Share News

లవణంతో లాలూచీ పడొద్దు

ABN , Publish Date - Jul 21 , 2026 | 02:08 AM

ఇప్పుడు పలు రకాల ఉప్పులు అందుబాటులోకొచ్చాయి. ఫలానా ఉప్పు మంచిదనీ, ఎక్కువ పరిమాణంలో తీసుకున్నా ప్రమాదం ఉండదనీ.. ఇలా అపోహలు, అవాస్తవాలు...

లవణంతో లాలూచీ పడొద్దు

పారాహుషార్‌

ఇప్పుడు పలు రకాల ఉప్పులు అందుబాటులోకొచ్చాయి. ఫలానా ఉప్పు మంచిదనీ, ఎక్కువ పరిమాణంలో తీసుకున్నా ప్రమాదం ఉండదనీ.. ఇలా అపోహలు, అవాస్తవాలు పెరుగుతున్నాయి. అయితే ఏ ఉప్పును, ఎందుకు ఎంచుకోవాలో, వైద్యులేమంటున్నారో తెలుసుకుందాం!

ఉప్పు రసాయన నామం...‘సోడియం క్లోరైడ్‌’. కండరాల సంకోచవ్యాకోచాలకూ, ఎలకొ్ట్రలైట్‌ బ్యాలెన్స్‌కూ మనకు ఈ రెండు ఖనిజ లవణాలూ శరీరానికెంతో అవసరం. మన శరీరానికి రోజుకు 2500 మిల్లీగ్రాముల సోడియం అవసరం. ఉప్పులో ఉండే క్లోరైడ్‌ కూడా అవసరమే కాబట్టి ఆరోగ్యకరమైన వ్యక్తులు రోజుకు ఐదు గ్రాముల మేరకు ఉప్పు తీసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. అయితే అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు, గుండె సమస్యలు ఉన్నవాళ్లు అంతకంటే తక్కువ ఉప్పుకే పరిమితం కావాలి.

అయోడిన్‌ కలిపిన ఉప్పు

సముద్రపు ఉప్పు పూర్తి ముడి ఉప్పు. దీన్లో అయోడిన్‌ ఉండదు. దాంతో గతంలో మనలో చాలా మందిలో థైరాయిడ్‌ పనితీరు దెబ్బతిని, గాయిటర్‌ సమస్య వేధిస్తూ ఉండేది. అయోడిన్‌ లోపం వల్ల తలెత్తే గాయిటర్‌ను తొలగించడం కోసం ప్రభుత్వం ఉప్పులో అయొడిన్‌ను కలపడం మొదలుపెట్టింది. ఆ విధంగా అయొడైజ్జ్‌ సాల్ట్‌ వాడుకలోకొచ్చింది. ప్రభుత్వం తీసుకున్న చర్య వల్లే మనలో ఎవరిలోనూ గాయిటర్‌ సమస్య కనిపించడం లేదు.

సైంధవ లవణం/రాతి ఉప్పు

ఈ ఉప్పును పర్వత గనుల నుంచి తవ్వి తీస్తారు. అయొడైజ్డ్‌ సాల్ట్‌తో పోల్చితే దీన్లో ఖనిజ లవణాలు కొద్ది పరిమాణాల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఉప్పుతో రక్తపోటు పెరగదు కాబట్టి ఎక్కువ పరిమాణాల్లో తీసుకోవచ్చని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఈ ఉప్పును ఎక్కువగా తీసుకున్నప్పుడు రక్తపోటు పెరుగుతుంది. అదనపు ఆరోగ్య సమస్యల ముప్పు కూడా ఉంటుంది. అలాగే ఈ ఉప్పుతో మన శరీరానికి చెప్పుకోదగిన ప్రయోజనం కూడా ఉండదు.


హిమాలయన్‌ పింక్‌ సాల్ట్‌

తాజాగా ట్రెండ్‌ అవుతున్న ఉప్పు ఇది. హిమాలయ పర్వతాల లోపలున్న సోడియం రాళ్ల నుంచే ఈ ఉప్పును సేకరిస్తారు. దీన్లో ఐరన్‌ లాంటి ట్రేస్‌ మినరల్స్‌ ఎంతో తక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి ఈ ఉప్పుకు గులాబీ రంగు సమకూరింది. అలాగని ఈ ఉప్పులోని ఐరన్‌ వల్ల మన శరీరానికి ఒరిగే అదనపు ప్రయోజనమేమీ ఉండదు. అలాగే దీన్లోని మినరల్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు సమకూరతాయని నిరూపించే శాస్త్రీయ ఆధారాలేవీ లేవు. పైగా దీన్లో అయొడిన్‌ స్వల్ప మోతాదులోనే ఉంటుంది. ఈ ఉప్పు ధర సాధారణ ఉప్పు కంటే పది రెట్లు ఎక్కువ. ధర ఎక్కువ కాబట్టి పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయని అపోహ పడుతూ ఉంటారు. కానీ ఇదొక వ్యాపార వ్యూహమనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉప్పులో కూడా సోడియం ఉంటుంది. అదనంగా తీసుకునే సాధారణ ఉప్పుతో ఎలాంటి ఆరోగ్య సమస్యల ముప్పు ఉంటుందో, దీంతో కూడా అంతే సమానమైన ముప్పు ఉంటుంది.

బ్లాక్‌ సాల్ట్‌

ఈ ఉప్పును ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నల్ల ఉప్పు జీర్ణ శక్తిని మెరుగు పరుస్తుందని ఆయుర్వేదం నమ్ముతుంది. అలాగని ఈ ఉప్పుతో జీర్ణ సమస్యలన్నీ తగ్గిపోతాయనుకుంటే పొరపాటు. సాధారణంగా ఉత్తర భారతీయులు చాట్‌ తయారీలో ఈ ఉప్పును వాడుకుంటూ ఉంటారు. చాట్‌లో వాడుకునే పప్పులు, సెనగల వల్ల అజీర్తి, కడుపుబ్బరం లాంటివి తలెత్తకుండా ఉండడం కోసమే నల్ల ఉప్పును కలుపుతూ ఉంటారు. అయితే రోజు మొత్తంలో తీసుకునే సాధారణ ఉప్పుతో పాటు బ్లాక్‌ సాల్ట్‌ను కూడా అదనంగా తింటూ ఉంటే, ఆరోగ్య సమస్యలు కచ్చితంగా తలెత్తుతాయి.

సముద్రపు ఉప్పు/సీ సాల్ట్‌

దీన్లో మెగ్నీషియం, సెలీనియం లాంటి కొన్ని ట్రేస్‌ మినరల్స్‌ స్వల్ప పరిమాణాల్లో ఉంటాయి. అయితే వీటితో అదనపు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి ఈ ఉప్పును కూడా పరిమితంగానే తీసుకోవాలి. ఎక్కువైతే ఆరోగ్య సమస్యలు తప్పవు.


లో సోడియం సాల్ట్‌

ఈ ఉప్పులో సోడియం తక్కువగా ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటు కలిగిన వాళ్లకు ఈ ఉప్పుతో కొంత మేరకు ప్రయోజనం ఉండవచ్చు. ఈ ఉప్పులో సోడియంను తగ్గించి దాని బదులుగా పొటాషియంను జోడిస్తారు. మూత్రపిండాల సమస్యలున్న వాళ్లలో పొటాషియం పెరగడం కూడా ప్రమాదకరమే! కాబట్టి వైద్యుల సలహా మేరకే ఈ ఉప్పు తీసుకోవాలి.

ఉప్పు ఎప్పటికీ పరిమితంగానే...

ఉప్పు ఏదైనా పరిమితంగానే తీసుకోవాలి. కానీ ఫలానా ఉప్పు ఎంతైనా తీసుకోవచ్చనీ, ఫలానా ఉప్పుతో ఎలాంటి నష్టం జరగదనీ అపోహపడుతూ ఉంటారు. ఏ కోవకు చెందిన ఉప్పు అయినా పరిమితంగానే తీసుకోవాలి. పింక్‌ సాల్ట్‌, రాక్‌ సాల్ట్‌లో ఉండే పోషక ప్రయోజనాలకు ఎక్కువగా పొందవచ్చనే ఆలోచనతో వాటిని ఎక్కువగా తీసుకోవడం ప్రమాదకరం. అధిక ఉప్పుతో మూత్రపిండాల మీద ఎక్కువ భారం పడి, దెబ్బతినడం మొదలుపెడతాయి. అధిక ఉప్పుతో అధిక రక్తపోటు, గుండె సమస్యలు పెరుగుతాయి. వంటలో భాగంగా ఉప్పును ఉపయోగించడంతో పాటు ఉప్పు కలిపిన స్నాక్స్‌ కూడా తింటూ ఉంటాం. సాల్టెడ్‌ బిస్కెట్స్‌, చిప్స్‌, పీనట్స్‌, నిల్వ పచ్చళ్లు, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌, ఫాస్ట్‌ ఫుడ్స్‌ తింటూ ఉంటాం. వీటి ద్వారా కూడా అదనపు ఉప్పు మన శరీరంలోకి చేరుకుంటూ ఉంటుంది. దీంతో ఒబేసిటీ,

గుండెపోటు, మూత్రపిండాల సమస్యలు పెరుగుతాయి.

మనలో చాలా మంది రోజుకు ఐదు గ్రాముల పరిమితికి మించి దాదాపు 9 నుంచి 10 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా యువత జంక్‌ ఫుడ్స్‌ ద్వారా అదనపు ఉప్పు తీసుకుంటూ చిన్న వయసులోనే గుండె సమస్యల బారిన పడుతోంది. మూత్రపిండాల సమస్యలు, అధిక రక్తపోటు పెరగడానికి తోడ్పడే ప్రధాన కారణాల్లో అధిక ఉప్పు ఒకటి. కాబట్టి జంక్‌ ఫుడ్‌, నిల్వ పచ్చళ్లు, పెరుగులో ఉప్పు కలుపుకోవడం, రుచిని పెంచడం కోసం అదనంగా ఉప్పు జోడించడం లాంటి అలవాట్లు మానుకోవాలి.

డాక్టర్‌ శశికళ తోట

రెనోవా సెంచరీ హాస్పిటల్స్‌,

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్త కోర్సులకు గ్రీన్ సిగ్నల్

మరో రెండు వారాలు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా డిప్యూటీ సీఎం పవన్..

Updated Date - Jul 21 , 2026 | 02:08 AM