Share News

మెదడులో కణుతులు-లక్షణాలు

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:20 AM

సాధారణంగా బ్రెయిన్‌ ట్యూమర్‌లో... మూర్ఛ, భరించలేని తలనొప్పులనే ప్రధాన లక్షణాలుగా భావిస్తూ ఉంటాం! కానీ మెదడు కణుతుల ప్రారంభ లక్షణాలు...

మెదడులో కణుతులు-లక్షణాలు

మీకు తెలుసా

సాధారణంగా బ్రెయిన్‌ ట్యూమర్‌లో... మూర్ఛ, భరించలేని తలనొప్పులనే ప్రధాన లక్షణాలుగా భావిస్తూ ఉంటాం! కానీ మెదడు కణుతుల ప్రారంభ లక్షణాలు గుర్తుపట్టే వీల్లేనంత సహజంగా, క్రమేపీ మన దైనందిన జీవితంలో ఒక భాగంగా మారిపోయి, నెలల తరబడి కొనసాగుతాయంటున్నారు వైద్యులు.

అసాధారణంగా చికాకుకు లోనవడం, సమావేశాల్లో ఏకాగ్రత లోపించడం లాంటి లక్షణాలు కూడా మెదడు కణుతుల లక్షణాలే! చాలా మంది ఈ లక్షణాలను నిద్రలేమికీ, ఆధునిక జీవనశైలి తాలూకు ఒత్తిడికీ ఆపాదిస్తూ ఉంటారు. కానీ లక్నోలోని డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స న్యూరోసర్జరీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌, ప్రొఫెసర్‌, డాక్టర్‌ దీపక్‌ కుమార్‌ సింగ్‌, బ్రెయిన్‌ ట్యూమర్‌ లక్షణాలు, ప్రవర్తన మార్పుల ద్వారా బయల్పడుతూ ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మెదడులో కణితి పెరిగినప్పుడు, ఆ ప్రదేశం ఆధారంగా భిన్నమైన లక్షణాలు బయల్పడుతూ ఉంటాయి. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి, ఒక్కసారిగా ఏకాంత సమయం గడుపుతున్నా, ప్రశాంత స్వభావం కలిగిన వ్యక్తి కోపిష్ఠిలా ప్రవర్తిస్తున్నా నిర్లక్ష్యం చేయకూడదు. ఈ మార్పులన్నిటినీ, పైబడే వయసుకూ, ఒత్తిడికీ ఆపాదించకుండా వెంటనే అప్రమత్తమై వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలంటున్నారు డాక్టర్‌ దీపక్‌.

మాటలు దొరకని పరిస్థితి

ప్రవర్తనా మార్పులతో పాటు కొందర్లో సంభాషణ సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. సంభాషించేటప్పుడు సాధారణ పదాల కోసం వెతుక్కోవడం, సంభాషణ మధ్యలో దేని గురించి మాట్లాడుతున్నారో మర్చిపోవడం, చర్చలను కొనసాగించడంలో సమస్యలు ఎదుర్కోవడం లాంటి లక్షణాలు కూడా మెదడు కణితి పెరుగుదలను సూచిస్తాయి. అలాగే కొందరు సంతులనాన్ని కోల్పోతూ ఉంటారు. దృష్టి లోపాలను ఎదుర్కొంటారు. ఇంకొందర్లో రోజు రోజుకూ చురుకుదనం తగ్గిపోతూ ఉంటుంది. రోజువారీ దినచర్యలు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. పని సామర్థ్యం సన్నగిల్లుతుంది. డెడ్‌లైన్స్‌ మర్చిపోతూ ఉంటారు. రోజువారీ బాధ్యతలు మరింత భారంగా మారిపోతాయి. అయితే ఈ లక్షణాలన్నీ రాత్రికి రాత్రే తలెత్తవు. క్రమేపీ, ఎంతో నెమ్మదిగా తీవ్రమవుతూ ఉంటాయి. సాధారణంగా ఇలాంటి లక్షణాలను రోగులతో పాటు కుటుంబ సభ్యులు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.


అత్యాధునిక చికిత్సలు అందుబాటులో...

పైన పేర్కొన్న లక్షణాలన్నిటినీ మెదడు కణుతులనే సూచించవు. విపరీతమైన ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి, ఇతరత్రా నాడీ సమస్యల్లో కూడా ఇవే లక్షణాలు బయల్పడుతూ ఉంటాయి. అయితే లక్షణాలు క్రమేపీ తీవ్రమవుతూ, వివరించడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి. న్యూరోసర్జరీలో పురోగతులు బ్రెయిన్‌ ట్యూమర్ల చికిత్సను సులభతరం చేస్తున్నాయి. ఆధునిక విధానాల ఆసరాతో వైద్యులు మెదడులోని కణుతులను కచ్చితంగా గుర్తించి, మరింత కచ్చితత్వంతో కణజాలాన్ని తొలగించగలుగుతున్నారు. ఫ్లోరెసెన్స్‌ గైడెడ్‌ ఇమేజింగ్‌, అలా్ట్రసోనిక్‌ యాస్పిరేటర్స్‌ మొదలైన అధునాతన సాంకేతికతలు, ఆరోగ్యకరమైన మెదడు కణజాలం దెబ్బతినకుండా జబ్బుపడిన కణజాలాన్ని తొలగించడానికి సహాయపడుతున్నాయి. అయితే లక్షణాల ఆధారంగా ప్రారంభ దశలోనే కణుతులను కనిపెట్టి, సత్వర చికిత్స అందించగలిగితే, చికిత్సా ఫలితం మరింత మెరుగ్గా ఉంటుందనీ, జీవన నాణ్యత సంతృప్తికరంగా ఉంటుందనీ భరోసా ఇస్తున్నారు డాక్టర్‌ సింగ్‌.

ఈ వార్తలనూ చదవండి:

బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్

’ఫర్జీ’ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు

Updated Date - Oct 27 , 2026 | 05:20 AM