ఆ వాపులు వ్యాధులు కావచ్చు
ABN , Publish Date - Nov 10 , 2026 | 02:50 AM
ఒళ్లు బరువైపోతుంది. కాళ్లు వాచిపోతూ ఉంటాయి. ఉదయం నిద్ర లేచే వేళకు ముఖం ఉబ్బిపోతూ ఉంటుంది. ఇవన్నీ చూసీ చూడనట్టు...
ఎడీమా
ఒళ్లు బరువైపోతుంది. కాళ్లు వాచిపోతూ ఉంటాయి. ఉదయం నిద్ర లేచే వేళకు ముఖం ఉబ్బిపోతూ ఉంటుంది. ఇవన్నీ చూసీ చూడనట్టు వదిలేయవలసిన లక్షణాలు ఏమాత్రం కాదు. గుండె, మూత్రపిండాలు, కాలేయ రుగ్మతలకు సంకేతాలు కూడా కావచ్చని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఒంట్లో నీరు నిలిచిపోయే ఈ పరిస్థితికి కారణాలు, పరిష్కారాల గురించి ఇలా వివరిస్తున్నారు.
గుండెతో అనుసంధానమై ఉండే రక్తనాళాల ద్వారా రక్తం గుండెకూ, గుండె నుంచి మిగతా శరీర భాగాలకూ ప్రవహిస్తూ ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే! అయితే రక్తంతో పాటు శరీర ద్రవాలు కూడా రక్తనాళాల్లో ప్రవహిస్తూ ఉంటాయి. ఇలా ప్రసరణ వ్యవస్థలో భాగంగా ప్రవహించే ఈ ద్రవాలు రక్తనాళాలకే పరిమితం కాకుండా, బయటున్న కణజాలంలోకీ, శరీరావయవాల్లోకీ స్రవిస్తూ ఉంటాయి. ఫలితంగా ఆయా ప్రదేశాల్లో వాపు కనిపిస్తుంది. దీన్నే వాటర్ రిటెన్షన్ లేదా ఎడీమా అని అంటారు. ఇందుకు పలు కారణాలున్నాయి.
కీలక అవయవాలు దెబ్బతింటే...
వాపు ఒక అవయవానికే పరిమితమైతే లోకలైజ్డ్ ఎడీమా అనీ, శరీరమంతా వాపు ఉంటే జనరలైజ్డ్ ఎడీమా అని అంటారు. సాధారణంగా పెద్దల్లో చీలమండలం, కాళ్లూ వాస్తూ ఉంటాయి. అయితే కొందర్లో ఉదయాన్నే నిద్ర లేస్తూనే ముఖం వాపు కనిపిస్తుంది. లేదంటే కళ్ల చుట్టూ వాపు ఉంటుంది. కొందరికి ఒక చేయి మాత్రమే వాస్తూ ఉంటుంది. ఇంకొందరికి కాళ్లు, పొట్ట భాగం వాస్తూ ఉంటాయి. ఇందుకు పలు కారణాలున్నాయి. పెద్ద వయసులో వాస్క్యులర్ వ్యవస్థలో పట్టు తగ్గి, కణజాలం వదులైపోయి, శరీరం దిగువ భాగం నుంచి పైభాగానికి రక్తప్రవాహ వేగం సన్నగిల్లడం వల్ల కాళ్లలో నీరు చేరుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కాళ్లు ఎత్తులో పెట్టుకుని పడుకుంటే, వాపులు సులభంగా తగ్గిపోతాయి. అలాగే క్రమం తప్పకుండా నడిచినా సమస్య పరిష్కారమవుతుంది. అయితే కొందర్లో అంతర్గత అవయవాలు దెబ్బ తినడం వల్ల వాపులు కనిపిస్తూ ఉంటాయి. అవేంటంటే...
గుండె : గుండెలో పంపింగ్ సమస్యలు ఉన్నప్పుడు ద్రవాలు పూర్తిగా బయటకు రావు. దాంతో మిగిలిపోయిన ద్రవాలు, రక్తం వెనక్కి తోసుకెళ్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కాళ్లలో వాపు మొదలవుతుంది. కాబట్టి కాళ్లలో వాపు కనిపిస్తే గుండె సమస్యగా పరిగణించాలి. మధుమేహం, అఽధిక రక్తపోటు అదుపు తప్పినా, కొలెస్ట్రాల్ మోతాదులు పెరిగినా, గుండెలో రక్తసరఫరా సమస్యలు తలెత్తి, గుండెపోటు లేదా గుండె వైఫల్యం లాంటివి జరుగుతాయి. గుండె బలహీనపడిపోయి, పంపింగ్ సామర్థ్యాన్ని కోల్పోయి, శరీరంలో నీరు పేరుకుపోకుండా ఉండాలంటే, క్రమం తప్పకుండా గుండె పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. మఽధుమేహం, రక్తపోటు అదుపులో ఉంచుకోవాలి. అలాగే గుండె సమస్యకు చికిత్స తీసుకుంటూ, ఒంట్లో నీరు నిల్వ ఉండిపోతూ ఉంటే వైద్యులు సూచించే డయూరిటిక్స్ మందులు వాడుకోవాలి.
మూత్రపిండాలు : మూత్రపిండాల్లో సమస్య ఉన్నప్పుడు ఉదయం నిద్ర లేవగానే ముఖంలో, కళ్ల చుట్టూరా వాపు కనిపిస్తుంది. మన మూత్రపిండాలు నిరంతరం రక్తాన్ని వడపోస్తూ మల మూత్ర విసర్జన ద్వారా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తూ ఉంటాయి. విసర్జక వ్యవస్థ సమర్థంగా పని చేస్తున్నంత కాలం మన శరీరంలో వ్యర్థాలు నిల్వ ఉండవు. అయితే మూత్రపిండాల పనితీరు సన్నగిల్లి, విసర్జక వ్యవస్థ కుంటుపడి, మూత్ర విసర్జన తగ్గినప్పుడు, శరీరంలో మరీ ముఖ్యంగా ముఖంలో, కళ్ల చుట్టూరా నీరు పేరుకుపోతూ ఉంటుంది. మూత్రపిండాలు దెబ్బ తినడానికి కూడా మధుమేహం, రక్తపోటు అదుపు తప్పడమే ప్రధాన కారణం. అలాగే యధేచ్ఛగా వాడుకునే నొప్పి మాత్రల వల్ల కూడా కిడ్నీలు దెబ్బతింటూ ఉంటాయనే విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి. అలాగే స్టిరాయిడ్లు, క్యాన్సర్ కారక మందులు, యాంటాసిడ్లు కూడా దీర్ఘకాలంలో మూత్రపిండాల వైఫల్యానికి దారి తీస్తాయి.
కాలేయం : పొట్ట భాగంలో వాపు కనిపిస్తే, ప్రధానంగా కాలేయ సమస్యగా భావించాలి. కాలేయం దెబ్బతినడానికి ప్రధాన కారణం మద్యపానమే అయినప్పటికీ అస్తవ్యస్థ ఆహారపుటలవాట్లు కూడా కాలేయం దెబ్బ తినడానికి దోహదపడుతున్నాయి. ఊబకాయంతో కాలేయంలో కూడా కొవ్వు పెరిగిపోతోంది. ఇలా కాలేయంలో కొవ్వు పెరిగినప్పుడు కాలేయ పనితీరు దెబ్బతింటుంది. మద్యపానంతో ఎలాగైతే కాలేయ సిర్రోసిస్ సమస్య తలెత్తుతుందో, నాన్ఫ్యాటీ లివర్ వల్ల కూడా కాలేయ వైఫల్య సమస్య పెరుగుతోంది. కాలేయం దెబ్బతిని, ఆల్బ్యుమిన్ ప్రొటీన్ పరిమాణం తగ్గిపోయి, పొట్టలోకి నీరు చేరుకుంటూ ఉంటుంది. కాబట్టి కాలేయం దెబ్బతినకుండా ఉండడం కోసం ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను అనుసరిస్తూ, బరువును అదుపులో పెట్టుకోవాలి. అలాగే మద్యపానం మానుకోవాలి.
అనీమియాతో ఒంట్లో నీరు
మన దేశంలో రక్తలేమి సమస్య ఎక్కువ. మరీ ముఖ్యంగా యువతులు, మహిళల్లో పోషక లోపాలు, అధిక నెలసరి రక్త స్రావాల వల్ల అనీమియా పెరుగుతోంది. సాధారణంగా నెలసరి సమస్యల గురించి మహిళలెవరూ ఫిర్యాదు చేయరు, పట్టించుకోరు. కానీ రక్తలేమి వల్ల గుండె బలహీనపడుతుంది. దాంతో పంపింగ్ సామర్థ్యం సన్నగిల్లి, శరీరంలో నీటి నిల్వ పెరుగుతుంది. అలాగే రక్తలేమి వల్ల రక్తంలోని ప్రొటీన్ క్షీణించి ద్రవాలు కణజాలాల్లోకి లీక్ అవుతాయి. దాంతో కాళ్ల వాపులు, ముఖం వాపు, ఆయాసం పెరుగుతాయి. ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే నెలసరి సమస్యలకు చికిత్స తీసుకోవాలి. పోషకాహార లోపాన్ని సమతులాహారంతో భర్తీ చేసుకోవాలి.

అధిక ఉప్పుతో...
ప్రస్తుతం జంక్ ఫుడ్స్ తినే ధోరణి పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా ఉప్పు జోడించిన స్నాక్స్ కూడా ఎక్కువగా తింటున్నాం! ఇలా సోడియం ఎక్కువగా ఉండే పదార్థాలు తిన్నప్పుడు, శరీరంలో నీటి నిల్వ పెరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే తక్కువ సోడియం కలిగిన పదార్థాలను తీసుకోవాలి. కూరగాయలు, తాజా పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తింటూ ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించాలి.
నొప్పి మాత్రలు, స్టిరాయిడ్లు
నొప్పి మాత్రల ప్రధాన దుష్ప్రభావం ఎడీమా. నొప్పి తగ్గించుకోవడం కోసం పెయిన్ కిల్లర్స్, స్టిరాయిడ్స్ మీద ఆధారపడేవాళ్లు ఎక్కువ. వీటితో ముఖం, మెడ, పొట్ట వాపు తలెత్తుతుంది. కాబట్టి వైద్యుల సూచన లేకుండా ఈ రెండు రకాల మందులు వాడకూడదు. అలాగే కొన్ని రకాల రక్తపోటు మందులు కూడా మడమల వాపుకు కారణమవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు వైద్యులను కలిసి, మందులు మార్చుకోవాలి.
ఈ పరిస్థితుల్లో కూడా...
నడి వయసు మహిళల్లో: హైపో థైరాయిడ్ సమస్య, మెనోపాజ్‌లో హార్మోన్ సమస్యల వల్ల కాళ్ల వాపులు రావచ్చు. కాబట్టి ఈ రెండు సమస్యలనూ వైద్య చికిత్సలతో సరిదిద్దుకోవాలి.
డీహైడ్రేషన్: సరిపడా నీళ్లు తాగని సందర్భాల్లో కూడా కాళ్ల వాపులు కనిపిస్తాయి.
ఈ అపోహలు వీడాలి
మనలో చాలా మంది, అధిక రక్తపోటు, మధుమేహం ఉందని నిర్థారణ అయినా, ‘ఎలాంటి మందులూ వాడుకోకుండా నేను బాగున్నాను కాబట్టి మందులు అవసరం లేదు’ అని అనుకుంటూ ఉంటారు. అయితే మధుమేహం, లేదా అధిక రక్తపోటు శరీరంలో ఏదో ఒక అవయవాన్ని దెబ్బ తీస్తే మినహా లక్షణాలు మొదలు కావు. అది గుండె కావచ్చు, మెదడు కావచ్చు, మూత్రపిండాలు కావచ్చు. అయితే ఆ అవయవాలు దెబ్బతిన్న తర్వాత, చికిత్సతో మరింత దెబ్బతినకుండా నియంత్రించగలుగుతాం. అంతే తప్ప ఆ భాగాన్ని చికిత్సతో రిపేర్ చేయలేం! బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్‌తో ఆస్పత్రుల్లో చేరే చాలా మందిలో చక్కెర, రక్తపోటు ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఇదే! మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నా వాటికి మందులు వాడుకోకుండా, నేను బాగున్నానంటూ అనుకోవడం సరి కాదు. అవసరాన్ని బట్టి వైద్యులు సూచించే మందులను సూచించినంత కాలం వాడుకోవాలి. మందుల వాడకం మొదలుపెడితే వాటికి అలవాటు పడిపోతాం అనుకోవడం కూడా ఒక అపోహే! నిజానికి ఆయా రుగ్మతలను చికిత్సతో అదుపులోకి తెచ్చుకుని, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించగలిగితే, మందులను వాడుకోవాల్సిన అవసరం కూడా తప్పుతుంది.
నాటు మందులు వద్దు
కామెర్లు, ఇతరత్రా రుగ్మతలకు కొందరు నాటు మందుల మీద ఆధారపడుతూ ఉంటారు. వీటి వల్ల కాలేయం దెబ్బ తింటుంది. ఇలాంటి మందులతో కాలేయ వైఫల్యంతో, కాలేయ మార్పిడి పరిస్థితికి చేరుకున్న వారున్నారు. కాబట్టి నాటు మందుల మీద ఆధారపడకుండా, రుగ్మతలకు తగిన సమర్థమైన చికిత్సల కోసం వైద్యులను సంప్రతించాలి.
మధుమేహులకు ఈ పరీక్షలు తప్పనిసరి
విచక్షణారహితంగా నొప్పి మాత్రలు వాడుకోవడం వల్ల, మధుమేహం, రక్తపోటును నియంత్రణలో పెట్టుకోకపోవడం వల్ల, నీటి కాలుష్యం, ఇతరత్రా ఇన్ఫెక్షన్ల వల్ల, ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల మూత్రపిండాల్లోని ఫిల్టర్లు దెబ్బతింటాయి. దాంతో ప్రొటీన్ శరీరం నుంచి బయటకు వెళ్లిపోతూ ఉంటుంది. రక్తంలోని ద్రవాలు కణజాలాల్లోకి లీక్ అవకుండా ఉండడానికి ఆల్బ్యుమిన్ అనే ఈ ప్రొటీను తోడ్పడుతుంది. రక్తంలో ఈ ప్రొటీన్ పరిమాణం తగ్గినప్పుడు, ద్రవాలు కణజాలాల్లోకి చేరుకుంటూ వాపులు మొదలవుతాయి. కాబట్టి మధుమేహులు మైక్రోఆల్బ్యుమినూరియా, యూరిన్ ప్రొటీన్ క్రియాటినిన్ పరీక్షలు చేయించుకుంటూ మూత్రపిండాల పనితీరును గమనించుకుంటూ ఉండాలి.
డాక్టర్ ఎస్.వి. చంద్రశేఖర్,
జనరల్ ఫిజీషియన్,
సీనియర్ కన్సల్టెంట్
జెమ్కేర్ కామినేని హాస్పిటల్స్, కర్నూలు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో బియ్యం ధరల నియంత్రణకు చర్యలు
గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..
Read Latest Telangana News And Telugu News