ఒత్తిడిని మరిపించేది వారి సంతోషమే
ABN , Publish Date - Jul 26 , 2026 | 02:28 AM
వైద్యాన్ని కేవలం ఒక వృత్తిగా చూడకుండా, పదిమందికీ పంచే విద్యగా భావిస్తూ, ప్రపంచవ్యాప్త వైద్యులకు గురువుగా మారారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నవీన్ పోలవరపు. తాజాగా...
అతిథి
వైద్యాన్ని కేవలం ఒక వృత్తిగా చూడకుండా, పదిమందికీ పంచే విద్యగా భావిస్తూ, ప్రపంచవ్యాప్త వైద్యులకు గురువుగా మారారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నవీన్ పోలవరపు. తాజాగా యుకె కాన్ఫరెన్స్ కోసం అత్యంత క్లిష్టమైన సర్జరీలు చేసి చూపించి, ప్రపంచవ్యాప్త అతిరథ మహారఽథులైన వైద్య నిపుణులతో ‘శభాష్’ అనిపించుకున్నారాయన. అన్నిటికీ మించి ఆత్మ సంతృప్తి ప్రధానమని నమ్మే డాక్టర్ నవీన్ ఆసక్తికరమైన వైద్య ప్రస్థానం ఆయన మాటల్లోనే....
‘‘మాది హైదరాబాద్. ఇక్కడే పుట్టి పెరిగాను. చిన్నప్పుడు అమ్మ ఆరోగ్యం పాడైంది. వైద్యులను కలిసి చికిత్స తీసుకున్న తర్వాత అమ్మ త్వరగా కోలుకుని, పూర్తి ఆరోగ్యాన్ని పుంజుకోవడం చూసి... ఆ క్షణమే వైద్యుడిని కావాలని నిర్ణయించుకున్నాను. ఇంటర్‌లో బైపీసీ గ్రూపు ఎంచుకుని, కష్టపడి చదవడం మొదలుపెట్టాను. 1995లో విజయవాడ సిద్దార్థ మెడికల్ కాలేజీలో మెడిసిన్ పూర్తి చేసి, పైచదువుల కోసం యుకె వెళ్లిపోయాను.
గ్యాస్ట్రోఎంటరాలజీ ఎందుకంటే...
చిన్నప్పటి నుంచి చురుకైన విద్యార్థినే! మెడిసిన్ చదివే రోజుల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అప్పట్లో నేను యూనివర్సిటీ టాపర్‌గా ఉండేవాడిని. యుకె వెళ్లిన తర్వాత... రెండు నెలల చొప్పున వేర్వేరు స్పెషాలిటీల్లో పని చేయవలసి వచ్చినప్పుడు, గ్యాస్ట్రోఎంటరాలజీ నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ స్పెషాలిటీలో ఓపీ ఉంటుంది, సర్జరీలు చేయొచ్చు. వైద్యపరమైన పురోగతులకు కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కొత్త ఇంటర్వెన్షన్లు, చికిత్స విధానాలు రూపొందుతూనే ఉంటాయి. దాంతో గ్యాస్ట్రోఎంటరాలజీ స్పెషాలిటీని ఎంచుకొని... దాన్లో ఎమ్‌ఆర్‌సిపి, ఎఫ్‌ఆర్‌సిపి, సిసిటి (గ్యాస్ట్రో సూపర్ స్పెషాలిటీ), అడ్వాన్స్‌డ్ ఎండోస్కోపిక్ ఫెలోషిప్, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఫెలోషిప్ పూర్తి చేశాను. తర్వాత యుకెలోనే కొంత కాలం కన్సల్టెంట్‌గా పని చేసి, తెలుగు ప్రజల కోసం ఇండియాకు వచ్చేశాను.

కేసులు సవాళ్లు విసిరిన సందర్భాల్లో...
వైద్యుల కెరీర్‌లో ఎన్నో క్లిష్టమైన కేసులు ఎదురుపడుతూ ఉంటాయి. కానీ గండాలన్నిటినీ గట్టెక్కించడం సాధ్యపడకపోవచ్చు. అయుతే చావు బ్రతుకుల్లో ఆస్పత్రికి చేరుకున్న వాళ్లు చికిత్సతో పూర్తిగా కోలుకున్నప్పుడు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఇలాంటి కేసులెన్నో ఉన్నాయి. ఒక సందర్భంలో పాతికేళ్ల యువతి, కాలేయం పూర్తిగా దెబ్బతిని, కోమా దశలో ఆస్పత్రికి వచ్చింది. ఎంతో క్లిష్టమైన పరిస్థితి అది. అయినప్పటికీ 24 గంటల్లో దాతను వెతికి, ట్రాన్స్‌ప్లాంట్ చేయగలిగాం. అలాగే రక్తపు వాంతులతో ఆస్పత్రికి చేరుకున్న రోగులకు ఎండోస్కోపీతో రక్తస్రావ ప్రదేశాలను గుర్తించి, వాటికి చికిత్స చేసి మూడు రోజుల్లో డిశ్చార్జి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
మరణాన్ని కూడా గౌరవించాలి
రోగిని బ్రతికించడం కోసం శాయశక్తులా ప్రయత్నించినా కొన్ని సందర్భాల్లో మా ప్రయత్నాలు వృథా అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కుంగిపోతే, వైద్య వృత్తిని సమర్థంగా కొనసాగించలేం, కాబట్టి అన్నీ మన చేతుల్లో ఉండవనే విషయాన్ని అర్థం చేసుకుని, పరిస్థితినిబట్టి సర్దుకుపోతూ ఉంటాం. రోగి మరణం కచ్చితంగా బాధిస్తుంది. చికిత్స ఇస్తాం కాబట్టి రోగితో అనుబంధం ఏర్పడుతుంది. కానీ అంతిమంగా ప్రకృతిదే పైచేయి అవుతుంది. కాబట్టి అంతిమ ఫలితాన్ని అంగీకరించక తప్పదు.
మనిషిని బ్రతికించడం ఎంత ముఖ్యమో, మరణాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యమని నేను నమ్ముతాను. రోగి స్థానంలో ఉండి వాళ్ల బాధనూ, వేదననూ వాళ్ల కోణంలో నుంచి అర్థం చేసుకుని చికిత్స చేయాలా? నాణ్యమైన జీవితాన్ని అందించాలా? అనేది నిర్ణయించాలి. చివరి దశ క్యాన్సర్‌తో పోరాడే రోగికి చికిత్స తీవ్రతను పెంచితే... ఆ రోగి బాధలు ఇంకొంత కాలం కొనసాగుతాయి. ఇలా మరణానికి చేరువయ్యే రోగులను చికిత్సతో మరింత బాధపెట్టడం సరికాదనీ, చివరి రోజులు నాణ్యంగా గడిపేలా కంఫర్ట్ కేర్ ఇవ్వమనీ వాళ్ల కుటుంబ సభ్యులకు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.
బోధనంటే మక్కువ ఎక్కువ
జ్ఞానాన్ని నలుగురితో పంచుకోవడం అవసరమని నేను బలంగా నమ్ముతాను. గురువుల దగ్గర శిక్షణ పొందాను కాబట్టే నేనీ రోజు వైద్యుడిగా సేవలందించగలుగుతున్నాను. కాబట్టి నేను పొందిన ఆ జ్ఞానాన్ని నా తోటి వైద్యులకు పంచడం బాధ్యతగా భావిస్తాను. మన దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఎంతోమంది ట్రైనీలు నా దగ్గరకు వస్తూ ఉంటారు.
ఇథియోపియా, టాంజానియా, కాంగో, కెన్యా, నైజీరియా మొదలైన ఆఫ్రికా దేశాల నుంచి కూడా వైద్యులు వచ్చి శిక్షణ తీసుకుంటూ ఉంటారు. అలాగే అనేక అంతర్జాతీయ సమావేశాలకు కూడా నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు. ఆసియా-పసిఫిక్ దేశాలన్నిట్లో కొందరు మెరికల్లాంటి వైద్యులను గుర్తించి, వాళ్లకు కూడా శిక్షణ ఇవ్వబోతున్నాను.

వైద్యులూ మనుషులే!
వైద్య వృత్తికి నూరు శాతం న్యాయం చేయాలంటే కుటుంబ సభ్యుల తోడ్పాటు కూడా కచ్చితంగా ఉండాలి. కుటుంబ మద్దతు, తోటి వైద్యులు, వైద్య సిబ్బంది బృంద కృషి వల్లే నేను ఆ స్థాయికి ఎదగగలిగాను. నేను భగవంతుడిని నమ్ముతాను. ప్రతి మనిషిలో భగవంతుడు ఉంటాడని నమ్ముతాను. రోగి క్షేమం కోసం శాయశక్తులా కష్టపడతాను. హేతుబద్ధంగా ఆలోచించి, అంతిమ ఫలితాన్ని స్వీకరిస్తాను. వైద్యులం కూడా మనుషులమే కాబట్టి ‘ఊపిరాడని పనులతో సతమతమయ్యే ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నానా?’ అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇదంతా జీవితంలో ఒక భాగం. అయితే అంతిమంగా సంతోషంగా ఇంటికి వెళ్లే రోగిని చూసినప్పుడు అప్పటివరకూ పడిన శ్రమ, ఒత్తిళ్లు దూదిపింజల్లా ఎగిరిపోతూ ఉంటాయి. వైద్యులకు కూడా వృత్తిపరమైన ఒత్తిళ్లు ఉంటాయి. కాబట్టి సాంత్వన కోసం పాత తెలుగు, హిందీ పాటలు వింటూ ఉంటాను. పిల్లలతో సమయం గడుపుతూ ఉంటాను. టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్ ఆడుతూ ఉంటాను. తరచూ విహారయాత్రలకు వెళ్తూ ఉంటాను. వైద్యులు పలు రకాల ఇన్‌ఫెక్షన్లకు బహిర్గతమవుతూ ఉంటారు కాబట్టి జబ్బు పడకుండా ఎంతో జాగ్రత్తగా ఉంటాను. రోగులకు వైద్యులే రోల్ మోడల్స్ కనుక వైద్యులెప్పుడూ ఆరోగ్యంగా కనిపించాలి. అందుకోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటాను. వ్యాయామం చేస్తాను. కంటి నిండా నిద్రపోతాను.
గోగుమళ్ల కవిత
ప్రపంచ దృష్టిని ఆకట్టుకుని...
‘‘ఈ జూలై 17న కాలేయం, జీర్ణవ్యవస్థల అత్యాధునిక సర్జరీలకు సంబంధించి, యుకె, మాంచెస్టర్‌లో రెండు రోజుల అంతర్జాతీయ సమావేశాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా మహామహులైన వైద్యులు పాల్గొన్న ఈ సమావేశాల్లో జూమ్ మీటింగ్ ద్వారా పాల్గొని, క్లిష్టమైన, అత్యాధునికమైన సర్జరీలను ప్రదర్శించే అపురూపమైన అవకాశం మా వైద్య బృందానికి వచ్చింది. ఆ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందడంతో... జూమ్ లింక్ ద్వారా బైల్ పైపులో ఉన్న ట్యూమర్లు, రాళ్లను తొలగించే కొన్ని క్లిష్టమైన సర్జరీలను చూపించగలిగాం. ప్రపంచవ్యాప్తంగా అమెరికాలోని ఫ్లోరిడా, యుకె, మన ఇండియా... మూడు దేశాలు మాత్రమే సర్జరీలను ప్రదర్శించగలిగాయి. సాధారణంగా విదేశాల్లో వ్యాధి నిర్థారణకు మూడు వారాల సమయం పడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఐదు నిమిషాల్లోనే రిపోర్టును అందుకుని, ఏక కాలంలోనే సర్జరీ, బయాప్సీ, వ్యాధి నిర్థారణ, చికిత్సలను పూర్తి చేయవచ్చని వాళ్లకు చూపించగలిగాను. ఆ సమయంలో వాళ్ల ప్రశ్నలకు సంతృప్తి కరమైన సమాధానాలు ఇవ్వగలిగాను. అది చూసిన ఆ అంతర్జాతీయ వైద్య నిపుణు లందరూ ‘‘నవీన్, మిమ్మల్ని చూసి మేం అసూయపడుతున్నాం’’ అని అన్నారు. జూమ్ మీటింగ్ ద్వారా ఇక్కడి వైద్యులు అందించే సత్వరమైన, నాణ్యమైన, చవకైన చికిత్సా విధానాల గురించి వాళ్లు తెలుసుకోగలిగారు. ఎంతో గర్వించదగిన సందర్భమిది.’’
డబ్బు సంపాదన అవసరమే!
కానీ అంతకంటే ఎక్కువగా ఆత్మసంతృప్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. డబ్బు అన్నది మనం చేసే పనికి లభించే ఒక ఉప ఉత్పత్తి మాత్రమే! మొదట రోగులకు సరైన సలహాను, నాణ్యమైన చికిత్సను అందించాలి. అంతిమంగా పేరు ప్రఖ్యాతులు, సంపదలు వాటంతటవే సమకూరతాయని నేను నమ్ముతాను.
2017లో మొజాంబిక్ దేశానికి వెళ్లినప్పుడు కేవలం ఇద్దరే ఇద్దరు గ్యాస్ట్రోఎంటరాలజి్‌స్టలను చూశాను. ఆ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో అక్కడి ఆరోగ్య మంత్రితో మాట్లాడి, పాఠ్యప్రణాళికలు డిజైన్ చేసి, గ్యాస్ట్రోఎంటరాలజిస్టులను ఇక్కడకు పిలిపించి, శిక్షణ ఇచ్చి, తిరిగి పంపించాను. అలా ఇన్నేళ్ల కాలంలో... ఆ వైద్యుల సంఖ్యను 36కు పెంచగలిగాను.
ఈ వార్తలనూ చదవండి:
ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మారుతున్న పరిణామాలు