అపోహలు తొలగించి సాధికారత వైపు
ABN , Publish Date - Apr 27 , 2026 | 02:58 AM
మహిళలకు సర్వసాధారణమైన రుతుక్రమం వారిని చదువుకు, ఉపాధికి దూరం చేస్తోందనే వాస్తవం సురభి కుమార్‌ను కొత్తదారిలో నడిపించింది. బిహార్ గ్రామీణ ప్రాంతాల్లో...
మహిళలకు సర్వసాధారణమైన రుతుక్రమం వారిని చదువుకు, ఉపాధికి దూరం చేస్తోందనే వాస్తవం సురభి కుమార్‌ను కొత్తదారిలో నడిపించింది. బిహార్ గ్రామీణ ప్రాంతాల్లో ఆమె సాగిస్తున్న కృషి ముప్ఫై వేలమందికి పైగా మహిళలు, బాలికల్లో అవగాహనను, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ‘‘శరీరంలో సంభవించే మార్పులు, వాటికి కారణాల గురించి బోధన... అక్షరాస్యతలో ప్రధానమైన భాగం కావాలి’’ అంటున్న సురభి ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే...
‘‘మహిళా సాధికారతలో మన దేశం సాధిస్తున్న పురోగతి గురించి గొప్పగా చెప్పుకుంటాం. కానీ అర్థంలేని నమ్మకాలు, కట్టుబాట్లు, ఆంక్షల మధ్య నలిగిపోతున్న మహిళలు మన దేశంలో ఇప్పటికీ కోట్ల సంఖ్యలో ఉన్నారు. నేను కూడా అలాంటి నేపథ్యం నుంచే వచ్చాను. మాది బిహార్ రాష్ట్రంలోని గయ. అమ్మాయిలు హద్దుల్లో ఉండాలి. చీకటి పడ్డాక బయటకు వెళ్ళకూడదు. అన్ని విషయాల్లోనూ సర్దుకుపోవాలి.. బడికి వెళ్ళే వయసు వచ్చేసరికి ఇవన్నీ జీవితంలో భాగమైపోతాయి. అలాగే... నెలసరి అనేది రహస్యంగా ఉంచాల్సిన విషయం. దాని గురించి ఎవరితోనూ మాట్లాడకూడదు’ అనేది కచ్చితంగా పాటించాల్సిన నియమం. వీటన్నిటినీ దాటి... సాటి మహిళల్లో చైతన్యం కలిగించే దశకు చేరుకోవడానికి ఎంతో దూరం ప్రయాణం సాగించాను.
రెండుసార్లు ఇంటర్ తప్పాను
నన్ను డాక్టర్‌నో, ఇంజనీర్‌నో చేయాలనేది నా తల్లిదండ్రుల కల. పోటీ పరీక్షలకు మంచి శిక్షణ లభిస్తుందనే ఉద్దేశంతో రాజస్థాన్‌లోని కోటాలో ఇంటర్‌లో నన్ను చేర్పించారు. ఒత్తిడి కారణంగా రెండుసార్లు ఇంటర్ ఫెయిలైపోయాను. ఇంటర్ పూర్తి చేశాక పట్నాలో జర్నలిజం కోర్సు చేశాను. అందులో భాగంగా... ‘అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్’తో కలిసి ఒక ప్రాజెక్ట్ చేశాను. కొన్ని సంస్థల్లో పాత్రికేయురాలిగా పనిచేశాను. అప్పుడే ‘సమర్ధ్’ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న ప్రభాత్‌తో పరిచయమయింది. బిహార్‌లోని చిన్నకారు, సన్నకారు రైతుల కోసం ఆ సంస్థ పని చేస్తోంది. ప్రభాత్ ఆశయాలు నన్ను ఆకర్షించాయి. మేము వివాహం చేసుకున్నాం. ఉద్యోగం మానేసి నా భర్త సంస్థకే పూర్తి సమయం కేటాయించాను.
అపోహలు తొలగేలా...
‘సమర్ధ్’ తరఫున విస్తృతంగా పర్యటించినప్పుడు... మన గ్రామీణ ప్రాంతాల్లోని దుర్భర వాస్తవాలు నాకు మరింత స్పష్టంగా అర్థమయ్యాయి. నెలసరి సమయంలో ఒకే పాత వస్త్రాన్ని సరిగ్గా ఉతక్కుండా, ఆరబెట్టకుండా ఉపయోగించే మహిళలను కలుసుకున్నాను. కూలి పనికి, పంట కోతలకు వెళ్ళే మహిళలు పీరియడ్స్ కాలంలో ఇల్లు దాటి బయటకు రారు. అలాగే... నెలసరి సాకు చెబుతారంటూ కొందరు వారిని పనిలో పెట్టుకోరు. తమ శరీరంలో వచ్చే ఈ మార్పుకు కారణాలేమిటో చాలామంది మహిళలకు తెలీదు. దీన్ని ఒక పాపంగానో, నేరంగానో భరిస్తూ... అపరాధ భావంతో బతుకుతున్న మహిళలు, బాలికల దుస్థితిని చూశాక నేను ఏం చేయాలో అర్థమయింది. ‘సమర్ధ్’కు అనుబంధంగా ‘సబల’ అనే విభాగాన్ని ఏర్పాటు చేశాను. నేను, మరికొందరు వాలంటీర్లు కొన్ని వందల గ్రామాలు సందర్శించాం. పొలాల్లో, సామాజిక కేంద్రాల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో మహిళలను కలిశాం. వారి సమస్యలు తెలుసుకున్నాం. రుతుక్రమం పట్ల వారికి ఉన్న అపోహలను తొలగించడం కోసం... (పీరియడ్‌శాల’ పేరిట సమావేశాలు నిర్వహించాం. నెలసరి సమయంలో పాటించాల్సిన శుభ్రత, సంరక్షణ గురించి వివరించాం. స్కూళ్లలో బాలికలకు పీరియడ్స్ మీద అవగాహన కల్పించాం.
అదే నా ఆశయం...
గ్రామీణ మహిళలకు శానిటరీ ప్యాడ్స్ అందుబాటు తక్కువ. వాటికి అయ్యే ఖర్చు భరించే సామర్థ్యం కూడా ఉండదు. అందుకే నా కుటుంబ సభ్యులు, మిత్రుల సహకారంతో పూర్తి ఆటోమేటిక్ శానిటరీ ప్యాడ్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశాను. ఆరు ప్యాడ్స్ తయారీకి 42 రూపాయలు ఖర్చవుతుంది. వాటిని పాతిక రూపాయలకే ఇస్తున్నాం. అది కూడా చెల్లించలేనివారికి ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ఇప్పటివరకూ మా కార్యక్రమాల ద్వారా పాతికవేల మందికి పైగా మహిళలు, దాదాపు అయిదువేల మంది బాలికలు ప్రయోజనం పొందారు. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. నెలసరి గురించి మాట్లాడడం తప్పు కాదని అర్థమయింది. అదే మేము ఆశించిన మార్పు. మా కృషికి అధికారుల నుంచి, ప్రభుత్వం నుంచి ప్రశంసలు లభించాయి. ప్రతినెలా కొన్ని కొత్త గ్రామాలకు మా కార్యక్రమాలను విస్తరిస్తున్నాం. ‘సబల’ అంటే ‘సాధికారత కలిగిన మహిళ’ అని అర్థం. అందరు మహిళలను సబలలుగా మార్చాలనేదే నా ఆశయం.
ఈ వార్తలు కూడా చదవండి..
అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖకు చోటు
రుద్రంపేట ఘటనపై రాయపాటి శైలజ ఆరా
For More AP News And Telugu News