పెద్దల్లో డిప్రెషన్... ఇలా పరిష్కారం
ABN , Publish Date - Jun 02 , 2026 | 01:58 AM
వృద్ధాప్యం శరీరాన్నే కాదు, మనసును కూడా కుంగదీస్తుంది. అన్నం మీదే కాదు అన్నిటి మీదా ఆసక్తి కొరవడుతుంది. పెద్దల్లో తలెత్తే ఈ మానసిక కుంగుబాటునే వైద్య పరిభాషలో ‘జేరియాట్రిక్ డిప్రెషన్...
జేరియాట్రిక్
వృద్ధాప్యం శరీరాన్నే కాదు, మనసును కూడా కుంగదీస్తుంది. అన్నం మీదే కాదు అన్నిటి మీదా ఆసక్తి కొరవడుతుంది. పెద్దల్లో తలెత్తే ఈ మానసిక కుంగుబాటునే వైద్య పరిభాషలో ‘జేరియాట్రిక్ డిప్రెషన్’ అంటారు. పెద్దలు ఎదుర్కొనే ఈ సమస్యను సకాలంలో గుర్తించి, వారి శేష జీవితం ఆనందదాయకంగా సాగడానికి తోడ్పడే చికిత్సలను దించాలంటున్నారు వైద్యులు.
ఇంట్లో పెద్దలుంటే అదో భరోసా! తల్లో నాలుకలా వ్యవహరించే పెద్దలు తోడుంటే ఇంటిల్లిపాదికీ రోజూ పండగే! కానీ ఇప్పటి పెద్దల పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటోంది. వాళ్లిప్పుడు మౌనంగా, భారంగా రోజులు వెళ్లదీస్తున్నారు. పిలిస్తే తప్ప పలకరు. పెడితే తప్ప తినరు. ఆ ధోరణి చూసిన కుటుంబసభ్యులు...పెద్ద వయసు కాబట్టి తక్కువ మాట్లాడుతూ, ఎక్కువ నిద్రపోతున్నారని సర్దిచెప్పుకుంటూ ఉంటారు. కానీ దీన్లో నిజం ఎంత? నడిచే ఓపిక ఉన్నా గదికే పరిమితం అవుతున్నా, ఆహారం మీద ఆసక్తి తగ్గిపోయినా, అనవసరంగా చికాకు ప్రదర్శిస్తున్నా.... మానసిక కుంగుబాటుగానే పరిగణించాలి.
కుంగుబాటు ఎందుకంటే....
హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న పెద్దలకేం సమస్యలుంటాయని అనుకుంటాం! కానీ ‘డిమెన్షియా’ లాంటి ఆరోగ్య సమస్యలు వాళ్లను నిశ్శబ్దంగా బాధిస్తూ ఉండి ఉండొచ్చు. స్నేహితుడిని చివరి చూపు చూడలేకపోయాననే బాధ మనసును మెలిపెడుతూ ఉండి ఉండొచ్చు. అందరి మీదా ఆజమాయిషీ చేసిన తాను, చివరకు పిల్లల పంచన చేరవలసి వచ్చిందనే వేదన వేధిస్తూ ఉండొచ్చు. పెద్ద వయసులో కంటి చూపు, వినికిడి తగ్గడంతో పాటు కండరాలు కూడా క్షీణిస్తాయి. దాంతో మునుపటి సత్తువ కొరవడుతుంది. నడకతో పాటు మలమూత్రాల మీద కూడా పట్టు తప్పుతుంది. ఈ అంశాలన్నీ వాళ్ల జీవితాన్ని అసౌకర్యంగా మార్చేస్తాయి. ఇవన్నీ అంతిమంగా మానసిక కుంగుబాటుకు దారి తీస్తాయి. కొందరు ఇదే పరిస్థితిలో చావుకు దగ్గరైతే, అరుదుగా కొందరు పెద్దలు ఆత్మహత్యలకు కూడా ప్రయత్నిస్తారు. అయితే ఇది కచ్చితంగా నివారించదగిన పరిస్థితే!
ఈ లక్షణాల మీద కన్నేసి...
ఉరుకుల పరుగుల జీవితాన్ని ఒకసారి పాజ్ చేసి, చుట్టూరా పరిశీలిస్తే, ఎంతో అరుదుగా తప్ప 65 ఏళ్లు పైబడిన పెద్దలెవరూ హుషారుగా కనిపించరు. అలాగని ఇదంతా సర్వసాధారణమేనని అనుకోకూడదు. పెద్దవాళ్లైపోయారు కాబట్టి మౌనంగా మారిపోయారనీ, ఆకలి తగ్గి ఉంటుంది కాబట్టి తినడం లేదని భావించకూడదు. రిటైర్మెంట్ తర్వాత కొంత కుంగుబాటు సహజమేనని సర్దిచెప్పుకుని, పెద్దలను అలాగే వదిలేయకూడదు. నిజానికి పెద్దల్లో తలెత్తే ఈ కుంగుబాటుకు పరిష్కారాలు, చికిత్సలు ఉన్నాయి. అన్నిటికంటే ముందు, కుటుంబసభ్యులు...పెద్దల్లో కుంగుబాటు లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచాలి. అవేంటంటే...
మునుపటిలా గలగలా మాట్లాడకపోతున్నా....
కంటి నిండా నిద్రపోలేకపోతున్నా....
పగటివేళ ఎక్కువ నిద్రపోతున్నా....
క్రమం తప్పకుండా చేసే పనులు మానుకున్నా...
కుటుంబ కార్యకలాపాల్లో పాలుపంచుకోకపోతున్నా...
ఒంటరిగా గడపడం ఇష్టపడుతున్నా....
చావు దగ్గర పడిందనో, జీవితం ముగింపుకొచ్చిందనో అంటున్నా...
చీటికీమాటికీ చికాకు ప్రదర్శిస్తున్నా....
ఆకలి బాగా తగ్గిపోయినా...
మతిమరుపు పెరిగినా....
వాళ్లకు నచ్చిన తీరులో...
గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే స్పోర్ట్స్ కారును వదిలేసి, సాధారణ కారులో ప్రయాణించవలసి వస్తే ఎవరికైనా చికాకు కలగక తప్పదు. వయసు మళ్లిన జీవితాన్ని గడిపే వృద్ధుల పరిస్థితీ ఇదే! చలాకీగా, హుషారుగా పరిగెత్తిన జీవితం, నత్త నడకన నిస్సారంగా సాగడాన్ని అందరు పెద్దలూ జీర్ణించుకోలేరు. మరీ ముఖ్యంగా ఉన్నతాధికారులుగా అందరి మీదా ఆజమాయిషీ చలాయించి, గౌరవమర్యాదలు పొందిన పెద్దలైతే, వృద్ధాప్యంలో తమ నిస్సహాయ పరిస్థితికి ఎక్కువగా కుంగిపోతారు. కుటుంబసభ్యులు తమ మాటకు విలువ ఇవ్వడం లేదనే వేదన వాళ్లను ఎక్కువగా బాధిస్తుంది. కుటుంబానికి ఇక తమతో పని లేదని నిర్లక్ష్యం చేస్తున్న భావనకు లోనవుతారు. ప్రతి చిన్న విషయానికీ నొచ్చుకుంటారు. ఇవన్నీ కుంగుబాటుకు లోను చేసే అంశాలే! కాబట్టి పెద్ద పోలీసు అధికారిగా రిటైర్ అయిన 80 ఏళ్ల అమ్మ/నాన్న దిగాలుగా కనిపిస్తే, సర్వీసులో పొందిన అవార్డులు, చేసిన సాహసాలు, మర్చిపోలేని అనుభవాల గురించి అడగాలి. నవ్వు తెప్పించే సందర్భాలను గుర్తుకు తెప్పించి, వాళ్లను మాట్లాడించాలి.
వ్యాయామం అవసరమే...
పెద్ద వయసులో బాడీ మాస్ ఇండెక్స్, కండర క్షీణత పెరుగుతుంది. కాబట్టి పెద్దలకు కూడా వ్యాయామం అవసరమే! చేతి కర్ర సహాయంతో వాళ్లను నడిపించాలి. అవసరమైతే చక్రాల కుర్చీలో తిప్పాలి. కమ్యూనిటీలో నలుగురు పెద్దలకు పరిచయం చేసి, కాలక్షేపం చేయించాలి. పెద్దలకు కూడా పార్టీలు ఏర్పాటు చేయాలి. కొందరు పెద్దలు నడవలేని పరిస్థితిలో పడకకే పరిమితమైపోవచ్చు. అలాంటి పెద్దల్లో వినికిడి, చూపు సరిగానే ఉంటుంది కాబట్టి కబుర్లతో కాలక్షేపం చేయించాలి. వాళ్లతో కలిసి వాళ్లకు నచ్చిన టివి కార్యక్రమాలు, సినిమాలు చూపించాలి. చదరంగం లాంటి కూర్చుని ఆడగలిగే ఆటలు ఆడించాలి. మనవళ్లు, మనవరాళ్లను తీసుకొచ్చి కథలు, అనుభవాలు చెప్పించాలి. నానమ్మ, తాతయ్య/అమ్మమ్మ, తాతయ్యల ప్రత్యేకతల గురించి మనవళ్లు, మనవరాళ్లకు చెప్పి ఆసక్తిగా ప్రశ్నలు అడిగేలా ప్రోత్సహించాలి.

పెద్దలను మించిన ఓర్పుతో...
సాధారణంగా పెద్దలు చెప్పించే చెప్తూ ఉంటారు. వినకపోతే కోపగించుకుంటారు. ఇలాంటప్పుడు విసుక్కోకుండా ఓర్పుతో వ్యవహరించాలి. చెప్పింది వింటే చాలు, వాళ్లు సంతోషిస్తారు. నా పిల్లలు ఇప్పటికీ నేను చెప్పింది వింటున్నారనే తృప్తిని వాళ్లు పొందుతారు. ‘నీకు తెలియదులే ఊరుకో’ అని వాళ్ల నోరు మూయించడం కంటే, ‘ఇప్పుడున్న జనరేషన్‌లో ఇలాగే జరుగుతోంది, మీ జనరేషన్‌లో అలా జరిగి ఉండొచ్చు’ అని సర్దిచెప్పాలి. పెద్దలతో వాదనకు దిగకూడదు. మనలాగే పెద్దలకూ అవసరాలూ, ఇష్టాలూ ఉంటాయి. అవి తీరని సందర్భాల్లో కోపతాపాలకు గురవడాలూ ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలవాలనే కోరిక బలంగా ఉండి, బయటకు చెప్పలేకపోతూ ఉండొచ్చు. ఏదో పదార్థం తినాలని ఉన్నా, తినే వీలు లేకపోవచ్చు. ‘నీకు షుగర్ ఉంది, ఇదెలా తింటావ్? అది తినకూడదు, ఇది తినకూడదు’ అంటూ వాళ్లకు నచ్చిన పదార్థాలన్నీ పూర్తిగా దూరం పెట్టేస్తే, కచ్చితంగా కోపం వస్తుంది. 85 ఏళ్ల పెద్దవాళ్లు మధుమేహం కంటే, కుంగుబాటుతో, దిగులుతో మరణానికి చేరువయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి జీవితంలో మిగిలిన కొన్నేళ్లు, వాళ్లకు నచ్చిన వాటిని ఆస్వాదించడానికి అనుమతించాలి. పరిమితంగానైనా నచ్చినవి తినిపించాలి. అలాగే ‘ఈ వయసులో నువ్వేం చేస్తావ్?’ అనే మాటలతో వయసును ఎత్తి చూపుతూ పెద్దలను అవమానించకుండా, మీరు బాధ్యతాయుతంగా పెంచడం వల్లే మేమీ స్థితిలో ఉన్నామంటూ వాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేయాలి. వాళ్ల మనసు నొచ్చుకునేలా, ఆత్మాభిమానం దెబ్బతినేలా ఎప్పటికీ ప్రవర్తించకూడదు.
యాంటి డిప్రెసెంట్స్‌తో...
కుటుంబసభ్యులు ఎంత ప్రయత్నించినా పెద్దల్లో కుంగుబాటు తగ్గనప్పుడు వైద్యులను సంప్రతించడం అవసరం. కొందరికి తక్కువ మోతాదు యాంటీ డిప్రెసెంట్స్ మెరుగైన ఫలితాన్నిస్తాయి. కొన్ని వారాల పాటు అందించే ఈ మందులతో కుంగుబాటు అదుపులోకొచ్చిన తర్వాత వైద్యులు క్రమక్రమంగా మందుల మోతాదు తగ్గించి, ఆపేస్తారు. అలాగే పెద్దలను వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లేటప్పుడు, మందులు అందించేటప్పుడు పెద్ద వయసులో ఇలాంటి కుంగుబాటు సహజమనీ, మందులతో కొంతమేరకు పరిస్థితి మెరుగుపరుచుకోవచ్చనీ వివరించాలి. అవసరాన్ని బట్టి వాళ్లకు గ్రూప్ థెరపీలు అందించాలి. అలాగే అసిడిటీ, అజీర్తి లాంటి అవసరం లేని మందులు వాడుతున్నప్పుడు, వైద్యుల సలహా మేరకు అలాంటి మందులను తొలగించి, అవసరమైన వాటికే పరిమితం చేయాలి. మరీముఖ్యంగా పెద్దలు నిద్రమాత్రలు వేసుకోకూడదు. వీటితో మానసిక స్థితి క్షీణిస్తుంది. పట్టుతప్పి కింద పడిపోయే అవకాశాలు పెరుగుతాయి.
డాక్టర్ సుధీర్ రెడ్డి. కె,
జేరియాట్రిక్ మెడిసిన్, ఫౌండర్ అండ్
ఛైర్మన్, ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్,
హైదరాబాద్
ఇవి కూడా చదవండి...
ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్
చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం