Share News

దేవుడి ముచ్చట నా జన్మఫలం

ABN , Publish Date - Aug 03 , 2026 | 01:32 AM

ఆషాఢమాసం శక్తిఆరాధనకు లష్కర్‌ బోనాలు పెట్టింది పేరు. అమ్మవారికి బువ్వ సమర్పించే ఈ మహోత్సవంలో అరుదైన ఘట్టం పసుపు, కుంకుమతో ముస్తాబైన జోగిని పచ్చికుండమీద నిలబడి...

దేవుడి ముచ్చట నా జన్మఫలం

ఆషాఢమాసం శక్తిఆరాధనకు లష్కర్‌ బోనాలు పెట్టింది పేరు. అమ్మవారికి బువ్వ సమర్పించే ఈ మహోత్సవంలో అరుదైన ఘట్టం పసుపు, కుంకుమతో ముస్తాబైన జోగిని పచ్చికుండమీద నిలబడి భవిష్యవాణి వినిపించడం. ఆ సమయంలో అమ్మవారే ఆమెతో మాటలు పలికిస్తారన్నది భక్తుల నమ్మకం. ఈ సంప్రదాయానికి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి దేవాలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. తరతరాల వంశాచారాన్ని కొనసాగిస్తూ, మూడు దశాబ్దాలుగా దేవుడి ముచ్చట భక్తులకు చెబుతున్న మాతంగి స్వర్ణలతను ‘నవ్య’ పలకరించింది.

‘‘సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో 30 ఏళ్లుగా రంగమెక్కి భవిష్యవాణి చెబుతున్నాను. మాది ఏర్పుల వంశం. మమ్మల్ని ‘మాతంగి’ అంటారు. రంగమెక్కడం.. మా కుటుంబంలో నాది ఏడోతరం. అంతకుముందు మా నాయనమ్మలు జోగమ్మ, బాలమ్మ, పోశమ్మ, బాగమ్మ పచ్చికుండ మీద నిలబడి దేవుడి ముచ్చట చెప్పేవారు. తరువాత ఆ వారసత్వాన్ని మా అక్క స్వరూపరాణి కొనసాగించింది. ఆమె అనారోగ్యంతో 1996లో కాలంచేయడంతో ఆ స్థానంలోకి నేను వచ్చాను. అదే ఏడాది మా పెద్దలు ముత్యాలమ్మ గుడిలో అంగరంగవైభవంగా కత్తితో నాకు పెళ్లి జరిపించారు. మా ఇంట పుట్టిన ఆడపిల్లలంతా అమ్మవారి సేవకే అంకితం. దేవుడితో మాత్రమే మాకు వివాహం. చిన్నప్పటి నుంచి జగన్మాత పెట్టిన ఎన్నో పరీక్షలను దాటితేగానీ ఇక్కడివరకు రాలేం. నియమ నిష్ఠలతో ప్రతిరోజూ అమ్మవారిని ఉపాసిస్తాం. అమ్మకు నైవేద్యం సమర్పించనిదే నీళ్లుకూడా తాగను. ఆషాఢమాసంలో అయితే రోజుకు ఒక్కపూట.. అదీ ఇడ్లీ, పాలు వంటి సాత్వికాహారం మాత్రమే తీసుకుంటాను. అమ్మవారి ఘటాల ఊరేగింపులో పనిపాటలోళ్లతో కలసి వాడవాడలా నేనూ వెంట వెళతాను.

పదోతరగతి వరకు...

నాకు తెలిసినంతవరకు మా పూర్వీకులది కూడా సికింద్రాబాదే! నేనూ అదే ప్రాంతంలోని తుకారాంగేట్‌లో పుట్టి పెరిగాను. ఇప్పుడు అక్కడే నా తమ్ముడి కుటుంబంతో కలసి ఉంటున్నాను. మా నాన్న ఏర్పుల నరసింహ పంబజోడు వాయిస్తూ, మా అమ్మ ఇస్తారమ్మ జైగంట మోగిస్తూ ఉజ్జయిని మహాకాళి అమ్మసేవలోనే చివరి వరకు తరించారు. తుకారాంగేట్‌ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి వరకు చదివాను. ఇల్లు గడవాలంటే బడిలోకన్నా నేను ఏదైనా పనిలోకి వెళ్లడమే ఆనాడు అత్యవసరమైంది. దాంతో టైలరింగ్‌ నేర్చుకున్నాను. చదువుమీద ఇష్టంతో ప్రైవేటుగా పదో తరగతి పూర్తిచేశాను. మా ఇంటికి దగ్గర్లోని ఓ ప్రైవేటు స్కూల్లో ప్రైమరీ క్లాస్‌ టీచర్‌గా కూడా పనిచేశాను. ఇప్పుడైతే పూర్తిగా అమ్మవారి సేవకే అంకితమయ్యాను. ఒంటరి మహిళ కింద ప్రతినెలా నాకు పింఛను వస్తోంది. ప్రతి మంగళ, శుక్రవారాలు మహాకాళి ఆలయానికి వచ్చి సేవచేస్తాను. దేవాలయం నుంచి నాకు నెలనెలా కొంత ఆర్థికసాయం అందుతుంది. అమ్మవారు ఇస్తున్నది నాకు చాలు. లోకమంతా చల్లగా ఉండాలని ఆ తల్లిని కోరుకుంటున్నా.


మా బాబాయే గురువు

రంగమెక్కడానికి కొన్ని అర్హతలుంటాయి. దేవుడిని పెళ్లాడటం ఒక్కటే కాదు, మాకు గురువులు మంత్రోపదేశం చేస్తారు. మైలకు దూరంగా ఉండాలి. పెళ్లిళ్లు, దినాలు ఎక్కడికి వెళ్లినా అన్నం తినకూడదు. పుష్పవతి వేడుకలు వంటి వాటికైతే చాలా దూరంగా ఉండాలి. ఇక రోజూవారీ జపాలు, పూజలు... అదంతా బోలెడంత తతంగం. నా చిన్నతనంలో మా బాబాయి గురోపదేశం చేశాడు. అయితే ఆయన ఇప్పుడు లేడు. కానీ ఆచారాలు, సంప్రదాయాలను పాటించడంలో ఎక్కడా ఇంతవరకు రాజీపడలేదు. నియమనిష్ఠలను అతిక్రమించలేదు. ఇప్పుడు నాకు పదిమంది శిష్యులున్నారు. వారిలో ఆడవాళ్లు, మగవాళ్లూ ఉన్నారు. ఇద్దరు పురుషులు అయితే పెళ్లిచేసుకోకుండా అమ్మవారి సేవకే అంకితమయ్యారు. ఇళ్లల్లో దేవుడి కల్యాణాలు జరిపించడం, ఒంటిమీదకు దేవుడు వచ్చినప్పుడు ముచ్చట చెప్పడం వంటి క్రతువుల్లో నా శిష్యులుంటారు. ఏడాది పరీక్షించిన తర్వాతే శిష్యులుగా స్వీకరిస్తాను. మిగతా రోజుల్లో జరిగే అమ్మవారి పూజలో వారంతా నాకు చేదోడువాదోడుగా ఉంటారు.

ఇంకొన్ని ఆలయాల్లో...

ఉజ్జయిని మహాకాళి దేవాలయం కాకుండా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోని దాదాపు 30 ఆలయాలకు వెళతాను. అక్కడా రంగమెక్కి భవిష్యవాణి చెబుతాను. మిగతా రోజుల్లో కొన్ని దేవాలయాలకు వెళ్లి అమ్మవారిని అలంకరించడం, ఇళ్లల్లో దేవుడి కల్యాణం జరిపించడం వంటి కార్యక్రమాలకు వెళుతుంటాను. కొందరు నాకు ఒడి బియ్యం పోసి వారి స్తోమతకు తగినట్టు ఎంతోకొంత తాంబూలంలో పెట్టి ఇస్తారు. ఇంకొందరు నాతో ఒడిబియ్యం పోయించుకొని చీర, సారె పెడతారు. ఇది అందరికి దొరికే అదృష్టం కాదు. అమ్మవారు ఒంటిమీదకు రావడమంటేనే, అది మా జన్మజన్మల పుణ్యఫలం’’

00-Navya.jpg


నా తరువాత మా తమ్ముడి పిల్లలు, అన్న పిల్లలు ఈ ఆచారాన్ని కొనసాగిస్తారు. వాళ్లు ఎంత చదువుకున్నా, పెద్ద ఉద్యోగం చేసినా సరే! దేవుడిని పెళ్లాడాలి. అమ్మసేవలో తరించాలి. బోనాలప్పుడు ముఖానికి బండారు పూసుకొని రంగమెక్కాల్సిందే!

అప్పుడు నాకు ఏమీ తెలియదు...

కుమ్మరి, రజక, నాయిబ్రాహ్మణ, చేనేత లాంటి రకరకాల వృత్తుల వాళ్లు తరతరాలుగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సేవిస్తున్నారు. వారినే పనిపాటలోళ్లు అంటారు. బోనాల పండుగలో పూజా క్రతువులు, ఘటాల ఊరేగింపులో పనిపాటలోళ్లు చాలా ముఖ్యం. బోనాలప్పుడు పచ్చికుండను అమ్మవారి ఆలయంలో కుమ్మరి సమర్పిస్తారు. మరుసటి రోజు ఒక గుంత తీసి అందులో పచ్చికుండను బోర్లిస్తారు. దానిచుట్టూ బియ్యపు పిండితో పాటు పసుపు, కుంకుమతో ముగ్గు పెడతారు. అదంతా నా తమ్ముడు నిర్వహిస్తాడు. ఆదిశక్తిని ఆరాధిస్తూ ముఖానికి బండారు పూసుకొని.. నుదుట కుంకుమ అలంకరించుకొని గవ్వల దండ, కిన్నెర చేతబట్టి ఒడిబియ్యంతో ఆలయానికి చేరుకుంటా. అంతవరకు మాత్రమే నాకు గుర్తు. అమ్మవారు నా ఒంటిమీదకు వచ్చాక చెప్పిన దేవుడి ముచ్చటంతా నేనూ తరువాత యూట్యూబ్‌ వీడియోలలో చూసి తెలుసుకోవడమే!

కత్తితోనే పెళ్లి

దేవుడిని పెళ్లాడి జీవితాంతం అమ్మసేవలోనే గడపడం మాతంగి కులాచారం. కొన్నిచోట్ల వివాహితలు కూడా రంగం చెబుతుంటారు. వాళ్లకు మా కులంతో సంబంధం లేదు. మా ఏర్పుల వంశంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల దేవుడికి అంకితం. వాళ్లు కత్తిని మాత్రమే వివాహమాడాలి. అమ్మవారి సేవలోనే జీవితం గడపాలి. ఇదిమాకు మాత్రమే లభించిన అదృష్టం.

సాంత్వన్‌

ఫొటోలు: చిట్టిబాబు

ఈ వార్తలనూ చదవండి:

ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..

వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..

Updated Date - Aug 03 , 2026 | 01:32 AM