Share News

ఆహారం విషం కాకుండా...

ABN , Publish Date - Mar 03 , 2026 | 01:16 AM

కల్తీ పాలతో పలువురు ఆస్పతి పాలైన విషయం మనందరికీ తెలిసిందే! పాలతో పాటు పన్నీర్‌, సెనగలు, నూనెలు, నెయ్యి కల్తీల గురించి వార్తలో చూస్తూనే ఉన్నాం. కల్తీలతో పాటు నిల్వ చేసే విధానాలు కూడా....

ఆహారం విషం కాకుండా...

ఫుడ్‌ పాయిజనింగ్‌

కల్తీ పాలతో పలువురు ఆస్పతి పాలైన విషయం మనందరికీ తెలిసిందే! పాలతో పాటు పన్నీర్‌, సెనగలు, నూనెలు, నెయ్యి కల్తీల గురించి వార్తలో చూస్తూనే ఉన్నాం. కల్తీలతో పాటు నిల్వ చేసే విధానాలు కూడా ఫుడ్‌ పాయిజనింగ్‌కు దారి తీస్తున్నాయి.

ఈ సమస్యను ప్రారంభంలో గుర్తించడంతో పాటు పాటించవలసిన నివారణ చర్యల గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

  • తాజాగా వండిన పదార్థాలే తినాలి

  • సలాడ్స్‌ నిల్వ ఉంచి తినకూడదు

  • తాజాగా కొన్న మాంసాహారమే వాడుకోవాలి

  • బయటి ఆహారం తినడం తగ్గించాలి

కల్తీ ఒక ప్రాంతానికే పరిమితం కాదు. విస్తృతంగా విస్తరించిన సమస్య ఇది. ప్రజలు పెద్ద సంఖ్యలో వినియోగించే పదార్థాలే ఎక్కువగా కల్తీ అవుతూ ఉంటాయి. ప్రతి ఇంట్లో నిత్యావసర వస్తువుల్లో పాలు తప్పనిసరిగా ఉంటాయి కాబట్టి పాలను ఎక్కువగా కల్తీ చేస్తూ ఉంటారు. అలాగే సులభంగా కల్తీ చేయగలిగే ఇతరత్రా పదార్థాలు కూడా కల్తీకి గురవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఒక విషయాన్ని ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలి. భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే పెద్ద సప్లయర్ల ఉత్పత్తుల విషయంలో రీసెర్డ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ నియంత్రణ ఉంటుంది. కాబట్టి పెద్ద బ్రాండ్‌ ఉత్పత్తులను ఎంచుకోవడం సురక్షితం. మరీ ముఖ్యంగా పాల విషయంలో ప్యాకెట్‌ పాలను ఇష్టపడని వాళ్లు వీలైతే దగ్గరుండి గేదె పాలను పితికించి వాడుకోవడం ఉత్తమం. బదులుగా వాడుక పాల మీద ఆధారపడితే, ఫుడ్‌ పాయిజనింగ్‌ లాంటి సమస్యలకు గురి కావలసి వస్తుంది.


ఎప్పుడు, ఎక్కడ, ఏం తింటున్నాం?

ఫుడ్‌ పాయిజనింగ్‌కు ఆహారం, నీటి కలుషితాలే ప్రధాన కారణాలు. అయితే ఇంట్లో శుచి శుభ్రతలు పాటిస్తూ, నీటి వడపోతకు ఫిల్టర్లు వాడుకుంటూ, వంటలు పరిశుభ్రమైన పరిసరాల్లో వండుకోవడం, నిల్వ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇంటి భోజనం తిన్నవాళ్లు ఫుడ్‌ పాయిజనింగ్‌కు గురయ్యే అవకాశాలు తక్కువగానే ఉంటున్నాయి. కానీ తరచూ బయటి ఆహారం తినేవాళ్లలో ఈ సమస్య పెరుగుతోంది. కలుషితానికి ఆస్కారం లేని విలాసవంతమైన హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా తిన్నవాళ్లు కూడా ఫుడ్‌ పాయిజనింగ్‌ బారిన పడుతున్న సందర్భాలు పెరుగుతున్నాయి. సాధారణంగా తింటున్న పదార్థాల రుచి మీదే దృష్టి పెడతాం, కానీ ఆ పదార్థాలను నిల్వ చేసిన తీరు, వండిన విధానం, పరిసరాల గురించి పట్టించుకోం. ఇడ్లీలు లాంటివి మన ముందే ఆవిరి మీద ఉడికించి వడ్డిస్తూ ఉంటారు. కానీ అన్ని పదార్థాలనూ ఇలా వండే వీలుండదు. మరీ ముఖ్యంగా సలాడ్స్‌ ఎక్కువగా కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే ఫ్రూట్‌ సలాడ్స్‌ కూడా! మిడ్‌నైట్‌ బిరియానీ తింటే, ఆ బిరియాని ఎప్పుడు వండారో ఎవరికి తెలుసు? కాబట్టి ఏం తింటున్నాం? ఎక్కడ తింటున్నాం? ఎప్పుడు తింటున్నాం? అన్నది చాలా ముఖ్యం.

ఎలా నిల్వ చేస్తున్నాం?

పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ చేసినప్పుడు బ్యాక్టీరియా, వైర్‌సలు చేరుకునే అవకాశం ఉంటుంది. మనం ఇంట్లో మయొనిస్‌ లాంటి పదార్థాలను అరుదుగా వాడతాం. కాలం చెల్లిన ఇలాంటి పదార్థాలతో కూడా పదార్థాలు కలుషితమవుతాయి. అలాగే కొనే పండ్లు, కూరగాయలు తాజాగా ఉండేలా చూసుకోవడంతో పాటు వాటిని వీలైనంత త్వరగా వాడుకోవాలి. వంటల్లో సాస్‌లు లాంటి వాటిని వాడుకునేటప్పుడు కూడా వాటి నిల్వ కాలాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఫ్రోజెన్‌ ఫుడ్స్‌ ట్రెండ్‌ ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఫ్రోజెన్‌ మీట్‌, ప్రి మారినేటెడ్‌ మీట్‌ ఆర్డర్‌ చేసినప్పుడు అది గడ్డకట్టిన స్థితిలో ఉందా లేదంటే కరిగిన స్థితిలో ఉందా అన్నది కూడా గమనించుకోవాలి. ఈ పదార్థాలతో ఆహార కలుషితం తీవ్రంగా ఉంటుంది.


ఈ లక్షణాల మీద కన్నేసి...

ఫుడ్‌ పాయిజనింగ్‌లో లక్షణాలు రెండు రకాలుగా ఉంటాయి. బ్యాక్టీరియా మన శరీరంలోకి చొరబడడం మూలంగా తలెత్తే ఫుడ్‌ పాయిజనింగ్‌ లక్షణాలు ఆలస్యంగా మొదలవుతాయి. బ్యాక్టీరియా ఆహారంలో కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది. ఆ ఆహారాన్ని తిన్నప్పుడు లక్షణాలు వెంటనే బయల్పడతాయి. కొన్ని వైర్‌సల విషయంలో లక్షణాలు బయల్పడడానికి కొన్ని వారాలు పట్టవచ్చు. ఫుడ్‌ పాయిజనింగ్‌లో ప్రధానంగా పేగులు, జీర్ణాశయం ప్రభావితమవుతాయి. వాంతులు, కడుపు నొప్పి, విరోచనాలు ప్రధాన లక్షణాలు. జ్వరం కూడా కనిపించవచ్చు.

చికిత్స ఎప్పుడు, ఎలా?

ఫుడ్‌ పాయిజనింగ్‌ లక్షణాలు బయల్పడినప్పుడు మందులు వాడకపోవడం కంటే, తోచిన మందులు కొనుక్కుని వాడుకోవడం మరింత ప్రమాదకరం. సాధారణంగా స్వల్ప ఫుడ్‌ పాయిజనింగ్‌లో ఓఆర్‌ఎస్‌, ఎక్కువ ద్రవాలు తీసుకుంటే పరిస్థితి దానంతట అదే సర్దుకుంటుంది. కానీ చాలా మంది యాంటీబయాటిక్స్‌ వాడేస్తూ ఉంటారు. ఇది సరి కాదు. అలాగే లోమోటిల్‌, ఇమోడియం లాంటి లోపిర్మైడ్‌ మందులు వాడేస్తూ ఉంటారు. వీటితో పేగులు కదలికలు నెమ్మదించి, మలవిసర్జన ఆగిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఈ పరిస్థితితో మలం ద్వారా ఇన్‌ఫెక్షన్‌ బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో పాటు పేగు ఉబ్బిపోయి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలాగే విరోచనాలతో తీవ్ర డీహైడ్రేషన్‌కు గురై మూత్రవిసర్జన ఆగిపోవచ్చు. కడుపునొప్పి కూడా తీవ్రంగా ఉండొచ్చు. ఈ పరిస్థితి ప్రమాదకరం. కాబట్టి ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి. మరీ ముఖ్యంగా పెద్దలు, పిల్లలు వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నప్పుడు అత్యవసరంగా వైద్యులను సంప్రతించాలి.

డాక్టర్‌ శారద పసంగులపాటి

సీనియర్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌,

యశోద హాస్పిటల్స్‌,

సోమాజిగూడ, హైదరాబాద్‌

ఇవి కూడా చదవండి:

విండీస్‌పై విజయం.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరంటే?

అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు

Updated Date - Mar 03 , 2026 | 01:17 AM