Share News

కళకు రూపం... ఆదాయ మార్గం

ABN , Publish Date - Jun 22 , 2026 | 02:11 AM

మరియా కురియయాకోస్‌... ఆమె చేతిలో పడితే వాడి పడేసిన కొబ్బరి చిప్పలు కూడా కళాకృతులుగా తిరిగి వస్తాయి. టీ కప్పులుగా... అలంకరణ వస్తువులుగా... మరెన్నో ఆకట్టుకొనే రూపాలుగా మారిపోతాయి...

కళకు రూపం...  ఆదాయ మార్గం

విభిన్నం

మరియా కురియయాకోస్‌... ఆమె చేతిలో పడితే వాడి పడేసిన కొబ్బరి చిప్పలు కూడా కళాకృతులుగా తిరిగి వస్తాయి. టీ కప్పులుగా... అలంకరణ వస్తువులుగా... మరెన్నో ఆకట్టుకొనే రూపాలుగా మారిపోతాయి. విదేశాల్లో ఉన్నత చదువులు... కార్పొరేట్‌ కొలువులు... కానీ ఏదో అసంతృప్తితో స్వరాష్ట్రానికి వచ్చిన ఆమె... సొంత కంపెనీ నెలకొల్పారు. కొబ్బరి చిప్పలతో పర్యావరణహిత ఆకృతులు తయారు చేస్తూ... విదేశాల్లో సైతం విక్రయిస్తున్నారు. స్థానిక కళాకారులకు... మహిళలకు ఉపాధి మార్గం చూపిన 31 ఏళ్ల మరియా జర్నీ ఇది.

‘‘కేరళలో సాధారణంగా... సొంత ఊళ్లో పాఠశాల విద్యాభ్యాసం తరువాత ఉన్నత చదువుల కోసం బెంగళూరు లాంటి ఇతర నగరాలకో లేదా విదేశాలకో వెళుతుంటారు. తిరిగి వచ్చి ఏదో ఒక వ్యాపారం ప్రారంభిస్తారు. నేనూ అందుకు భిన్నమేం కాదు. అదే దారిలో నడిచిన సగటు కేరళ అమ్మాయిని. అయితే ఆదాయం గడించడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకోలేదు. నేను పెరిగిన సమాజం, నా చుట్టూవున్న పర్యావరణం గురించి కూడా కొంత బాధ్యత తీసుకోవాలనేది నా సంకల్పం. దానికి అనుగుణంగానే నా ప్రయాణం సాగించాలని అనుకున్నాను. కేరళలోని పాలక్కాడ్‌ మాది. స్కూల్‌ చదువు అవ్వగానే ముంబయి సెయింట్‌ జేవియర్స్‌ కాలేజీలో బీఏ ఎకనామిక్స్‌ చదివాను. అక్కడి నుంచి స్కాలర్‌షిప్‌ మీద స్పెయిన్‌ వెళ్లి ఎంబీయే చేశాను. తిరిగి ముంబయికి వచ్చాక రెండేళ్లు ఓ కార్పొరేట్‌ కంపెనీలో, మరో రెండేళ్లు ఓ స్టార్టప్‌లో ఉద్యోగం.

కొత్తగా ఏదైనా చేయాలని...

స్పెయిన్‌లో చదువు, ముంబయిలో ఉద్యోగం... అంతా సవ్యంగానే సాగిపోతున్నా నాలో ఏదో వెలితి. కొత్తగా, సుస్థిరంగా, ప్రకృతికి దగ్గరగా ఉండేలా సొంతంగా ఏదో చేయాలనే తపన. ఈ తపన ఇవాల్టిది కాదు... చిన్నప్పటి నుంచీ ఉండేది. కానీ కెరీర్‌ను నిర్మించుకొనే క్రమంలో అది మరుగున పడిపోయింది. ఎప్పుడైతే ఆలోచన మారిందో... వెంటనే ఉద్యోగం వదిలేసి తిరిగి ముంబయికి వచ్చేశాను. కానీ ఏం చేయాలనేదానిపై స్పష్టత లేదు. అనుభవం కోసం ‘మైనా మహిళ ఫౌండేషన్‌’లో చేరాను. అక్కడి మురికివాడల మహిళలతో కలిసి శానిటరీ ప్యాడ్స్‌ తయారీ, విక్రయంతో పాటు రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన కల్పించడం నా పని. సొంత కంపెనీ ప్రారంభించాలని కలలు కంటున్న నాకు ఈ అనుభవం ఎంతో ఉపయోగపడింది.


సొంతూరికి వచ్చి...

ముంబయిలోని స్వచ్ఛంద సంస్థతో కలిసి పని చేయడంవల్ల నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా లాభాలు ఆర్జిస్తూనే ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి, పర్యావరణానికి కూడా తోడ్పడవచ్చని గ్రహించాను. అక్కడి నుంచి సొంత రాష్ట్రానికి వచ్చాను. ఏ వ్యాపారం చేయాలన్నదానిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. ముందుగా చుట్టూవున్న సహజ వనరుల గురించి అధ్యయనం మొదలుపెట్టాను. కేరళలో కొబ్బరి ఉత్పత్తులు ప్రత్యేకం. కొబ్బరి నీళ్లు, కొబ్బరి పీచు లాంటి ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉందని తెలుసుకన్నాను. అయితే వాటి తయారీ రంగంలో విపరీతమైన పోటీ ఉంది. అందుకని తాటాకులతో కొన్ని కళాకృతులు చేసి, అమెజాన్‌ తదితర ఈకామర్స్‌ స్టోర్స్‌, సూపర్‌మార్కెట్‌లలో విక్రయించాను. బానే అమ్ముడయినా అందులో స్థిరమైన ఆదాయం లేదు. అలాగని నష్టమూ లేదు. ఈ క్రమంలోనే ఇంటి పెరట్లో పడివున్న కొబ్బరి చిప్పలు నన్ను ఆకర్షించాయి. కొన్ని చిప్పలు తీసుకొని, వాటిపై శాండ్‌ పేపర్‌తో రుద్ది, కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే, మెరిసిపోయాయి. నాన్నకు చూపిస్తే... ‘చాలా అందంగా ఉన్నాయి’ అన్నారు. ఒక చిప్పలో మొక్క పెట్టి... తదేకంగా దాని వైపే చూస్తూ కూర్చున్నాను. ముచ్చటగా అనిపించింది. అప్పుడు మదిలో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అదే కొబ్బరి చిప్పలతో కళాకృతుల తయారీ.

5-Navya.jpg

రెండు లక్షల పీస్‌లు...

మా ఉత్పత్తులకు మార్కెట్‌ పెరగడంతో ఆరేళ్ల కిందట తెంగా పేరుతో ఒక కంపెనీ ప్రారంభించాను. దాని ద్వారా ఇప్పుడు దేశంలోనే కాకుండా, ఐరోపా దేశాల్లో కూడా విక్రయిస్తున్నాం. దాదాపు మూడున్నర కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్నాం. ప్రధానంగా ఎగుమతులపైనే దృష్టి పెట్టాం. రెండేళ్ల కిందట మాకు ఒకేసారి రెండు లక్షల పీస్‌ల భారీ ఆర్డర్‌ వచ్చింది. దాంతో మరింతమందిని పనిలోకి తీసుకొనే అవకాశం లభించింది. ప్రస్తుతం నా దగ్గర పనిచేసే వారందరూ మహిళలే. పాలక్కాడ్‌ యూనిట్‌లో 26 మంది, అడ్మినిస్ర్టేటివ్‌ కార్యాలయంలో మరో 14మంది మహిళలు ఉన్నారు. ఇది నాకు ఎంతో సంతృప్తినిచ్చే అంశం. నేను కోరుకున్నట్టు నాకు నచ్చిన రంగంలో రాణిస్తున్నాను. నాలాంటి మరికొంతమందికి ఉపాధి మార్గమయ్యాను.’’


తయారీ... మార్కెటింగ్‌... నేనే...

ఆరంభంలో వెరైటీలు తయారు చేశాను. వాటిని తీసుకువెళ్లి బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాల్లోని కంపెనీలను సంప్రదించాను. చాలామంది వాటిని చూసి ఆశ్చర్యపోయారు. వినూత్నంగా, ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. అలా తొలిసారి నేను అందుకున్న ఆర్డర్‌... 200 పీస్‌లు. ఒక్కొక్కటీ రూ.60 చొప్పున విక్రయించాను. ఆర్డర్లు పెరగడంతో షెల్స్‌ భారీగా కావాల్సివచ్చింది. వాటిని సేకరించే క్రమంలో కళాకారులను కూడా కలిశాను. అప్పటికే కొందరు చిప్పలతో అలంకరణ వస్తువులు తయారు చేస్తున్నారు. అలాంటివారందరినీ ఒకచోటకు చేర్చాను. వారిలో అధిక శాతం మహిళలే. కేవలం అలంకరణ వస్తువులకే పరిమితం కాకుండా, కాఫీ కప్పులు, బౌల్స్‌ తదితర నిత్యావసర వస్తువులు, బహుమతులు, కొవ్వొత్తుల స్టాండ్స్‌, కంటైనర్లవంటివి కూడా రూపొందిస్తున్నాం. వందకు పైగా వెరైటీలను మార్కెట్‌లో అందుబాటులో ఉంచాం.

ఇవి కూడా చదవండి..

మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 22 , 2026 | 02:11 AM