అసాధారణ ప్రతిభ
ABN , Publish Date - Aug 12 , 2026 | 03:07 AM
కామెడీ కంటెంట్ క్రియేటర్‌గా... డిజిటల్ తెరపై హావభావాలతో ఆకట్టుకుంది. కడుపుబ్బ నవ్వులు పండించి... ఈ ప్రపంచానికి తనను తాను సరికొత్తగా పరిచయం చేసుకుంది. లక్షలమంది...
విభిన్నం
కామెడీ కంటెంట్ క్రియేటర్‌గా... డిజిటల్ తెరపై హావభావాలతో ఆకట్టుకుంది. కడుపుబ్బ నవ్వులు పండించి... ఈ ప్రపంచానికి తనను తాను సరికొత్తగా పరిచయం చేసుకుంది. లక్షలమంది అభిమానులు... లెక్కకు మించి వ్యూస్... లైక్స్... సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారిన ఆమె కెరీర్... ఇప్పుడు ఊహించని మలుపు తీసుకుంది. మాధురీ దీక్షిత్, తృప్తి దిమ్రితో కలిసి నటించి... ప్రేక్షకుల మనసు గెలిచి... కల నెరవేర్చుకున్న ధారణా దుర్గ కథ ఇది.
‘‘మా అమ్మ నుంచి నేను నేర్చుకున్న అతిపెద్ద పాఠం... దృఢ సంకల్పం. ఉపన్యాసాలతో కాకుండా, రోజువారీ జీవితంలో భాగంగానే కష్టంగా ఉన్నప్పుడు కూడా ముందుకు సాగాలని తను ఆచరించి చూపించింది. ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఆత్మనిబ్బరం కోల్పోకుండా... కుటుంబం, బాధ్యతలు, చేసే పని పట్ల నా దృక్పథాన్ని తీర్చిదిద్దింది. నాలో ధైర్యాన్ని నింపింది. అందుకే ‘మా బెహెన్’ చిత్రంలో ‘సుష్మా’ పాత్ర పోషించడం నాకు ఒక ప్రత్యేకమైన, అర్థవంతమైన అనుభవంగా మారింది’’ అంటున్న ధారణా దుర్గా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇంట్లో టీవీలో సినిమాలు చూసి, తను కూడా నటి కావాలని కలలు కన్నది. ‘మా సొంతూరు పుదుచ్చేరి. కానీ నా బాల్యం, విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే సాగింది. కాలేజీలో తరచూ నాటకాలు వేసేదాన్ని. ఆ తరువాత ఓ థియేటర్ గ్రూప్‌తో అనుబంధం ఏర్పడింది. నటి కావాలంటే నాలో ప్రతిభ, నాదైన ప్రత్యేకత ఉండాలి కదా. అందుకే థియేటర్ ఆర్టి్‌స్టగా విభిన్న పాత్రలు పోషించడానికి ప్రయత్నించాను’’ అంటున్న ధారణ కెరీర్‌ను కరోనా అనూహ్య మలుపు తిప్పింది. లాక్‌డౌన్‌వల్ల కాలేజీకి వెళ్లలేకపోయింది. పాఠాలు ఆన్‌లైన్‌లో వినే వీలుంది. ‘కానీ నాటకాలు ఇంట్లో వేయడం కుదరదు కదా. థియేటర్ గ్రూప్‌తో కలిసి నటించే అవకాశం లేకుండా పోవడంతో... ఏంచేయాలో తోచలేదు. ఖాళీగా కూర్చోలేకపోయాను. నా బాధ అర్థం చేసుకున్న స్నేహితులు ఓ సలహా ఇచ్చారు... ‘వీడియోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయవచ్చుగా’ అని. ఆ సలహా నాకు బాగా నచ్చింది’’ అంటూ కెరీర్ ఆరంభ రోజులు గుర్తు చేసుకుంది ధారణ.
షార్ట్ వీడియోలతో...
స్నేహితుల సలహాతో ధారణ ఇన్‌స్టా రీల్స్ చేసింది. క్రమంగా షార్ట్ వీడియోలతో ప్రయోగాలు ప్రారంభించింది. సరదాగా చేసిన హాస్యభరిత వీడియోలకు మంచి ఆదరణ లభించింది. వీక్షకుల సంఖ్య వందలు దాటి వేలు, లక్షలకు చేరింది. అది ఆమెలో ఎనలేని ఉత్సాహాన్నిచ్చింది. చివరకు అదే కెరీర్‌గా మారింది. ‘‘అనుకోకుండా పేరు, దాంతోపాటే డబ్బు... నా కంటెంట్‌కు విపరీతమైన ఆదరణ. కొత్త వీడియోలు ఎప్పుడు అప్‌లోడ్ చేస్తానా అని ఎదురుచూసే వారి సంఖ్య లక్షలు దాటింది. ఇదంతా నాకు గొప్పగా అనిపించింది. నా అసలు పేరు ధారణ కుచాల్. రీల్స్‌లోకి వచ్చాక ధారణా దుర్గగా మారిపోయింది. నేను సృష్టించిన కంటెంట్ నాకు చేతి నిండా డబ్బు సంపాదించి పెడుతోంది. రొటీన్ ఉద్యోగాలకు భిన్నంగా, నాకు నచ్చిన సమయంలో నాకు నచ్చిన పని చేసుకోవడం... అదే సంపాదన మార్గం కావడం... ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎన్నడూ ఊహించలేదు’’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.
నిజ జీవిత పాత్రలు...
ధారణ కంటెంట్‌లో కనిపించేవన్నీ తన చుట్టూవున్న నిజ జీవిత పాత్రలే. తన కంట పడినవారందరినీ నిశితంగా పరిశీలిస్తుంటుంది. ‘‘ప్రతి ఒక్కరిలో ఓ ప్రత్యేకత ఉంటుంది. దాన్ని పట్టుకోవడానికి ప్రయతిస్తాను. వారిలా మేకప్ వేసుకొని పరకాయ ప్రవేశం చేస్తాను. ఏం చేసినా చూసేవారి పెదవులపై చిరునవ్వులు చిందాలి. ఎవరినీ కించపరిచేలా చిత్రీకరించను. సినీ స్టార్స్ పాత్రలు కూడా అప్పుడప్పుడూ అనుకరిస్తుంటాను. నా వీడియోలు చూసి బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే తదితర సెలబ్రిటీలు కూడా అభినందించారు. ప్రస్తుతం నా యూట్యూబ్ చానల్‌కు దాదాపు పది లక్షలమంది సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు. ప్రతి వీడియో, షాట్‌ను కనీసం రెండు లక్షలమంది వీక్షిస్తున్నారు. అత్యధికంగా హీరో వరుణ్‌ధావన్‌తో చేసిన ఒక వీడియోకు 3.7 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు ఇరవై లక్షలమంది ఫాలో అవుతున్నారు. ఇక పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఏ ఉద్యోగంలోనూ రానంత సంపాదిస్తున్నాను. మూడేళ్ల కిందట ఫోర్బ్స్ ‘టాప్ 100 ఇండియా డిజిటల్ స్టార్స్’ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాను’’ అంటుంది ధారణ.
కల నెరవేరింది...
ఎప్పటికైనా వెండితెరపై కనిపించాలనేది తన కల అని ఎన్నోసార్లు ధారణ చెప్పింది. 2022లో వచ్చిన ‘భాయ్ బెహెన్ వర్సెస్ వరల్డ్’ చిత్రంతో ఆ కల నెరవేరింది. గత ఏడాది మరో సినిమాలో నటించిన ఆమెకు... ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘మా బెహెన్’తో మంచి గుర్తింపు లభించింది. మాధురీ దీక్షిత్, తృప్తి దిమ్రిలతో కలిసి అందులో నటించింది. ‘‘మీ ధైర్యవంతమైన మహిళలను చూస్తూ పెరిగినప్పుడు స్థైర్యం అనేది ఒక జీవన విధానంలా అనిపించడం మొదలువుతంది. అది ‘సుష్మా’ పాత్రతో భావోద్వేగపరంగా మమేకం కావడానికి నాకు సహాయపడింది’’ అంటున్న ధారణ... నెట్టింట ప్రశంసలతోపాటు విమర్శలనూ అదే స్థాయిలో ఎదుర్కొంటూ వచ్చింది. వీటన్నిటి నేపథ్యంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది నిరంతర ప్రక్రియగా అలవర్చుకుంది. ‘‘అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ప్రేక్షకులు కంటెంట్ క్రియేటర్ల ప్రతిభను కూడా కచ్చితంగా ఆమోదిస్తున్నారు. అలాగే పరిశీలనాత్మకంగా కూడా చూస్తున్నారు. సానుకూల అంశం ఏమిటంటే... కేవలం థంబ్‌నెయిల్ ఆధారంగా కాకుండా, కంటెంట్‌ను బట్టి అంచనావేసేవారు పెరుగుతున్నారు. ఇది ఆహ్వానించతగ్గ పరిణామం’’ అనేది ధారణ మాట. కాస్తంత ప్రోత్సాహం అందిస్తే అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించగలరనడానికి ఆమె జీవితమే ఒక ఉదాహరణ.
ఈ రంగంలో అనిశ్చితిని, అధిక పని గంటలను, నిరంతర ఒత్తిడిని చవిచూశాను. కనుక కీర్తిప్రతిష్ఠలు, సినిమాల్లో అవకాశాల కంటే నేను నిజాయతీగా పని చేస్తున్నానా లేదా అన్నదే నాకు ముఖ్యం.
ఇవి కూడా చదవండి..
దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్ ముందు ట్రంప్ కొత్త డిమాండ్..
అమిత్ షా సభకు రావాలి.. విపక్షాల నినాదాలు..