Share News

కార్టిసాల్‌ మీద కన్నేద్దాం..!

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:54 AM

కార్టిసాల్‌ను ఒత్తిడి హార్మోన్‌ అనుకుంటాం! కానీ నిజానికి మన దినచర్య సజావుగా సాగడంలో ఈ హార్మోన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి సమర్థమైన, అత్యవసరమైన హార్మోన్‌ను...

కార్టిసాల్‌ మీద కన్నేద్దాం..!

హార్మోన్‌ హెల్త్‌

కార్టిసాల్‌ను ఒత్తిడి హార్మోన్‌ అనుకుంటాం! కానీ నిజానికి మన దినచర్య సజావుగా సాగడంలో ఈ హార్మోన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి సమర్థమైన, అత్యవసరమైన హార్మోన్‌ను ప్రయోజనాలను పొందాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలినీ, ఆహారశైలినీ అనుసరించాలంటున్నారు వైద్యులు.

మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన హార్మోన్లలో కార్టిసాల్‌ ఒకటి. అడ్రినల్‌ గ్రంథి నుంచి స్రవించే కార్టిసాల్‌ మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరీ ముఖ్యంగా రక్తపోటు నిర్వహణ, గ్లూకోజ్‌ మెటబాలిజం, ఇన్‌ఫ్లమేషన్‌... ఇవన్నీ కార్టిసాల్‌తోనే ముడిపడి ఉంటాయి. అలాగే ఇదే హార్మోన్‌, మన దైనందిన జీవితంలో ఎదుర్కొనే పలు రకాల భౌతిక, మానసిక ఒత్తిడిలను తట్టుకోడానికి తగ్గట్టు మన శరీరాన్ని సిద్ధం చేస్తుంది. కాబట్టే ఈ హార్మోన్‌ను... ‘ఫ్లైట్‌ ఆర్‌ ఫైట్‌’ హార్మోన్‌ అని కూడా అంటారు.

ఒత్తిడి హార్మోన్‌ కాదు

మన మానవ వ్యవస్థ అనేక రకాల ఒత్తిడులను తట్టుకోగలిగేలా రూపొందింది. ఉదాహరణకు రోడ్డు దాటబోతున్నప్పుడు ఒకస్మాత్తుగా ఒక కారు మన వైపు దూసుకొస్తే, ఒక్క ఉదుటన పక్కకు తప్పుకుంటాం! ఇలా మనల్ని క్షణాల్లో చైతన్యపరిచి, స్పందింపచేసే శక్తి కార్టిసాల్‌కు ఉంటుంది. ఇలా అనేక భౌతిక లేదా మానసిక ఒత్తిడులను ఎదుర్కొనే సందర్భాల్లో, హైపోథలామస్‌ పిట్యుటరీ అడ్రినల్‌ యాక్సెస్‌ అనే వ్యవస్థ, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సిస్టమ్‌లా పని చేసి, అడ్రినల్‌ గ్రంఽథిని ప్రేరేపిస్తుంది. ఫలితంగా కార్టిసాల్‌ హార్మోన్‌ విడుదలవుతుంది. అలా విడుదలైన కార్టిసాల్‌, నిర్దిష్ట ఒత్తిడిని తట్టుకోగలిగేలా శరీరాన్ని సన్నద్ధం చేయడం కోసం అధిక గ్లూకోజ్‌ అందుబాటులో ఉంచుతూ, రక్తపోటును నిర్వహిస్తుంది. ఎదుర్కొంటున్న ఒత్తిడి తగ్గినప్పుడు, శరీరంలో ఉత్పత్తయిన కార్టిసాల్‌ కూడా తగ్గిపోతుంది.

కార్టిసాల్‌ క్రమం తప్పితే...

కార్టిసాల్‌ హార్మోన్‌, అవసరమైన సందర్భాల్లో పెరిగి, అవసరం తీరిన తర్వాత తగ్గిపోవాలి. కానీ నిద్ర తగ్గినా, ఆహారశైలి క్రమం తప్పినా, వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పెరిగినా, సామాజిక మాధ్యమాల వాడకం పెరిగినా కార్టిసాల్‌ క్రమం తప్పుతుంది. ఫలితంగా...

  • రక్తంలో చక్కెర పెరుగుతుంది

  • రక్తపోటు పెరుగుతుంది

  • ఇన్‌ఫ్లమేషన్‌ రెస్పాన్స్‌ పెరుగుతుంది

  • హార్ట్‌ రేట్‌ పెరుగుతుంది.


ఇలా కనిపెట్టాలి

ఎవరికి వారు కార్టిసాల్‌ పెరిగినట్టు గుర్తించడం కోసం కొన్ని లక్షణాలను గమనించవచ్చు. మందులు వాడుకుంటున్నా మధుమేహం, రక్తపోటు క్రమం తప్పడం, బరువు పెరగడంతో పాటు ఇంకొన్ని స్పష్టమైన లక్షణాలు బయల్పడతాయి. అవేంటంటే...

పొట్ట కొవ్వు: ముఖం, పొట్ట ప్రాంతాల్లో కొవ్వు పేరుకుపోతుంది. పొట్ట ప్రాంతంలో అంతర్గత అవయవాల చుట్టూరా కొవ్వు పేరుకునేలా కార్టిసాల్‌ శరీరాన్ని ప్రేరేపిస్తుంది. దీంతో రూపం మారడమే కాకుండా శరీరం శక్తిని ఖర్చు చేసే వేగం కూడా తగ్గిపోతుంది. శరీరం మొత్తం సమంగా లావెక్కకుండా, కేవలం మొండెం భాగంలోనే కొవ్వు ఎక్కువగా పేరుకునే సెంట్రల్‌ ఒబేసిటీలో, ముఖం, బుగ్గలు ఉబ్బినట్టు ఉంటాయి.

చర్మపు ముడతలు: ఒత్తిడి ప్రభావం చర్మం మీద పడుతుంది. కార్టిసాల్‌, చర్మపు బిగుతుకు తోడ్పడే కొల్లాజెన్‌ను విరిచేస్తుంది. దాంతో చర్మం సాగే గుణాన్ని కోల్పోయి, ముడతలు పడి, జీవం కోల్పోతుంది. అధిక కార్టిసాల్‌ మొటిమలను పెంచుతుంది.

వెంట్రుకలు పలుచన: సాధారణంగా వెంట్రుకలు, పెరుగుదల, విశ్రాంతి దశలను ఎదుర్కొంటాయి. నిరంతరం కార్టిసాల్‌ ఎక్కువగా ఉన్నప్పుడు వెంట్రుకల గ్రోత్‌ సైకిల్‌ కుదించుకుపోయి, బట్టతల, వెంట్రుకలు పలుచబడడం మొదలైన సమస్యలు మొదవుతాయి.

కండర క్షీణత: శరీరం దీర్ఘకాలం పాటు ఒత్తిడిని ఎదుర్కొనప్పుడు, కండరాలు బలహీనపడతాయి. క్యాటబాలిజం అనే ఈ స్థితిలో మరీ ముఖ్యంగా చేతులు, కాళ్లు, భుజాల కండరాలు పటుత్వం కోల్పోతాయి. అధిక కార్టిసాల్‌తో ఎముక సాంద్రత తగ్గి, నడుము నొప్పి వేధిస్తుంది.

కార్టిసాల్‌ పెరిగినట్టు గ్రహిస్తే, దాన్ని తగ్గించే మార్గాలకు బదులుగా, అది పెరగడానికి దారి తీసిన కారణాల మీద దృష్టి పెట్టాలి. నిద్ర పట్టకపోతే అందుకు కారణాలను అన్వేషించాలి. ఏ ఆందోళన, ఒత్తిడి నిద్రకు భంగం కలిగిస్తోందో కనిపెట్టి, దాని తాలూకు కారణాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి.

ఉల్లాసంగా, ప్రశాంతంగా...

నిద్ర, సమతులాహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతతలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఒత్తిడి దరి చేరకుండా ఉంటుంది. రోజుకు 7 నుంచి 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. జంక్‌ ఫుడ్‌, ప్రాసెస్‌ చేసిన పదార్థాలకు బదులుగా పౌష్ఠికాహారం తీసుకోవాలి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తప్పనసరిగా మానసికోల్లాసానికి, విశ్రాంతికి సమయం కేటాయించాలి. చివరి నిమిషం వరకూ పనులను వాయిదా వేసి, ఆఖరి నిమిషంలో కంగారు పడిపోవడం, సమస్యను తక్షణమే పరిష్కరించుకోకుండా, తీవ్రమైన తర్వాత గందరగోళానికి లోనవడం వల్ల ఒత్తిడి పెరిగి, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒత్తిడితో మధుమేహం తీవ్రమవుతుందనీ, రక్తపోటు పెరుగుతుందనీ మనందరికీ తెలుసు. మందులు వాడుతున్నా, ఈ ఆరోగ్య సమస్యలు గాడిలో పడకపోతే, మనం నిరంతర ఒత్తిడికి లోనవుతున్నామని అర్థం. ఇలాంటి సందర్భాల్లో ఎవరికి వారు వారి పరిస్థితిని విశ్లేషించుకుని, కారణాలను కనిపెట్టి, నివారణ చర్యలకు పూనుకోవాలి.


ఒత్తిడి వద్దు

ఒత్తిడి మనకు తెలియకుండానే మన దైనందిన జీవితాల్లోకి ప్రవేశిస్తోంది. భోజనానికి బ్రేక్‌ ఇవ్వడం, ఇంకో కప్పు అదనంగా కాఫీ తాగేయడం, అర్థరాత్రి వరకూ సామాజిక మాధ్యమాల్లో మునిగిపోవడం అలవాట్లుగా మారిపోతున్నాయి. ఈ పరిస్థితితో దీర్ఘకాలంలో కార్టిసాల్‌ క్రమం తప్పడం మొదలుపెడుతుంది. నిజానికి ఒత్తిడి హార్మోన్‌గా పేరున్న కార్టిసాల్‌, ఉదయాన్నే మనం నిద్ర మేల్కోడానికీ, మెలకువగా ఉండడానికీ, దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనడానికీ తోడ్పడుతుంది. అయితే దీర్ఘకాలం పాటు కార్టిసాల్‌ హార్మోన్‌ అధిక స్థాయిలో కొనసాగినప్పుడే సమస్యలు మొదలవుతాయి. సాధారణంగా ఉదయం మనల్ని నిద్ర లేపి, చురుగ్గా దైనందిన కార్యక్రమాలు మొదలుపెట్టడానికి తగ్గట్టుగా ఉదయంవేళల్లో ఈ హార్మోన్‌ ఎక్కువగా స్రవించి రాత్రికి తగ్గిపోతుంది. అయితే జీవనశైలి అలవాట్లు క్రమం తప్పినప్పుడు, మన శరీరం ఒత్తిడిని సమర్థంగా క్రమబద్ధీకరించుకోలేకపోతుంది. దాంతో దీర్ఘకాలంలో మెటబాలిజం మందగించడం, నిద్రలేమి, హోర్మోన్లలో హెచ్చుతగ్గులు మొదలైన సమస్యలు తలెత్తుతాయి. ఆరు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోయే వారిలో మరుసటి రోజు కార్టిసాల్‌ మోతాదులు ఎక్కువవుతున్నట్టు అధ్యయనాలు సూచిస్తున్నాయి. నీలి రంగుకు బహిర్గతమవడం వల్ల మెలటోనిన్‌ హార్మోన్‌ తగ్గి, మెదడు మెలకువగా ఉండి నిద్ర దూరమవుతుంది. అలాగే కెఫీన్‌ కార్టిసాల్‌ను పెంచుతుంది. కెఫీన్‌ తీసుకున్న గంటలోపే కార్టిసాల్‌ 30ు మేరకు పెరుగుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం, సామాజిక మాధ్యమాల వినియోగాన్ని వీలైనంత తక్కువ సమయానికి పరిమితం చేయడం, రోజు మొత్తంలో తాగే కాఫీలను రెండు నుంచి మూడుకు పరిమితం చేయడం ఉత్తమం.

ఆరోగ్య సమస్యలతో...

కుషింగ్‌ సిండ్రోమ్‌లో కార్టిసాల్‌ పెరుగుతుంది. వీరి లక్షణాలు విలక్షణంగా ఉంటాయి. నడుము భాగం లావుగా, కాళ్లూ, చేతులు సన్నగా ఉండడం, చర్మం పలుచబడి సులభంగా గాయపడడం, పొట్ట మీద మచ్చలు, మహిళల్లో నెలసరి సమస్యలు, ఎముకలు పెళుసుగా మారి సులభంగా విరిగిపోవడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలున్నవారు వైద్యులను కలిసి, తగిన చికిత్స ఎంచుకోవాలి.

డాక్టర్‌ కె. కృష్ణ ప్రభాకర్‌, డైరెక్టర్‌,

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌,

రెనోవా సెంచరీ హాస్పిటల్స్‌,

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.

ఈ వార్తలనూ చదవండి:

అంతరిక్ష రంగంలో చైనా మరో అద్భుతం.. కేవలం 2 రోజుల్లో..

హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..

Updated Date - Sep 22 , 2026 | 04:54 AM