విటమిన్లతోనే బలం...
ABN , Publish Date - Nov 16 , 2026 | 03:22 AM
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్లు ముందుంటాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే విటమిన్లు, అవి లభించే ఆహారం గురించి తెలుసుకుందాం...
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్లు ముందుంటాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే విటమిన్లు, అవి లభించే ఆహారం గురించి తెలుసుకుందాం...
‘ఎ’ విటమిన్ : దీనికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. శరీరంలో వాపులను, నొప్పులను నివారిస్తుంది. కణాల వృద్ధికి తోడ్పడుతుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుడ్లు, చేపలు, పాలు, క్యారెట్, తర్బూజా, గుమ్మడికాయ, చిలగడదుంపలు, ఆలివ్ ఆయిల్, గింజల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది.
‘బి’ విటమిన్ : ఇందులో ఎనిమిది రకాలు ఉంటాయి. ఇవి నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఎర్ర రక్తకణాల తయారీకి, హార్మోన్ల సమతుల్యతకు, జీవక్రియలు సజావుగా జరిగేందుకు తోడ్పడతాయి. తృణధాన్యాలు, బీన్స్, బఠాణీలు, పల్లీలు, మాంసం, చేపలు, తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పుట్టగొడుగులు, పాల ఉత్పత్తుల్లో ‘బి’ విటమిన్ అధికంగా లభిస్తుంది.
‘సి’ విటమిన్ : ఇది హానికారక బ్యాక్టీరియాలు, వైర్‌సల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తుంది. నిమ్మ, దానిమ్మ, నారింజ, జామ, స్ట్రాబెర్రీ, కివీ, లిచీ పండ్లలో ‘సి’ విటమిన్ అధికంగా ఉంటుంది. వీటిని తరచూ తినడంతోపాటు పాలకూర, క్యాప్సీకమ్‌లను వారానికి రెండుసార్లు ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
‘డి’ విటమిన్ : ఇది ఎముకలు, కండరాలను దృఢంగా మారుస్తుంది. శరీరంలో కాల్షియం శోషణకు తోడ్పడుతుంది. ఉదయాన్నే లేత ఎండలో అరగంటసేపు నిలబడితే చాలు ఆ రోజుకు కావాల్సిన ‘డి’ విటమిన్ లభ్యమవుతుంది. రోజూ చీజ్, యోగర్ట్, గుడ్లు, చేపలను తీసుకోవాలి.
‘ఇ’ విటమిన్ : ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి ఫ్రీ రాడికల్స్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. మెదడు, గుండె ఆరోగ్యంగా పనిచేసేలా చూస్తుంది. ముడుతలు, గీతలు లాంటి అకాల వార్థక్య సమస్యలు రాకుండా చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మం పొరల్లో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ‘ఇ’ విటమిన్ విరివిగా లభించే పొద్దు తిరుగుడు గింజలు, పల్లీలు, బాదం పప్పులు, బ్రొకొలీ, అవకాడో, చేపలను రోజూ తప్పనిసరిగా తీసుకోవాలి.
ఈ వార్తలనూ చదవండి:
మియామి ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాల ఢీ.. ఇద్దరికి గాయాలు
చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..