బ్రెయిన్ ట్యూమర్ మరణశాశనం కాదు
ABN , Publish Date - Jun 23 , 2026 | 06:06 AM
పిల్లల మెదళ్లలో కణుతుల చికిత్స నేడు అత్యంత సులభతరం. కాబట్టి బ్రెయిన్ ట్యూమర్ అనగానే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోకుండా లక్షణాల ఆధారంగా వైద్యులను సంప్రతించి...
మెదడు క్యాన్సర్
పిల్లల మెదళ్లలో కణుతుల చికిత్స నేడు అత్యంత సులభతరం. కాబట్టి బ్రెయిన్ ట్యూమర్ అనగానే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోకుండా లక్షణాల ఆధారంగా వైద్యులను సంప్రతించి, సత్వర చికిత్సలను ఆశ్రయించాలని అంటున్నారు వైద్యులు.
పిల్లల్లో మెదడు కణుతులకు నిర్దిష్టమైన కారణాలంటూ ఉండవు. కొన్ని కుటుంబాల్లో జన్యుపరమైన కారణాల వల్ల మెదడు కణుతులు కొనసాగుతూ ఉంటాయి. అయితే అన్ని క్యాన్సర్లలాగే మెదడు క్యాన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించడం కీలకం. అందుకోసం పిల్లల్లో కొన్ని కీలకమైన లక్షణాలను గమనించాలి. అయితే పిల్లలు వాళ్లను బాధించే సమస్యల గురించి బయటకు తెలియపరచరు. తలనొప్పి వేధిస్తున్నా, మౌనంగా బాధపడతారే తప్ప, దాన్నొక సమస్యగా గుర్తించి, పెద్దల దృష్టికి తీసుకురారు. కాబట్టి పెద్దలే అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి. మెదడు క్యాన్సర్‌లో కొన్ని ప్రధాన లక్షణాలు బయల్పడుతూ ఉంటాయి. అవేంటంటే....
తలనొప్పి వేధిస్తూ ఉంటుంది
కొందరు పిల్లలు రాత్రుళ్లు సరిగా నిద్రపోలేరు
జ్వరం వేధిస్తూ ఉంటుంది
రాత్రుళ్లు తరచూ ఏడుస్తూ నిద్ర లేస్తూ ఉంటారు
నడుస్తూ నడుస్తూ కింద పడిపోతూ ఉంటారు
అదేపనిగా వాంతులు చేసుకుంటూ ఉంటారు
కళ్లు కిందకు, పైకి, లేదా పక్కలకు తిరిగిపోతూ ఉంటాయి
మూర్ఛలు కూడా వేధిస్తాయి
తల పరిమాణం అసాధారణంగా...
రెండేళ్ల లోపు పిల్లల్లో మెదడు క్యాన్సర్ ఉన్నప్పుడు, ఆ పిల్లల తల పరిమాణంపరంగా అసాధారణంగా పెరిగిపోతుంది. అప్పుడే పుట్టిన పసికందులకు మూడు నెలల వయసొచ్చేవరకూ, వాళ్ల తల నెలకు రెండు సెంటీమీటర్ల మేరకు పెరుగుతూ ఉండాలి. ఆ తర్వాత మూడు నుంచి నాలుగు నెలల పాటు ఒక సెంటీమీటరు మేరకు పెరుగుతుంది. తర్వాత ఆరు నెలల పాటు నెలకు 0.5 సెంటీమీటర్ల మేరకు పెరుగుతుంది. పుట్టుకతో 35 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన పసికందుల తలలు ఏడాది వయసొచ్చేటప్పటికి 45 సెంటీమీటర్ల మేరకు పెరగాలి. రెండేళ్ల వయసుకు చేరుకునేటప్పటికి 48 నుంచి 50 సెంటీమీటర్లకు పెరగాలి. పిల్లల తలలు ఈ కొలతలకు భిన్నంగా పెరిగిపోయినప్పుడు, మెదడులో సమస్య ఉన్నట్టు గుర్తించాలి.
పుట్టిన వెంటనే సర్జరీ
తల్లి గర్భంలో పెరుగుతున్నప్పటి నుంచి ఏడాది, రెండు లేదా మూడేళ్లు, 14 ఏళ్ల వరకూ పిల్లల్లో మెదడు క్యాన్సర్లను గమనించవచ్చు. తల్లి గర్భంలో పెరిగే బిడ్డకు మెదడు క్యాన్సర్ ఉన్నట్టు తెలిపే పరీక్ష, 4డి అలా్ట్రసౌండ్. ఈ పరీక్షలో బిడ్డకు మెదడు క్యాన్సర్ ఉందని తేలితే, ఎమ్మారై చేసి నిర్థారించుకోవచ్చు. సాధారణంగా 6, 7 నెలల గర్భంలో ఎమ్మారై చేస్తూ ఉంటారు. అంతకంటే ముందు అల్ట్సాసౌండ్‌తో సమస్యను గుర్తించవచ్చు. కడుపులో పెరిగే నాలుగు నుంచి ఐదు నెలల పిండంలో ట్యూమర్ ఉన్నట్టు పరీక్షలో తేలితే, అబార్షన్ చేయక తప్పదు. అంతకంటే ఎక్కువ నెలల్లో ఈ సమస్య ఉన్నట్టు తేలితే, ప్రెగ్నెన్సీని కొనసాగించి, పుట్టిన బిడ్డకు వెంటనే సర్జరీ చేసి ట్యూమర్‌ను తొలగించవచ్చు. ఒకటి నుంచి మూడేళ్ల లోపు పిల్లల్లో ట్యూమర్ ఉన్నట్టు తేలితే చికిత్సతో సమస్యను సమర్థంగా పరిష్కరించుకోవచ్చు. ఏడాది నుంచి 12 ఏళ్ల లోపు పిల్లల్లో మెదడు క్యాన్సర్ సాధ్యమైనంత త్వరగా గుర్తించి, సత్వర చికిత్స అందించగలిగితే ఆ పిల్లల ఆయుష్షు మెరుగ్గా ఉంటుంది.
వయసును బట్టి చికిత్స
మెదడులో కణితి ఉన్నప్పుడు, సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ అనే మూడు రకాల చికిత్సలను అందించాల్సి ఉంటుంది. రెండేళ్ల లోపు పిల్లలకు వైద్యులు రేడియేషన్ సూచించరు. అప్పటికి మెదడు పూర్తిగా ఎదిగి ఉండదు కాబట్టి రేడియేషన్ ఇచ్చినప్పుడు, మెదడు దెబ్బతింటుంది. కాబట్టి ప్రధానంగా సర్జరీతో ట్యూమర్‌ను తొలగించి, కీమోథెరపీ అందించవలసి వస్తుంది. రెండేళ్లు పైబడిన పిల్లలకు రేడియేషన్ కూడా ఇవ్వవచ్చు. అత్యాధునిక వైద్య చికిత్సల వల్ల దుష్ప్రభావాల తీవ్రత తగ్గింది కాబట్టి రేడియేషన్ గురించి భయపడవలసిన అవసరం లేదు. కీమోథెరపీలో టార్గెటెడ్ థెరపీలు అందుబాటులోకొచ్చాయి కాబట్టి కీమోథెరపీ ప్రభావాలు కూడా బాగా తగ్గిపోయాయి. ట్యూమర్‌కు జన్యు పరీక్ష చేపడితే సదరు పిల్లలకు టార్గెటెడ్ థెరపీ ఇవ్వవచ్చో, లేదో తెలుస్తుంది. టార్గెటెడ్ థెరపీ ఇవ్వవచ్చని తేలితే, అదనంగా, కీమో థెరపీ, రేడియేషన్ అవసరం ఉండదు.
ట్యూమర్ల దశ, రకం ఆధారంగా...
గతంతో పోల్చితే మెదడు కణుతులను మెరుగ్గా నిర్థారించగలుగుతున్నారు. ఇంతకు ముందు 2డి అలా్ట్రసౌండ్ మాత్రమే అందుబాటులో ఉంటే, నేడు 3డి, 4డి అలా్ట్రసౌండ్స్ అందుబాటులోకొచ్చాయి. అలా్ట్రసౌండ్‌తో పాటు సిటి, ఎమ్మారైలు కూడా అందుబాటులోకొచ్చాయి కాబట్టి మెదడు కణుతులను నేడు సులభంగా గుర్తించి, సత్వర చికిత్సలను అందించగలుగుతున్నారు. అన్ని క్యాన్సర్లలాగే మెదడు క్యాన్సర్‌లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. మొదటి దశలో ఉన్న క్యాన్సర్ గడ్డను గుర్తించి, తొలగించగలిగితే రేడియేషన్ కూడా అవసరం ఉండదు. రెండో దశ క్యాన్సర్‌కు కూడా సర్జరీ తదనంతర రేడియేషన్, కీమో అవసరం ఉండదు. కానీ తిరగబెట్టే అవకాశాలుంటాయి కాబట్టి సమస్య మీద ఓ కన్నేసి అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి. మూడు, నాల్గవ దశ క్యాన్సర్లలో తిరగబెట్టే ముప్పు ఎక్కువగా ఉంటుంది. పెద్దల్లో తలెత్తే 50ు ట్యూమర్లు దూకుడుగా ఉంటే, పిల్లల్లో కేవలం 20ు ట్యూమర్లు మాత్రమే దూకుడుగా వ్యవహరిస్తాయి. కాబట్టి మెదడు క్యాన్సర్లకు గురైన పిల్లల సర్వైవల్ రేటు అధికంగా ఉంటుంది.
అపోహలు, భయాలు అనవసరం
బ్రెయిన్ ట్యూమర్‌ను మరణశాశనంగా భావించేవారే ఎక్కువ. దాంతో చికిత్సపరంగా సంశయిస్తూ, తాత్సారం చేస్తూ పిల్లలను మరణానికి చేరువ చేస్తూ ఉంటారు. కానీ నిజానికి 80ు పిల్లల్లో మెదడు క్యాన్సర్లు దూకుడుగా ఉండవు. కాబట్టి ప్రారంభంలోనే చికిత్సను అందించగలిగితే పిల్లల ఆయుష్షును పెంచుకోవచ్చు. కానీ మెదడు సర్జరీల పట్ల ప్రజల్లో నెలకొని ఉన్న భయాలు, అనుమానాల వల్ల, పిల్లలకు మెదడు క్యాన్సర్ల చికిత్సలు సమయానికి అందడం లేదు. నిజానికి ఈ సర్జరీలు ఎంతో అత్యాధునికమైనవి, సురక్షితమైనవి. గతంలో పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్, పిడియాట్రిక్ అనస్థీషియాలు అందుబాటులో ఉండేవి కావు. కానీ నేడు ఇవి అందుబాటులోకొచ్చాయి. ఫలితంగా మెదడు సర్జరీలు సురక్షితంగా మారిపోయాయి. మెదడు క్యాన్సర్ చికిత్సల ఫలితంగా 70ు పిల్లలు 10 నుంచి 15 ఏళ్లు జీవించి ఉండగలుగుతారు. క్యాన్సర్ తిరగబెట్టని కొందరు పిల్లలు ఈ వ్యాధి నుంచి పూర్తిగా విముక్తి పొందుతారు. కాబట్టి మెదడు క్యాన్సర్ సోకిన పిల్లలకు, చికిత్స తదనంతరం, ప్రతి ఏటా స్కాన్స్‌తో మెదడును పరీక్షించుకుంటూ ఉండాలి. మొదటి దశ క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న పిల్లలకు ప్రతి రెండేళ్లకోసారి స్కాన్ అవసరమవుతుంది. రెండో దశ క్యాన్సర్‌కు ప్రతి ఏటా స్కాన్ చేయించాలి. మూడు, నాల్గవ దశ క్యాన్సర్లకు ప్రతి ఆరు నెలలకూ స్కాన్ చేయిస్తూ ఉండాలి.
డాక్టర్ మానస్ కుమార్ పాణిగ్రాహి
హెచ్‌ఒడి అండ్ సీనియర్
కన్సల్టెంట్, న్యూరోసర్జరీ,
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
ఇవి కూడా చదవండి..
‘నా భర్త అన్ని లిమిట్స్ క్రాస్ చేశాడు’.. టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో
ఆధ్యాత్మిక, సనాతన పరిరక్షణ కేంద్రాలుగా ఆలయాలు: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
Read Latest AP News And Telugu News