసిరిన ఆ ఒక్క క్షణం.. నాలో ఏదో ఒక కొత్త ప్రపంచం అన్‌లాక్‌ అయింది. అప్పటికి నేను చెన్నై ఎస్‌బీవోఏ పాఠశాల విద్యార్థిని. లంచ్‌ బ్రేక్‌లో నన్ను చూసి ‘త్రోయింగ్‌ ప్రయత్నించు.. నువ్వు పొడవుగా ఉన్నావు, ఈ క్రీడ కోసమే పుట్టావు’ అని మా పీఈటీ టీచర్‌ తిరుమల జ్యోతి నన్ను మైదానంలోకి లాగారు. లెక్కల క్లాస్‌ తప్పించుకోవచ్చనే ఆశతో ఆటలవైపు అడుగులు వేశాను. కానీ, ఆ ఇనుపగుండు నా చేతిని వీడిన క్షణం.. అది నా జీవితాన్ని మార్చేస్తుందని ఊహించలేకపోయాను.

రక్తంలోనే క్రీడలు

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో క్రీడలు ఒక పండుగలా ఉండేవి. నా తండ్రి సి.జయశంకర్‌ మీనన్‌ భారత పురుషుల బాస్కెట్‌బాల్‌ జట్టుకు కెప్టెన్‌. నా తల్లి ప్రసన్న మహిళా జట్టుకు కెప్టెన్‌. ఆ తర్వాత కోచ్‌గా, జాతీయ సెలక్టర్‌గానూ సేవలు అందించారు. బాస్కెట్‌బాల్‌ మా తల్లిదండ్రుల ప్రపంచం. దీంతో నాకంటూ సొంత గుర్తింపు కావాలనిపించి షాట్‌పుట్‌, డిస్కస్‌ త్రోలను ఎంచుకున్నాను. మూడునాలుగేళ్ల వయసున్నప్పుడు అరచేతికి తీవ్ర గాయమై రక్తం కారుతున్నా ఏడవకుండా నవ్వుతూనే ఉన్నానట. ఆ మొండితనమే నా కెరీర్‌కు పునాది అయింది.

సూర్యుడి కంటే ముందే పరుగు

నా ప్రయాణం పూలబాట కాదు. తెల్లవారుజామున 5:30కి ప్రాక్టీస్‌. నిమిషం ఆలస్యమైనా నన్ను గ్రౌండ్‌కు తీసుకెళ్లేవారు కాదు. అందుకే నేను 5:20కే సిద్ధంగా ఉండేదాన్ని. అన్నానగర్‌ నుంచి తాంబరం వరకు చెన్నై వీధుల్లో సుదీర్ఘ ప్రయాణాలు. స్కూల్‌ అయిపోయాక మళ్లీ అలసిపోయేలా ట్రైనింగ్‌. దీని ఫలితంగానే కేవలం ఆరు నెలల శిక్షణతో జూనియర్‌ నేషనల్స్‌లో నేను మూడో స్థానంలో నిలిచాను.


గాయపరిచిన బాడీషేమింగ్‌

ఒకవైపు ఆటలో గెలుస్తున్నా.. సమాజం నుంచి వచ్చే బాడీ షేమింగ్‌ నన్ను ఎంతో గాయపరిచింది. సంప్రదాయ సౌందర్య ప్రమాణాలకు భిన్నంగా పొడవుగా, వెడల్పాటి భుజాలతో ఉండే నా శరీరాన్ని చూసి ఎగతాళి చేసేవారు. అమ్మాయి అంటే ఇలా ఉండకూడదన్నట్టు చూసేవారు. కానీ నేను జమైకా, అమెరికా వెళ్లినప్పుడు నా ఆలోచనలు మారాయి. అక్కడ శారీరక బలాన్ని గర్వంగా చాటుకునే మహిళా అథ్లెట్లను చూశాను. బలం అనేది లోపం కాదు.. అది ఒక అద్భుతమైన ఆస్తి అని అప్పుడు నాకు అర్థమైంది.

4-Navya.jpg

కంఫర్ట్‌ జోన్‌ దాటి జమైకాకు

2021లో కరోనా సమయంలో 18 ఏళ్ల వయసులో ఒంటరిగా జమైకా విమానం ఎక్కాను. అమెరికన్‌ కాలేజీ కోచ్‌లు జమైకాకు వచ్చి ప్రతిభను గుర్తిస్తారని, తద్వారా నాకు ఎన్‌సీఏఏ స్కాలర్‌షిప్‌ వస్తుందని స్పష్టమైన ప్రణాళిక ఉంది. అందుకే భయాన్ని గెలిచి వెళ్లాను. భారత్‌లో వంట, లాండ్రీ తెలియని నేను జమైకాలో రోజూ రెండు బస్సులు మారు తూ ఒంటరిగా బతకడం నేర్చుకున్నాను. ‘కంఫర్ట్‌ జోన్‌ ముగిసిన చోట జీవితం మొదలవుతుంది’ అనే మాటను నేను అనుభవించాను. అక్కడ కోచ్‌ మైఖేల్‌ వాసెల్‌ నాకు సాంకేతికతతోపాటు జీవించడం నేర్పారు. ఆ కష్టమే నన్ను అమెరికాలో ‘ఎన్‌సీఏఏ డివిజన్‌ 1’ స్కాలర్‌షిప్‌ సాధించిన మొదటి భారతీయ మహిళా త్రోయర్‌గా నిలబెట్టింది.

గుండెను పిండేసే తిరస్కరణలు

నా ప్రయాణంలో నేను కోల్పోయినవి ఎన్నో. నా సోదరి నిశ్చితార్థానికి, కుటుంబ వేడుకలకు దూరమయ్యాను. వీటన్నింటికంటే నన్ను బాగా దెబ్బతీసింది పదేపదే ఎదురైన తిరస్కరణలు. ఎనిమిదిసార్లు నేను టీమిండియాకు ఎంపిక కాలేకపోయాను. ప్రతిసారి చాలా దగ్గరగా వచ్చి అవకాశం చేజారిపోయేది. ముఖ్యంగా 2021 వరల్డ్‌ అండర్‌-20 చాంపియన్‌షి్‌ప అర్హతకు కేవలం కొద్ది మార్జిన్‌తో నా కల ఆగిపోయినప్పుడు నా గుండె పగిలింది. ఆ తర్వాత ఒలింపిక్స్‌కు ముందు గాయాలు నా ప్రణాళికను దెబ్బతీశాయి. స్పోర్ట్స్‌ సైకాలజిస్టుల సాయంతో ఆ నిరాశ నుంచి బయటకు వచ్చి మనసును బలోపేతం చేసుకున్నాను. ఏ క్రీడ అయినా 80 శాతం మానసిక బలంపైనే ఆధారపడి ఉంటుంది. నా మెదడు నేను చాంపియన్‌నని నమ్మినప్పుడు.. నా శరీరం అలాగే స్పందించింది. చీకట్లో ప్రయాణించిన ఆ చిన్ననాటి కృష్ణ కోసం నేను గెలవాలని నిర్ణయించుకున్నాను.


చరిత్ర సృష్టించిన ‘త్రో’

మార్చి 2025లో అల్బుకెర్కీ ఇండోర్‌ చాంపియన్‌షి్‌ప్స వచ్చింది. నేను పతకం సాధిస్తానని ఎవరూ అనుకోలేదు. ఫైనల్‌ రౌండ్‌కు ముందు నేను నాలుగో స్థానంలో ఉన్నాను. నా చివరి ప్రయత్నానికి ముందు ‘ఇదే నీ ఆఖరి త్రో’ అని నా మనసుకు చెప్పుకున్నాను. సర్వశక్తులు ఒడ్డి గుండును విసిరాను. ఆ త్రో 16 మీటర్లు దాటి ఇండోర్‌ నేషనల్‌ రికార్డును బద్దలుగొట్టింది. నాకు కాంస్య పతకాన్ని అందించింది. ఆ ఒక్క క్షణం అంతా అవాస్తవంగా అనిపించింది. ఆ ఒక్క క్షణం వెనుక.. చెన్నై వీధుల ప్రయాణాలు, జమైకా ఒంటరితనం, పదేపదే ఎదురైన తిరస్కరణల కారణంగా మనసు పడిన వేదన ఉంది. ప్రస్తుతం ముంబైలోని రిలయన్స్‌ ఫౌండేషన్‌లో ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ కోచ్‌ స్టీవ్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్నాను.

ఒలింపిక్స్‌ కల

ఈ రోజు నా ముందు ఆసియా గేమ్స్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌, లాస్‌ఏంజెలెస్‌ 2028 ఒలింపిక్స్‌ ఉన్నాయి. నేను పోడియంపై నిలబడి ఉన్నప్పుడు మన త్రివర్ణ పతాకం ఎగురుతుంటే భారత జాతీయ గీతం వినిపించాలనేదే నా జీవిత కల. మా నాన్న ఆ అనుభూతిని పొందారు. ఇప్పుడు నేను దాని కోసం ఎదురుచూస్తున్నాను. నన్ను నేను మూడు ముక్కల్లో వర్ణించుకోవాలంటే.. భయం లేనిదాన్ని. తిరుగుబాటుదారురాల్ని, పోరాట యోధురాల్ని. నా ప్రయాణం ద్వారా వచ్చే తరానికి నేను చెప్పేది ఒక్కటే. ఎవరి కోసమో మిమ్మల్ని మీరు

తగ్గించుకోవద్దు. స్పేస్‌ తీసుకోండి. పెద్ద కలలు కనండి. ఓటములు, తిరస్కరణల తర్వాత కూడా ఆగడానికి నిరాకరించే మొండితనమే మిమ్మల్ని చరిత్ర శిఖరాలపై నిలబెడుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి

అత్తాపూర్ కిడ్నాప్‌ కేసు.. ఇంట్లోనే సేఫ్‌గా ఉన్న యువతి

శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుపడిన హైగ్రేడ్ గంజాయి..

Updated Date - May 21 , 2026 | 04:35 AM