Share News

కారు ప్రయాణంలో వికారం

ABN , Publish Date - Nov 19 , 2026 | 03:33 AM

మీకున్న సమస్యను ‘మోషన్‌ సిక్‌నెస్‌’ అని అంటారు. ఈ సమస్య బహుళ ఇంద్రియాలతో ముడిపడి ఉంటుంది. దాంతో వికారం, తలనొప్పి, వాంతులు, చెమటలు వేధిస్తాయి...

కారు ప్రయాణంలో వికారం

కౌన్సెలింగ్‌

డాక్టర్‌! కార్లో ప్రయాణించిన ప్రతిసారీ వికారం, వాంతులు వేధిస్తూ ఉంటాయి. దాంతో కారు ప్రయాణం చేయలేకపోతున్నాను. ఇలా అందరికీ జరగకుండా నాకే ఎందుకు జరుగుతోంది? ఈ సమస్యకు పరిష్కారమేంటి?

ఓ సోదరి, హైదరాబాద్‌.

మీకున్న సమస్యను ‘మోషన్‌ సిక్‌నెస్‌’ అని అంటారు. ఈ సమస్య బహుళ ఇంద్రియాలతో ముడిపడి ఉంటుంది. దాంతో వికారం, తలనొప్పి, వాంతులు, చెమటలు వేధిస్తాయి. కార్లో ప్రయాణించేటప్పుడు, అయోమయానికి గురి చేసే సెన్సరీ సిగ్నల్స్‌కు శరీరం స్పందించే తీరు ఫలితంగానే మోషన్‌ సిక్‌నెస్‍కు లోనవుతాం! కారు ప్రయాణంలో మన మెదడు... కళ్లు, లోపలి చెవి నుంచి మిశ్రమ సంకేతాలను అందుకుంటూ ఉంటుంది. ప్రయాణించే సమయంలో మన కళ్లు, లోపలి చెవి సంతులనాన్ని నిర్వహించడానికి సహాయపడతాయి. లోపలి చెవి... కదలికలనూ, మలుపులనూ, వేగంలో మార్పులనూ కనిపెడుతుంది. అదే సమయంలో కారు లోపలి అంశాల మీద దృష్టి పెట్టే మన కళ్లు కదలికలు, మలుపులు, వేగాలను కనిపెట్టలేవు. ఈ మిస్‌మ్యాచ్‌ వల్ల మన మెదడు అయోమయానికి లోనై వికారం, వాంతులు, తలనొప్పి మొదలైన లక్షణాలను ప్రేరేపిస్తుంది. కార్లో ప్రయాణిస్తున్న ప్రతిసారీ వాంతులు అవుతున్నాయి కాబట్టి పొట్టలో ఏదో సమస్య ఉందని అనుకోకూడదు. మన కళ్లు, లోపలి చెవుల నుంచి మెదడుకు చేరే సంకేతాల్లో గందరగోళం వల్లే ఇలా జరుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ సమస్య ఉన్నవాళ్లు కార్లో ప్రయాణిస్తున్నప్పుడు పుస్తకం చదివినా, ఫోన్‌ను స్ర్కోల్‌ చేసినా మోషన్‌ సిక్‌నెస్‌ మరింత పెరుగుతుంది. కాబట్టి ఆ అలవాట్లు మానుకోవాలి.


నియంత్రణ ఇలా...

సెన్సరీ మిస్‌మ్యాచ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి మోషన్‌ సిక్‌నెస్‌ ఎక్కువగా ఉంటుంది. అలాగే పిల్లలు, గర్భిణులు, మైగ్రెయిన్‌తో బాధపడేవారు, గతంలో ఇదే సమస్యతో ఇబ్బంది పడిన వారికి మోషన్‌ సిక్‌నెస్‌ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే...

  • ముందు సీట్లో కూర్చోవాలి

  • ఫోన్‌, పుస్తకం చూడకుండా కిటికీలో నుంచి దూరంగా కనిపించే రోడ్డు లేదా ప్రకృతినీ చూస్తూ ఉండాలి

  • తలను వెనక్కి వాల్చి ఉంచితే తలతిరుగుడు, వికారం తగ్గుతాయి

  • కారు కిటికీలు తెరిచి ఉంచినా సమస్య తగ్గుతుంది

  • ప్రయాణానికి ముందు భారీ భోజనం చేయకూడదు. తేలికపాటి ఆహారం తీసుకోవాలి

  • తరచూ మోషన్‌ సిక్‌నెస్‍కు గురయ్యేవారు, సమస్యను నివారించే మందులు తీసుకోవచ్చు

డాక్టర్‌ రాజేష్‌

ఇంటర్నల్‌ మెడిసిన్‌, హైదరాబాద్‌.

ఇవి కూడా చదవండి:

20 బంతుల్లోనే శ్రేయాంక పాటిల్ హాఫ్ సెంచరీ.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తుందా?

రూ. 3,700 కోట్ల డీల్.. కేకేఆర్‌లో తన సగం వాటా విక్రయించిన జూహీ చావ్లా భర్త!

Updated Date - Nov 19 , 2026 | 03:33 AM