బయోఫిలిక్ డెకర్.. ప్రకృతి ఒడిలో ఇల్లు
ABN , Publish Date - Nov 02 , 2026 | 01:42 AM
కాంక్రీట్ జంగిల్‌లో నివసించే ఆధునిక మానవుడిని తిరిగి ప్రకృతికి దగ్గర చేస్తూ ఇంటికి సరికొత్త ప్రాణాన్ని తెచ్చే ఇంటీరియర్ విప్లవం ఇది...
కాంక్రీట్ జంగిల్‌లో నివసించే ఆధునిక మానవుడిని తిరిగి ప్రకృతికి దగ్గర చేస్తూ ఇంటికి సరికొత్త ప్రాణాన్ని తెచ్చే ఇంటీరియర్ విప్లవం ఇది.
ఆధునిక జీవనశైలిలో మనమంతా నాలుగు గోడలు, ఏసీ గదులు, డిజిటల్ స్ర్కీన్ల మధ్యే ఎక్కువ సమయం గడిపేస్తున్నాం. ఈ క్రమంలో ప్రకృతికి దూరమై మానసిక ఒత్తిడికి గురవుతున్నాం. ఈ సమస్యకు చక్కని పరిష్కారంగా తెరపైకి వచ్చిందే ‘బయోఫిలిక్ డెకర్’. అంటే ప్రకృతి పట్ల మానవుడికి ఉండే సహజమైన ప్రేమ. మన ఇంటి ఇంటీరియర్స్‌లో కేవలం కొన్ని పూలకుండీలు పెట్టడం మాత్రమే కాకుండా, ఇంటి ప్రతి మూలలోనూ ప్రకృతి ఉనికి స్పష్టంగా కనిపిచేలా, అనుభవంలోకి వచ్చేలా డిజైన్ చేయడమే ఈ కాన్సెప్ట్ అంతర్గత సూత్రం.
ఈ ట్రెండ్‌లో అత్యంత ముఖ్యమైనది‘ లైవ్ ఎలిమెంట్స్’ (సజీవ వస్తువులు). లివింగ్ రూమ్‌లోని ఒక ప్రధాన గోడను పూర్తిగా పాచి, చిన్న చిన్న ఇండోర్ మొక్కలతో ‘మోస్ వాల్’ లేదా ‘వర్టికల్ లివింగ్ వాల్’గా మార్చడం దీనిలో ప్రధాన ఆకర్షణ. ఇది కంటికి ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా, ఇంట్లోని గాలిని సహజంగా శుద్ధి చేస్తుంది. వీటితో పాటు స్నేక్ ప్లాంట్, మనీప్లాంట్, పీస్‌లిల్లీ, పామ్‌ల వంటి గాలిని శుభ్రపరిచే మొక్కలను మూలల్లోనూ, టేబుళ్ల పైనా అమర్చడం వల్ల ఇల్లు ఒక చిన్నపాటి అడవిలా, ఎకోసిస్టమ్‌లా మారుతుంది.
సహజ సిద్ధమైన ముడిసరుకులు: బయోఫిలిక్ డిజైన్‌లో ప్లాస్టిక్, కృత్రిమ రసాయన వస్తువులకు అస్సలు చోటుండదు. నునుపు చేసిన చెక్కకు బదులుగా చెట్టు తొర్రలు, బార్క్ షేప్స్ అలాగే ఉండే ‘లైవ్‌ఎడ్జ్ ఫర్నిచర్’ వాడటం దీని ప్రత్యేకత. డైనింగ్ టేబుళ్లు, టీపాయ్‌లు, షెల్ఫ్‌ల కోసం రఫ్ వుడ్, వెదురు, రాతి శిల్పాలు, జనపనారతో చేసిన కార్పెట్లు, వోవెన్ బాస్కెట్లను డెకర్ ఐటెమ్స్‌గా వాడతారు. ఇవి ఇంటికి సహజమైన సంప్రదాయ, రాజసపు లుక్‌ను తెచ్చిపెడతాయి.
వెలుతురు, గాలి: సహజమైన పగటి కాంతి ఇంట్లోని ప్రతి మూలకూ ప్రసరించేలా పెద్ద గ్లాస్ విండోస్, స్కైలైట్స్ ఏర్పాటు చేయడం బయోఫిలిక్ స్టైల్ ముఖ్యాంశం. అలాగే గాలి నిరంతరం ప్రసరించేలా పారదర్శకమైన లైట్‌వెయిట్ కాటన్ లేదా లిలెక్ కర్టెన్లను వాడతారు. పగటిపూట కృత్రిమ లైటింగ్‌ను పూర్తిగా తగ్గించి, బయటి వాతావరణంతో ఇల్లు మమేకమయ్యేలా చూడటం దీని ఉద్దేశం.
ప్రకృతి ధ్వనులు.. నీటి సవ్వడులు: ఇంట్లో ఒక చిన్న ఇండోర్ వాటర్ ఫౌంటెన్ లేదా రాళ్లతో కూడిన వాటర్ క్యాస్కేడ్ ఏర్పాటు చేయడం వల్ల నీటి చప్పుడు నిరంతరం వినిపిస్తూ మనసులోని ఆందోళనలను కరిగిస్తుంది. గోడలకు మట్టి రంగులు అంటే క్లే బ్రౌన్, ఫారెస్ట్ గ్రీన్, సాండ్ ఎల్లో, ఓషన్ బ్లూ వంటి రంగులను వాడటం వల్ల నాడీ వ్యవస్థ శాంతిస్తుంది.
ఈ బయోఫిలిక్ డెకర్ కేవలం ఒక అలంకరణ శైలి మాత్రమే కాదు.. ఇది ఇంట్లోని వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక హీలింగ్ థెరపీ. రోజువారీ పని ఒత్తిడితో అలసిపోయి ఇంటికి తిరిగొచ్చిన ప్రతిఒక్కరికీ ఈ ఇంటీరియర్ స్టైల్ అడవి ఒడిలోకి అడుగుపెట్టినంత అపారమైన ప్రశాంతతను, కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఓట్‌చోరీపై రాంలీలా మైదాన్‌లో పోరాటం చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేసరికి.. ఇంట్లో 29 తులాల బంగారం మాయం