పిల్లులతో ఇన్‌ఫెక్షన్లు
ABN , Publish Date - May 12 , 2026 | 04:20 AM
కుక్కలతో సోకే రేబీస్ వ్యాధి గురించి భయపడతాం! మరి ఇళ్లలో పెంచుకునే పిల్లుల పరిస్థితి ఏంటి? వాటి గోళ్ల వల్ల గాయపడితే ఏం జరుగుతుంది...
పెట్ కేర్
కుక్కలతో సోకే రేబీస్ వ్యాధి గురించి భయపడతాం! మరి ఇళ్లలో పెంచుకునే పిల్లుల పరిస్థితి ఏంటి? వాటి గోళ్ల వల్ల గాయపడితే ఏం జరుగుతుంది?
పిల్లి గోళ్లు అంతగా బాధించవు. ఆ క్షణం నొప్పి కలుగుతుంది. ఆ తర్వాత దాని గురించి మర్చిపోతాం! కానీ పిల్లి గోళ్లతో ఏర్పడే గాయాలు కొన్ని సందర్భాల్లో రేబీ్‌సను మించిన ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. ప్రత్యేకించి, పిల్లి గోళ్లు చర్మంలో లోతుగా గీరుకుపోయినా, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నా ఈ తరహా గాయాలు మరింత పెద్ద ముప్పును తెచ్చిపెడతాయి. సాధారణంగా చాలావరకూ పిల్లి గోళ్ల గాయాలు వాటంతటవే మానిపోతాయి. అయితే కొన్ని సందర్భాల్లో ‘బార్టొనెల్లా హెన్సీలే’ అనే బ్యాక్టీరియా కారణంగా క్యాట్ స్ర్కాచ్ ఫీవర్‌ను కలిగిస్తాయి. పేలు కలిగిన పిల్లుల ద్వారా ఈ జ్వరంతో పాటు ‘పాశ్చురెల్లా మల్టోసిడా’ అనే ఇన్‌ఫెక్షన్ కూడా సోకుతుంది. ఆరోగ్యంగా కనిపించే పిల్లుల నోళ్లలో, పాదాల అడుగున ఈ బ్యాక్టీరియా ఉంటుంది. ఇంట్లో పెంచుకునే పిల్లులను ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటున్నప్పటికీ, పర్యావరణం నుంచి, ఆహార ట్రేల నుంచి, లేదా అవి తినే కీటకాలు, ఎలుకల నుంచి వ్యాధికారక సూక్ష్మజీవులు పిల్లుల్లోకి చేరుకుంటూ ఉంటాయి. ఈ పిల్లులు వాటి గోళ్లతో మనల్ని గాయపరచడం ద్వారా చీరుకుపోయిన చర్మం గుండా బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరుకుని, కొన్ని రోజులు, వారాలకు ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తుంది.
మూడు వారాల్లో లక్షణాలు
పిల్లుల గోళ్లు గీరుకుపోవడం, పిల్లి కొరకడం, పిల్లులు, మన పగిలిన చర్మాన్ని నాకడం ద్వారా బార్టొనెల్లా హెన్సీలే బ్యాక్టీరియా మన శరీరంలోకి చొరబడుతుంది. బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన ఒకటి నుంచి మూడు వారాల లోపు లక్షణాలు బయల్పడడం మొదలుపెడతాయి. ప్రత్యేకించి మెడ, బాహుమూలాలు, లేదా కటి ప్రదేశంలోని లింఫ్ గ్రంథుల వాపు కనిపిస్తుంది. కొందర్లో జ్వరం, అలసట, తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటాయి. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో ఈ లక్షణాలు స్వల్పంగా బయల్పడి, వాటంతటవే సర్దుకుంటాయి. అయితే పిల్లలు, వృద్ధుల్లో వ్యాధినిరోధకశక్తి బలహీనంగా ఉంటుంది కాబట్టి లక్షణాలు తీవ్రమై, యాంటీబయాటిక్స్ వాడుకోవలసిన పరిస్థితి తలెత్తుతుంది.
మృదుకణజాల ఇన్‌ఫెక్షన్లు
వ్యాధికారక బ్యాక్టీరియా చర్మం లోపలి పొరల్లోకి లేదా రక్తప్రవాహంలోకి చొరబడినప్పుడు, అది సెల్యులైటి్‌సకు దారి తీస్తుంది. ఈ చర్మ ఇన్‌ఫెక్షన్ నొప్పినీ, అసౌకర్యాన్నీ కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో వ్యాధినిరోధకశక్తి సన్నగిల్లినవారిలో సెప్సి్‌సకూ, ప్రాణాంతకమైన సిస్టమిక్ రియాక్షన్‌కు దారి తీస్తుంది. కాబట్టి 24 నుంచి 48 గంటల్లోగా గాయం తీవ్రత పెరిగితే ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి. తుప్పు పట్టిన రేకులు, మేకులు కోసుకున్నప్పుడు మాత్రమే మనం టెటనస్ ఇంజెక్షన్ చేయించుకుంటూ ఉంటాం. కానీ పదునైన పిల్లి గోళ్లు గీరుకుపోయినప్పుడు కూడా ‘క్లాస్ట్రిడియం టెటనై’ స్పోర్స్ మన శరీరంలోకి చేరుకుని టెటన్‌సను వ్యాప్తి చేస్తాయి. ఈ సమస్య నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి, కండరాలు బిగుసుకుపోవడం, వణకడం లాంటి లక్షణాలను కలుగచేస్తుంది. గత పదేళ్ల కాలంలో టెటనస్ తీసుకోని వాళ్లకు వైద్యులు బూస్టర్ డోస్‌ను సూచిస్తూ ఉంటారు. ఒకవేళ టిటి టీకా తీసుకున్నదీ లేనిదీ కచ్చితంగా తెలియనప్పుడు, ఆ విషయాన్ని వైద్యులకు తెలియపరచాలి.
తక్షణ చర్యలు ఇవే...
ఇన్‌ఫెక్షన్‌కు అడ్డుకట్ట వేయడం కోసం, గీరుకుపోయిన ప్రదేశాన్ని సబ్బు నీళ్లతో శుభ్రంగా కడగాలి. దీంతో బ్యాక్టీరియా తొలగిపోతుంది. ఆ తర్వాత యాంటిసెప్టిక్ లోషన్ పూసి, గాయాన్ని పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. గాయానికి బిగుతుగా కట్టు కట్టి, మూసిఉంచకూడదు. లోతైన గాయాలను నిర్లక్ష్యం చేయకూడదు. మరీ ముఖ్యంగా ముఖం, చేతులు, కీళ్ల దగ్గర ఏర్పడిన గాయాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. 24 గంటల తర్వాత కూడా గాయం నుంచి రక్తస్రావం ఆగకపోయినా, గాయం పెద్దదవుతున్నా, జ్వరం, ఫ్లూ లక్షణాలు మొదలైనా, గాయపడిన ప్రాంతంలో నొప్పి, వాపు పెరుగుతున్నా వెంటనే వైద్యులను కలవాలి.
ఈ వార్తలనూ చదవండి:
ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం
అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత