బేర్‌ఫుట్ షూస్‌దే ట్రెండ్!
ABN , Publish Date - Sep 24 , 2026 | 04:57 AM
ఫ్యాషన్ ప్రపంచంలో పాదరక్షలకు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాలానుగుణంగా ఎన్నో రకాల డిజైన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. స్టయిల్‌గా కనిపించే హై హీల్స్...
ఫ్యాషన్ ప్రపంచంలో పాదరక్షలకు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాలానుగుణంగా ఎన్నో రకాల డిజైన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. స్టయిల్‌గా కనిపించే హై హీల్స్ నుంచి మెత్తటి ప్యాడ్‌లు జోడించిన స్నీకర్స్ వరకు అన్నీ మహిళల మనసు దోచుకున్నవే. మినిమలిస్టిక్ స్టయిల్స్‌ను అమితంగా ఇష్టపడే జెన్‌జీలు.. మారథాన్ రన్నర్ల కోసం ప్రత్యేకించిన టో-షూలపై దృష్టిసారించడం మొదలుపెట్టారు. క్రమంగా ఇవి కొన్ని మార్పులు చేర్పులతో బేర్‌ఫుట్ షూస్‌గా రూపాంతరం చెంది హై ఫ్యాషన్ రన్‌వే మీదికి అక్కడి నుంచి లగ్జరీ స్ట్రీట్‌వేర్ కలెక్షన్లలోకి దూసుకొచ్చేశాయి.
ఎలా ఉంటాయంటే...
వీటి అడుగు భాగం(సోల్) పలుచగా ఉంటుంది. దీనివల్ల నేల స్పర్శ పాదాలకు స్పష్టంగా తెలుస్తుంది. వేళ్ల భాగం వెడల్పుగా విశాలంగా ఉంటుంది. నడిచేటప్పుడు వేళ్లు బిగపట్టకుండా సహజంగా కదిలేందుకు అనువుగా ఉంటుంది. వేళ్లకు విడివిడిగా అరలు ఉండే మోడల్స్ కూడా ఉన్నాయి. ఈ షూస్ లోపల మందపాటి కుషన్లు, ఆర్చ్ సపోర్టులు, ప్యాడింగ్ లాంటివి ఏవీ ఉండవు. పాదమే బరువును మోసేలా వీటిని రూపొందిస్తారు. అందుకే ఈ బేర్‌ఫుట్ షూస్ వేసుకున్నప్పటికీ చెప్పులు లేకుండా నడిచినట్లే అనిపిస్తుంది. ఫలితంగా అరికాళ్లు, చీలమండల కండరాలు బలపడతాయి. శరీర సమతుల్యత పెరిగి, నడక తీరు మెరుగుపడుతుంది. రన్నింగ్, ట్రెక్కింగ్, జిమ్ ట్రైనింగ్‌లకు ఇవి అనుకూలంగా ఉంటాయి.

డిజైనరీ షూస్‌తో ప్రమాదమా..?
ఆకర్షణీయమైన డిజైనరీ షూస్‌ను వదిలి జెన్‌జీలు ఈ బేర్‌ఫుట్ షూస్‌ను ఎంచుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. సాధారణంగా షూస్, స్నీకర్స్‌లో కాస్తయినా ఎత్తు మడమలు ఉంటాయి. వీటికి ముందు భాగం సన్నగా వేళ్లను దగ్గరికి అదిమి పెట్టేలా ఉంటుంది. వీటిని ధరించినప్పుడు శరీర గురుత్వాకర్షణ కేంద్రం ముందుకు వంగుతుంది. దీంతో శరీర ఆహార్యం మారుతుంది. వేళ్లు వంగినట్లు అవుతాయి. మామూలుగా షూలలో ఉండే ఆర్చ్ సపోర్టు, కుషనింగ్‌ల వల్ల పాదాల్లో ఉండే అంతర్గత కండరాలు నిద్రాణ స్థితిలోకి వెళతాయి. ఎందుకంటే శరీరానికి స్థిరత్వాన్ని ఇచ్చే పనిని పూర్తిగా షూస్ చేసేస్తాయి కాబట్టి. ఇలా దీర్ఘకాలం కొనసాగితే శరీర సమతుల్యత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే బేర్‌ఫుట్ వేర్ ధరించడం వల్ల మడమ నుంచి పాదం ముందు భాగం వరకు నేలమీద ఒకే ఎత్తులో ఉంటాయి. ఆర్చ్ సపోర్ట్ ఉండదు కాబట్టి పాదాలే శరీర బరువును మోయాలి. ఇలాంటి నిర్మాణాత్మక మార్పుల వల్ల శారీరక బలం, సామర్థ్యం విశేషంగా పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది.
జాగ్రత్తలు కూడా అవసరమే...
బేర్‌ఫుట్ షూస్ వల్ల లాభాలే కాదు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. గట్టి తారు రోడ్ల మీద మైళ్ల కొద్దీ నడిచే పట్టణ వాసులకు అరికాలి నొప్పులు రావచ్చు. వీటితో ఎక్కువసేపు నిలబడడం కూడా కష్టంగానే అనిపించవచ్చు. మధుమేహం ఉన్నవారు, చదునైన పాదాలు ఉన్నవారు, కండరాల క్షీణతతో బాధపడేవారు వీటిని ధరించకూడదు. ఏళ్ల తరబడి కార్పొరేట్ షూస్ వాడుతున్నవారు ఒక్కసారిగా ఈ బేర్‌ఫుట్ షూస్ వేసుకుని రన్నింగ్ చేయడానికి ప్రయత్నిస్తే పాదాలు ఈ మార్పును తట్టుకోలేవు. ఫలితంగా అకిలెస్ టెండినైటిస్, మెటాటార్సల్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ లాంటి సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి ఒకేసారి బేర్‌ఫుట్ షూస్‌కు మారకుండా మిగిలిన షూస్‌తో మార్చి మార్చి సందర్భాన్ని బట్టి ధరిస్తూ పాదాలకు అలవాటయ్యేలా చూడాలి. ఇంట్లో ఉన్నప్పుడు వీటిని వేసుకుని నడుస్తూ సాధన చేయవచ్చు. ఇరవై ఆరు ఎముకలు, ముఫ్పై మూడు కీళ్లు, వందకు పైగా కండరాలు ఉన్న పాదాలకు కష్టం, నష్టం కలుగకుండా సరైన ఫుట్‌వేర్‌ను ఎంపిక చేసుకోవడమే స్టయిలిష్ నిర్ణయం.
ఇవీ చదవండి:
ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు