అప్పుడు ఎయిర్‌హోస్టెస్ ఇప్పుడు ట్రక్కు డ్రైవర్
ABN , Publish Date - Sep 23 , 2026 | 01:15 AM
కొవిడ్‌తో వైమానిక పరిశ్రమ మూతపడడంతో, కొత్తగా చేతికందిన ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం ఊడింది. అలాగని పోయిన ఉద్యోగాన్ని తలుచుకుని కుంగిపోకుండా, తండ్రి అడుగుజాడల్లో...
విభిన్నం
కొవిడ్‌తో వైమానిక పరిశ్రమ మూతపడడంతో, కొత్తగా చేతికందిన ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం ఊడింది. అలాగని పోయిన ఉద్యోగాన్ని తలుచుకుని కుంగిపోకుండా, తండ్రి అడుగుజాడల్లో ట్రక్కు స్టీరింగ్ పట్టింది హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల నేహా ఠాకూర్. పురుషులకే పరిమితమైన ఆ వృత్తిలో రాణించడమే కాకుండా, వ్లాగింగ్ చేస్తూ సాటి యువతులకు ఆదర్శంగా నిలుస్తున్న హిమాచల్ తొలి మహిళా ట్రక్కర్ ప్రస్థానమిది.
పదహారు టన్నుల బరువుండే భారీ ట్రక్కును కొండ వాలుల్లోని భయంకరమైన మలుపుల్లో నడిపించడం ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకు అపారమైన ఏకాగ్రత, పొడవాటి ట్రక్కును ఒడుపుగా నడిపించే నేర్పరితనం, అన్నిటికీ మించి లెక్కలేనంత ఆత్మస్థైర్యం అవసరం. అయితే చిన్నప్పటి నుంచి తండ్రి రాజేష్ ఠాకూర్‌ను గమనిస్తూ పెరిగిన నేహకు ట్రక్కుల గురించి అవగాహన ఉంది. 20 ఏళ్లకు పైగా ట్రక్కు డ్రైవర్‌గా పని చేసిన రాజేష్, తన సొంత ట్రక్కులో నేహను ఎక్కించుకుని స్కూలు దగ్గర దింపుతూ ఉండేవాడు. దాంతో ఆ భారీ ట్రక్కుల మీద నేహకు చిన్నప్పుడే ఆసక్తి ఏర్పడింది. కానీ ఎయిర్ హోస్టె్‌సగా ఎదగాలన్నది నేహ చిన్నప్పటి కల. దాంతో మండి జిల్లా, ఖుడ్ల గ్రామానికి చెందిన నేహ, గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే, చండీఘడ్ చేరుకుని ఎయిర్ హోస్టె్‌సగా శిక్షణ పొందింది. తర్వాత కొద్ది కాలానికే ప్రముఖ వైమానిక సంస్థలో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం సంపాదించింది. అయితే లాక్‌డౌన్‌తో వైమానిక పరిశ్రమ మూతపడడంతో ముచ్చటపడిన ఉద్యోగం ఊడింది. అయితే అంతమాత్రాన నేహ కుంగిపోలేదు. అక్కడితో తన వృత్తి జీవితం ముగిసిపోయిందని బాధ పడలేదు. సొంత ఊరు చేరుకున్న తర్వాత బాల్యంలో తన ఆసక్తిని చూరగొన్న వాణిజ్య ట్రక్కుల డ్రైవింగ్ వైపు మనసును మళ్లించింది.
కష్టమైనా ఇష్టంగా...
కమర్షియల్ ట్రక్ డ్రైవింగ్ పట్ల తనకున్న ఆసక్తిని తండ్రికి వివరించి, డ్రైవింగ్ స్కూల్లో చేరి, 2023లో 21 ఏళ్ల వయసులో హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ పొందింది నేహ. తండ్రి రాజేష్ ఆధ్వర్యంలో ట్రక్కు నడపడంలోని మెలకువలను నేర్చుకుంది. అయితే ఎయిర్ హోస్టెస్ నుంచి ట్రక్కు డ్రైవర్‌గా మారడానికి ఆమెంతో కష్టపడవలసి వచ్చింది. భారీగా ఉండే వాణిజ్య ట్రక్కుల యాంత్రిక సమస్యల పట్ల అవగాహన ఏర్పరుచుకోవడంతో పాటు, సంక్లిష్టమైన గేర్లు, క్లచ్ నియంత్రణ, ఎయిర్ బ్రేక్స్ వాడకాల మీద పూర్తి పట్టును పెంచుకుంది. అయితే ట్రక్కును నడపడం ఒక ఎత్తైతే, దాన్నిండా సరుకు నింపుకుని పర్వత దారుల్లో ప్రయాణించడం మరొక ఎత్తు. ట్రక్కు డ్రైవర్‌గా మారిన ప్రారంభంలో నేహ డ్రైవింగ్ అసైన్‌మెంట్లు, స్థానిక దారులకే పరిమితమై ఉండేవి. తర్వాత దూర ప్రయాణాలు, ఇతర రాష్ట్రాలకు ట్రక్కును నడపడం మొదలుపెట్టింది. నేడు తన 16 టన్నుల భారీ ట్రక్కులో భవన నిర్మాణ పదార్థాలతో పాటు, వ్యవసాయ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు సైతం తరలించగలుగుతోంది.
విమర్శలే ప్రశంసలు
ప్రారంభంలో పురుష వృత్తిని ఎంచుకున్న నేహను విమర్శించిన వాళ్లందరూ నేడు ఆమె ధైర్యాన్నీ, తెగువనూ ప్రశంసిస్తున్నారు. పెద్ద స్టీరింగ్‌ను సునాయాసంగా తిప్పుతూ, ట్రక్కును అవలీలగా నడిపిస్తున్న నేహను చూసి పురుషులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే బరువైన వాణిజ్య వాహనాన్ని కొండల్లో నడిపించడం చాలా కష్టం. ఈ వృత్తిలో భోజన వేళలు క్రమం తప్పుతాయి. విపరీత వాతావరణాలు సవాళ్లు విసురుతాయి. వారాల తరబడి ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ సవాళ్లన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటున్న నేహ, నేడు కఠినమైన పర్వత మార్గాల్లో దేశవ్యాప్త అంతరాష్ట్ర రహదారుల్లో చాకచక్యంగా ట్రక్కును నడిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన మొట్టమొదటి ట్రక్ డ్రైవర్‌గా పేరు తెచ్చుకున్న నేహ, తన ప్రయాణాలు, అనుభవాలతో వ్లాగింగ్ చేస్తూ, లక్షలకొద్దీ వ్యూయర్లను సంపాదించుకుంది. యూట్యూబ్‌లో ఆమెకు నాలుగున్నర లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 8 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ
ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా