రొమ్ము క్యాన్సర్‌ను జయిద్దాం
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:42 AM
అవగాహన మాసంగా గుర్తిస్తారు. భారతదేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్టు ఒక అంచనా! అవగాహనా లోపం...
ప్రతి ఏడాదీ అక్టోబరు నెలను రొమ్ము క్యాన్సర్
అవగాహన మాసంగా గుర్తిస్తారు. భారతదేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్టు ఒక అంచనా! అవగాహనా లోపం, సమర్థవంతమైన జనాభా ఆధారిత స్ర్కీనింగ్ కార్యక్రమాల కొరత కారణంగా రొమ్ము క్యాన్సర్‌గా నిర్థారణ అయిన ప్రతి ఇద్దరు రోగుల్లో ఒకరు మరణిస్తున్నారు. ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోతోంది. పాశ్చాత్య దేశాల్లో 50 ఏళ్ల తర్వాత ఈ వ్యాధి కనిపిస్తే, మన దేశంలో 40 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల్లోనే ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి.
రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం
రొమ్ము క్యాన్సర్ నిర్థారణ, చికిత్సలు సవాలుతో కూడుకుని ఉంటాయి. తమకు రొమ్ము క్యాన్సర్ రావొచ్చనే ఆలోచన చాలా మంది యువతులకు ఉండదు. దాంతో రొమ్ములో తలెత్తే మార్పులను పెద్దగా పట్టించుకోరు. ఫలితంగా వ్యాధి నిర్థారణ ఆలస్యం కావచ్చు. వయసు పైబడిన మహిళలతో పోల్చితే యువతుల్లో రొమ్ము కణజాలం దళసరిగా ఉంటుంది. దాంతో మామోగ్రామ్ ద్వారా ప్రారంభ దశలోని సూక్ష్మ మార్పులను పసిగట్టడం క్లిష్టమవుతుంది. అలాగే యువతుల్లో తలెత్తే రొమ్ము క్యాన్సర్ ఉధృతంగా ఉండవచ్చు. వివిధ చికిత్సలకు స్పందించే అవకాశం తక్కువగా ఉండవచ్చు. దాంతో వ్యాధి నిర్థారణ తర్వాత ఫలితాలు ప్రతికూలంగా ఉండే ప్రమాదం ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ నిర్థారణ అయిన యువతులు ఆ విషయాన్ని జీర్ణించుకోలేరు. దాంతో తీవ్రంగా కుంగిపోతారు. క్యాన్సర్ వ్యాధి శరీరంతో పాటు మనసును కూడా కబళిస్తుంది. కాబట్టి శరీరంతో పాటు మనసుకూ చికిత్స అవసరమవుతుంది. చిన్న వయసులో రొమ్ము క్యాన్సర్ బారిన పడిన యువతులు ఎదుర్కొనే సమస్యలు, వయసు పైబడిన రొమ్ము క్యాన్సర్ బాఽధితుల సమస్యలకు భిన్నంగా ఉంటాయి. కాబట్టి కౌన్సెలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. కౌన్సెలింగ్‌తో రోగితో పాటు ఆమె కుటుంబ సభ్యులను వ్యాధితో పోరాటానికి సర్వసన్నద్ధం చేయవచ్చు. ప్రతి దశలో వ్యాఽధిపై నియంత్రణ ఉన్న భావన కలిగించవచ్చు. సానుకూల దృక్పథం కలిగిన రోగుల్లో చికిత్స ఫలితం మెరుగ్గా ఉంటుంది.
గర్భిణుల్లో క్యాన్సర్
కొందరు మహిళల్లో గర్భిణిగా ఉన్న సమయంలో లేదా ప్రసవానంతరం రొమ్ము క్యాన్సర్ నిర్థారణ అవుతుంది. మిగతా సమయాలతో పోల్చితే, గర్భిణిగా ఉన్న సమయంలో తలెత్తే రొమ్ము క్యాన్సర్ మరింత దూకుడుగా ఉంటుందని నిరూపించే ఆధారాలేవీ లేవు. అయితే గర్భిణుల్లో కాన్సర్ గుర్తింపు క్లిష్టంగా ఉండడంతో ఈ కోవకు చెందిన మహిళల్లో వ్యాధి నిర్థారణ ఆలస్యం కావచ్చు. గర్భిణిగా ఉన్న సమయంలో అందించే చికిత్స, వ్యాధి దశ, గర్భిణి దశల ఆధారంగా చికిత్సను అందిస్తారు. చికిత్స అందించే వైద్య బృందం, సదరు మహిళకు చికిత్స అందించే ప్రసూతి వైద్యుల సమన్వయంతో పని చేయడం ఎంతో ముఖ్యం. రొమ్ము క్యాన్సర్ చికిత్సలు సంతానోత్పత్తిని ప్రభావితం చేయవచ్చు. కాబట్టి చికిత్సకు ముందే సంతానోత్పత్తి సామర్థ్యం కుంటుపడే అవకాశాన్ని రోగితో పాటు ఆమె భాగస్వామికి వివరించి, అవసరాన్ని బట్టి, ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించేలా చేయడం క్యాన్సర్ వైద్యుల బాధ్యత.
జుట్టు రాలకుండా...
క్యాన్సర్ చికిత్స దుష్ప్రభావాల్లో జుట్టు రాలడం సహజం. కాబట్టి చికిత్సకు ముందే అవగాహన కలిగించి, అవసరమైతే విగ్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. దీంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రస్తుతం జుట్టును సంరక్షించుకోవడం కోసం కీమోథెరపీ సమయంలో ‘కోల్డ్ క్యాప్స్, స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్స్ లాంటి పద్ధతులు అందుబాటులోకొచ్చాయి. కొందరు మహిళలకు రొమ్మును పూర్తిగా తొలగించే మాస్టెక్టమీ అవసరమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో రొమ్ము పునర్నిర్మాణం కూడా సాధ్యపడుతుంది. క్యాన్సర్ చికిత్సలో సాధించిన ఆధునిక పురోగతి ఫలితంగా, అత్యుత్తమ సౌందర్య ఫలితాలతో కూడిన రొమ్మును కాపాడే చికిత్స సాధ్యపడుతోంది. ఇందుకోసం పలు రకాల ఆంకోప్లాస్టిక్ శస్త్రచికిత్సా పద్ధతులు ఉపయోగపడుతున్నాయి. ఆంకోప్లాస్టిక్ సర్జరీలో క్యాన్సర్‌ను తొలగించడంతో పాటు, రొమ్ములో ఏర్పడిన లోపాన్ని రొమ్ములోని కణజాలంతో పాక్షికంగా పునర్నిర్మించి సాధ్యమైనంత మెరుగైన సౌందర్య ఫలితాన్ని సాధించవచ్చు.
కృత్రిమ మేధస్సు తోడ్పాటుతో...
క్యాన్సర్ వ్యాధి... మన జీవనశైలినీ, ఆలోచనా విధానాన్నీ, జీవితం పట్ల మనకున్న దృక్పథాన్ని మార్చుకోవలసిన అవసరాన్ని సూచించే ఒక సంకేతం. భయంలో, అనిశ్చితిలో కుంగిపోకుండా ఉండగలిగితే క్యాన్సర్ మీద విజయం సాధించడం సులభమే! హైదరాబాద్‌కు చెందిన రొమ్ము క్యాన్సర్ అవగాహన కోసం పనిచేస్తున్న లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, ఎన్‌ఎఆర్‌ఐ (నేషనల్ అవేర్‌నెస్ అండ్ రిసోర్స్ ఇనిషియేటివ్ ఫర్ బ్రెస్ట్ హెల్త్) అనే ఎఐ ఆధారిత కార్యక్రమాన్ని పరిచయం చేసింది. భాష, భౌగోళిక పరిమితులతో సంబంధం లేకుండా, రొమ్ము ఆరోగ్యం, రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
డాక్టర్ పి. రఘురామ్
పద్మశ్రీ అండ్ డా. బి.సి.రాయ్ నేషనల్ అవార్డు గ్రహీత,
ఫౌండర్ అండ్ ఛైర్మన్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, హైదరాబాద్.
ఇవి కూడా చదవండి..
బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..
మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..