Share News

మెల్ల కన్ను మతలబులు

ABN , Publish Date - Sep 01 , 2026 | 02:25 AM

మెల్ల కన్ను అదృష్టం కాదు. అదొక మూఢనమ్మకం. పిల్లల్లో కనిపించే ఈ లక్షణాన్ని వీలైనంత త్వరగా వైద్యుల దృష్టికి తీసుకెళ్లడం అత్యవసరం. లేదంటే తిరిగి సరిదిద్దలేని కంటి...

మెల్ల కన్ను మతలబులు

ఐ కేర్‌

మెల్ల కన్ను అదృష్టం కాదు. అదొక మూఢనమ్మకం. పిల్లల్లో కనిపించే ఈ లక్షణాన్ని వీలైనంత త్వరగా వైద్యుల దృష్టికి తీసుకెళ్లడం అత్యవసరం. లేదంటే తిరిగి సరిదిద్దలేని కంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు కంటి వైద్యులు.

మెల్ల కన్నుకు పలు కారణాలుంటాయి. ప్రతి మెల్ల కన్నుకూ కండరాల అసమతౌల్యం కారణం కాదు. దృష్టి లోపం వల్ల మెల్ల కన్ను రావచ్చు. కంజక్టైవల్‌ క్యాటరాక్ట్‌ అనే కంటి పొరల వల్ల కూడా మెల్ల కన్ను రావచ్చు. రెటీనో బ్లాస్టోమా వల్ల కూడా మెల్ల కన్ను రావచ్చు. కాబట్టి కారణం ఏదన్నది కచ్చితంగా కనిపెట్టి, సరైన సమయంలోగా సరిదిద్దుకోవాలంటే మెల్ల కన్ను కనిపించిన వెంటనే అప్రమత్తం కావాలి.

పసికందుల్లో మెల్ల కన్ను

ఇన్‌ఫాంటైల్‌ స్క్వింట్‌, నాలుగు నుంచి ఆరు నెలల పసిపిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. కొందరు పిల్లలో ఈ తరహా మెల్ల కన్ను తొమ్మిది నెలల వయసుకు దానంతట అదే సరి అయిపోతుంది. అయితే కొన్ని మెల్లలు సరికావు. అలాంటప్పుడు చికిత్సలో సరిచేయవలసి ఉంటుంది. సాధారణంగా పిల్లలకు రెండు నుంచి ఐదేళ్ల వయసులో త్రీడి విజన్‌ అభివృద్ధి చెందుతుంది. ఈ దృష్టి అభివృద్ధి కావాలంటే రెండు కళ్లూ పని చేయాలి, అవి నేరుగా చూడగలగాలి, దృష్టి కూడా బాగుండాలి. ఈ మూడు అంశాలు మెరుగ్గా ఉండాలంటే కళ్లలో మెల్ల ఉండకూడదు. కాబట్టి మెల్ల కన్నును ఏడాది వయసులోపే సరి చేయించాలి. అందుకోసం పిల్లల్లో మెల్ల కన్ను కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను కలిసి, అందుకు రెటీనో బ్లాస్టోమా, కంజక్టైవల్‌ క్యాటరాక్ట్‌ లాంటివి కారణం కాదనీ ఇన్‌ఫాంటైల్‌ స్క్వింట్‌ అనీ నిర్థారించుకోవాలి. తర్వాత వైద్యులు చెప్పినట్టు తొమ్మిది నెలల వరకూ ఆగవచ్చు. ఒకవేళ మెల్ల కన్నుకు రెటీనో బ్లాస్టోమా, కంజక్టైవల్‌ క్యాటరాక్ట్‌ కారణమైతే ఈ సమస్యలను చికిత్సతో సరిదిద్దుకోవాలి.


చికిత్సలున్నాయి

రెండు కళ్లలో క్యాటరాక్ట్‌ ఉంటే కాస్త ఆలస్యంగా, ఒక కంట్లో క్యాటరాక్ట్‌ వల్ల ఆ కంటి చూపు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే సర్జరీతో సరిచేయాల్సి ఉంటుంది. రెటినో బ్లాస్టోమా క్యాన్సర్‌ కణితి కాబట్టి వెంటనే చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. పసిపిల్లల్లో మెల్లకన్నుకు దృష్టి లోపం కూడా ఒక కారణం కాబట్టి దాన్ని సరిచేయడం కోసం కళ్లజోడు వాడాల్సి ఉంటుంది. పసిపిల్లల్లో దృష్టి లోపం ఎంతో ఎక్కువగా ఉంటుంది. దాంతో వాళ్లకేమీ కనిపించదు. కాబట్టి తప్పనిసరిగా కళ్లజోడు వాడుకోవాలి. మెల్ల కన్నుకు తీవ్రమైన సమస్యలేవీ కారణం కాకుండా కేవలం ఇన్‌ఫాంటైల్‌ స్క్వింట్‌ మాత్రమే కారణమైనప్పుడు, వైద్యులు చెప్పినట్టు తొమ్మిది నెలల వయసొచ్చేవరకూ ఆగాలి. ఆ తర్వాత కూడా మెల్ల కళ్లు సరికాని పక్షంలో ఈ పిల్లలకు కూడా చికిత్స అవసరమవుతుంది. ఈ చికిత్సలను ఆశ్రయించకుండా పసిపిల్లల మెల్ల కన్నును పట్టించుకోకుండా వదిలేస్తే, రెండు నుంచి ఐదేళ్ల లోపు అభివృద్ధి కావలసిన త్రీడి విజన్‌ అభివృద్ధి కాదు.

నాలుగేళ్ల పిల్లల్లో మెల్ల

కొందరు పిల్లల్లో నాలుగు లేదా ఐదేళ్ల వయసులో మెల్ల కన్ను మొదలవుతుంది. ఈ మెల్ల ప్రధానంగా పిల్లల్లో దృష్టిలోపం వల్ల తలెత్తుతుంది. కాబట్టి ఈ వయసు పిల్లల్లో మెల్ల కనిపించిన వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలి. కొందరు పిల్లల్లో కళ్లజోడుతో మెల్ల పూర్తిగా సరి అయిపోతుంది. కొందరు పిల్లల్లో కళ్లజోడుతో మెల్ల సగం వరకూ సరి అవుతుంది. అరుదుగా కొందరు పిల్లల్లో కళ్లజోడు వల్ల కూడా మెల్ల సరి కాకపోవచ్చు. ఇలా వైద్యులు, కళ్లజోడుతో పిల్లల మెల్లను సరి చేసే ప్రయత్నం చేసి, అంతిమంగా ఫలితం కనిపించని సందర్భాల్లో సర్జరీని ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ వయసు పిల్లల్లో మెల్లను సరి చేయడం ఎంతో ముఖ్యం.


పెద్దల్లో మెల్ల కళ్లు

మెల్ల కన్నును ఏ వయసులోనైనా సరి చేయవచ్చు. కనుగుడ్లు ముక్కు వైపు లోపలకు తిరిగి ఉన్నా, బయటి వైపుకు తిరిగి ఉన్నా, వాటిని సులభంగా సరి చేయవచ్చు. అయితే కొందరికి రెటీనా సమస్యలుంటాయి. వీళ్లకు సర్జరీ తదనంతరం, మెల్ల కన్ను తిరగబెట్టే అవకాశాలు రెండు నుంచి ఐదు శాతం వరకూ ఉంటాయి. దృష్టి లోపం తక్కువగా ఉన్న వాళ్లకు మెల్ల కన్ను తిరగబెట్టే అవకాశాలు ఎక్కువగా, దృష్టిలోపం ఎక్కువగా ఉన్న వాళ్లకు మెల్ల కన్ను తిరగబెట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే మెల్లకన్ను తిరగబెట్టే అవకాశాలు ఏ మేరకు ఉంటాయన్నది వైద్యులు మాత్రమే చెప్పగలుగుతారు. కొందర్లో కంటి పక్షవాతం వల్ల

పారాలైటిక్‌ స్క్వింట్‌’ వస్తుంది. ఈ కోవకు చెందిన వాళ్లలో సర్జరీ తదనంతర ఫలితం తక్కువగా ఉంటుంది. మధుమేహుల్లో ఈ సమస్య ఎక్కువ.

మెల్ల కన్ను అదృష్టం కాదు

మెల్ల కన్ను అదృష్టమనే అపోహ సర్వత్రా నెలకొని ఉంది. దాంతో చిన్న వయసులో సరిదిద్దుకోవలసిన ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి, పెళ్లీడు వయసులో సంబంధాలు కుదరక వైద్యుల దగ్గరకు పరిగెత్తుకొస్తూ ఉంటారు. అలాగే చిన్న వయసులోనే పిల్లలకు సర్జరీ చేయించకుండా పెద్దయ్యాక చేయించాలనుకునే పెద్దలూ ఉంటున్నారు. కానీ పిల్లల మెల్లకన్నును సరిదిద్దడానికి వైద్యులు ఏడాదిలోపే సర్జరీని సూచించినా, కళ్లజోడును సూచించినా కాదనకూడదు. జంతువుల నుంచి మనుషులను వేరు చేసేది త్రీడి దృష్టి. అలాంటి త్రీడి దృష్టిని పిల్లల నుంచి లాక్కునే హక్కు పెద్దలకు లేదు. పరిసరాలు, వస్తువుల మధ్య దూరాలను అంచనా వేయడానికి త్రీడి దృష్టి అవసరం. ఇది లోపిస్తే, దృష్టిలో డెప్త్‌ లోపించి అంతా చదునుగా కనిపిస్తుంది. అలాగే మెల్లకన్నుతో కంటిచూపు కూడా మెరుగ్గా ఉండదు. మెల్ల కన్ను పిల్లలు హేళనలు, అవమానాలను కూడా ఎదుర్కొంటారు. దాంతో ఆత్మవిశ్వాసం దెబ్బతిని, మానసికంగా కుంగిపోతారు. కాబట్టి పిల్లల్లో మెల్ల కన్నును అదృష్టంగా భావించకుండా, వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లి, వారి సూచలనలను పాటించాలి.

డాక్టర్‌ ఆశా సందని

ఆప్తల్మాలజీ కన్సల్టెంట్‌, హైదరాబాద్‌.

ఇవి కూడా చదవండి..

ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..

భారత్, బంగ్లాదేశ్ సిరీస్‪పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!

ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి

Updated Date - Sep 01 , 2026 | 02:25 AM