జీవ గడియారం ఇలా క్రమం
ABN , Publish Date - Mar 10 , 2026 | 02:22 AM
కొన్ని పదార్థాలు గాడి తప్పిన జీవ గడియారాన్ని గాడిలో పెడతాయి. అగ్నిని స్థిరీకరించగలిగితే, హార్మోన్లు సంతులనమవుతాయి. అలాగే నాడీ వ్యవస్థ...
ఆయుర్వేదం
కొన్ని పదార్థాలు గాడి తప్పిన జీవ గడియారాన్ని గాడిలో పెడతాయి. అగ్నిని స్థిరీకరించగలిగితే, హార్మోన్లు సంతులనమవుతాయి. అలాగే నాడీ వ్యవస్థ గాడిలో పడితే, నిద్ర సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. కాబట్టి ఏ ఆహారం మహిళల ఆరోగ్యానికి కీలకమో తెలుసుకుందాం!
వట్టి వేర్లు: వీటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఆ నీళ్లను రోజంతా తాగుతూ ఉండాలి. వీటితో శరీరం చల్లబడి, అదనపు పిత్త తగ్గుతుంది. మానసిక గందరగోళం సద్దుమణిగి, కమ్మని నిద్ర పడుతుంది. అస్తవ్యస్థ నెలసరులు కూడా గాడిలో పడతాయి
శతావరి: శతావరి క్షీరపాకంతో పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ఇందుకోసం శతావరిని పాలలో కలిపి చిన్న మంట మీద ఉడికించుకుని తాగాలి. దీంతో అర్థరాత్రి రెండు గంటలకు మెలకువ అయ్యే సమస్య పరిష్కారమవుతుంది. అండాశయ విడుదల లయబద్ధంగా సాగుతుంది. గర్భధారణకు తోడ్పడే హార్మోన్లన్నీ సంతులనాన్ని సాధిస్తాయి
గోధుమ బంక: గోండ్ అని పిలిచే ఈ పదార్థాన్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టుకోవాలి. తెల్లవారేసరికి ఈ పదార్థం జిగటగా, జెల్లీలా మారిపోతుంది. దీన్ని తీసుకోవడం వల్ల కణజాలానికి సరిపడా నీరు అందుతుంది. అంతర్గత వేడి తగ్గుతుంది. కార్టిసాల్ హార్మోన్ పెరుగుదల తగ్గుముఖం పడుతుంది
జటమాన్సి: గోరువెచ్చని పాలలో చిటికెడు జటమాన్సి పొడి కలుపుకుని తాగితే, నాడీ వ్యవస్థ నెమ్మదిస్తుంది. సహజసిద్ధ మెలటోనిన్ ఉత్పత్తి పెరిగి కమ్మని నిద్ర పడుతుంది
నల్ల ఎండుద్రాక్ష: రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే తినాలి. దీంతో రక్తవృద్ధి జరుగుతుంది. మలబద్ధకం వదులుతుంది. నెలసరి గాడిలో పడుతుంది.
సామలు: తేలికగా జీర్ణమవుతాయి. సాయంకాలానికి ఒళ్లు బరువెక్కిన భావనకు లోనయ్యేవాళ్లు వీటిని తినడం వల్ల శరీరం తేలికపడుతుంది. జీర్ణ సమస్యలున్నవాళ్లు సాయంత్రం ఏడు గంటల్లోపే సామలు తినడం వల్ల జీర్ణాగ్ని మెరుగు పడి, నిద్ర గాడిలో పడుతుంది.
ఇవి కూడా చదవండి:
ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ
పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్