కళ్లకీ కావాలి యోగా..!
ABN , Publish Date - Sep 10 , 2026 | 05:42 AM
పగలు గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్‌టా్‌పలమీద పనిచేస్తూ రాత్రంతా మొబైల్స్ చూస్తూ గడిపేయడం వల్ల పలువురికి రక రకాల కంటి సమస్యలు ఎదురవుతున్నాయి. తలనొప్పి,..
పగలు గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్‌టా్‌పలమీద పనిచేస్తూ రాత్రంతా మొబైల్స్ చూస్తూ గడిపేయడం వల్ల పలువురికి రక రకాల కంటి సమస్యలు ఎదురవుతున్నాయి. తలనొప్పి, కళ్లు ఎరుపెక్కి పొడిబారడం, కళ్లమంటలు, దురద, మైకం లాంటివి సర్వసాధారణమయ్యాయి. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు కంటి యోగా పేరుతో నిపుణులు సూచిస్తున్న అంశాలు అందిరినీ ఆకర్షిస్తున్నాయి. ఆ వివరాలు...
స్క్రీన్ స్ట్రెయిన్..
స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల ఆ ప్రభావం మెదడుపై కంటే కళ్లమీదే ఎక్కువగా పడుతుంది. అకామడేషన్, కన్వర్జెన్స్ ప్రక్రియల ద్వారా కళ్లు నిరంతరం దృష్టిని సర్దుబాటు చేసుకుంటూ ఉంటాయి. మెదడు కూడా వేగంగా మారుతున్న దృశ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తదేకంగా స్ర్కీన్‌ను చూస్తూ కనురెప్పలు వేయడం కూడా మర్చిపోయి గంటల సమయం గడుపుతుంటే కన్నీటి పొర ఆవిరైపోయి కళ్లు గరగరలాడడం, మండడం లాంటివి బాధిస్తుంటాయి. అలాగే కళ్లు పొడిబారడం, చూపు మసకబారడం, తలనొప్పి, కళ్లు పూర్తిగా అలసిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు చిన్న చిన్న కంటి వ్యాయామాలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా అలసిన కళ్లకు విశ్రాంతినిచ్చి దృష్టిని మెరుగుపరిచే మార్గంగా ‘కంటి యోగా’ విశేష ప్రాచుర్యాన్ని పొందుతోంది. దగ్గరగా దూరంగా ఉన్న వస్తువులను మార్చి మార్చి చూడడం, కనుపాపలను కిందికి పైకి పక్కలకు కదల్చడం, చూపులతో వృత్తాలు గీయడం, వీలైనన్ని సార్లు వేగంగా కళ్లార్పడం లాంటివి దృష్టి వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. కళ్లలోని కణజాలానికి రక్తప్రసరణను, ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి. కార్నియా తేమతో నిండేందుకు ఉపకరిస్తాయి.
అన్నింటికీ కాదు...
కంటి వ్యాయామాలు కొన్ని సమస్యలను పరిష్కరిస్తున్నప్పటికీ తీవ్రమైన దృష్టి దోషాల నివారణకు ఉపకరిస్తాయని చెప్పలేం. మయోపియా, హైపరోపియా, ఆస్టిగ్మాటిజం లాంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వాటికి సరైన వైద్య చికిత్స చేయించుకోవడం మంచిది. కళ్లకు సంబంధించి ఏ సమస్య ఎదురైనా దాన్ని స్ర్కీన్ స్ట్రెయిన్‌గా భావించకూడదు. తరచూ వేధించే తలనొప్పి, కారణం లేకుండా కళ్లు తిరగడం, వస్తువు రెండుగా కనిపించడం, రంగులు గుర్తుపట్టలేకపోవడం, కళ్ల నుంచి నీరు కారడం, ఆకస్మిక దృష్టి దోషాలను స్ర్కీన్ స్ట్రెయిన్‌కు ఆపాదించకూడదు. అలాగే విపరీతమైన అలసట, తిమ్మిరి, మాటల్లో తడబాటు, గందరగోళంగా అనిపించడం లాంటి లక్షణాలను కూడా అశ్రద్ద చేయకూడదు.
కంటి యోగా ఇలా...
పామింగ్: అరచేతులను ఒకదానికొకటి వేగంగా రుద్ది అవి వేడెక్కిన తరువాత వాటిని మూసిన కళ్లపై ఉంచి సున్నితంగా నొక్కాలి. ఇలా వీలైనన్నిసార్లు చేస్తుంటే కళ్లకు విశ్రాంతి లభిస్తుంది.
రోలింగ్: కనుపాపలను నెమ్మదిగా గుండ్రంగా తిప్పాలి. మొదట సవ్య దిశలో తరువాత అపసవ్య దిశలో తిప్పుతుంటే కళ్ల చుట్టూ ఉన్న కణజాలానికి రక్తప్రసరణ పెరుగుతుంది. కంటి కండరాలు బలోపేతమవుతాయి.
చూపు నిలపడం: కంటికి దగ్గరగా ఉన్న వస్తువును కొన్ని సెకన్లపాటు తదేకంగా చూసి వెంటనే దూరంగా ఉన్నదానిపై చూపు నిలపాలి. ఇలా తరచూ చేస్తుంటే కళ్ల అలసట, తలనొప్పి, చూపు మసకబారడం లాంటి సమస్యలు తగ్గుతాయి.
కళ్లార్పడం: కనురెప్పలను తరచూ మూస్తూ తెరుస్తూ ఉంటే కంటి ఉపరితలం నీటితో నిండి తేమగా మారుతుంది. దీనివల్ల కళ్లు పొడిబారడం, దురద, కళ్ల మంటలు దరిచేరవు. కార్నియాకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది.
20-20-20 రూల్: ప్రతి 20 నిమిషాలకోసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుపై 20 సెకన్లపాటు చూపు నిలపాలి. దీనివల్ల తదేకంగా చూస్తూ పనిచేసేవారికి కళ్ల అలసట తగ్గుతుంది.
8-ఆకారం: ఊహాత్మకంగా 8 ఆకారాన్ని కళ్లతో నెమ్మదిగా గీయాలి. ఇలా తరచూ చేస్తుంటే కంటి చూపు మెరుగుపడడంతోపాటు కళ్లకు విశ్రాంతి లభిస్తుంది.
విశ్రాంతి తప్పనిసరి...
మితిమీరిన స్క్రీన్ టైమ్ వల్ల ఏర్పడే పరిణామాలకు ‘కంటి యోగ’ ఓ తాత్కాలిక ఉపశమనమే గానీ శాశ్వత పరిష్కారం కాదు. కళ్లకు ఎక్కువగా శ్రమ కలిగించకుండా తరచూ విరామాలు ఇవ్వడం, వీలైతే కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం, తరచూ కనురెప్పలను ఆర్పుతూ ఉండడం, కళ్లజోడు లేదా లెన్స్ వాడి దృష్టి దోషాలను సరిచేసుకోవడం, స్ర్కీన్ టైమ్‌ను నియంత్రించుకోవడం, రాత్రిపూట హాయిగా నిద్రించడం లాంటివి అలవాటు చేసుకుంటే చాలావరకు సాధారణ కంటి సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి.
ఇవి కూడా చదవండి..
ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..
మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..