Share News

నిదురపోరా తమ్ముడా

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:50 AM

‘రోజుకు తొమ్మిది గంటలు నిద్రపోతే ఇక నువ్వు జీవించేదెప్పుడు?’ అంటూ ఒక సందర్భంలో సద్గురు, హిందీ నటి ఆలియాభట్‌తో సరదాగా హాస్యమాడారు. నిజానికి ఎంత ఎక్కువ సమయం..

నిదురపోరా తమ్ముడా

స్లీప్‌ ఫ్యాక్ట్స్‌

‘రోజుకు తొమ్మిది గంటలు నిద్రపోతే ఇక నువ్వు జీవించేదెప్పుడు?’ అంటూ ఒక సందర్భంలో సద్గురు, హిందీ నటి ఆలియాభట్‌తో సరదాగా హాస్యమాడారు. నిజానికి ఎంత ఎక్కువ సమయం నిద్రపోతే ఆరోగ్యానికి అంత మేలు జరుగుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. ఎంతోమంది ప్రముఖులు నిద్రకే అధిక ప్రాఽధాన్యం ఇస్తూ ఉంటారు.

నిద్రాహారాలు మానుకుని, అహర్నిశలు కష్టపడి ఎత్తుకు ఎదిగినట్టు ఎంతో మంది నోట వింటూ ఉంటాం. కానీ నిజానికి జీవితంలో విజయం సాధించిన అనేక మంది ప్రముఖుల విజయ రహస్యం వారి నిద్రలోనే దాగి ఉంటుంది. అనేక క్రీడా, సినీ ప్రముఖులు రోజులో ఏకంగా 9 నుంచి 12 గంటలు నిద్రకే కేటాయిస్తూ ఉంటారు.

ఆలియా భట్‌

ఈ బాలీవుడ్‌ భామ క్రమం తప్పకుండా ప్రతి రోజూ 9 గంటలు నిద్రకు కేటాయిస్తుంది.

రోజర్‌ ఫెదరర్‌

ఈ టెన్నిస్‌ దిగ్గజం పగలు, రాత్రి కలిపి రోజు మొత్తంలో ఏకంగా 12 గంటలు నిద్రకు కేటాయిస్తాడు. టెన్నిస్‌లో తాను నంబర్‌ వన్‌ ర్యాంకింగ్‌లో సుదీర్ఘ కాలం పాటు కొనసాగడానికీ, అనేక గ్రాండ్‌స్లామ్స్‌ గెలుచుకోడానికీ నిద్ర తనకు తోడ్పడిందని పలు సందర్భాల్లో పేర్కొన్నాడు ఫెదరర్‌.

క్రిస్టినో రొనాల్డొ

ఈ ప్రపంచప్రఖ్యాత ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు నిద్ర కోసం కచ్చితమైన క్రమశిక్షణను పాటిస్తాడు. నిద్ర నిపుణుడు, నిక్‌ లిటిల్‌హేల్స్‌ సూచన మేరకు, ఏకబిగిన 8 గంటల నిద్రకు బదులుగా, ప్రతి రోజూ 90 నిమిషాలకు తగ్గకుండా 5 సార్లు నిద్రపోతాడు రొనాల్డొ. అలాగే నిద్ర కోసం ఇతను ఫీటల్‌ పొజిషన్‌ను అనుసరిస్తాడు. గర్భంలో పెరిగే పిండం కాళ్లు ముడుచుకుని నిద్రపోతుంది. ఈ భంగిమలో కంటి నిండా నిద్ర పడుతుందని పరిశోధనల్లో రుజువైంది. కాబట్టి రొనాల్డొ ఇదే నిద్రా భంగిమను అనుసరిస్తాడు.


కమ్మని నిద్ర కోసం...

నిద్ర పట్టకపోతే పగటి నిద్రతో సరిపెట్టవచ్చని అనుకుంటాం. వరుసగా రోజుల తరబడి నిద్ర కరువవుతున్నా, ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోం! కానీ నిద్రలేమిని కూడా ఆరోగ్య సమస్యగానే పరిగణించాలి. కమ్మని నిద్ర కోసం కొన్ని నియమాలు పాటించాలి. అవేంటంటే....

టైమ్‌టేబుల్‌: భోజనానికీ, ఇతరత్రా పనులకూ ఎలాగైతే టైమ్‌టేబుల్‌ను అనుసరిస్తామో, అలాగే నిద్రకూ వేళలు కచ్చితంగా పాటించాలి. ఏడున్నర నుంచి ఎనిమిది గంటల నిడివి ఏర్పాటు చేసుకుని, అందుకు తగిన సమయాలను ఫిక్స్‌ చేసుకుని అనుసరించాలి.

రాత్రి భోజనం: నిద్రకు రెండు గంటల ముందే రాత్రి భోజనం ముగించాలి.

సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌: ఇవి వెలువరించే నీలం వెలుగు నిద్రకు తోడ్పడే మెలటోనిన్‌ అనే రసాయనం ఉత్పత్తిని తగ్గిస్తుంది. దాంతో నిద్ర తగ్గుతుంది. కాబట్టి నిద్రకు రెండు గంటల ముందు సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండాలి.

వ్యాయామం: ఆదమరిచి నిద్ర పట్టాలంటే శరీరం ఎంతో కొంత అలసటకు లోనవ్వాలి. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా అవసరమే! అయితే వ్యాయామంతో శరీరం వేడిగా ఉన్న స్థితిలో నిద్ర పట్టదు. కాబట్టి సాయంత్రం వ్యాయామం చేసే అలవాటు ఉన్నవాళ్లు నిద్ర సమయానికి రెండు గంటల ముందే ముగించాలి.

22 నుంచి 24 డిగ్రీలు: పడగ్గదిలో ఉష్ణోగ్రత 22 నుంచి 24 డిగ్రీల మధ్య ఉంటే త్వరగా నిద్రలోకి జారుకుంటాం. కాబట్టి పడగ్గదిలో ఏసి ఉంటే, అలా పెట్టుకోవాలి.

అలారం: ఫోన్‌ లేదా, గడియారాల్లో రిపీటెడ్‌ అలారం పెట్టుకోకూడదు. ఎలాంటి అలారం అవసరం లేకుండా ఉదయం ఒకే సమయానికి మెలుకువ వచ్చేలా అలవాటు చేసుకోవాలి.

పడగ్గది: పడగ్గదిని నిద్రకే

ఉపయోగించాలి తప్ప ఆఫీసు పనులకు, ఇతరత్రా ఇండోర్‌ గేమ్స్‌కూ ఉపయోగించకూడదు. బెడ్‌రూమ్‌లో టివి ఉండకూడదు. నిద్రకు గంట ముందు బెడ్‌రూమ్‌లో బెడ్‌లైట్‌ ఆన్‌ చేసి పెట్టుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే, బెడ్‌రూమ్‌ నిద్ర కోసమే అనే జ్ఞాపకం మెదడులో క్షిప్తమవుతుంది. దాంతో బెడ్‌రూమ్‌లోకి అడుగు పెట్టిన వెంటనే నిద్ర పడుతుంది.

ఈ వార్తలనూ చదవండి:

అంతరిక్ష రంగంలో చైనా మరో అద్భుతం.. కేవలం 2 రోజుల్లో..

హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..

Updated Date - Sep 22 , 2026 | 04:50 AM