క్యాన్సర్‌ను గెలిచి.. ర్యాంప్‌పై మెరిసి!
ABN , Publish Date - Jun 22 , 2026 | 02:05 AM
ఆమె కళ్లు చూసే ప్రపంచం చీకటి కావొచ్చు.. కానీ ఆమె మనసు సృష్టించే ప్రపంచం రంగులమయం. 11 ఏళ్లకే క్యాన్సర్ మహమ్మారి ఆమె చూపును లాగేసుకుంది. ‘ఇక నీ జీవితం ముగిసిపోయింది’ అని...
ఆమె కళ్లు చూసే ప్రపంచం చీకటి కావొచ్చు.. కానీ ఆమె మనసు సృష్టించే ప్రపంచం రంగులమయం. 11 ఏళ్లకే క్యాన్సర్ మహమ్మారి ఆమె చూపును లాగేసుకుంది. ‘ఇక నీ జీవితం ముగిసిపోయింది’ అని సమాజం గేలి చేసింది. కానీ, ఆ ఆశ నిరాశల నుంచే ఒక అద్భుతం పుట్టుకొచ్చింది. చూపు లేకపోయినా.. పట్టుదలనే ఊతంగా చేసుకుని ప్రతిష్ఠాత్మక లండన్ ఫ్యాషన్ వీక్‌లో తన బ్రాండ్‌ను ప్రదర్శించిన భారతీయ ధీరవనిత ఆష్కా సునీల్ గోయల్ స్ఫూర్తిదాయక విజయగాధ ఇది.
ఆష్కాది ఛత్తీ్‌సగఢ్ రాజధాని రాయ్‌పూర్. ఐదో తరగతి చదువుతున్న సమయంలో ఒక రోజు అకస్మాత్తుగా ఆమె నోటివెంట రక్తం పడటంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆమె నాసికా కుహరంలో ఒక అరుదైన ట్యూమర్ (క్యాన్సర్)ను గుర్తించారు. అది చివరి దశకు చేరుకుందని, చిన్నారి ఎక్కువ కాలం బతకడం కష్టమని చెప్పేశారు. ఆ తర్వాత ఆ ట్యూమర్ క్రమంగా ఆమె కంటి నరాలను దెబ్బతీయడం ప్రారంభించింది.
ఫ్లైట్‌లోనే ఆగిపోయిన చూపు
చికిత్స కోసం ఆష్కా కుటుంబం రాయ్‌పూర్ నుంచి చెన్నై, ముంబై నగరాల చుట్టూ తిరిగింది. ఎక్కడికి వెళ్లినా చేసేదేం లేదని, శస్త్రచికిత్స చేయలేమని వైద్యులు చేతులెత్తేశారు. ఒకరోజు ముంబై నుంచి తిరిగి విమానంలో వస్తుండగా ఆష్కా కళ్లముందు ఒక్కసారిగా అంతా చీకటిగా మారిపోయింది. ‘నాన్నా.. నాకేమీ కనిపించడం లేదు’ అని తండ్రితో చెప్పింది. ఆ తర్వాత నెల రోజుల వ్యవధిలోనే రెండుకళ్ల చూపును పూర్తిగా కోల్పోయింది.
ఇంటికి తీసుకెళ్లి చావనివ్వండి
ఆష్కా బతికే అవకాశాలు తక్కువగా ఉండటంతో ‘ఈమె ఎలాగూ బతకదు, అనవసరంగా డబ్బులు దండగ చేయకుండా ఇంటికి తీసుకెళ్లి ప్రశాంతంగా చావనివ్వండి’ అని చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ, ఆష్కా బాబాయి మాత్రం లొంగిపోవడానికి నిరాకరించారు. ‘మనం చేతులు ముడుచుకుని కూర్చుందామా? లేదు, మనం పోరాడుదాం’ అని కుటుంబంలో ధైర్యం నింపారు. ఆ తర్వాతే అసలైన పోరాటం మొదలైంది. కీమోథెరపీ రేడియేషన్ వల్ల ఆమె నోరు, గొంతు దెబ్బతిన్నాయి. నెల రోజులపాటు చుక్క మంచినీరు కూడా తాగలేని స్థితిలో బరువు దారుణంగా తగ్గిపోయింది. ‘నా పొడవైన జుట్టు రాలిపోతుంటే నా గుండె పగిలిపోయింది’ అని ఆష్కా గుర్తుచేసుకున్నారు.
ఒక్క అద్భుతం చాలు
చివరకు ఒక డాక్టర్ ధైర్యం చేసి శస్త్రచికిత్స చేయడానికి ఒప్పుకున్నారు. సర్జరీ విజయవంతమైంది. ట్యూమర్ తొలగించారు. ఆష్కాకు ప్రాణం తిరిగి వచ్చింది. కానీ, చూపు రాలేదు. అయినా ఆమె నిరాశపడలేదు. ‘నా ప్రాణం నిలిచింది. మన ప్రపంచాన్ని వెలిగించడానికి ఒకే ఒక్క అద్భుతం చాలనే సత్యాన్ని నేను ఆ రోజు గ్రహించాను’ అని అంటారామె.
టీచర్ ఎగతాళి
ఆష్కా ప్రాణం నిలిచినా సమాజం నుంచి ఎదురైన ప్రశ్నలు క్రూరంగా ఉండేవి. ‘గుడ్డిదాని కోసం ఇన్ని డబ్బులు ఎందుకు వృథా చేశారు?’, ‘ఈమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు?’ అంటూ సూటిపోటి మాటలు అనేవారు. అయినా తల్లిదండ్రులు ఆమెకు అండగా నిలిచి మళ్లీ స్కూలుకు పంపారు. అక్కడ ఒకరోజు ‘భవిష్యత్తులో నువ్వు ఏం కావాలని అనుకుంటున్నావు?’ అని క్లాస్ టీచర్ అడిగితే.. ‘ఫ్యాషన్ డిజైనింగ్’ అని ఆష్కా బదులిచ్చింది. దానికి ఆ టీచర్ నవ్వుతూ ‘నీ జీవితం ముగిసిపోయింది. కళ్లులేని నువ్వు ఫ్యాషన్ ఏం చదువుతావ్?’ అని ఎగతాళి చేసింది. ఆ మాటలకు ఆష్కా ఏడ్చింది. కానీ, ఆ అవమానమే ఆమెలో ఎలాగైనా తనేంటో నిరూపించుకోవాలనే బలమైన సంకల్పాన్ని రగిల్చింది.

చూపును దాటిన ఫ్యాషన్ బంధం
ఫ్యాషన్ అంటే కేవలం కళ్లతో చూసే రంగులు మాత్రమే కాదు.. అది స్పర్శ, అనుభూతి అని ఆష్కా నమ్మారు. వస్త్రధారణ, బట్టల నిర్మాణం ఆధారంగా డిజైన్లను అర్థం చేసుకోవడం ప్రారంభించారు. బట్టలపై గుర్తులు పెట్టడానికి ప్రత్యేక మార్కర్లు, సేఫ్టీపిన్‌లను ఉపయోగించే సరికొత్త పద్ధతులను కనిపెట్టారు. ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థ అయిన ‘లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్’లో చదవాలనేది ఆమె కల. తండ్రి ఒక షరతు పెట్టారు. ‘ఎలాంటి షార్ట్‌కట్స్ ఉండకూడదు. నీ ప్రతిభతోనే సీటు సాధించాలి’ అని. దాని కోసం ఆమె చిన్న వయసులోనే ఒంటరిగా ముంబైకి మారి చేతికర్ర సాయంతో నడక నేర్చుకున్నారు. ‘ముంబై నగరం నన్ను భయం లేని దానిగా మార్చింది’ అని చెబుతారు ఆష్కా.
లండన్ ఫ్యాషన్ వీక్‌లో సగర్వంగా..
కష్టానికి తగిన ఫలితం దక్కింది. 22 ఏళ్ల వయసులోనే ఆష్కా ‘లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్’లో సీటు సాధించడమే కాకుండా, తన సొంత ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఒకప్పుడు ఫ్యాషన్ చదవలేవన్న సమాజం ముందే.. ప్రపంచ ప్రఖ్యాత ‘లండన్ ఫ్యాషన్ వీక్’ వేదికపై తన డిజైన్లను ప్రదర్శించి.. సగర్వంగా ర్యాంప్‌వాక్ చేశారు. దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ చేతుల మీదుగా ‘ఇన్విన్సిబుల్ స్పిరిట్ అవార్డు’, బ్రిటన్ పార్లమెంటులో ‘ఇన్‌స్పైరింగ్ యంగ్ టాలెంట్ అవార్డు’ అందుకుని దేశకీర్తిని పెంచారు.
నాకు జాలి వద్దు
తనను ఒక ‘ఇన్‌స్పిరేషనల్ హెడ్‌లైన్’గా చూడటాన్ని ఆష్కా ఇష్టపడరు. ‘నేను ఇక్కడ ఎవరినో ఇన్‌స్పైర్ చేయడానికి లేను, సమాజపు దృక్పథాన్ని మార్చడానికి ఉన్నాను’ అని చెబుతారు. ‘కళ్లు లేని అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అడుగుతారు.. జీవితంలో అంతకంటే పెద్ద సమస్యలు లేవా?’ అని ప్రశ్నించారు. ‘జీవితం మీ కంటిచూపును లాక్కోవచ్చు.. కానీ మీ అంతఃదృష్టిని ఎప్పటికీ మార్చలేదు’ అని చెప్పే ఆష్కా.. దివ్యాంగులను జాలితో కాకుండా నమ్మకంతో ఆహ్వానించే ప్రపంచం రావాలన్నదే తన కల అని చెబుతారు.
ఇవి కూడా చదవండి..
మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..