చీకటిని గెలిచిన అక్షరదీపం!
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:10 AM
వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపించింది శ్రీనగర్ అమ్మాయి జైనబ్ బిలాల్. కళ్లు కనిపించకపోయినా, పట్టుదలతో చదివి, ల్యాప్‌టాప్‌తో పరీక్ష రాసి పదో తరగతి ఫలితాల్లో 95...
వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపించింది శ్రీనగర్ అమ్మాయి జైనబ్ బిలాల్. కళ్లు కనిపించకపోయినా, పట్టుదలతో చదివి, ల్యాప్‌టాప్‌తో పరీక్ష రాసి పదో తరగతి ఫలితాల్లో 95 శాతం మార్కులతో సత్తాచాటిన ఈ ‘వండర్ గర్ల్’ స్ఫూర్తిదాయక గాధ మీకోసం...
విధి సృష్టించే అడ్డంకులు కొందరిని కుంగదీస్తే, మరికొందరిని పోరాట యోధులుగా మారుస్తాయి. ప్రతిభకు శారీరక లోపాలు ఏనాడు అవరోధం కావని, ఆత్మవిశ్వాసం తోడైతే ఆకాశమే హద్దుగా రాణించవచ్చని నిరూపించింది శ్రీనగర్‌కు చెందిన జైనబ్ బిలాల్. ఇటీవల విడుదలైన సీబీఎ్‌సఈ పదో తరగతి ఫలితాల్లో 95 శాతం మార్కులు సాధించి, కశ్మీర్ లోయలోనే కాదు, యావత్ దేశంలోనే ఒక ఆశాకిరణంగా నిలిచింది. చూపు లేకపోయినా తన మేధస్సుతో అక్షరాలను వెలిగించిన ఈ 16 ఏళ్ల బాలిక ప్రస్థానం.. ప్రతి విద్యార్థికి ఒక అద్భుత పాఠం. సహాయకుడు లేనిదో పరీక్ష రాయడం కష్టమనుకునే చోట ల్యాప్‌టాప్ సాయంతో పరీక్ష రాసి విజయం సాధించడం ఆమెలోని తిరుగులేని పట్టుదలకు నిదర్శనం.
సరికొత్త రికార్డు
సాధారణంగా దృష్టి లోపం ఉన్న విద్యార్థులు పరీక్షలు రాయడానికి మరొకరి సాయాన్ని తీసుకుంటారు. కానీ, జైనబ్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. సాంకేతికతను తన ఆయుధంగా మార్చుకున్న ఆమె.. ల్యాప్‌టాప్ సాయంతో పరీక్షలు రాసి సీబీఎ్‌సఈ చరిత్రలో అరుదైన ఘనత సాధించిన అతికొద్దిమంది విద్యార్థుల సరసన చేరింది. ఆ పరీక్షల్లో 500 మార్కులకు గాను 475 మార్కులు సాధించడం విశేషం.
ఐటీ రంగంవైపు
జైనబ్ చిన్నప్పటి నుంచే సాంకేతిక రంగంపై మక్కువ పెంచుకుంది. కంప్యూటర్ సైన్స్‌లో 100కు వంద మార్కులు సాధించడం ఆమెకు ఆ రంగంపై ఉన్న పట్టును తెలియజేస్తోంది. భవిష్యత్తులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో స్థిరపడాలన్నదే తన లక్ష్యమని గర్వంగా చెబుతోంది. ‘‘నాకు చిన్నప్పటి నుంచి కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ అంటే ఇష్టం, డిగ్రీలో కూడా దానినే ఎంచుకుంటాను’’ అని ఆత్మవిశ్వాసంతో తన ఆశయాన్ని వ్యక్తపరిచింది. శ్రీనగర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లెర్నింగ్ రిసోర్స్ సెంటర్ ఆమెకు అండగా నిలిచింది. తన విజయానికి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తన తల్లిదండ్రులే ప్రధాన కారణమని ఆమె కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకుంది.
రేడియో జాకీగా...
జైనబ్ ప్రతిభ కేవలం చదువుకే పరిమితం కాలేదు. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవలం 12 ఏళ్ల వయసులోనే తన స్కూల్ రేడియో ప్లాట్‌ఫాం ‘రేడియో డీపీఎస్’ ద్వారా రాజకీయ దిగ్గజం ఒమర్ అబ్దుల్లాను, బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్‌ను ఇంటర్వూ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె సంభాషణ చాతుర్యం, ఎదుటివారిని ఆకట్టుకునే మాటతీరు జైనబ్ ఒక అద్భుతమైన కమ్యూనికేటర్ అని నిరూపించాయి. లోపం లేని మనుషులకే సాధ్యం కాని ఎన్నో పనులను జైనబ్ అత్యంత సునాయాసంగా, చిరునవ్వుతో పూర్తిచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
తల్లిదండ్రులకు జైనబ్ సందేశం
తన విజయం ద్వారా సమాజానికి జైనబ్ ఒక శక్తిమంతమైన సందేశాన్ని పంపింది. ముఖ్యంగా దివ్యాంగ పిల్లలున్న తల్లిదండ్రులు వారిని భారంగా భావించకూడదని, సరైన ప్రోత్సాహం అందిస్తే వారు అద్భుతాలు చేస్తారని ఆమె చెబుతోంది. ‘‘నేను చేయగలిగితే ఎవరైనా చేయగలరు. కావాల్సిందల్లా మీ మద్దతు, నమ్మకం మాత్రమే’’ అని ఆమె చెబుతున్న మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. కళ్లకు వెలుగులు లేకపోయినా, లక్ష్యం వైపు ప్రయాణించడానికి ఆమె ఎంచుకున్న దారి, పడుతున్న శ్రమ నేడు ఎందరో విద్యార్థుల్లో కొత్త స్ఫూర్తిని నింపుతోంది. జైనబ్ సాధించిన ఈ మైలురాయి కశ్మీర్ యువతకు ఒక గొప్ప విజయ సంకేతం.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టీమిండియా మహిళల స్థానాలివే!
కండరాల గాయం.. ఐపీఎల్ నుంచి ఆయుశ్ మాత్రే ఔట్