Share News

మహిళల గొంతుక

ABN , Publish Date - Nov 19 , 2026 | 03:40 AM

ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగం... మరో వైపు ఆపన్నులను ఆదుకోవాలన్న సంకల్పం... రెండింటినీ సమన్వయం చేసుకొంటూ... పలువురి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు...

మహిళల గొంతుక

ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగం... మరో వైపు ఆపన్నులను ఆదుకోవాలన్న సంకల్పం... రెండింటినీ సమన్వయం చేసుకొంటూ... పలువురి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు దేబశ్రీ దాస్‌ దెబర్మా. ఆర్థిక స్థోమత లేనివారికి విద్యబుద్ధులు చెప్పి... నాట్యం నేర్పి... వారిలోని సృజనకు రెక్కల తొడిగి... స్వశక్తితో ఎదిగేందుకు ఊతమవుతున్నారు. అందాల కిరీటం కోసం పోటీపడే ఔత్సాహిక యువతులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. పోస్టల్‌ కొలువు... మోడల్‌గా రాణింపు... భిన్న రంగాల్లో బిజీగా ఉన్నా... సామాజిక చైతన్యమూ తన కర్తవ్యంలో భాగమేనంటున్న దేబశ్రీ జర్నీ ఇది.

‘‘బాల్యం నేర్పిన పాఠం... ఆర్థిక అవసరాలు తీరక చదువు కొనసాగించడానికి అవస్థలు పడిన అనుభవం... ఇవే నన్ను ఇవాళ ఒక చైతన్యవంతమైన వ్యక్తిగా నిలబెట్టాయి. నాలాగా చదువు కోసం మరెవరూ ఇబ్బందులు పడకూడదని, కనీసం నా చుట్టూ ఉన్న పేద పిల్లల భవితకైనా భరోసా కల్పించాలని చిన్నప్పుడే బలంగా నిర్ణయించుకున్నాను. త్రిపుర రాజధాని అగర్తల మాది. ప్రస్తుతం ఇక్కడి పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్నాను. దిగువ మధ్యతరగతి కుటుంబం మాది. మా నాన్న చిన్నపాటి వ్యాపారం చేసేవారు. ఆ సంపాదన కుటుంబ అవసరాలకు ఏ మాత్రం సరిపోయేది కాదు. కానీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నన్ను, మా అక్కను పట్టుబట్టి చదివించారు. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఎందుకంటే జీవితాలను మార్చగలిగే శక్తి చదువుకు మాత్రమే ఉందనేది నాన్న నమ్మకం.


ప్రైవేట్లు చెబుతూ...

హైస్కూల్‌కు వచ్చేసరికి పుస్తకాలు కొనుక్కోవడం, ఫీజులు కట్టడం మరింత కష్టంగా మారింది. దాంతో నేను ఇంట్లోవారికి భారం కాకూడదనుకున్నాను. ప్రైవేట్లు చెప్పడం మొదలుపెట్టాను. ఆ డబ్బుతో ఫీజులు కట్టుకున్నాను. కాలేజీలో చేరాక కూడా ట్యూషన్లు కొనసాగించాను. డిగ్రీ తరువాత పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సంపాదించాను. ప్రభుత్వ కొలువులో చేరాక మా ఇంటి అవసరాలు తీరుస్తూ, ఉన్నంతలో అప్పుడప్పుడూ పేదవారికి సాయం చేస్తూ వచ్చాను.

వరదల్లో అండగా...

కొవిడ్‌ సమయంలో వైద్యులు, న్యాయవాదులు తదితర వృత్తులవారు బాధితులకు సాయం చేయడం చూశాను. మహమ్మారిని సైతం లెక్క చేయకుండా వారంతా బయటకు వచ్చి ఆపన్నులను ఆదుకోవడం నన్ను కదిలించింది. వారితో నేనూ జత కలిశాను. కరోనా తరువాత అగర్తలతో పాటు సబ్రూమ్‌, ఉదయ్‌పూర్‌ ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. కొవిడ్‌ సమయంలో సాయం చేసిన మా బృందమే వచ్చి బాధితులను ఆదుకుంది. ఆహారం, ఇతర నిత్యావసరాలు, వస్త్రాలు, మందులు అందించింది. ఇలా జట్టుగా కలిసి పని చేస్తే భవిష్యత్తులో మరింతమందికి చేయూత అందివ్వవచ్చు కదా అనిపించింది. వీటన్నిటికీ ఒక వేదిక ఉంటే బాగుంటుందని భావించి రెండేళ్ల కిందట ‘కన్యా కథ’ నెలకొల్పాం. ‘మహిళ గొంతుక’ దీని అర్థం వాస్తవానికి ఇది మా బృందంలో న్యాయవాది అయిన పూజా మదిలో మెదిలిన ఆలోచన. ఇది మహిళల నేతృత్వంలో నడిచే సంస్థ. అయితే సభ్యులుగా పురుషులు కూడా ఉంటారు. సమాజంలో మార్పు ఒక్కరివల్ల సాధ్యం కాదు. చేయి చేయీ కలిస్తేనే అనుకున్నది సాధించగలం. ఈ వాస్తవం గ్రహించి మెరుగైన సమాజం కోసం వివిధ రంగాల్లో స్థిరపడిన మేమందరం ఒక్కటయ్యాం. మా వ్యక్తిగత పరిచయాలు, నైపుణ్యాలను ప్రజలకు సాయం చేయడానికి ఉపయోగిస్తున్నాం.


మోడలింగ్‌... డ్యాన్స్‌...

మా సంస్థ ద్వారా అందరితో కలిసి చేసే కార్యక్రమాలు కాకుండా ప్రత్యేకంగా నేను కొన్ని వర్గాలను నిత్యం కలుస్తున్నాను. వారికి నాట్యం, పెయింటింగ్‌తోపాటు మోడలింగ్‌ వైపు మళ్లాలనుకున్న ఔత్సాహిక యువతులను ప్రోత్సహిస్తున్నాను. పని ఒత్తిడిలో ఎంత బిజీగా ఉన్నా క్రమం తప్పకుండా అగర్తల శివారు గ్రామాలకు వెళ్లి, అక్కడి పేద పిల్లలకు శిక్షణ ఇస్తున్నాను. వారాంతాల్లో వారు నా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. డ్యాన్స్‌ లాంటివి ఎందుకంటే... ఒకవేళ చదువు అయిపోయాక సరైన ఉద్యోగం దొరక్కపోతే, నాలాగా వారూ నాట్య శిక్షణ ఇచ్చి సంపాదించుకొనే అవకాశం ఉంటుందని.

అమ్మ నుంచి...

నాకు చిన్నప్పటి నుంచి నాట్యంపై ఎంతో మక్కువ. అందుకు కారణం... మా అమ్మ. తను భరతనాట్య కళాకారిణి. తరువాత యూట్యూబ్‌లో చూసి కథక్‌, మణిపురి నేర్చుకున్నా. ప్రస్తుతం ఒక డ్యాన్స్‌ అకాడమీతో కలిసి పిల్లలకు శిక్షణ ఇస్తున్నా. నాట్యంలో ఈ ఏడాది ఓ ప్రముఖ సంస్థ నుంచి గ్లోబల్‌ బెస్ట్‌ డ్యాన్సర్‌ అవార్డు అందుకున్నాను. నేను మోడలింగ్‌ కూడా చేస్తాను. 2022లో ‘మిసెస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌’ టైటిల్‌ గెలిచాను. స్థానిక ‘ఆర్కే ఎంటర్‌టైన్‌మెంట్‌’ చీఫ్‌గా వ్యవహరిస్తున్నా. సంస్థ తరుఫున ఫ్యాషన్‌ ఈవెంట్స్‌ నిర్వహిస్తున్నా. ఔత్సాహిక మోడల్స్‌కు తర్ఫీదునిస్తున్నా. నాకు పెయింటింగ్‌లో కూడా ప్రవేశం ఉంది. ఇంటివద్ద తరగతులు ఏర్పాటు చేసి, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు డ్రాయింగ్‌ నేర్పిస్తున్నా. నా అంతిమ లక్ష్యం ఒక్కటే... ఆర్థిక ఇబ్బందులతో నేను, మా అక్క బాల్యాన్ని ఆస్వాదించలేకపోయాం. చదువుకోవడానికి అవస్థలు పడ్డాం. మాలాగా మరే చిన్నారి పేదరికంతో చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో పని చేస్తున్నాను. నా సంకల్పం సత్ఫలితాలు ఇస్తున్నందుకు ఎంతో సంతృప్తిగా ఉంది.

ఇవి కూడా చదవండి:

20 బంతుల్లోనే శ్రేయాంక పాటిల్ హాఫ్ సెంచరీ.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తుందా?

రూ. 3,700 కోట్ల డీల్.. కేకేఆర్‌లో తన సగం వాటా విక్రయించిన జూహీ చావ్లా భర్త!

Updated Date - Nov 19 , 2026 | 03:40 AM