లైన్‌ఉమన్
ABN , Publish Date - Mar 04 , 2026 | 01:11 AM
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె నిరూపిస్తున్నారు. పురుషులకే పరిమితం అనుకున్న విద్యుత్ స్తంభాలను అలవోకగా...
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె నిరూపిస్తున్నారు. పురుషులకే పరిమితం అనుకున్న విద్యుత్ స్తంభాలను అలవోకగా ఎక్కేస్తూ వేల ఇళ్లలో వెలుగులు నింపుతున్న ఆమె అసాధారణ ప్రయాణం ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపునకు నోచుకుంది.
సాధారణంగా మన ఊరిలో కరెంటు పోతే కాసేపటికి ఓ వ్యక్తి వచ్చి విద్యుత్ స్తంభం ఎక్కి వైర్లు సరిచేయడం చూస్తుంటాం. ‘లైన్‌మన్’ అనగానే మన కళ్లముందు మెదిలే రూపం ఒక పురుషుడిదే. కానీ ఆ పాత అంచనాలను, సామాజిక కట్టుబాట్లను పటాపంచలు చేస్తూ అత్యంత ప్రమాదకరమైన, సవాలుతో కూడిన ఈ వృత్తిలో తనదైన ముద్ర వేస్తున్నారు దీపాలి ఖోబ్రగడె. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎంఎ్‌సఈడీసీఎల్)లో పనిచేస్తున్న ఆమె మార్చి 4న న్యూఢిల్లీలో జరగనున్న ‘లైన్‌మెన్’ డే వేడుకల్లో జాతీయ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. దేశవ్యాప్తంగా ఈ గౌరవానికి ఎంపికైన అతికొద్దిమందిలో మహారాష్ట్ర నుంచి ఎంపికైన ఏకైక మహిళా ఉద్యోగి దీపాలి.
సవాళ్ల బాటలో పుష్కర కాలం
దీపాలి జీవితం పూలబాట ఏమీ కాదు. పన్నెండేళ్ల క్రితం గ్రామీణ ప్రాంతాల్లో ఒక సాధారణ టెక్నీషియన్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు ఆమె ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. మారుమూల పల్లెల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు భారీ పరికరాలతో కిలోమీటర్ల మేర ప్రయాణించేవారు.
అడవి దారులు, ఎండ, వాన.. ఇలా ఏ ప్రతికూలత ఎదురైనా ఆమె వెనకడుగు వేయలేదు. ఏడేళ్లపాటు గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరాయంగా సేవలు అందించి అక్కడి ప్రజల మన్ననలు పొందారు. ప్రస్తుతం నాగ్‌పూర్‌లోని మహల్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ శుక్రవారీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో సీనియర్ టెక్నీషియన్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నారు.
అంకితభావం
ఒక సీనియర్ టెక్నీషియన్‌గా దీపాలి బాధ్యతలు ఎంతో కీలకమైనవి. కేవలం స్తంభాలు ఎక్కడమే కాదు, విద్యుత్ పంపిణీ వ్యవస్థలో తలెత్తే సంక్లిష్టమైన సాంకేతిక లోపాలను గుర్తించి, వాటిని తక్షణమే సరిదిద్దడంలో ఆమె సిద్ధహస్తురాలు. కరెంటు పోయినప్పుడు వినియోగదారుల ఇళ్ల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకుంటూ, సహచరులతో సమన్వయం చేసుకుంటూ విద్యుత్ పునరుద్ధరణ చేయడం కత్తిమీద సామే. దీనితోపాటు బిల్లుల వసూళ్లు, అక్రమ కనెక్షన్ల తనిఖీ వంటి బాధ్యతలను కూడా ఆమె అంతే సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు.
మృత్యువుతో పోరాటం
విద్యుత్ రంగంలో పనిచేయడం అంటే ప్రతి క్షణం మృత్యువుతో పోరాటమే. చిన్న అజాగ్రత్త జరిగినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకే భద్రత విషయంలో దీపాలి ఎక్కడా రాజీపడరు. ‘‘రక్షణ పరికరాలు లేకుండా పనిచేయడం అంటే మృత్యువును స్వయంగా ఆహ్వానించడమే. ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు’’ అని ఆమె చెబుతారు. క్షేత్రస్థాయిలో పనిచేసేటప్పుడు పి.పి.ఈ కిట్లు ధరించడం, ఇన్సులేటెడ్ గ్లోవ్స్ వాడటం వంటి భద్రతా నియమాలను ఆమె తు.చ. తప్పకుండా పాటిస్తారు. తనతోపాటు పనిచేసే సిబ్బంది కూడా భద్రతపై అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
నేటి యువతులకు స్ఫూర్తి ప్రదాత
మన సమాజంలో ఇప్పటికీ కొన్ని వృత్తులు కేవలం పురుషులకే పరిమితమని భావిస్తుంటాం. ముఖ్యంగా ఫీల్డ్ వర్క్, కష్టంతో కూడిన సాంకేతిక పనులవైపు మహిళలు రావడానికి వెనకడతారు. కానీ దీపాలి ఆ అపోహను తుడిచిపెట్టేశారు. ఢిల్లీలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, టాటాపవర్ డీడీఎల్ సంయుక్తంగా అందజేయబోయే ఈ పురస్కారం.. కేవలం దీపాలి వ్యక్తిగత విజయం కాదు. ఇది తనపై నమ్మకం ఉంచిన ఎంఎ్‌సఈడీసీఎల్ సంస్థకు, ఆమెకు అండగా నిలిచిన కుటుంబానికి, సవాళ్లను స్వీకరించే ప్రతి మహిళకు దక్కిన గౌరవం.
ఆ చిరునవ్వే
అసలైన బహుమతి
ఒక మహిళగా ఈ వృత్తిలో దీపాలి పొందుతున్న సంతృప్తి వెలకట్టలేనిది. ‘‘చీకటిలో మగ్గుతున్న ఇళ్లలో మళ్లీ కరెంటు వచ్చినప్పుడు అక్కడి ప్రజల ముఖాల్లో కనిపించే ఆనందం, వారి కళ్లలో కనిపించే కృతజ్ఞత చూస్తుంటే నా అలసట అంతా మాయమైపోతుంది. ఆ తృప్తి ముందు ఏ అవార్డు సాటిరాదు’’ అని దీపాలి భావోద్వేగంతో చెబుతారు. కేవలం క్షేత్రస్థాయి పనులకే పరిమితం కాకుండా ప్రస్తుతం విద్యుత్ రంగంలో వస్తున్న స్మార్ట్ మీటర్లు, సోలార్ ఎనర్జీ వంటి ఆధునిక మార్పుల పట్ల కూడా ఆమె అపారమైన అవగాహన కలిగి ఉన్నారు. వినియోగదారులకు దీనిపై అవగాహన కల్పించడంలో ఆమె ముందుంటారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్
ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి