కూలర్ నుంచి చల్లగాలి రావట్లేదా?
ABN , Publish Date - Apr 29 , 2026 | 02:37 AM
ఒక్కోసారి కూలర్ నుంచి ఆశించినంత చల్లదనం రాదు. అలాకాకుండా ఏసీ లాంటి చల్లదనం రావాలంటే కూలర్‌ను వాడేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...
ఒక్కోసారి కూలర్ నుంచి ఆశించినంత చల్లదనం రాదు. అలాకాకుండా ఏసీ లాంటి చల్లదనం రావాలంటే కూలర్‌ను వాడేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...
కూలర్ చక్కగా పనిచేయాలంటే దానికి తాజా గాలి అందాలి. అందుకే కూలర్ వేసినప్పుడు గది కిటికీలు తెరచి ఉంచాలి. దీనివల్ల గదిలో తేమ సమంగా పరచుకుని ఉక్కపోత తగ్గుతుంది. కూలర్ వెనక భాగాన్ని ఒక కిటికీ దగ్గర అమర్చి గదిలోని గాలి బయటికి వెళ్లడానికి వీలుగా మరో కిటికీ లేదా గుమ్మం తలుపు తెరచి ఉంచితే గాలి ప్రసరణ బాగా జరిగి గదిలో చల్లదనం పెరుగుతుంది.
కూలర్ నుంచి వచ్చే చల్లదనం పూర్తిగా దాని పక్కల ఉండే గడ్డి ప్యాడ్‌లపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్యాడ్‌ల మీద దుమ్ము, ధూళి చేరి ఉంటే వాటిపై నీరు సరిగా ప్రవహించలేదు. దీంతో చల్లగాలి రాదు. వారానికోసారి గడ్డి ప్యాడ్‌లను మంచినీటితో శుభ్రం చేయాలి. ఇవి పాతవైతే గదిలో చల్లదనం వ్యాపించదు. ఏడాదికోసారి గడ్డి ప్యాడ్‌లను మార్చడం మంచిది. హనీకోంబ్ ప్యాడ్‌లను వాడితే అవి ఎక్కువ నీటిని పట్టి ఉంచుతాయి కాబట్టి గదిలో ఏసీ లాంటి చల్లదనం విస్తరిస్తుంది.
కూలర్‌పైన ఉండే నీటి పైపుల రంధ్రాల్లో తరచూ ఉప్పు చేరుతూ ఉంటుంది. దీంతో అవి మూసుకుపోయి గడ్డి ప్యాడ్‌ల మీదికి నీటిని పారనీయవు. గడ్డి ప్యాడ్‌లు తడవకపోవడంతో కూలర్ గాలి వేడిగా వస్తుంది. పొడవాటి సూదితో ఆ రంధ్రాలను గుచ్చి శుభ్రం చేసి గడ్డి ప్యాడ్‌ల మీద నీటి ప్రవాహం వచ్చేలా చేయాలి. ప్యాడ్‌లన్నీ సమంగా తడుస్తున్నాయో లేదో పరిశీలించాలి. అలాగే కూలర్ ట్యాంక్‌ను కూడా రెండు రోజులకోసారి వెనిగర్ లేదా నిమ్మచెక్కలతో శుభ్రం చేస్తూ ఉండాలి.
కూలర్ ట్యాంక్‌లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేస్తే వెంటనే నీళ్లన్నీ చల్లబడి గడ్డి ప్యాడ్‌ల మీదుగా ప్రవహించడంతో చల్లటి గాలి వస్తుంది.
ఇవి కూడా చదవండి:
జనన రికార్డుల్లో వ్యత్యాసాలు.. అండర్ 17 మహిళా రెజ్లర్‌పై వేటు
మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి: విరాట్ కోహ్లీ