క్యాన్సర్ రక్ష ఇలా...
ABN , Publish Date - Sep 22 , 2026 | 04:46 AM
క్యాన్సర్ వ్యాధి, అకస్మాత్తుగా తట్టుకోలేనంత బాధతో కుప్పకూల్చేసి, తన ఉనికిని చాటుకోదు. సాధారణంగా ఈ వ్యాధి మనం నిర్లక్ష్యం చేసే ఒక చిన్న అసౌకర్యంతో మొదలవుతుంది....
క్యాన్సర్ కేర్
క్యాన్సర్ వ్యాధి, అకస్మాత్తుగా తట్టుకోలేనంత బాధతో కుప్పకూల్చేసి, తన ఉనికిని చాటుకోదు. సాధారణంగా ఈ వ్యాధి మనం నిర్లక్ష్యం చేసే ఒక చిన్న అసౌకర్యంతో మొదలవుతుంది. కాబట్టి క్యాన్సర్ హెచ్చరికలను ప్రారంభంలో కనిపెట్టాలి. అవేంటంటే....
పెద్దపేగు క్యాన్సర్: మలంలో రక్తం కనిపిస్తుంది లేదా మలం నల్లగా మారుతుంది. సాధారణంగా ఈ లక్షణాలను పైల్స్‌కు ఆపాదిస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ రక్తస్రావానికి పెద్దపేగులో పెరిగే కణితి కారణం కావచ్చు. కాబట్టి 40 ఏళ్లు పైబడిన వాళ్లు ఈ లక్షణం కనిపించిన వెంటనే వైద్యులను కలవాలి.
లంగ్ క్యాన్సర్: రెండు వారాలకు పైగా దగ్గు వేధిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కఫంలో రక్తం కనిపించవచ్చు. సాధారణంగా కొందరు ఈ లక్షణాన్ని స్మోకర్స్ కాఫ్‌గా పొరబడుతూ ఉంటారు. లేదా అలర్జీగా భావించి సర్దుకుపోతూ ఉంటారు. కానీ సాధారణ దగ్గు కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. కానీ తగ్గకుండా వారాల తరబడి వేధిస్తూ, దగ్గినప్పుడు రక్తం బయటకొస్తుంటే ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి.
రొమ్ము క్యాన్సర్: రొమ్ముల్లో గడ్డలు, సొట్టలు, ఆకారం కోల్పోయిన చనుమొనలు రొమ్ము క్యాన్సర్ ప్రధాన లక్షణాలు. కానీ చాలా మంది మహిళలు దాన్నొక సాధారణ సిస్ట్‌లా భావించి, దానంతట అదే తగ్గిపోతుందని అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉండవచ్చు. చాలా గడ్డలు క్యాన్సర్ అవకపోవచ్చు. కానీ క్యాన్సర్ కాదని మనకు మనం నిర్థారించడం సరి కాదు కాబట్టి రొమ్ముల్లో తలెత్తే గడ్డలను వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.
ప్రోస్టేట్ క్యాన్సర్: తరచూ మూత్ర విసర్జన చేయవలసి రావడం, సన్నని ధార లేదా మూత్రంలో రక్తం కనిపించడం ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రధాన లక్షణాలు. సాధారణంగా పురుషులు ఈ లక్షణాలను పైబడే వయసుతో ముడిపెడుతూ ఉంటారు. కానీ మూత్ర సమస్యలు పైబడే వయసులో సహజమే అయినప్పటికీ, పెద్ద వయసులో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు కూడా పొంచి ఉంటుంది. కాబట్టి అలసత్వం పనికి రాదు.
చర్మ క్యాన్సర్: ఆకారం, పరిమాణం, రంగు మారిపోయే పుట్టుమచ్చలు చర్మ క్యాన్సర్ సంకేతాలు. కానీ చాలా మంది పుట్టుమచ్చల్లో తలెత్తే మార్పులను పెద్దగా పట్టించుకోరు. కానీ పుట్టుమచ్చల్లో మార్పును గమనిస్తే వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.
ఈ వార్తలనూ చదవండి:
అంతరిక్ష రంగంలో చైనా మరో అద్భుతం.. కేవలం 2 రోజుల్లో..
హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..