రైతులే నా గురువులు
ABN , Publish Date - Mar 23 , 2026 | 02:01 AM
డాక్టర్ బద్రి జ్యోతీయాదవ్‌ది వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం కాకపోయినా... ఆమె ఆ రంగంలో శాస్త్రవేత్తగా రాణిస్తున్నారు. లక్షలాదిమంది రైతులకు...
డాక్టర్ బద్రి జ్యోతీయాదవ్‌ది వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం కాకపోయినా... ఆమె ఆ రంగంలో శాస్త్రవేత్తగా రాణిస్తున్నారు. లక్షలాదిమంది రైతులకు మేలుకలిగించాలనే లక్ష్యంతో ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చి’లో సీనియర్ సైంటిస్టుగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ పాత నగరంలో పుట్టి, పెరిగిన ఆమె మూడు సరికొత్త వరి వంగడాలను కనుగొన్నారు. పట్టణం నుంచి పంట పొలాల వైపుగా ప్రయాణిస్తున్న జ్యోతి తన పరిశోధనా విశేషాలను ‘నవ్య’తో పంచుకున్నారు.
‘‘మాది వ్యవసాయ కుటుంబం కాదు. మా పూర్వీకులకు కూడా సాగుతో సంబంధం లేదు. అలాంటిది ఇవాళ రైతులకు మేలు కలిగించే మూడు రకాల వరి వంగడాలను అందించినందుకు సంతోషంగా ఉంది. వాటిలో... ఈ మధ్యే కనుగొన్న ‘డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చి’ (డీఆర్‌ఆర్) ధాన్ - 87 రకం వరి వంగడం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, బిహార్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాలలో సాగుకు అనుకూలం. వరి కాండం దృఢంగా ఉండడంతో కోత సమయంలో పంట గాలివానలకు నేల వాలదు. గింజ రాలే తత్వం చాలా తక్కువ. పంట పక్వానికి వచ్చేప్పుడు మూడు వారాల నిద్రావస్థలో ఉండే లక్షణం వల్ల ఒకవేళ కంకులు తడిసినా మొలకలెత్తవు. కంకికి 400 గింజల వరకు వచ్చి, మంచి దిగుబడి లభిస్తుంది. ఇది సేంద్రియ వ్యవసాయానికి కూడా చాలా అనుకూలం. ఎరువులు పెద్దగా వినియోగించనవసరం లేదు. ఈ వేసవిలో ఏపీ, తెలంగాణ రైతులు కొంందరు ఇదే వంగడాన్ని సాగు చేస్తున్నారు. చాలా మంచి ఫలితాలు వస్తున్నాయని నాకు ఫోన్ చేసి చెబుతున్నారు. ఈ వంగడాన్ని పరీక్షించడానికి మాకు ఏడేళ్లు పట్టింది.
అంతర్జాతీయ సదస్సులో ప్రసంగం
మరొక కొత్త వంగడం... ‘హంస’ల్లో 79 రకం. ఇది నీటి ఎద్దడిని సైతం తట్టుకుంటుంది. అగ్గి తెగులు, ఇతర చీడ పీడలను ఎదుర్కొని ఒక హెక్టారుకు ఏడు టన్నుల దిగుబడిని ఇచ్చేంత సామర్థ్యం దీనికి ఉంది. అలాగే 2018లో విడుదలైన డీఆర్‌ఆర్ ధాన్ 48 రకం.... మా సీనియర్ సైంటిస్ట్ టి. రామ్ పర్యవేక్షణలో కొనసాగిన ఈ వంగడం పరిశోధనలో నేను భాగమయ్యాను. ఈ ధాన్యంలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ అని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్’ కూడా నిర్దారించింది. ఈ అధ్యయనానికి డాక్టర్ నీరజ సహకారం మర్చిపోలేనిది. మిగతా రకాలతో పోలిస్తే దీనిలో జింక్ శాతం కూడా ఎక్కువ. పైగా ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ. ఇదంతా ఒక ఎత్తు అయితే నా పర్యవేక్షణలో పరిశోధన చేసిన అక్షయ్ పీహెచ్‌డీ థీసిస్ ఉత్తమ పరిశోధనగా ఎంపిక కావడం మరొక ఎత్తు. ఈ ఏడాది జనవరిలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్‌డియాగో నగరం వేదికగా ‘ప్లాంట్ అండ్ జీనోమ్ సదస్సు’లో ప్రసంగించడం నాకు లభించిన మంచి అవకాశం.
ఆగిపోయిన చదువు తిరిగి...
మాది హైదరాబాద్ పాతనగరంలోని ఉప్పుగూడ. మా నాన్న బద్రి కృష్ణకుమార్ ఆర్టీసీలో డ్రైవర్. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే నన్ను డాక్టర్‌గా చూడాలన్నది నాన్న కోరిక. నాకూ అదే ఇష్టం. కేవలం రెండు మార్కుల తేడాతో మెడిసిన్ సీటు తప్పిపోయింది. నా చదువు గురించి తర్జనభర్జన పడుతున్న నాన్నకు ఒక రోజు బస్సులో ప్రయాణికులెవరో అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు మంచిదని సలహా ఇచ్చారట. అలా వ్యవసాయ నేపథ్యం లేకపోయినా 1996లో రాజేంద్రనగర్ కళాశాలలో సీటు రావడంతో చేరాను. ఎమ్మెస్సీ జెనటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ సబ్జెక్టులో పోస్టు గ్రాడుయేషన్ చేస్తున్న సమయంలోనే పెళ్లయింది. కోర్సు అయితే విజయవంతంగా పూర్తిచేశాను కానీ తర్వాత ఏం చేయాలో తెలియలేదు. పిల్లలు, వారి ఆలనాపాలనలో నాలుగేళ్లు గడిచిపోయాయి. ‘ఇంత చదివి గృహిణిగానే మిగిలిపోవాలా?’ అని నాలోనేను అంతర్మథనం చెందుతున్న సమయంలో పీహెచ్‌డీ చేయాలన్న ఆలోచన వచ్చింది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళాను.

అది కష్టం అనిపించింది...
మనం పడే కష్టం వృఽథా కాదన్న మాట నా జీవితంలోనూ నిజమైంది. పీహెచ్‌డీ సీటు కోసం సిద్ధమైన అనుభవం అగ్రికల్చరల్ రీసెర్చి సర్వీసెస్ (ఏఆర్‌ఎస్) జాతీయ స్థాయి పోటీ పరీక్షలో నెగ్గడానికి తోడ్పడింది. ‘నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చి మేనేజ్‌మెంట్’లో పోస్టింగ్. అప్పటివరకు పీహెచ్‌డీ విద్యార్థిగా రీసెర్చి ల్యాబ్‌లో మొక్కల డీఎన్‌ఏను చూసి సంబరపడిన నాకు నాలుగు గోడల మధ్య ఉద్యోగం కష్టమనిపించింది. మొక్కలతోనే నా జీవితం ముడిపడి ఉండాలనుకున్నాను. ఆ వెంటనే ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చి’ కేంద్రానికి బదిలీపై వెళ్లాను. నా 14 ఏళ్ల పరిశోధనా వృత్తిలో మూడు కొత్త వరి వంగడాలు కనుగొనడం, ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు అందుకోవడం... ఈ రంగంలో మరింతగా రాణించడానికి అవసరమైన శక్తిని ఇచ్చాయి. గత ఏడాది ‘రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ పురస్కారం’తో డైరెక్టర్ డాక్టర్ ఆర్‌ఎం సుందరం సారధ్యంలోని మా టీమ్‌ను భారత ప్రభుత్వం సత్కరించింది. నేను మొట్టమొదటిసారిగా ఇక్రిశాట్ ప్రాంగణంలోని మా డీఆర్‌ఆర్ సంస్థ వరి పొలంలో దిగిన రోజును ఎప్పటికీ మరవలేను. మోకాళ్ల లోతు బురదలో వరి కంకులను, కాండాన్ని చూస్తూ తన్మయత్వం చెందాను. రైతులే నా గురువులు. వారికి అధిక లాభం చేకూర్చే నాణ్యమైన కొత్త రకం వరి వంగడాలను అందించాలి. అవి చీడపీడలను తట్టుకొని నిలవాలి. రైతులకు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని ఇవ్వాలి. వినియోగించేవారికి పోషక విలువలను అందించాలి. ఇదే నా పరిశోధనల ప్రధాన లక్ష్యం.
సాంత్వన్
ప్రఖ్యాత శాస్త్రవేత్త పర్యవేక్షణలో...
పీహెచ్‌డీ సీటు దొరకడం అంత ఆషామాషీకాదు. యూజీసీ నెట్ పోటీ పరీక్ష కోసం రోజూ ఉదయం 9.30 గంటలకు రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లైబ్రరీకి వెళ్లి మధ్యాహ్నం 3 గంటల వరకు చదివేదాన్ని. అత్యుత్తమ ర్యాంకు రావడమే కాదు... హరిత విప్లవ పితామహుడు ఎమ్మెస్ స్వామినాథన్‌కు ప్రియ శిష్యుడు, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఈఏ సిద్ధిక్ పర్యవేక్షణలో పీహెచ్‌డీ పరిశోధన అవకాశం దక్కడం నా అదృష్టం. అంతవరకు పొలాల ముఖం ఎరుగని నేను వ్యవసాయ వర్సిటీకి అనుబంధంగా ఉన్న పంట చేలలో కూర్చొని పరిశోధన చేయడం మరిచిపోలేని ఒక మధురానుభూతి. సిద్ధిక్ సర్ మార్గదర్శకత్వంలో... నువ్వుల్లో అధిక దిగుబడికి సహాయపడే జన్యుపరమైన అంశాలపై పరిశోధన చేశాను. నువ్వుల్లో మొట్టమొదటిసారిగా డీఎన్‌ఏ సీక్వెన్సె్‌సను గుర్తించాను. అది ఉత్తమ పీహెచ్‌డీ పరిశోధనగా ఎంపికవడమే కాదు బంగారు పతకాన్ని కూడా నాకు అందించింది.
ఇవి కూడా చదవండి
ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప