Share News

సపోటాలతో పసందుగా..!

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:51 AM

తియ్యటి సపోటా పండ్లను ఇష్టపడని వారుండరు. వీటితో స్మూతీలు, మిల్క్‌షేక్‌లు, ఐస్‌క్రీమ్‌లే కాదు ఎన్నో రకాల వెరైటీలను తయారుచేయవచ్చు. అలాంటి విభిన్న రుచుల్లో కొన్ని మీకోసం...

సపోటాలతో పసందుగా..!

వంటిల్లు

తియ్యటి సపోటా పండ్లను ఇష్టపడని వారుండరు. వీటితో స్మూతీలు, మిల్క్‌షేక్‌లు, ఐస్‌క్రీమ్‌లే కాదు ఎన్నో రకాల వెరైటీలను తయారుచేయవచ్చు. అలాంటి విభిన్న రుచుల్లో కొన్ని మీకోసం...

సపోటా బర్ఫీ

కావాల్సిన పదార్థాలు

సపోటా పండ్లు- ఏడు, కోవా- పావు కేజీ, పాల పొడి- నాలుగు చెంచాలు, పంచదార- నాలుగు చెంచాలు, నెయ్యి- అయిదు చెంచాలు, యాలకుల పొడి- అర చెంచా, బాదం పలుకులు- కొన్ని, పిస్తా పలుకులు- కొన్ని

తయారీ విధానం

బ్లెండర్‌లో సపోటా పండ్ల ముక్కలు వేసి మెత్తగా బ్లెండ్‌ చేయాలి. స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో నెయ్యి, సపోటా పండ్ల గుజ్జు వేసి బాగా కలుపుతూ చిన్న మంట మీద అయిదు నిమిషాలపాటు వేయించి దించాలి. స్టవ్‌ మీద మరో గిన్నె పెట్టి అందులో కోవా, పాలపొడి, పంచదార వేసి బాగా కలపాలి. ఆపైన సపోటా పండ్ల పేస్టు, యాలకుల పొడి కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమం ముద్దలా దగ్గరకు వచ్చే వరకు చిన్న మంట మీద ఉడికించాలి. ఆపైన నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసి సమంగా పరిచి పైన బాదం పలుకులు, పిస్తా పలుకులు చల్లాలి. ఇది చల్లారిన తరువాత ముక్కలుగా కోసి సర్వ్‌ చేయాలి.

సపోటా

లాలిపాప్స్‌

కావాల్సిన పదార్థాలు

పండిన సపోటాలు- అయిదు, జీడిపప్పులు- పది, ఖర్జూరాలు- అయిదు, పాలు- ఒక కప్పు, తేనె- రెండు చెంచాలు

తయారీ విధానం

మిక్సీ గిన్నెలో సపోటా పండ్ల ముక్కలు, జీడిపప్పులు, ఖర్జూరాలు, పాలు, తేనె వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. లాలిపాప్‌ మౌల్డ్స్‌లో ఈ మిశ్రమాన్ని పోసి మధ్యలో ఐస్‌క్రీమ్‌ స్టిక్స్‌ను ఉంచాలి. వీటిని డీప్‌ ఫ్రిజ్‌లో ఆరు గంటలపాటు ఉంచాలి. ఆపైన మౌల్డ్స్‌ మీద గోరువెచ్చటి నీటిని పోస్తూ లాలిపా్‌ప్సను బయటికి తీయాలి. వీటిని ఐస్‌క్యూబ్స్‌ మీద ఉంచి సర్వ్‌ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.


సపోటా హల్వా

కావాల్సిన పదార్థాలు

పండిన సపోటాలు- నాలుగు, బొంబాయి రవ్వ- ఒక కప్పు, బెల్లం- ఒక కప్పు, పంచదార- పావు కప్పు, పాలు- మూడు కప్పులు, నెయ్యి- నాలుగు చెంచాలు, జీడిపప్పులు- అయిదు, బాదం పప్పులు- అయిదు, యాలకుల పొడి- అర చెంచా

తయారీ విధానం

సపోటా పండ్ల ముక్కలను గిన్నెలోకి తీసుకుని చెంచాతో కచ్చా పచ్చాగా మెదిపి పంచదార కలపాలి. ఆపైన గిన్నెను స్టవ్‌ మీద పెట్టి సపోటా పండ్ల గుజ్జును రెండు నిమిషాలపాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి నెయ్యి, జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు, బొంబాయి రవ్వ వేసి గరిటెతో కలుపుతూ మూడు నిమిషాలపాటు దోరగా వేయించాలి. ఆపైన వేడి పాలు పోసి అయిదు నిమిషాలపాటు మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. రవ్వ ఉడికి దగ్గరకు వచ్చిన తరువాత సపోటా పండ్ల గుజ్జు, బెల్లం వేసి కలపాలి. రెండు నిమిషాల తరువాత యాలకుల పొడి వేసి కలిపి గిన్నెను స్టవ్‌ మీద నుంచి దించాలి. ఈ సపోటా హల్వాని వేడి వేడిగా పూరీ లేదా చపాతీతో సర్వ్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి:

వరుస డకౌట్లకు చెక్.. అభిషేక్ ఫామ్ అందుకోవడానికి కారణం అదే!

టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్

Updated Date - Feb 28 , 2026 | 12:51 AM