మట్టిబాటలో మేటి రైతు
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:57 AM
ఏడో తరగతి చదువుకున్నా.. మట్టిని విశ్వవిద్యాలయంగా మార్చుకుని సమగ్ర సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్నారు జగిత్యాల జిల్లాకు చెందిన మహిళా రైతు బండారి విజయ....
ఏడో తరగతి చదువుకున్నా.. మట్టిని విశ్వవిద్యాలయంగా మార్చుకుని సమగ్ర సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్నారు జగిత్యాల జిల్లాకు చెందిన మహిళా రైతు బండారి విజయ. వైవిధ్యమైన పంటలతో, ఆధునిక మార్కెటింగ్ మెళకువలతో అద్భుతాలు సృష్టిస్తున్న ఆమెను ‘జాతీయ ఉత్తమ మహిళా రైతు’ అవార్డు వరించింది. గురువారం (అక్టోబరు 15) ఢిల్లీలో అవార్డు అందుకోబోతున్న విజయ.. తన విజయ ప్రస్థానాన్ని ‘నవ్య’తో పంచుకున్నారు.
‘‘మాది జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల. ఏడో తరగతి వరకే చదువుకున్న నాకు వ్యవసాయం ఎన్నో పాఠాలు నేర్పింది. మట్టిని నమ్ముకుని మొక్కలను ప్రేమించాను. ప్రకృతితో కలిసి నడిచాను. ఆ ఇష్టం.. నా కష్టమే నేడు నన్ను జాతీయ ఉత్తమ మహిళా రైతుగా దేశం ముందు నిలబెట్టింది. ఈ విజయం నా ఒక్కదానిదే కాదు.. నాకు అండగా నిలిచిన నా భర్త వెంకటేశ్ది. మా కుటుంబానిది, మా పొలంలో పండిన ప్రతి మొక్కది.
వ్యవసాయమే నా జీవితం
నా జీవితం వ్యవసాయానికే అంకితమైంది. మా కుటుంబానికి ఉన్న 16 గుంటల భూమితోపాటు మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకుని పదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. మూడేళ్ల క్రితం వరకు 6 ఎకరాల్లో వ్యవసాయం చేసి ఏడాదికి రూ. 6 లక్షలు సంపాదించాం. ఇప్పుడు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని పలు రకాలు పంటలు పండిస్తూ ఏడాదికి రూ. 10 లక్షల వరకు ఆర్జిస్తున్నాం. మూడెకరాల్లో సపోట పండిస్తున్నాం. ఇందులో అంతరపంటగా కర్బూజ, కశ్మీర్ రెడ్ ఆపిల్ సాగు చేస్తున్నా. ఎకరంలో బంతితోట, అరెకరంలో కాలిఫ్లవర్, రెండున్నర ఎకరాల్లో వరి, మరో ఎకరంలో బీరకాయ, వంకాయ, పండ్ల తోటలు ఉన్నాయి. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో సాగునీరు అందిస్తున్నాను.
ఒకే పంటపై ఆధారపడకుండా...
ఒకే పంటపై ఆధారపడితే ప్రకృతి వైపరీత్యాలు, ధరల హెచ్చుతగ్గుల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకే పదేళ్లుగా మా పొలాన్ని ప్రయోగశాలగా మార్చుకున్నాను. ఏ కాలంలో ఏ పంట వేయాలి? ఏ పంటకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది? తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి ఎలా సాధించాలి? అనే విషయాలపై దృష్టి పెట్టాను. కూరగాయల సాగుతో మొదలుపెట్టి ఆపిల్ బేర్, బంతి, చామంతి పూలు పండిస్తున్నాను. వేసవిలో కర్బూజ, తర్బూజ సాగు చేస్తున్నాను. పంటల ఎంపికలో వైవిధ్యం పాటించడం వల్ల ఏడాది పొడవునా ఏదో ఒక పంట చేతికొస్తోంది. వ్యవసాయం అంటే విత్తనం వేయడం, పంట కోయడం మాత్రమే కాదు.. నేలను అర్థం చేసుకోవడం, కాలాన్ని అంచనా వేయడం, మార్కెట్ అవసరాలను గుర్తించడం కూడా అని అనుభవం నాకు నేర్పింది.
సేంద్రియ సాగు
నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పంటలు పండించాలన్న ఉద్దేశంతో సేంద్రియ పద్ధతులకు ప్రాధాన్యం ఇస్తున్నాను. వ్యవసాయ పనులు చూసుకుంటూనే కుటుంబ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాను. వృద్ధాప్యంలో ఉన్న అత్తమామలు లక్ష్మి-రాజమల్లు బాగోగులు చూసుకోవడం, కుటుంబాన్ని నడిపించడం, పొలంలో పనులను పర్యవేక్షించడం.. ఇలా ప్రతి బాధ్యతను సమన్వయం చేసుకుంటున్నాను. వ్యవసాయంలో భర్త నాకు అండగా ఉంటున్నారు. సాగు పనుల నుంచి పంటల విక్రయం వరకు ఇద్దరం కలిసి నిర్ణయాలు తీసుకుంటాం. మా కుమారుడు సుధీర్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.
కష్టమంతా పంట విక్రయంలోనే...
వ్యవసాయంలో రైతు కష్టం అందరికీ తెలుసు. కానీ అసలు కష్టమంతా పంట ఉత్పత్తుల విక్రయమంలోనే ఉంది. అందుకే పంట పండిస్తే సరిపోదని, దానిని ఎక్కడ విక్రయించాలన్న దానిపైనా దృష్టి పెట్టాను. దళారులపై ఆధారపడకుండా నేరుగా మార్కెట్కు చేరువయ్యే ప్రయత్నం చేశాను. హైదరాబాద్, నిజామాబాద్, జగిత్యాల వంటి పట్టణాలకు మా ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాను. బిగ్ బాస్కెట్, రిలయన్స్, మోర్ వంటి సంస్థలకు కూడా విక్రయిస్తున్నాను. మారుతున్న కాలానికి అనుగుణంగా వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నాను. పంటల వివరాలను ప్రచారం చేయడం ద్వారా వినియోగదారులకు చేరువవుతున్నాను. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అనుసరించడమే కాకుండా, మార్కెటింగ్లోనూ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాను.
ముక్క వేణుగోపాల్

జగిత్యాల శ్రమకు దక్కిన గౌరవం
వ్యవసాయంలో నేను అనుసరిస్తున్న విభిన్న పంటల సాగు విధానం, సేంద్రియ పద్ధతులకు ప్రాధాన్యమివ్వడం, తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు సాధించే ప్రయత్నం చేయడం, అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం పొందడం, పంటలను నేరుగా మార్కెట్కు చేర్చడం వంటి అంశాలు నా సాగుకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. వీటిని గుర్తించిన వ్యవసాయ శాఖ అధికారులు జాతీయ ఉత్తమ మహిళా రైతు అవార్డుకు నా పేరును ఎంపిక చేశారు. అక్టోబరు 15 తేదీన ఢిల్లీలో నిర్వహించే జాతీయ మహిళా రైతుల దినోత్సవ కార్యక్రమంలో అవార్డు అందుకోబోతున్నాను. మా ఊరి పొలం నుంచి దేశ రాజధాని వరకు సాగిన ఈ ప్రయాణాన్ని తలుచుకుంటే ఎంతో ఆనందంగా ఉంది.
ప్రతి పంట ఒక పాఠమే
నవంబర్ 14వ తేదీన హైదరాబాద్లో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ‘అన్నదాతకు ఆత్మీయ సత్కారం’లో సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నాను. గతంలో హైదరాబాద్ గాంధీ గ్లోబల్ సంస్థ ఆధ్వర్యంలో, జగిత్యాల అగ్రికల్చర్ కళాశాల ఆధ్వర్యంలో, జగిత్యాల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆదర్శ రైతు, పుడమి పుత్ర, అన్నదాత అవార్డులు అందుకున్నాను. ప్రతి పంట నాకు ఒక పాఠాన్ని నేర్పింది. ప్రతి సీజన్ ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చింది. నా విజయాన్ని చూసి మరికొంత మంది మహిళా రైతులు స్ఫూర్తి పొందితే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. భూమి ఎంత ఉందన్నది కాదు.. అందులో ఎంత తెలివిగా సాగు చేస్తున్నామన్నదే ముఖ్యం. పంట పండించడం నుంచి మార్కెటింగ్ వరకు ప్రతి దశలోనూ రైతు అవగాహన పెంచుకోవాలి. కష్టానికి కొత్త ఆలోచన తోడైతే వ్యవసాయంలోనూ విజయాలు సాధించవచ్చు. రైతు చేతిలోని మట్టికి విలువ ఉంది.. ఆ మట్టిని నమ్ముకున్న మహిళకు సాధించలేనిదంటూ ఏదీ లేదన్న విషయం తెలుసుకున్నాను. ఈ నా విజయాన్ని మా పొలంలోని ప్రతి మొక్కకు అంకితం చేస్తున్నాను.
ఈ వార్తలూ చదవండి
రేపటి నుంచే విజయవాడ ‘సరస్ మేళా’.. పనులను పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని
క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్
అడవి నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే షాక్.. వీడియో