Share News

నయా నంబర్‌ వన్‌

ABN , Publish Date - Sep 23 , 2026 | 01:19 AM

యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌... ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంకింగ్‌... కజకిస్తాన్‌ టెన్నిస్‌ స్టార్‌ ఎలెనా రిబకినాను రెండూ ఒకేసారి వరించాయి. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ దక్కించుకున్న ఆమె...

నయా నంబర్‌ వన్‌

విజేత

యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌... ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంకింగ్‌... కజకిస్తాన్‌ టెన్నిస్‌ స్టార్‌ ఎలెనా రిబకినాను రెండూ ఒకేసారి వరించాయి. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ దక్కించుకున్న ఆమె... కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తోంది. గాయాలను దాటి... ఆరోగ్య సమస్యలను అధిగమించి... అంకితభావం, కఠోర శ్రమతో కలలను సాకారం చేసుకొని... అగ్రస్థానానికి ఎగసిన కజకిస్తాన్‌ సంచలనం 27 ఏళ్ల రిబకినా జర్నీ ఇది.

యూఎస్‌ ఓపెన్‌కు కొన్ని వారాల ముందు రిబకినాను చూసినవారికి ఆమె సాధించిన విజయాలు నమ్మశక్యం కావు. ఎందుకంటే తీవ్రమైన గాయం నుంచి కోలుకొని... కోర్టులో ఇబ్బంది పడుతున్న ఆమె ఈ గ్రాండ్‌స్లామ్‌ నాటికి అనూహ్యంగా పుంజుకుంది. పాదరసంలా కదులుతూ... మానసికంగా మెరుగైన స్థితిలో కనిపించింది. కీలక సమయాల్లో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా... వెనకబడినా నీరుగారిపోకుండా... రెట్టించిన ఉత్సాహంతో ప్రత్యర్థులపై విరుచుకుపడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి ముందు రిబకినా ఖాతాలో రెండు గ్రాండ్‌స్లామ్‌లు ఉన్నా... యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా ఆవిర్భవిస్తుందని ఎవరూ అంచనా వేయలేదు. అందుకు కారణం... ఎత్తుపల్లాలతో సాగుతున్న ఆమె ఫామ్‌.

అంచనాలు లేకుండానే...

నిజానికి రిబకినా ఈ ఏడాదిని అద్భుతంగా ప్రారంభించింది. ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచి... నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం రెండో గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకుంది. కానీ ఆ తరువాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ రెండో రౌండ్‌లో, వింబుల్డన్‌ మూడో రౌండ్‌లోనే నిష్క్రమించింది. ఇక యూఎస్‌ ఓపెన్‌కు ముందు గాయంతో ఇబ్బంది పడింది. దాంతో ఆమెపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ ఒక్కో మ్యాచ్‌లో పుంజుకొంటూ... ఒకాసో, కోకో గాఫ్‌ లాంటి ఫామ్‌లో ఉన్న క్రీడాకారులను మట్టి కరిపిస్తూ... అంతిమ సమరానికి చేరుకుంది. రెండుసార్లు డిఫెండింగ్‌ చాంపియన్‌, చిరకాల ప్రత్యర్థి అయిన అరీనా సబలెంకాతో తలపడింది. మొదటి సెట్‌లో దూకుడుగా ఆడిన రిబకినా... హోరాహోరీగా జరిగిన రెండో సెట్‌ను కోల్పోయింది. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో మూడో సెట్‌లో విజృంభించి... సునాయాసంగా నెగ్గింది. యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను ముద్దాడింది.


‘నమ్మలేకపోతున్నా’...

కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకున్న రిబకినా... ఈ విజయం ఊహించలేదని చెప్పింది. ‘‘నిజం చెప్పాలంటే నాకు మాటలు రావడంలేదు. ఈ టోర్నీకి వస్తున్నప్పుడు నేను ఇలాంటిది ఏదీ ఊహించలేదు. దీనికి ముందు గాయం కారణంగా కాస్త ఇబ్బంది పడుతున్నాను. ఒక్కో మ్యాచ్‌పై దృష్టి పెడుతూ ఆడా ను. ఏదో విధంగా అన్నీ నాకు అనుకూలంగా జరిగాయి. అరీనా... నువ్వు గొప్ప చాంపియన్‌వి. నీతో ఆడటం చాలా కష్టం. నువ్వు నా పరిమితులను దాటి ఆడతావు. నేను దొరికినన్ని బం తులను అందుకోవాలని ప్రయత్నించాను. సులువుగా ప్రత్యర్థికి పాయింట్‌ ఇవ్వకూడదని పట్టుదలగా ఆడాను. అదే నన్ను గెలిపించింది’’ అంటూ ఫైనల్స్‌ అనంతరం ఆమె భావోద్వేగానికి లోనైంది. సబలెంకాతో మూడు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో తలపడిన ఆమె... రెండుసార్లు విజేతగా నిలవడం విశేషం.

జిమ్నాస్టిక్స్‌ వదిలేసి...

వాస్తవానికి రిబకినా మాతృభూమి రష్యా. మాస్కోలో పుట్టింది. ఆమె తండ్రి ఆండ్రీ రిబకినా ఎన్‌టీవీ ప్లస్‌ టీవీ చానల్‌లో ప్రొడ్యూసర్‌గా పని చేశారు. ఆయన మూలాలు కజకిస్తాన్‌లో ఉన్నాయి. తల్లి ఎకటెరినా. అక్క అన్నాతో కలిసి చాలా చిన్న వయసులో ఆటల్లోకి అడుగు పెట్టిన రిబకినా... తొలుత జిమ్నాస్టిక్స్‌, ఐస్‌ స్కేటింగ్‌లో సాధన చేసింది. అయితే బాగా పొడవుగా ఉండటంవల్ల ఆ క్రీడల్లో కెరీర్‌ను కొనసాగించడం కష్టమని కోచ్‌లు చెప్పడంతో రూటు మార్చింది. తండ్రి సూచనతో ఆరేళ్లప్పుడు టెన్నిస్‌ రాకెట్‌ పట్టుకుంది. గమనించాల్సిన అంశం ఏమిటంటే పద్ధెనిమిదేళ్ల వరకు రిబకినాకు వ్యక్తిగత కోచ్‌ లేకపోవడం. పదిహేనేళ్ల వరకు ఎనిమిది మంది క్రీడాకారుల బృందంతో, ఆ తరువాత నలుగురు బృందంతో కలిసి సాధన చేసింది. టెన్ని్‌సకు రెండు గంటలు, ఫిట్‌నెస్‌కు మూడు గంటలు సమయం కేటాయించేది. మిగిలింది స్కూల్‌ వర్క్‌ కోసం.

8-navya.jpg


రష్యా నుంచి కజకిస్తాన్‌కు...

పధ్నాలుగేళ్లకు ఐటీఎఫ్‌ జూనియర్‌ సర్క్యూట్‌ ద్వారా తొలిసారి అంతర్జాతీయ పోటీల్లోకి అడుగుపెట్టిన రిబకినా... కొద్ది కాలంలోనే ప్రపంచ జూనియర్‌ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకింది. 2015లో యూఎస్‌ ఓపెన్‌ జూనియర్స్‌ గ్రాండ్‌స్లామ్‌ విభాగంలో తలపడింది. అదే ఆమె కెరీర్‌లో అతి పెద్ద మలుపు. మరుసటి ఏడాది ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ జూనియర్స్‌లో పాల్గొంది. వీటితోపాటు ఇతర ఐటీఎఫ్‌ టోర్నీల్లోనే టైటిల్స్‌ లేకుండా వెనుదిరిగింది. ఆ సమయంలో కాస్త నిరాశకు లోనైన ఈ ఆరడుగుల బుల్లెట్‌... మరింత కసిగా ప్రయత్నించింది. జూనియర్‌ గ్రాండ్‌స్లామ్స్‌లో ఫైనల్స్‌కు వెళ్లింది. ఇతర టూర్‌ టైటిల్స్‌ గెలిచింది. అయితే రష్యా టెన్నిస్‌ ఫెడరేషన్‌ నుంచి సరైన ఆర్థిక మద్దతు, సహకారం లేకపోవడంతో ఆమె తండ్రి విసుగెత్తిపోయారు. కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రష్యా నుంచి కజకిస్తాన్‌కు మారారు. రిబకినా తన పంతొమ్మిదో ఏట ఆ దేశ పౌరసత్వాన్ని పొందింది. ఆ సాహసోపేత నిర్ణయం ఆమె కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పింది. ఆ దేశ టెన్నిస్‌ ఫెడరేషన్‌తో పాటు స్పాన్సర్ల మద్దతుతో వ్యక్తిగత కోచ్‌ను నియమించుకుంది. నాటి నుంచి గ్రాండ్‌స్లామ్‌ వేట మొదలుపెట్టింది.

వింబుల్డన్‌తో మొదలు...

ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ఫైనల్‌లో వెనుదిరిగిన రిబకినా... 2022లో వింబుల్డన్‌ టైటిల్‌ గెలిచి సంచలనం సృష్టించింది. ఎన్నో ఏళ్ల ఆమె గ్రాండ్‌స్లామ్‌ కల నెరవేరింది. ఆమె జీవితంలో అది చారిత్రక క్షణం. మళ్లీ ఈ ఏడాది ఆరంభంలో ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ నెగ్గిన రిబకినా... తాజాగా యూఎస్‌ ఓపెన్‌లోనూ తానేమిటో నిరూపించుకుంది. బలమైన గ్రౌండ్‌ షాట్స్‌, గంటలకు రెండు వందల కిలోమీటర్ల వేగం దాటే సర్వ్‌లు ఆమె ప్రత్యేకత. క్రీడాకారిణిగా నైపుణ్యాలు మెరుగుపరుచుకొంటున్న కొద్దీ, ప్రత్యర్థులకు అతిపెద్ద సవాలుగా మారింది. నైపుణ్యంతో పాటు ఆటలో ఆమెకు సహజసిద్ధమైన ప్రతిభ ఉందనేది మాజీల మాట.

అదే ఆమె బలం...

సంవత్సరాల తరబడి కఠోర శ్రమకు, పట్టుదలకు, అంకితభావానికి ప్రతిబింబం రిబకినా ప్రయాణం. సానుకూల దృక్పథం, రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉండే తత్వం... ఇవే ఆమె బలం. తన విజయాల్లో తనకు మద్దతుగా నిలిచిన అభిమానుల పాత్ర కూడా ఉందని పలు సందర్భాల్లో రిబకినా చెప్పింది. ‘‘ఇంటికి దూరంగా ఉన్నప్పుడు, మైదానంలో ప్రేక్షకులు మనల్ని ప్రోత్సహిస్తుంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఇంటి బెంగ పోతుంది. వారు నాపై చూపే ప్రేమ ముగ్ధురాలిని చేస్తుంది. అందుకే నాకు సమయం దొరికినప్పుడల్లా అభిమానులతో ఒక ఫొటో, ఒక చిరునవ్వు, ఒక సంతకం, ఒక క్షణం... ఇలా ఏదో ఒక రూపంలో వారికి తిరిగి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను’’ అంటున్న రిబకినా నవతరానికి స్ఫూర్తి మంత్రం.

ఈ వార్తలు కూడా చదవండి..

రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ

ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా

Updated Date - Sep 23 , 2026 | 01:24 AM