క్యాన్సర్ భూతం భోజనంలోనే...
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:40 AM
క్యాన్సర్‌లో జన్యువుల పాత్ర ఉన్నప్పటికీ, ప్రధానంగా అస్తవ్యస్థ ఆహారశైలి కూడా ఈ వ్యాధికి కీలకంగా మారుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన...
క్యాన్సర్ కేర్
క్యాన్సర్‌లో జన్యువుల పాత్ర ఉన్నప్పటికీ, ప్రధానంగా అస్తవ్యస్థ ఆహారశైలి కూడా ఈ వ్యాధికి కీలకంగా మారుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన పలు రకాల క్యాన్సర్లకు మూల కారణం ఆహారమే! కాబట్టి ఏం తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం? ఎలా వండుకుని తింటున్నాం? అనే విషయాల మీద దృష్టి పెట్టాలని అంటున్నారు వైద్యులు.
నోరూరించే పదార్థాలు అందుబాటులో ఉన్నప్పుడు నోటిని కట్టుకోవడం కష్టమే! చిటికెలో ఆర్డర్ చేసిన ఆహారం నేరుగా ఒళ్లోకి వచ్చిపడే వెసులుబాట్లు ఉండడంతో బయటి భోజనాల మీద ఎక్కువగా ఆధారపడుతున్నాం. శుద్ధి చేసిన పదార్థాల వాడకం కూడా పెరిగిపోయింది. నూనెలు, బియ్యం, గోధుమ పిండి... ఇలా ప్రతి పదార్థం ప్రాసె్‌సకు గురవుతోంది. అలాగే పిజ్జా, బర్గర్లు మొదలైన జంక్ ఫుడ్స్, పలు రకాల ఐస్‌క్రీమ్స్, పేస్ట్రీలు, చాక్లెట్లు మన మెనూల్లో చేరిపోతున్నాయి. ఇవన్నీ మన జీర్ణవ్యవస్థను అతలాకుతలం చేసేవే! తరచూ ఈ పదార్థాలను తినడం వల్ల పెద్ద పేగు, జీర్ణాశయ క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది.
పెద్దపేగు క్యాన్సర్
ఈ క్యాన్సర్‌కు ముఖ్య కారణం ప్రాసెస్డ్ ఫుడ్. లేత మాంసం, పప్పుధాన్యాలు, కూరగాయలు తక్కువగా తింటూ, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినేవాళ్లకు పెద్దపేగు క్యాన్సర్ ముప్పు ఎక్కువ. అలాగే ఈ ఆహారశైలికి అదనంగా మద్యపానం, ధూమపానం అలవాటు ఉంటే, క్యాన్సర్ ముప్పు రెట్టింపు ఉంటుంది.
జీర్ణాశయ క్యాన్సర్
ఆరోగ్యకరమైన ఆహారమేదీ ఎక్కువ కాలం నిల్వ ఉండదు. కానీ పదార్థాలు ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండడం కోసం నిల్వ పదార్థాలు జోడిస్తే, సదరు పదార్థాన్ని ప్రాసెస్ చేసిన ఆహారంగానే పరిగణించాలి. పదార్థాలు నిల్వ ఉండడం కోసం జోడించే ప్రిజర్వేటివ్స్, పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించడం కోసం కలిపే కృత్రిమ రంగులు కూడా క్యాన్సర్ కారకాలే! వీటితో జీర్ణాశయ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. స్టమక్ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్ ఈ కోవకు చెందినవే!
వ్యాయామం లోపిస్తే....
అస్తవ్యస్థ ఆహార శైలితో పాటు వ్యాయామం లోపించడం జీర్ణవ్యవస్థ సంబంధిక క్యాన్సర్లకు ప్రధాన కారణం. వారానికి ఐదు రోజుల పాటు వ్యాయామాలు చేసే వారిలో, శరీరం శక్తిని ఖర్చు చేసుకునే వేగమైన, మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉంటున్నట్టు తాజా పరిశోధనల్లో బయల్పడింది. కాబట్టి దైనందిన జీవితంలో వ్యాయామానికి చోటు కల్పించాలి.
పరీక్షలు తప్పనిసరి
పెద్ద పేగు క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవడం కోసం ముందస్తు పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. 45 ఏళ్లు దాటిన వాళ్లలో, పెద్దపేగులో పాలిప్స్ పెరుగుతాయి. దీర్ఘకాలంలో ఇవి క్యాన్సర్ ముప్పును పెంచుతాయి. కాబట్టి ఈ పాలి్‌ప్సను ప్రారంభంలోనే గుర్తించి, తొలగించుకోవడం అవసరం. కాబట్టి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ‘కొలనోస్కోపీ’ పరీక్ష చేయించుకోవాలి. పాశ్చాత్య దేశాల్లో అత్యధిక క్యాన్సర్ల జాబితాలో పెద్దపేగు క్యాన్సర్ ప్రధమ స్థానంలో ఉండేది. కానీ బోవెల్ క్యాన్సర్ స్ర్కీనింగ్ కారణంగా మొదటి స్థానంలో ఉన్న క్యాన్సర్ నేడు ఎనిమిదో స్థానానికి పరిమితమైపోయింది. కాబట్టి ఐదేళ్లకోసారి కొలనోస్కోపీ చేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ పరీక్షలో పాలిప్స్ కనిపిస్తే, వాటి పరిమాణాన్ని బట్టి రెండేళ్లు లేదా మూడేళ్లకోసారి ఈ పరీక్ష చేయించుకోవలి వస్తుంది.
కాలేయ క్యాన్సర్
వేగంగా పెరుగుతున్న క్యాన్సర్ల జాబితాలో కాలేయ క్యాన్సర్ కూడా ఉంది. మద్యపానం, ఫ్యాటీ లివర్, వైరల్ హెపటైటిస్ వల్ల కాలేయ క్యాన్సర్ పెరుగుతోంది. అయితే ఈ కారకాలన్నీ నియంత్రించదగినవే! మద్యపానం మానేయవచ్చు. ఫ్యాటీ లివర్‌ను ఆరోగ్యకరమైన ఆహారశైలితో సరిదిద్దుకోవచ్చు. హెపటైటి్‌సను ముందస్తు పరీక్షలతో కనిపెట్టవచ్చు, అందుబాటులో ఉన్న టీకాలతో అడ్డుకట్ట వేయవచ్చు.
ఏం తినాలి?
సమతులాహారం తీసుకోవాలి. మన ఆహారంలో కొవ్వులను పూర్తిగా తొలగించుకోవలసిన అవసరం లేదు. అయితే అవి పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ అయి ఉండేలా చూసుకోవాలి. పొద్దుతిరుగుడు నూనె, విత్తనాలు, వాల్‌నట్స్, సబ్జా, అవిసె గింజలు, గుమ్మడి విత్తనాలు, టోఫు, చేపల్లో ఈ కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. అలాగే అన్నం పరిమాణం తగ్గించి, మాంసకృత్తులతో కూడిన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే తినే ఆహారంలో ఖనిజ లవణాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సరిపడా ఉండేలా చూసుకోవాలి. నూనెలో వేయించిన పదార్థాలు తగ్గించాలి. నూనెలను పదే పదే వేడి చేసి వాడుకోవడం మానేయాలి. ఆకుకూరలు ఎక్కువగా తినాలి. రెడ్ మీట్ మానేయడం మంచిది.
ఈ లక్షణాల మీద కన్నేసి...
బోవెల్ హ్యాబిట్‌లో మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు. ఒకరికి రోజుకు ఒకసారి లేదా రెండుసార్లు మలవిసర్జన చేసే అలవాటు ఉండొచ్చు. ఇంకొందరు రెండు నుంచి మూడు రోజులకోసారి మలవిసర్జన చేసే అలవాటు ఉంటుంది. ఈ అలవాట్లన్నీ సహజమైనవే! అయితే ఇదే క్రమం కొనసాగకుండా, రోజుకు రెండుసార్లు వెళ్లే వ్యక్తికి రెండు రోజులకు విరోచనం అవుతున్నా, రెండు రోజులకు విరోచనం అయ్యే వ్యక్తికి రోజుకు రెండుసార్లు అవుతున్నా అప్రమత్తం కావాలి. ఇలాంటి మార్పులను తీవ్రంగా పరిగణించాలి. జీర్ణవ్యవస్థతో ముడిపడి ఉండే క్యాన్సర్లకు ఈ లక్షణాలే సూచనలు. అలాగే మలంతో పాటు రక్తం పడుతున్నా, అకారణంగా బరువు కోల్పోతున్నా, వాంతులు, పొట్టలో నొప్పి, మంట వేధిస్తున్నా అప్రమత్తం కావాలి. తింటున్నప్పుడు గొంతులో అడ్డుపడుతున్నట్టు అనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. మరీ ముఖ్యంగా 45 ఏళ్లు దాటిన వాళ్లలో ఈ లక్షణాలు రెండు నుంచి మూడు వారాల పాటు కొనసాగితే, నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను కలవాలి. అలాగే రక్తపరీక్షతో హెపటైటి్‌సను పరీక్షించుకుంటూ ఉండాలి. పరీక్షలో హెపటైటిస్ లేదని తేలితే, వ్యాక్సిన్ వేయించుకోవాలి. కాలేయ పనితీరును నిర్థారించుకోవడం కోసం లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి. ప్యాంక్రియాటిస్ క్యాన్సర్ వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. ఈ కోవకు చెందిన వాళ్లు అప్రమత్తంగా ఉండాలి. అలాగే కుటుంబ చరిత్రలో ఏ రకమైన క్యాన్సర్ ఉన్నా, ఆ కుటుంబీకులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి.
డాక్టర్ నవీన్ పోలవరపు
సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్,
అడ్వాన్స్‌డ్ థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్
అండ్ ఎండోసోనాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్
ఇవీ చదవండి:
పైలట్ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!
టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!