Share News

మహిళా రైతులకు పూలబాట

ABN , Publish Date - Nov 02 , 2026 | 01:52 AM

తెగల మధ్య ఘర్షణలతో మనుగడ ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో... పెరటి తోటల పూలను లాభసాటి వ్యాపారంగా మార్చి వందలాది మంది మహిళల జీవితాల్లో...

మహిళా రైతులకు పూలబాట

తెగల మధ్య ఘర్షణలతో మనుగడ ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో... పెరటి తోటల పూలను లాభసాటి వ్యాపారంగా మార్చి వందలాది మంది మహిళల జీవితాల్లో వికాసం తెచ్చారు ఛొఖోనే క్రిఛెనా. మణిపూర్‌ నుంచి వివిధ రాష్ట్రాలకు, దేశాలకు పుష్పాల ఎగుమతిని విజయవంతంగా సాగిస్తూ... ‘ఫ్లవర్‌ లేడీ ఆఫ్‌ మణిపూర్‌’గా ప్రధాని మోదీ ప్రశంసలు సైతం అందుకున్నారు. వీలైనంత మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనేదే తన ఆశయమని చెబుతున్న చెఖోనే అంతరంగం ఇది.

‘‘మాది మణిపూర్‌లోని సేనాపతి జిల్లా మావో అనే పట్టణం. మా ప్రాంతం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడింది. అలాగే... భూములన్నీ ఎంతో సారవంతంగా... పండ్లు, పువ్వులు, కూరగాయల సాగుకు అనుకూలంగా ఉంటాయి. దాదాపు ప్రతి ఇంట్లో రకరకాల పూలమొక్కలు ఉంటాయి. పూలతో ఇళ్ళను అలంకరించుకోవడం మా సంప్రదాయంలో భాగం. చుట్టూ పువ్వులు కనిపించని కాలాన్ని మేం ఊహించలేం. అందుకే... బోటనీలో గ్రాడ్యుయేషన్‌ చెయ్యడానికి పుణే వెళ్ళినా, బయోటెక్నాలజీలో మాస్టర్స్‌ కోసం గువాహటి వెళ్ళినా నా మనసు ఎప్పుడూ మా ఊరు చుట్టూ తిరిగేది.

సోషల్‌ మీడియాతో మొదలై...

చదువు పూర్తి చేశాక... బెంగళూరులో ఒక ఫార్మా కంపెనీలో ఇంటెర్న్‌షిప్‌ చేశాను. ఆ తరువాత మణిపూర్‌ వచ్చి, స్కూల్‌ టీచర్‌గా చేరాను. అంతా బాగుందనే సమయంలో... కొవిడ్‌ వచ్చి పడింది.

జనం ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. తీరిక ఎక్కువగా దొరకడంతో పూల చెట్ల పంపకం, కూరగాయల సాగు ప్రధాన కాలక్షేపమయింది. మా దగ్గర పూసే గులాబీల నుంచి వైల్డ్‌ ఆర్కిడ్స్‌ వరకూ అన్ని రకాల పువ్వులను ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చెయ్యడం మొదలుపెట్టాను. వెంటనే ‘‘మీరు వాటిని అమ్ముతారా?’’ అంటూ ఎంక్వయిరీలు మొదలయ్యాయి. విక్రయం కాని పూలు మా దగ్గర పుష్కలం. దాంతో... దగ్గర్లో ఉన్న పట్టణాల నుంచి ఆర్డర్‌ చేసిన వారికి పంపడం ప్రారంభించాను. పూల మార్కెటింగ్‌ గురించి అధ్యయనం చేసినప్పుడు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌కు మయన్మార్‌ నుంచి పూలు వస్తాయి. అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అవుతాయి. అయితే స్థానికంగా పూలు పుష్కలంగా సాగు అవుతున్నాయి. వాటికి మంచి డిమాండ్‌ ఉంది. దీన్ని ఒక అవకాశంగా తీసుకుంటే... వేరే దేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పైగా ఇక్కడి మహిళలకు అది ఉపాధి మార్గం కూడా అవుతుంది. ఆ ఆలోచనతో ‘డియాంతి’ పేరుతో ఒక వెంచర్‌ ప్రారంభించాను. ‘డియాంతి’ అంటే... ‘దేవతా పుష్పం’ అని అర్థం.


ఆ సమస్యకు పరిష్కారంగా....

మణిపూర్‌, సమీపంలోని నాగాలాండ్‌ రాష్ట్రాల్లోని మార్కెట్ల మీద మొదట దృష్టి పెట్టాను. సోషల్‌ మీడియా ద్వారా క్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు రావడం మొదలయింది. కానీ తాజా పూలు వాడిపోకుండా, పాడైపోకుండా దూరప్రాంతాలకు చేరవేయడం సవాలుగా మారింది. మావో పట్టణానికి విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల అందుబాటు చాలా పరిమితం. పోస్టల్‌, కొరియర్‌ సర్వీసుల్లో పంపితే... అవి గమ్యాలకు చేరేసరికి వారాలు, కొన్నిసార్లు నెలలు కూడా పట్టేవి. పూలను ప్రత్యేక పద్ధతిలో ఎండబెట్టడమే దానికి పరిష్కారంగా గుర్తించి, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చాను. ఆ పద్ధతి వల్ల అవి ఏడాదికి పైగా వాటి సహజ సౌందర్యాన్ని, రంగుల్ని కోల్పోవు. అంతేకాదు... వాటి నిర్వహణ కూడా తక్కువ. ఇంట్లో అలంకరించుకోవడానికి ఎంతో అనువుగా ఉంటాయి. ఈ ప్రక్రియలో యంత్రాలు కాని, రసాయనాలు కాని వినియోగించం. ఎక్కువగా నీడలోనే వాటిని ఆరబెడతాం. కొన్ని రకాలను మాత్రం ఎండలో ఉంచాల్సి వస్తుంది. దీని గురించి వినియోగదారులకు తెలియజేసినప్పుడు... సానుకూలమైన స్పందన వచ్చింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అయితే ఇది అంత సులువుగా జరిగిపోలేదు. పూల కన్నా కూరగాయల ద్వారానే ఆదాయం వస్తుందనే ఆలోచనతో మహిళా రైతులు మొదట్లో ముందుకు రాలేదు. పదిమందిని ఒప్పించడమే కష్టమయింది. వారితో ప్రత్యేకమైన రకాల పూల మొక్కలు ఇచ్చి, వాటి పెంపకానికి అవసరమైనవన్నీ సమకూర్చాను. కొన్ని నెలల్లోనే... కూరగాయల విక్రయం కన్నా రెట్టింపు ఆదాయాన్ని వారు అందుకున్నారు. అది చూసి మరింతమంది మహిళలు ముందుకు వచ్చారు.


ఆ మాటల ప్రేరణతో...

ఇప్పుడు మా పట్టణానికి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 300 మందికి పైగా మహిళలు ‘డియాంతి’తో కలిసి పని చేస్తున్నారు. ఇరవైకి పైగా రాష్ట్రాలకు మా ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎగ్జిబిషన్లలో వాటిని ప్రదర్శించాం. అయితే పూలను భారీ స్థాయిలో ఉత్పత్తి చెయ్యలేం కాబట్టి మా వ్యాపారానికి పరిమితులు ఉన్నాయి. మరోవైపు... మా రాష్ట్రంలో తెగల మధ్య ఘర్షణల వల్ల ప్రజలు మనుగడ కోసం అవస్థలు పడుతున్నారు. వ్యసాయం, వ్యాపారాల మీద కూడా ఆ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ సమస్యలను అధిగమించడానికి కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. మరోవైపు.... హిమాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ తదితర ప్రాంతాల్లోని రైతులను కూడా భాగస్వాములుగా చేసుకొని ‘డియాంతీ’ కార్యకలాపాల విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది డిసెంబర్‌ నాటి మన్‌ కీ బాత్‌లో నా గురించి ప్రస్తావించి, ప్రశంసించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. వీలైనంతమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే నా ఆశయానికి ప్రధాని మాటలు నిరంతర ప్రేరణగా నిలుస్తున్నాయి.’’

ఈ వార్తలు కూడా చదవండి

ఓట్‌చోరీపై రాంలీలా మైదాన్‌లో పోరాటం చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేసరికి.. ఇంట్లో 29 తులాల బంగారం మాయం

Updated Date - Nov 02 , 2026 | 01:54 AM