ఒపీనియన్ కట్నం చావులను ఆపుదాం
ABN , Publish Date - May 21 , 2026 | 04:39 AM
కొన్ని రోజుల వ్యవధిలోనే నోయిడా, భోపాల్‌లలో ఇద్దరు వివాహిత మహిళల ఆత్మహత్యల ఘటనలు సాధారణ ప్రజానీకంతో పాటు ప్రముఖులను కూడా కదిలించాయి...
కొన్ని రోజుల వ్యవధిలోనే నోయిడా, భోపాల్‌లలో ఇద్దరు వివాహిత మహిళల ఆత్మహత్యల ఘటనలు సాధారణ ప్రజానీకంతో పాటు ప్రముఖులను కూడా కదిలించాయి. నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌తో పాటు, మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ, కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి... ఈ ఘటనలకు అడ్డుకట్ట వేసే పరిష్కారాలు, వివాహిత మహిళలు నడుచుకోవలసిన తీరుతెన్నుల గురించి వారి వారి అభిప్రాయాలను మీడియాకు వెల్లడించారు.
కొడుకులు, కూతుళ్ల కంటే ఎందుకు ఎక్కువ?
అత్తింట్లో ఆరళ్ల గురించి కూతురు తల్లిదండ్రులకు చెప్పినా, ఎక్కువ చేసి చెప్తోందనో, కోపంతో ఫిర్యాదు చేస్తోందనో అనుకుంటారు. లేదంటే, కొత్తగా పెళ్లయింది కాబట్టి సర్దుకుపోయే క్రమంలో ఇలాంటివన్నీ మామూలేనని వాళ్లకు వాళ్లు సర్దిచెప్పుకుంటారే తప్ప, కూతురి దృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకోరు. అలాగే మన సమాజం కొడుకులను కూతుళ్ల కంటే కాస్త ఎక్కువ స్థాయి వ్యక్తులుగానే పరిగణిస్తోంది. ఈ బీజాలు నాటుకున్న మగపిల్లలు, పెరిగి పెద్దయ్యాక భార్యలను చిన్నచూపు చూడడం మొదలుపెడుతున్నారు. ఆడపిల్లను పెళ్లి చేసుకుని, వాళ్లకు జీవితాన్నిస్తున్నట్టు, వాళ్లను ఉద్ధరిస్తున్నట్టు భావిస్తున్నారు. నిజానికి ప్రతి అమ్మాయి తల్లిదండ్రులూ, అంగట్లో అల్లుళ్లను వేలంపాట పాడుకునే బిడ్డర్స్ లాంటివాళ్లు. కట్నకానుకలిచ్చి, భర్తలను కొనుక్కుంటున్న కొందరు అమ్మాయిలు, వాళ్ల ప్రాణాలనే మూల్యంగా చెల్లించవలసివస్తోంది. అత్తింటివారు అబ్బాయిని ఎంత అపురూపంగా పెంచుకుంటారో, పుట్టింటివారు అమ్మాయిని కూడా అంతే అపురూపంగా పెంచుకుంటారు. కాబట్టి అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ సమానమే! అలాంటప్పుడు పెళ్లి ఖర్చులను అమ్మాయి తల్లిదండ్రులే ఎందుకు భరించాలి? రెండు కుటుంబాలూ చెరి సగం ఎందుకు పంచుకోకూడదు?
- రేణుక చౌదరి
కోరుకున్న జీవితానికే తొలి ప్రాధామ్యం
‘వివాహితులైన యువతులకు సంబంధించి ప్రతిరోజూ అనేక విషాద వార్తలు వింటున్నాం. ఈ మహిళల్లో విద్యావంతులున్నారు. ఉన్నత చదువులు చదివిన ఈ మహిళలు కూడా, అత్తగారి ఇంటి నుంచి బయటపడడానికి తల్లిదండ్రుల సహాయాల మీదా, సలహాల మీదా ఆధారపడుతూ ఉండడం విచారకరం. భారతీయ సమాజాల్లో కూతుళ్లకు పెళ్లి చేసిన తర్వాత, వారిని పూర్తిగా పట్టించుకోవడం మానేయడం ఒక ఆనవాయితీగా మారింది. బాధాకరమైన విషయమిది. మరే సామాజిక మాధ్యమం, ఫ్యాషన్/డేటింగ్/వెడ్డింగ్/మేకప్ పరిశ్రమా ఇవ్వని ఒక సలహా నేను వివాహిత మహిళలకు ఇవ్వాలనుకుంటున్నాను. మీ జీవితంలో అందరికంటే, అన్నిటికంటే ముఖ్యమైనది మీ కెరీర్. ఆర్థికంగా, అన్ని విధాలా స్వతంత్రంగా మారిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండి. మీకు మీరే హీరోగా మారండి. మిమ్మల్ని కాపాడడానికి ఎవరూ రారు. మీరెవర్ని పెళ్లి చేసుకుంటారు? అన్న దాని కంటే, మీరేం అవుదామనుకుంటున్నారు? మీరెవరు? అన్నదే ముఖ్యం. నచ్చిన జీవితాన్ని నిర్మించుకోండి. ఎవరి మాటా వినొద్దు’.
కంగనా రనౌత్

ఇవన్నీ నివారించదగిన దుర్ఘటనలే!
‘వివాహిత మహిళల మరణాలన్నీ నివారించదగినవే! తల్లిదండ్రులు వీటిని నివారించగలుగుతారు. సదరు వివాహిత మహిళలు కూడా ఈ దుర్ఘటనలను నివారించుకోగలుగుతారు. మన సమాజం మగపిల్లలను కెరీర్ కోసం సిద్ధం చేస్తూ, ఆడపిల్లలను జీవితం కోసం, కెరీర్ కోసం సిద్ధం చేయడానికి బదులుగా పెళ్లి కోసం, జీవితకాలపు భద్రత, డిపెండెన్సీల కోసం సిద్ధం చేస్తోంది. ఒకవేళ ఆడపిల్లలకు కెరీర్ అన్నది ఉన్నా, అది పెళ్లి తర్వాతి స్థానానికే పరిమితమైపోతోంది. మనం మన పిల్లలను ఈ ప్రాధామ్యాలకు తగ్గట్టుగా పెంచి పెద్ద చేస్తున్నాం. వాళ్ల వ్యక్తిత్వాలను తదనుగుణంగానే మలుస్తున్నాం. మరీ ముఖ్యంగా మగపిల్లలకు, అనుబంధాల విలువలను నేర్పించడం లేదు. పంచుకోవడంలో ఉండే ఆనందాన్ని ఆస్వాదించే విధంగా పెంచడం లేదు. అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులు పెళ్లి ఎంత ఆడంబరంగా జరుపుతూ ఉంటారంటే, ఆ వైభవం, ఆడంబరాలను చూసిన ఆడపిల్ల, తన కోసం అంతటి పెట్టుబడి పెట్టిన తల్లిదండ్రులను ఎప్పటికీ నిరాశ పరచకూడదనీ, తన మీద పెట్టుకున్న ఆశలను ఎప్పటికీ నీరుకార్చకూడదనీ అనుకుంటుంది. ఆ అదృశ్య బాధ్యతను మోస్తూ, అణకువతో నడుచుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ విషయం గురించి తల్లిదండ్రులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్యావంతులైన ఆడపిల్లలు కూడా కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏ మేరకు ఉందనే దిశగా ఆలోచించాలి. కెరీర్‌ను నిర్మించుకుని ఆర్థిక స్వాతంత్రం పొందడం ముఖ్యమనే విషయాన్ని గ్రహించాలి. పెళ్లయ్యాక ఎదురయ్యే అవమానాలనూ, నిందలనూ, అవహేళనలనూ కచ్చితంగా తీవ్రంగానే పరిగణించాలి. అలాంటి ఇంట్లో నోరు తెరవకుండా ఉండిపోవడం సరి కాదు. పుట్టింటికి వెళ్లి నిర్ణయం తీసుకుంటానని చెప్పి, తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోవచ్చు. పెళ్లవగానే కొత్తగా, అదనంగా తోడయ్యే ఇల్లు... అత్తిల్లు. పుట్టిల్లును కోల్పోయి అత్తింటినే తన ఇల్లుగా భావించి, ఆ ఇంటికే పరిమితమైపోవడం కూడా సరి కాదు. పెళ్లైన ప్రతి మహిళా తనకు రెండు ఇళ్లు ఉన్నాయనే ఆలోచనతో మెలగాలి. పెళ్లి తర్వాత పుట్టింటిని వదిలి, అత్తింటికి వెళ్లిపోయినంత మాత్రాన, పుట్టిల్లును కోల్పోయామని అనుకోకూడదు. అత్తింట్లో పరిస్థితులు అనుకూలించి, జీవితం సాఫీగా సాగితే ఫర్వాలేదు. లేనప్పుడు తిరిగి రావడానికి పుట్టిల్లు ఉండనే ఉంది’.
కిరణ్ బేడి
ఈ వార్తలు కూడా చదవండి
అత్తాపూర్ కిడ్నాప్ కేసు.. ఇంట్లోనే సేఫ్‌గా ఉన్న యువతి
శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుపడిన హైగ్రేడ్ గంజాయి..