‘ఈజిప్షియన్ మెథడ్’తో ఏసీ బిల్లుకు చెల్లు
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:25 AM
ఎండలు మండిపోతున్నాయి. ఏసీలు, కూలర్లు ఉన్నా ఉక్కపోత తగ్గడం లేదా? అయితే పురాతన ఈజిప్షియన్లు వాడిన ఒక అద్భుతమైన చిట్కాను ప్రయత్నించి చూడండి...
ఎండలు మండిపోతున్నాయి. ఏసీలు, కూలర్లు ఉన్నా ఉక్కపోత తగ్గడం లేదా? అయితే పురాతన ఈజిప్షియన్లు వాడిన ఒక అద్భుతమైన చిట్కాను ప్రయత్నించి చూడండి. దీనినే ‘ఈజిప్షియన్ మెథడ్’ అంటారు.
ఏమిటీ ఈజిప్షియన్ మెథడ్?
ప్రాచీన ఈజిప్షియన్లు ఎడారి ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించేవారు. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడానికి వారు తమ దుప్పట్లను నీటిలో తడిపి, నీరు కారకుండా గట్టిగా పిండి, వాటిని ఒంటిపై కప్పుకుని పడుకునేవారు. వినడానికి ఇది కొంచెం వింతగా ఉన్నా, దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణం ఉంది.
సైన్స్ ఏం చెబుతోంది?
దీనిని శాస్త్రీయంగా ‘ఎవాపరేటివ్ కూలింగ్’ అంటారు. మనం వాడే మట్టికుండలో నీళ్లు చల్లగా ఉండటానికి ఏ సూత్రం అయితే పనిచేస్తుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. తడిషీట్ మీద గాలి తగిలినప్పుడు అందులోని నీరు ఆవిరిగా మారుతుంది. నీరు ఆవిరి కావడానికి అవసరమైన వేడిని అది మన శరీరం నుంచి, చుట్టూ ఉన్న వాతావరణం నుంచి గ్రహిస్తుంది. ఫలితంగా మన శరీర ఉష్ణోగ్రత తక్షణమే తగ్గి చల్లదనం కలుగుతుంది.
మీ ఇంట్లో ఎలా ప్రయత్నించాలి?
సరైన షీట్ ఎంపిక: పల్చటి కాటన్ బెడ్‌షీట్ లేదా పెద్ద బాత్‌టవల్‌ను తీసుకోండి. సింథటిక్ వస్త్రాలు వాడకూడదు.
తడపడం: షీట్‌ను చల్లటి వాటర్‌లో పూర్తిగా ముంచండి.
నీటిని తొలగించడం: షీట్‌ను వాషింగ్ మెషీన్‌లోని ‘స్పిన్’ సైకిల్‌లో వేస్తే నీరంతా పోయి కేవలం తడిగా ఉంటుంది. మెషీన్ లేకపోతే చేత్తో మొత్తం నీరు పోయేలా పిండాలి.
ఏర్పాటు: పరుపు తడవకుండా ఉండాలంటే దానిపై ఒక ప్లాస్టిక్ షీట్ లేదా వాటర్ ప్రూఫ్ మ్యాట్ వేసి, దానిపైన పొడి బెడ్‌షీట్ పరవండి.
నిద్ర: ఇప్పుడు మీపైన తడి బెడ్‌షీట్‌ను కప్పుకోండి. గదిలో ఫ్యాన్ తక్కువ స్పీడ్‌లో తిరుగుతున్నా లేదా కిటికీ నుంచి గాలి వస్తున్నా మీరు అద్భుతమైన చల్లదనాన్ని అనుభవిస్తారు.
ఈ వార్తలనూ చదవండి:
శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ
భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో